నాదస్వర కోవిద - షేక్ చిన్న మౌలానా - అచ్చంగా తెలుగు

నాదస్వర కోవిద - షేక్ చిన్న మౌలానా

Share This
‘నాదస్వర కోవిద, నాదస్వర ఆచార్య, ‘మంగళవాద్య విశారద’
షేక్ చిన్న మౌలానా (1924 – 1999) వర్థంతి
'నాదస్వర'లయ నీరాజనం, నివాళి
కొంపెల్ల శర్మ 

ఆయన ఒక ఇస్లాం మతస్తుడు. ఇంట్లో ఖురాన్ కు సంబంధించిన ఫొటోలతోపాటు, శ్రీరంగనాథస్వామి, శ్రీరామ పంచాయతనం, ఇత్యాది హిందూ దేవతల ఫోటోలు గోడలను అలంకరించటం తమ వంశాచారం. ఈ వింత విడ్డూరాల్ని చూసి తమిళ ప్రజ ముక్కున వేలేసుకుంది. ఇదేమిటి? అని ప్రశ్నిస్తే – “నేను ముస్లింనే కాని మా వంశం వందల సంవత్సరాల నుండి హిందూ సంప్రదాయాలను కూడా పాటిస్తుంది. బురఖా అలవాటు మా ఆడవారికి లేదు. బొట్టు, జుట్టు, ముడిలో పువ్వులు, చీర, కాలికి మట్టెలు, ఇవన్నీ మా స్త్రీలకూ సంప్రదాయబద్ధమైనవే. రంజాన్, బక్రీద్ లలాగే వినాయకచవితి, దసరా, దీపావళి కూడా. ఆలయాలు మాకు నిషిద్ధం కావు. ఆహ్వానిస్తే దేవుని ఉత్సవాల్లో కచేరీలు చేస్తూనే ఉంటాం. సంగీతం, నాదోపాసన, ఇవే మా ఆరాధ్య దైవాలు అనేవారు”. ఆయన పేరు షేక్ చిన మౌలానా. 
విశ్వమంతా నాదస్వర నాదంతో ఖ్యాతినొందిన నాదస్వర కోవిదుడు షేక్ చిన్న మౌలానా. నాదస్వరం అంటే మనకు శుభకార్యం స్ఫురణకు రాకమానదు. సునాద మంగళ స్వరం లేని శుభకార్యంలో చెప్పలేని లోటు కనిపించక మానదు. అల్లంత దూరాన నాదస్వరం వినగానే గుండెంతా పచ్చతోరణం కట్టినట్టై పోతుం ది. కళ్ళనిండా పట్టుచీరల రెపరెపలు దర్శనమిస్తాయి. అందుకేనేమో డోలు-సన్నాయి అవిభాజ్య మంగళ వాద్యాలుగా, ఖచ్చితంగా అక్కడేదో శుభకార్యం జరుగుతూనే ఉంటుందని ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి అన్నారు. చేతులు మారి మారి, నాదస్వరం ఆయన చేతిలోకి వచ్చి వాలింది. నాదస్వరం అనగానే ఆయన, ఆయన పేరు చెబితే నాదస్వరం ఉభయతారకంగా భాసిల్లక మానదు. నాదస్వరం పేరెత్తగానే ఆంధ్రులందరికీ ఒక మహా మనీషి స్ఫురణకు రాక మానడు. ఆయనే షేక్ చిన్న మౌలానా.
షేక్ చిన మౌలానా ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో 5 డిసంబర్ 1924 న నాగస్వర విద్వాన్ ఖాసిం సాహెబ్ బీబమ్మ దంపతులకు జన్మించారు. సంప్రదాయంగా వస్తున్నా నాదస్వర వాద్యాన్ని మొదట తండ్రి వద్ద తర్వాత పెదతండ్రి మాడారు సాహెబ్ గారి వద్ద అభ్యసించాడు. కొంతకాలం చిలకలూరుపేట ఆడం సాహెబ్ గారి వద్ద అభ్యసించారు. నాదస్వర విద్వాంసుల వద్ద సాధన చేయాలన్న తాపత్రయంతో, తంజావూర్ జిల్లా నాచ్చిమార్ కోయల్ దోరైకన్ను సోదరుల వద్ద శిక్షణ పొందారు. టి యన్ రాజరత్నం పిళ్ళై వారి నాదస్వరం వింటూ ముఖ్య విషయాల సాధన చేశారు. కంచి కామకోటి పీఠం పరమాచార్య, శృంగేరీ పీఠం శంకరాచార్యుల సమక్షంలో కచేరీలు చేసి ధన్యాత్ములు, పుణ్యాత్ములుగా తరించారు. 
1959 లో చెన్నైలో జరిగిన రేడియో సంగీత సమ్మెలన ప్రారంభోత్సవంలో తన నాదస్వర వాదనం వినిపించి, కామరాజ నాడార్ లాంటి ప్రముఖ నాయకుల అభినందనల్ని అందుకుని, ఆ పరంపరలో తమిళనాడులో మంచిపేరు సంపాదించారు. తమిళనాడులో ప్రముఖులైన కారైకురిచ్చి అరుణాచలం, వేదమూర్తిలాంటి వారి మన్ననలందుకొన్నారు. కొంతకాలం తన స్వస్థలం కరవడిలో ఉంటూ, పలుచోట్ల నాదస్వర ప్రదర్శనలనిచ్చారు. 15.4.1964 నుండి తిరుచిరాపల్లి సమీపంలో శ్రీరంగనాథస్వామి సంనిదానమైన శ్రీరంగం కోవెలలో స్థిరపడ్డారు. వీరి సంగీతంలో రాగం పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని సమకూర్చుకొన్నదని పలువురు సంగీత విశ్లేషకులు భావించారు. తోడి, ఖరహరప్రియ, కళ్యాణి, కాంభోజి, శుభాపంతువరాలి, భైరవి రాగాల వాదనలో దిట్టగా పేరుగాంచారు. మోవ్లానాగారి కాపీరాగాలాపన విన్న మహా విద్వాంసులు ముగ్దులయ్యేవారని ఆనాటి విశ్లేషకులు విషయాలని ప్రస్తావించారు. రాగంలో కీర్తన, స్వరాల్లో మోవ్లానాగారి నాదపోషణ ప్రత్యేక ప్రతిష్ట సంగారించుకొని శోతలను మైమరపించేదిగా రూపుదిద్దుకోనేదని ఆనాటి విశ్లేషకులు తీర్మానిన్చేవారు.
మౌలానా గారి నాదస్వర ప్రతిభా శిగలో ఎన్నో కలికితురాయిలు ఒదిగిపోయాయి. మంగళవాద్య విశారద, కలైమామణి, పద్మశ్రీ, కేంద్ర సంగీత నాటక అకాడమీ, సప్తగిరి సంగీత విద్వన్మణి, తమిళనాడు ఆస్థాన విద్వాన్ పదవి, రాజరాజచోళన్ సహస్రాబ్ది ఉత్సవాల్లో స్వర్ణపతకం, కళాప్రపూర్ణ – యివి మచ్చుకే కొన్ని.
“కొన్ని తరాలుగా మా పూర్వీకులు హిందూ దేవాలయాల్లో పనిచేశారు. తమిళనాడులో కాకపోవచ్చు, నన్ను ద్వేషించినవారే నా అభిమానులై ఎన్నో కచేరీలు చేయించారు. ఇందుకు నా పాలిటి దైవమైన శ్రీరంగ నాథుడే కారణం. స్వామి అనుగ్రహం, గురువులు, తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులే నాకు శ్రీరామరక్షగా ఉన్నాయి” అని నమ్రతతో చెప్పేవారు.
పట్టుబట్ట కట్టడం, కుంకుమ బొట్టు పెట్టడం, భక్తిగా రాముడికి దణ్ణం పెట్టడం – ఎవరైనా ప్రశ్నిస్తే – “నాదోపాసకులకు మతభేదమేమీలేదు. పర్వీన్ సుల్తానా చక్కగా కుంకుమబొట్టు పెట్టుకునేది. బడే గులాం ఆలీ ఖాన్ పాకిస్తాన్ లో కచేరీ ఇస్తూ ‘కన్హయ్యా’ (కృష్ణుడు) అనే గీతం ఆలపిస్ట్ అక్కడి వాళ్ళు ఆక్షేపించాగా కన్నయ్య లేని సంగీతం నాకు అక్ఖరలేదు అని వచ్చేశాడట. భగవత్ సాక్షాత్కారానికి వివిధ మార్గాలునా నాకు సంగీతమే శరణ్యం. దాన్లో పై స్థాయికి వెళ్ళడమే నా లక్ష్యం. అన్ని మతాల్లోనూ సంగీతానికి, భక్తికీ సంబంధం ఉంది. మేము అనుదినం చేసే నమాజు అల్లా... ఆ ...ఆ...ఆ.. అనే బేమ్గ్ (నినాదం) మాయా మాళవగౌళ రాగం. సంగీతం నాకు ఎంత ప్రాణమై పోయిందంటే కరవడిలో మాకు మళ్ళూ, మాన్యాలూ, ఇల్లూ వాకిళ్ళూ, ఉన్నా కేవలం సంగీతం కోసం, సంగేట వాతావరణం కోసం శ్రీవైష్ణవుల 108 దివ్య దేవాలయాల్లో ప్రధానమైన శ్రీరంగంలోనే స్థిరపడ్డాను. ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఉంటూ నిత్యం నాదస్వరార్చన చేసుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.” అని చాలా భక్తి విశ్వాస పూర్వకంగా సమాదానమిచ్చేవారు. గాన కళా ప్రపూర్ణ, గాంధర్వ కళానిధి, సంగీత విద్వన్మణి ఇతర బిరుదులూ ఆయన్ని ఆవహించాయి.
శ్రీరంగంలో స్థిర నివాస మేర్పరచుకొన్న మౌలానా, 1982 లో ‘శారద నాదస్వర సంగీత ఆశ్రమం’ స్థాపించి పలు యువ కళాకారులకు నాదస్వర వాదనంలో శిక్షణ నేర్పించిన ఉద్దర హృదయులు. నాదస్వర విద్వాంసులుగా అపార కీర్తి గడించిన షేక్ చిన మౌలానా 1999 ఏప్రిల్ 13 న శ్రీరంగంలోనే మరణించారు. 
ఆళ్వారులలో పెక్కుమంది శ్రీరంగ వైభవాన్ని గానం చేశారు. తిరుప్పానాల్వారు, నాచ్యార్ రంగనాథుని పాద సన్నిధిలో లీనమయ్యారు. పలు విదేశాల్లో కూడా నాదస్వర కచేరీలు చేసి తన్మయులను చేశారు. రామున్ని, అల్లాని, కృష్ణుని, త్యాగయ్యనీ, నాదస్వారంతో పూజించే ఒక మహా విద్వాంసుడు. ఒక సత్పురుషుడు, ఒక తత్త్వవేత్త, అన్నిటినీ మించి ఒక మానవతావాది –శ్రీ షేక్ చిన్న మౌలానా గారు అని తనికెళ్ళ భరణిగారు వివరించారు. చిన్న మౌలానా లాంటి నాదస్వర విద్వాంసులు తెలుగు నాట కూడా ఆవిర్భావించాలంటే దేవాలయాల్లో ప్రతీ ఉదయం నాదస్వరం మారుమ్రోగాలి. ఇది సంగీతజ్ఞులంతా పలికే నినాదం. మనవారిలో సంగీతం పట్ల ప్రజాభిరుచి పెరగాలన్నా అదొకటే దారి; ప్రభుత్వమూ, సంబంధిత శాఖలూ, ఈ విషయం త్వరలో గుర్తించి అమలుకు కావలసిన ఏర్పాట్లు చేస్తారని భగవంతున్ని ప్రార్థిద్దాం – అని సుప్రసిద్ధ సంగీత విశేషక పాత్రికేయులు చాగంటి కమాలేశ్వరరావు గారు ఒక వ్యాసంలో ఉద్ఘాటించారు. ఈసారైనా, మన ప్రభుత్వం యీ విషయంపై దృష్టి పెట్టి, వేదపండిత ప్రవచన ప్రణాళిక యోజన మాదిరి ప్రతీ నాదస్వర విద్వాంసుడు – నియమిత దేవాలయంలో ప్రతీరోజు నాదస్వరార్చన, నీరాజనం చేసి, భగవదారాధనలో భాగస్వామ్యం వహించేలా – మన ప్రభుత్వాలు, సాంస్కృతిక శాఖలు – కొంచెం దృష్టి పెట్టి ఈ వర్గానికి తగినంత స్థాయిలో ఉపాదీకరణకు ఏర్పాట్లు చేసి కళాసేవ, పోషణలో తగినంతగా ప్రయత్నాలు చేసి, నూతన పరిపాలనలో, కొత్త ప్రభుత్వాలు సత్ఫలితాల్ని సాధిస్తారని ఆశిద్దాం. 

No comments:

Post a Comment

Pages