అటక మీది మర్మం -6 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం -6

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల-6 వ భాగం 
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
 
(తన మనుమరాలి పోషణకు కావలసిన ధనం కోసం కుమారుడి సాహిత్యాన్ని అమ్మాలనుకున్న మార్చ్ అన్న మిలిటరీ వానికి సాయం చేయటానికి న్యాయవాది కూతురైన నాన్సీ ఒప్పుకొని తన స్నేహితురాళ్ళతో ప్లెజెంట్ హెడ్జెస్ కి వెళ్ళి ఆ భవంతి మొత్తం గాలిస్తుంది. కానీ ఆమెకు మాయమైన ఫిప్ సాహిత్యం కనబడదు గానీ తక్షణ సాయంగా అటకమీద ఒక పాత బల్ల, మంచి చిత్రాలు గీసి ఉన్న అరడజను అట్టపెట్టెలు కనిపిస్తాయి. వాటిని పురాతన వస్తువుల దుకాణంలో అమ్మగా కొంత సొమ్ము వస్తుంది. అదేసమయంలో స్నేహితురాలు యింట్లో ఉన్న మిలిటరీ వాని మనుమరాలు తట్టురోగంతో యింటికి వచ్చేస్తుంది. దానివల్ల ఆ పాపకు సంరక్షకురాలిగా ఎఫీ అన్న అమ్మాయిని తెచ్చి పెడుతుంది నాన్సీ. ఎఫీ భయస్తురాలు. ఒకరోజు యింటి వద్ద ఉన్న నాన్సీకి ఎఫీ ఫోను చేసి ఉన్నపాటున బయల్దేరి రమ్మని, రాత్రి జరిగిన విషయం చెప్పాలని చెబుతుంది. ఆ కబురు విన్న నాన్సీ అఘమేఘాలమీద అక్కడకు చేరుకొన్నాక, ముందురోజు అర్ధరాత్రి ఒక ఆగంతకుడు ఆ ప్రాంగణంలో తచ్చాడాడని ఎఫీ చెబుతుంది. 'దొంగిలించటానికి ఆ పాత భవనంలో ఏమున్నాయని ' ఎఫీని సంతృప్తిపరచినా, అనుమానంతో ఆ ప్రాంగణంలో అన్వేషించే నాన్సీకి అడుగుజాడలు కనిపించి బిత్తరపోయింది. తరువాత అటకమీద అన్వేషించిన ఆమెకు పాతభోషాణం పెట్టెలో అమ్మకానికి పనికొచ్చే డజను పాతచిత్రాలు కనిపించాయి. వాటిని మార్చ్ అనుమతితో ఫేబర్ దుకాణంలో అమ్మి, భయపడుతున్న ఎఫీకి తోడుకోసం ఆ రాత్రి ప్లెజెంట్ హెడ్జెస్ కి తిరిగి వస్తుంది. ఆ రాత్రి అటకమీద బట్టలబీరువాలో నాన్సీకి అస్తిపంజరం కనిపిస్తుంది. అది హలోవీన్ ఉత్సవానికి ఫిప్ బంధువొకడు తెచ్చాడని పెద్దాయన చెబుతాడు. దాన్ని ఫిప్ అందులో దాచాడంటే తన సాహిత్యం యితరుల కళ్ళబడకుండా దానికి కాపలాగా దాచాడా? అని నాన్సీ అనుమానిస్తుంది. మరునాడు ఉదయం తన యింటికి వెళ్ళిన ఆమెకు తండ్రి మరొక కొత్త కేసు గురించి చెబుతాడు. బుకర్ కంపెనీలో తయారయే ఆడపిల్లల పట్టుకండువాలను పోలిన కండువాలను డైట్ కంపెనీ కూడా తయారుచేస్తోందని, కొన్నాళ్ళు బుకర్ కంపెనీలో పనిచేసిన బుషీట్రాట్ అన్న వ్యక్తి డైట్ కంపెనీలో జేరాడని, అతనే ఈ పట్టుకండువాల మూలపదార్ధపు తయారీని యిక్కడ కనుక్కొని, అదే విధానంలో అక్కడ తన కంపెనీ పట్టుకండువాలను పోలిన కండువాలను తయారు చేసి తన వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్నారని, దీనిలో డైట్ కంపెనీ యజమాని డైట్ హస్తం ఉందని, అందుకే ఆ కంపెనీపై కేసు వేయాలని బుకర్ భావిస్తున్నాడని డ్రూ తన కూతురికి చెబుతాడు. తరువాత ఏం జరిగిందంటే. . . . . . . ) 
@@@@@@@@@@@@

"తుప్పలా పెరిగిన జుట్టు. . .బుషీట్రాట్ పేరు. . " తండ్రి మాటలు నాన్సీ మనసులో ముద్ర వేసుకొనిపోయాయి.
"తన ఫాక్టరీలో పట్టుకండువాల నమూనా రహస్యాన్ని తెలిసిన వ్యక్తి యితనొక్కడేనని బుకర్ నమ్ముతున్నాడా?"
"అవును. ఇతను డైట్ పంపిన గూఢచారి అని బుకర్ వాదన. ఇంతకాలం డైట్ కంపెనీ సింథటిక్ వస్త్రాలే తప్ప సిల్కు బట్టలు తయారుచెయ్యలేదు."
"ఈ కేసులో నేనెలా సాయపడగలను?" నాన్సీ కుతూహలంగా అడిగింది.
"నువ్వు డయానె డైట్ గురించి చెప్పేవరకూ నేనూ అదే అనుకొన్నా! ఆమె నీకు స్నేహితురాలు అయి ఉంటే ఈ విషయంలో నువ్వు తలదూర్చటం నయవంచన అయ్యేది. కానీ యిప్పుడా బాధ లేదు. ప్రస్తుతం నువ్వు ఈ కేసు కోసమే ఆమెతో స్నేహాన్ని ప్రారంభిస్తావు. ఆమె స్నేహాన్ని అడ్డుపెట్టుకొని ఆమె తండ్రి ఫాక్టరీలో ప్రవేశించే అవకాశం లేదంటావా? నిబంధనల ప్రకారం ఏ ఫాక్టరీలోకైనా సందర్శకులను అనుమతించరు. నాలాంటి న్యాయవాది వెడితే ఏదో కేసు విషయంలో వచ్చానని ఆ ఫాక్టరీ యజమాని అనుమానించే అవకాశం ఉంది."
"అర్ధమైంది నాన్నా! మీరు చెప్పినట్లు ఆనందంగా ప్రయత్నిస్తాను. ఫాక్టరీ లోపలకు వెళ్ళి నన్నేం చేయమంటారు? బుషీట్రాట్ ను కనిపెట్టాలా?"
"ముఖ్యంగా అదే! అతను అక్కడ ఉన్నట్లయితే, ఈ కంపెనీ రహస్యాన్ని అతనే అక్కడకు చేరవేశాడని రూఢిపరచుకోవచ్చు. అంతేకాదు. వీలుంటే అక్కడ యీ కండువా తయారీకి వాడే పట్టు తయారీప్రక్రియను కనుక్కోగలిగితే, మనకు మరింత ఉపయోగం" న్యాయవాది కూతురితో అన్నాడు.
"ఇది చాలా క్లిష్టమైన పని. కానీ ప్రస్తుతం నేను తీసుకొన్న మార్చ్ కేసంత కష్టమైనదేం కాదు" నాన్సీ అంది.
"కొంతకాలం నువ్వీ కేసుపై పనిచేసి, తిరిగి మార్చ్ కేసుపై దృష్టిని పెడితే నీకు మార్పు ఉంటుంది కదా!" తండ్రి ఆమెకు సలహా యిచ్చాడు.
తన తండ్రి ఆఫీసుకెళ్ళిపోయాక, డయానెకు అనుమానం రాకుండా ఆమెతో స్నేహం చేయటానికి తానేం చేయాలో నాన్సీ ఆలోచిస్తోంది. అదేసమయంలో ఆమె స్నేహితురాలు జార్జ్ ఫయానె వచ్చింది.
"ఏమిటలా ముఖాన్ని చిట్లిస్తున్నావు?" జార్జ్ అడిగింది
"డయానె డైట్ తో స్నేహాన్ని ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నా!" నాన్సీ బదులిచ్చింది.
"డయానె డైట్ తోనా? అకస్మాత్తుగా నువ్వు ఆమెను యిష్టపడటం వింతగా ఉందే!"
"నేను యిష్టపడుతున్నానని చెప్పానా?"
"నీ ఉద్దేశంలో ఆమె ఏదో మిస్టరీలో యిరుక్కొందంటావా? మాయమైన ఫిప్ సాహిత్యాన్ని యీమె దొంగిలించిందని చెప్పటంలేదు కదా!" ఆమె పరిహాసమాడింది.
"అదికాదు. వాళ్ళ నాన్నగారి ఫాక్టరీలోకి వెళ్ళటం కోసమే ఆమెను పట్టుకోవాలనుకొంటున్నాను" నాన్సీ చెప్పింది.
"తండ్రి ఫాక్టరీ గొడవల్ని ఆమె పట్టించుకోదు కదా! ఎంతసేపూ తన గురించి, పారీ మేడం దగ్గర తాను కుట్టించుకొన్న కొత్తబట్టల గురించే ఎక్కువగా మాట్లాడుతూంటుంది" జార్జ్ గుర్తుచేసింది.
"పారీ మేడం అంటే ఆ దర్జీ(టైలర్)యేనా? ఆమె గురించి నాకు అంతగా తెలియదు."
"ఈమధ్య మా అమ్మ పెళ్ళికి వెళ్ళటానికి బట్టలు కుట్టమని ఆమెకి యిచ్చిందట. అదే సమయంలో డయానె అక్కడకు వచ్చి అమ్మ ముందే పెద్ద తుఫాను సృష్టించిందట. పారీని తన పనంతా వదిలేసి ఉన్నపాటున తనకు బట్టలు కుట్టి యివ్వాలని హుకుం జారీ చేసిందట. ఆమె ఏదో పనిమీద ఊరు వదిలి వెళ్ళాలట."
"అంటే డయానె ప్రస్తుతం ఊళ్ళో లేదా?" నాన్సీ నిరాశగా అడిగింది.
"లేదు. తను ఎన్నాళ్ళు ఊరెళ్ళిందో నాకు తెలీదు. ఆమె యింటికి ఫోను చేసి డయానె వివరాలు తెలుసుకోవచ్చు కదా!"
"ఫోను ద్వారా గాక, ఆమె సమాచారాన్ని మరోమార్గంలో తెలుసుకోవాలనుకొంటున్నాను" నాన్సీ చెప్పింది.
"ఆ దర్జీ సంగతేమిటి? ఆమెతో పనుందని పదకొండు గంటలకి అమ్మ వెడుతోంది. మనిద్దరం కలిసి ఆమెతో వెడదాం" జార్జ్ సలహా యిచ్చింది.
"మంచి ఆలోచన" అంటూ నాన్సీ హుషారుగా లేచింది.
వెంటనే అమ్మాయిలిద్దరూ జార్జ్ యింటికి బయల్దేరారు. వీళ్ళు వెళ్ళే సమయానికి జార్జ్ తల్లి బయల్దేరబోతోంది. మరికొద్దిక్షణాల్లో నాన్సీ పారీని పరిచయం చేసుకొంది. ఆమె డయానె కోసం కుట్టిన బట్టలను చూసి నాన్సీ పొగడ్తలతో ముంచెత్తింది.
"ఆ పిల్ల ఒళ్ళు పీలగా, బట్టలు కుట్టడానికి యీలుగా ఉంటది" దర్జీ డయానె రూపాన్ని మెచ్చుకొంటూ అంది.
"డయానె ఊళ్ళో లేదనుకుంటా!" పారీతో నాన్సీ అంది.
"ఇయ్యాల రెండింటి రైలుకొత్తాది. కానీ బండి దిగ్గానే తిన్నగా యీడకొచ్చి గోల సేత్తాది. నేనేమో దాన్ని సగమే కుట్టాను. ఏటంటుందో ఏటో? కాలూ సెయ్యి ఆట్టం లేదు" పారీ తన గోడు వెళ్ళబుచ్చుకొంది.
ఆమె మాటలకు నాన్సీ బుర్ర పాదరసంలా పనిచేసింది. తాను డయానెను కలిసే అవకాశం యింత సులువుగా దొరుకుతుందనుకోలేదు.
"నేను ఆమెను స్టేషనుకెళ్ళి కలుస్తాను. కలిసినప్పుడు బట్టలింకా సిద్ధం కాలేదని చెప్తాను. సరేనా?" నాన్సీ మాటలకు దర్జీ కళ్ళలో ఉపశమనం కనిపించింది.
"నా తల్లే! ఆ ఉపకారం సేసిపెట్టు. అదే టయంలో ఊళ్ళో దిగ్గానే తనకు పోను కొట్టమన్నారని ఆళ్ళ నాన్న సెప్పినట్టు కూడా సెప్పు."
సందర్భానికి తగ్గట్టుగా తన స్నేహితురాలు వేస్తున్న ఎత్తుగడలకు జార్జ్ కి నవ్వాగటం లేదు. దర్జీ దుకాణంనుంచి బయటపడ్డాక, జార్జ్ ఆమెకు అభినందనలు చెప్పింది.
"నాకు పట్టరాని సంతోషంగా ఉంది. ఏదైనా హోటల్లో భోజనం చేద్దాం" నాన్సీ హుషారుగా వాళ్ళని ఆహ్వానించింది. "హోటల్లో నా ప్రణాళిక ఏమిటో అమ్మకి వివరిస్తాను."
రుచికరమైన భోజనం ముగించాక నాన్సీ హడావిడిగా యింటికొచ్చింది. డయానెతో స్నేహం చేయాలంటే మామూలుగా ఉంటే కాదు, అందంగా, చాలా ఖరీదైన దుస్తుల్లో ముస్తాబవాలి. అసలు అల్లాటప్పాగాళ్ళను పలకరించే అలవాటే డయానెకు లేదు. ఒక గంట తరువాత ఎప్పటిలాగ కాక, చక్కగా ముస్తాబై డాబా దిగుతున్న నాన్సీని చూసి హన్నా గ్రూ విస్తుపోయింది.
"ఇంతలా ముస్తాబై ఎక్కడికమ్మా వెడుతున్నావు?"
అడిగిన హన్నాను నాన్సీ అమాంతం కౌగిలించుకొని హుషారుగా గిరగిరా తిప్పేసింది. "రివర్ హైట్స్ లో ఉన్న డయానె డైట్ అనే ఖరీదైన స్నేహితురాలితో అలా కాసేపు తిరగటానికి వెడుతున్నాను" నవ్వుతూ చెప్పి, ఆమె కంగారుగా బయటకు పరుగుతీసింది.
"నాన్న ఫోన్ చేస్తే, నేను చెప్పిన విషయాన్ని ఆయనకు తెలియజేయి" అంటూ గేరేజ్ నుంచి హన్నా గ్రూకి కేకవేసి చెప్పింది.
నాన్సీ కారులో స్టేషనుకి వచ్చేసరికి, అప్పుడే రెండు గంటల రైలు స్టేషనులోకి ప్రవేశిస్తోంది. కారును త్వరగా పార్క్ చేసి నాన్సీ ప్లాట్ ఫాం మీదకు పరుగెత్తింది.
రైలులోంచి దిగుతున్న మొదటి ప్రయాణీకురాల డయానే నే! ఆమె వద్దకు వెడుతున్న నాన్సీ గుండె వేగంగా కొట్టుకోసాగింది. 'తన ప్రణాళిక పని చేస్తుందా?'
"హల్లో డయానే!" నాన్సీ పిలిచింది.
తల పైకెత్తి చూసిన ఆమె తనను నాన్సీ పలకరించటం చూసి ఉలికిపడింది. ఇష్టంలేకపోయినా ముఖప్రీతికి చిరునవ్వుతో బదులిచ్చింది.
"నీకో సందేశం తెచ్చాను" నాన్సీ చెప్పింది.
"నాకా? ఏమిటది?" డయానె ఆందోళనగా అడిగింది.
"పారీ మేడం నీ దుస్తులింకా సిద్ధం కాలేదని చెప్పమంది."
"ఓ!" ఎలాంటి కబురు వినవలసివస్తుందోనని ఆందోళన పడ్డ డయానె తేలికగా నిట్టూర్చింది. తరువాత ఆమె కళ్ళు టపటప కొట్టుకొన్నాయి. "ఆ మనిషి ఎప్పుడూ యింతే! ఇలాగే నిరుత్సాహపరుస్తుంది. ఏదో బట్టలు అందంగా కుడుతుందనే తప్ప, ఇకపై ఆమె వద్దకు వెళ్ళను."
"డయానె! అద్భుతమైన అందం నీది" నాన్సీ పొగడ్తకు ఆమె పొంగిపోయింది. అప్పుడే ఆమె నాన్సీ వేసుకొన్న దుస్తులను తేరిపార చూసింది.
"నువ్వు వేసుకొన్న బట్టలు చాలా బాగున్నాయి. వీటిని నువ్వు తయారుచేయించావా?"
" అవును" రాబోతున్న నవ్వును ఆపుకొంటూ చెప్పింది నాన్సీ. డయానె తన వేషానికి యింత త్వరగా పడిపోతుందనుకోలేదు. 'హన్నా గ్రూ తను తయారుచేసిన దుస్తులకు యింత పొగడ్త లభించిందని వింటే ఎంత పొంగిపోయేదో!' మనసులో అనుకొందామె.
"డయానె! నిన్ను నా కారులో తీసుకెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఏదీ? నీ సూటుకేసు యిటివ్వు" అంటూ నాన్సీ అందుకోబోయింది. డయానె అడ్డు చెబితే నాన్సీ చిరునవ్వు నవ్వింది. డయానె చేతిలో సూటుకేసు అందుకుని తన కారువైపు నడిచింది నాన్సీ. డయానె అక్కడ చుట్టుప్రక్కల కూలీవాళ్ళు లేనందుకు, తమ కారు డ్రయివరు సెలవులో ఉన్నందుకు అనవసరంగా తన చేత సామాను మోయించి యిబ్బందిపెడుతున్నానని బాధపడింది. వాళ్ళు కారులో కూర్చున్నాక డయనె యింటికి వ్యతిరేకదిశలోకి నాన్సీ కారును మళ్ళించింది.
"నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు" డయానె ఆగ్రహంతో అరిచింది.
నాన్సీ అడ్డు తగులుతూ " ఇప్పుడే గుర్తొచ్చింది. మీ నాన్నగారు వెంటనే నిన్ను ఫాక్టరీ దగ్గర చూడాలనుకొంటున్నారట! పారీ మేడం ఈ సందేశం కూడా నీకు అందజేయమంది" అని చెప్పింది.
ఇటుకలతో కట్టిన యిళ్ళసమూహం వచ్చేవరకూ నాన్సీ కారును పోనిచ్చింది. అక్కడ కారు దిగిన డయానె ఆమెకు వీడ్కోలు చెప్పి తాను యింటికి టాక్సీలో పోతానని చెప్పింది. కానీ నాన్సీ ఆమెను అంత సులభంగా వదలదలుచుకోలేదు.
"ఫరవాలేదు. నేను ఉంటాను. ప్రస్తుతం నాకు వేరే పని లేదు."
ఆమె అభ్యంతరం చెప్పేలోపునే నాన్సీ కారు దిగి డయానెతో పాటే అక్కడున్న భవనంలోకి నడిచింది. మర్యాదకొరకు ఆమె నాన్సీని తన తండ్రి కార్యదర్శికి పరిచయం చేయక తప్పలేదు.
"నాన్న దగ్గర ఎంతసేపు ఉంటానో తెలియదు. నాకోసం నువ్వు ఇబ్బంది పడవద్దు" డయానె మర్యాదపూర్వకంగా నాన్సీతో చెప్పింది. డయానె తన తండ్రి కార్యాలయం వైపు వెళ్ళిపోయాక, నాన్సీ కార్య్దర్శి మిస్ జోన్స్ ని చూసి నవ్వింది. "పని చేయటానికి యిది మనోహరమైన ప్రాంతం. సింథటిక్ వస్త్రాల మూలపదార్ధాన్ని తయారుచేసే ప్రక్రియ మీకు తెలుసా?" నాన్సీ ఆమెతో కబుర్లను ప్రారంభించింది
"బాగా తెలుసు. కానీ అన్నింటికీ దూరంగా ఉన్నాను" ఆ యువతి హుషారుగా బదులిచ్చింది.
కొద్దిక్షణాలు నాన్సీ తాను ఉన్న గదిని పరికించి చూసింది.
"కాసేపు నాకు ఈ ఫాక్టరీ అంతా చూసి రావాలని ఉంది. డయానెను అడిగితే తీసుకెడుతుందా?"
నాన్సీ ప్రశ్నకు మిస్ జోన్స్ చిరునవ్వు నవ్వింది. "తనకు వాళ్ళ నాన్న వ్యాపారంపై అంతగా శ్రద్ధ లేదు. నువ్వు త్వరగా చూసి వస్తానంటే, నేను చూపించగలిగినంత చూపిస్తాను. ఇక్కడ అనుసరించే ఎన్నో ప్రక్రియలు రహస్యంగా ఉంటాయనుకో! అందులో కొన్ని నాకే పూర్తిగా తెలియవు."
నాన్సీ నాడి వేగంగా కొట్టుకోసాగింది. త్వరగా ఆ ఫాక్టరీని చుట్టేసి రావాలన్న ఆత్రుత ఆమెలో ఉన్నా, పైకి మాత్రం ప్రశాంతంగా ఉన్నట్లు నటిస్తోంది.
"అది మీ గొప్పదనం మిస్ జోన్స్! నిజంగా మీ సమయాన్ని నాకోసం కేటాయిస్తే, చుట్టూ చూసి రావటానికి నాకు అభ్యంతరం లేదు."
"నిబంధనల ప్రకారం సందర్శకులను ఫాక్టరీలోకి అనుమతించరు. కానీ నువ్వు డయానె స్నేహితురాలివి కావటం వల్ల. . . ." అంటూ నాన్సీ వేసుకొన్న దుస్తులను మెచ్చుకోలుగా చూస్తూ, "నిన్ను లోపలికి తీసుకెడతాను" అందామె.
వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న హాళ్ళ గుండా పోతూ, మెట్లను ఎక్కి దిగుతుండగా సింథటిక్ వస్త్రాల తయారీలో ఉపయోగించే మూలాధారాల గురించి మిస్ జోన్స్ వివరించింది.
"ఇదంతా ఒక యింద్రజాలంగా కనిపిస్తుంది. బొగ్గు, నూనె కలిసి అతితక్కువ కాలంలో చక్కని మెత్తటి పదార్ధాలుగా మారుతాయి. ఇతర ఫాక్టరీల్లో బొగ్గు, నూనెలను కలిపి తయారుచేసిన రంగులేని రసాయనికాలను మనం కొంటాం. వాటిని నువ్వక్కడ చూశావే! అలాంటి టాంకుల్లో కొన్ని రసాయనిక మిశ్రమాలతో కలిపి, కొన్ని గంటలపాటు చిలుకుతారు."
"పీచు లక్షణాలున్న ద్రావణాలు దాని ఫలితమేగా?" నాన్సీ అడిగింది.
"అవును. ప్రతిదానికి దానిలో వాడిన మిశ్రమాలను బట్టి వాణిజ్యపరమైన పేరు పెడతారు."
"ఇందులో రహస్యం ఏమీ లేదు" అని నాన్సీ మనసులో అనుకొంది.
మిస్ జోన్స్ ఆమెను ఫాక్టరీలో మరీ లోపలికి తీసుకెళ్ళినప్పుడు, నాన్సీ బుషీట్రాట్ కోసం కళ్ళతో వెతకసాగింది. అక్కడ తమ పనుల్లో లీనమైపోయిన ఎంతోమంది పనివాళ్ళున్నా, తాను అనుమానిస్తున్న దొంగ పోలికలు వారెవరిలోనూ కనబడలేదు. దూరంగా చివర్లో ఉన్న మెట్లు ఎక్కితే వచ్చే భవనాన్ని గమనించింది. దానికి చాలామందంగా రాచరికపు కోట తలుపులను తలపించే పరిమాణంలో ఒక తలుపు ఉంది. దానికి తగిలించిన లోహపు బోర్డ్ మీద యిలా ఉంది.
" ప్రవేశం నిషిద్ధం -
ప్రమాదం - దూరంగా ఉండండి"

(మిగిలిన కధ వచ్చే నెలలో)

No comments:

Post a Comment

Pages