ప్రేమతో నీ ఋషి – 38 - అచ్చంగా తెలుగు
ప్రేమతో నీ ఋషి – 38
- యనమండ్ర శ్రీనివాస్

ఉపసంహారం

ఫాక్స్ సందేశాన్ని పట్టుకున్న మిష్టర్ త్రివేది దాన్ని వెంటనే తన బాస్ వద్దకు తీసుకువెళ్ళాడు. మరికొద్ది క్షణాల్లో ఆ భవంతిలోని ఉన్నతాధికారులందరిలో పెద్ద అలజడి చెలరేగింది. ఆ సందేశాన్ని వెంటనే నియామకులకు, చట్టాన్ని అమలుపరిచే ఏజన్సీలకు పంపారు. 
మరికొద్ది గంటల్లో ఎక్చేంజి నుంచి అనేక ప్రదేశాలకు ఉద్వేగ భరితమైన కాల్స్ వెళ్ళాయి. మహేంద్ర కంపెనీ ప్రతినిధి ఆ వార్త యొక్క ప్రామాణికతను నిర్ధారించలేకపోయాడు, ఆయన ఆఫీస్ లో ఎవరూ ఫోన్ తియ్యలేదు. మహేంద్ర ఫ్లైట్ ఇంకా లాండ్ అవలేదు కనుక ఎవరికి ఆ ఉత్తరంలోని అంశాల వాస్తవికత తెలీదు.
మీడియా వారికి ఈ వార్త తెలిసింది, దానికి మరింత ఉత్సుకతను కలిపి, వారు టివీల్లో ప్రసారం చెయ్యసాగారు.
ఆ రోజంతా నాటకీయతకు సాక్షిగా నిలిచింది. చాలా కొద్ది సమయంలోనే కంపెనీ షేర్ విలువ చలించిపోయి, నేలమట్టమైపోసాగింది. స్టాక్ ఎక్స్చేంజ్ వారు స్టాక్ మార్కెట్ మరింతగా పడిపోకుండా సర్క్యూట్ ట్రిగ్గర్లను ఉపయోగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పై ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. వెనువెంటనే ఈ కుంభకోణంలో తమ‌పాత్ర ఏమీ లేదని, తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, మినిస్టర్లంతా పత్రికా ముఖంగా ప్రకటించారు. 
ఇదే అవకాశంగా భావించిన ప్రతిపక్షం వారు, ఇది అత్యంత అవినీతిని కలిగి ఉన్న ప్రభుత్వమని చాటి,  పాలకులు గద్దె దిగాలని 
రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
మహేంద్రను విమానాశ్రయం లోనే చిట్టుముట్టి ఘొరావ్ చెయ్యాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తీసుకోమని, పోలీస్ శాఖకు ఆజ్ఞ ఇచ్చింది.
ప్రతిపక్ష నాయకులు ఆర్ట్ మ్యూజియం ప్రాజెక్ట్ నిర్వాణ ప్లస్ కు ఇవ్వడమనే విషయం పై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేసారు. ప్రతిపక్షాల సారధ్యంలో ఒక పెద్ద గుంపు హైదరాబాదులో ఉన్న మ్యూజియం ముందు బైఠాయించి, మ్యూజియం కోసం ఇప్పటికే  కొన్న 
పెయింటింగ్స్ పై సాంకేతికత పరీక్షలు జరపాలని డిమాండ్ చెయ్యసాగారు.
కాసేపట్లోనే ఆ గుంపువారు ఉద్రిక్తతలకు పాల్పడడంతో, ప్రభుత్వం వారు వారిని శాంతింప చేసేందుకు, సాంకేతిక పరీక్షల నిమిత్తం  వెంటనే మ్యూజియం ను సీజ్ చెయ్యాల్సొచ్చింది.
అర్థరాత్రికి, మహేంద్ర, మిష్టర్ శర్మ ప్రయాణిస్తున్న ఫ్లైట్ ముంబైలో లాండయ్యింది. వారు హైదరాబాద్ వచ్చేందుకు డొమెస్టిక్ ఫ్లైట్ కు మారే లోపునే ముంబై ఎయిర్ పోర్ట్ లోని పోలీస్ అధికారులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. 
గత కొద్ది గంటలుగా జరుగుతున్న అంశాల గురించి మహేంద్రకు కాస్త కూడా అవగాహన లేదు. కాని కొద్ది గంటల్లోనే పరిస్థితి ఎంత నాటకీయంగా మారిందంటే, అందరు ప్రభుత్వాధికారులతో ఆయన సంప్రదింపులు పూర్తిగా నిలిపివేయబడ్డాయి.
అటువంటి కీలక సమయంలో, ఎవరూ ఆయనతో మాట్లాడడం ఇష్టం ఉండదు కదా, అది వారికే చేటు చేస్తుంది కదా!
ఓటమిని అంగీకరించి, దర్యాప్తు విభాగానికి లొంగిపోయి, సహకరించడం తప్ప, ఎవరి పరపతిని వాడే అవకాశం ఇక అతనికి లేదు. మరి కొద్ది రోజుల్లో మహేంద్ర సామ్రాజ్యం పూర్తిగా పతనమయ్యింది, నిర్వాణ ప్లస్ వేరే వారికి అమ్మెయ్యబడింది.
***
" విశ్వామిత్ర పెయింటింగ్ కు తెర తీయడం ద్వారా, ఈ మ్యూజియంను ప్రారంభించమని, పర్యాటక శాఖా సంఘ మంత్రివర్యులకు మనవి చేస్తున్నాము." స్టేజిపై ఉన్న ఏంకర్ సభికుల ముందు ప్రకటించింది. ఆడిటోరియంలో బిగ్గరగా చప్పట్లు వినవచ్చాయి.
మహేంద్ర గుట్టు అందరిలో రట్టైన కొన్ని నెలల తర్వాత ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియం వద్ద ఈ సభ జరగసాగింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సత్వరమే స్పందించి, విచారణ కోసం వెంటనే ఒక సంఘాన్ని నియోగించింది. అసలు కొనుగోలుదారులతో సహా అన్ని పెయింటింగ్ల వివరాలను కమిటి గుర్తించి, నమోదు చేసారు. స్నిగ్ధ, ఋషి వెంటనే వారిని క్షమాపణ కోరి వరుసగా జరిగిన సంఘటనలన్నీ , ఆధారాలతో సహా ప్రభుత్వం వారికి అందించారు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages