ప్రతిభావంతుడు (smart success) - అచ్చంగా తెలుగు
ప్రతిభావంతుడు  (smart success)
బి.వి.సత్య నాగేష్ 

“రెక్కాడితే గాని డొక్కాడదు ” అనుకుంటూ నెలకు మూడు వేల రూపాయిల జీతం కోసం రోజంతా రెక్కల కష్టం చేస్తే చివరికి రోజుకు సంపాదించేది కేవలం 100 రూపాయిలేనా అనుకుంటాడు ఓ సగటు ఉద్యోగి. మరి లక్షల్లో సంపాదించే కొంతమందికి రోజుకు సంపాదన వేలల్లోవుంటుంది. దీనికి కారణం ఏంటా?... అని ఆలోచిస్తే చాలా ప్రస్పుటంగా మనకు సమాధానం దొరికిపోతుంది.
టైపిస్ట్ గా చిరుద్యోగం చేసి ఆ సంపాదనలో తృప్తి చెందక జీవితంలో ఎదగాలని నిర్ణయించుకొని ఎలా ఎదగాలోతెలుసుకొని,అలోచించి,ఆచరించి ఉద్వేగంతో సఫలీకృతుడై ఈ రోజు పదిమందికి ఉపాధి కల్పించేస్థాయికిఎదిగేడు ఒక వ్యక్తి. పోలిథీన్ సంచులను ప్రతీషాపుకు అందచేస్తూ రోజుకు కేవలం వంద రూపాయిలకంటే తక్కువ సంపాదించే వ్యక్తి తన ఎదుగుదలకు కావలసిన అంశాలపై దృష్టి పెట్టి ఈ రోజు ఒక పెద్ద వ్యాపారానికి అధినేత అయ్యేడు. ఒకప్పుడు రోడ్డు ప్రక్కన ఇడ్లీలు అమ్ముతూ వ్యాపారం చేసిన వ్యక్తి ఈ రోజు పెద్ద కేటరింగ్ సర్వీసెస్ కు అధినేత అయ్యేడు. ఒకప్పుడు హోటల్ లో గుమాస్తాగా పనిచేసి ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న “ఒబరాయ్ హోటల్స్ గ్రూపు” అధినేత ఒబరాయ్ ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందరూ ‘ఒబరాయ్ ‘ లాగా అవుతారా?.... అనే ప్రశ్న మనసులో మెదలుతుంది. ఆ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో లక్ష్యం వుండాలి. దానికి తగ్గ కృషి చెయ్యాలి. ‘పిండి కొద్ది రొట్టె’ అనే సామెత ఉండనే ఉంది. బాగా చదవాలి అన్నారు కదా అనిపదవతరగతి పరీక్షలో 90 శాతం మార్కులు తెచ్చుకుని వెంటనే IAS ఆఫీసర్ పరీక్ష రాయాలను కోవడం సబబు కాదు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలంటే కనీసం డిగ్రీ వుండాలి. దేశవ్యాప్తంగా పోటీదారులతో పోటీపడాలి. కనుక మన లక్ష్యం వాస్తవానికి దగ్గరగా వుండాలి. అలాగే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి ఎదగాలి. మనం ఉన్నస్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావలసిన లక్షణాలను పెంపొందించుకుంటూ అభివృద్ధిని సాధ్యం చెయ్యవచ్చు. ఈ విధంగా కొంతమంది మాత్రమే ఎందుకు చెయ్యగలుగుతారనే విషయం గురించి విశ్లేషించుకుందాం.
ఒకేరకమైన వ్యాపారం చేస్తున్న వ్యక్తుల్లో కొంతమంది మాత్రమే విజయం పొందుతున్నారు. అలాగే ప్రతీ సంవత్సరం యూనివర్సిటీల నుంచి కొనివేల మంది వృత్తిపరమైన కోర్సులను చదివి,పరీక్షల్లో ఉత్తీర్ణులై,పట్టాలను పట్టుకొని వృత్తిలోకి ప్రవేశిస్తున్నారు. కానీ వీరందరూ వృత్తిలో ఒకే స్థాయిలో రాణించలేదనేదివాస్తవం. ఉదాహరణకు...డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వృత్తిపరమైన కోర్సులను పూర్తి చేసి వృత్తి వ్యాపారంల్లోకిప్రవేశిస్తున్నారు. ఇందులో కొంతమంది మాత్రమే మంచి గుర్తింపును సంపాదించుకుని వృత్తి వ్యాపారాల్లో రాణిస్తున్నారు. యూనివర్సిటీ పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు సంపాదించుకున్నప్పటికీ కొంతమంది వృత్తిలో రాణించలేక పరాజయం పొందుతున్నారు కూడా. దీనికంతటికీకారణాలేంటో చూద్దాం!
పాత తరం వారికి మూడు గట్టి నమ్మకాలుండేవి. 1.చెమటోడ్చి కష్టపడితేనే ఫలితాలోస్తాయి.2.తెలివితేటలు అనేవి కొంతమందికి మాత్రమే ఉంటాయి 3.కొంత అదృష్టం కలిసి రావాలి. ఈ మూడు నమ్మకాలను కొత్తతరం బిహేవియరల్ సైంటిస్ట్ లు ఒప్పుకోవడం లేదు ఈ మూడు నమ్మకాల స్థానంలోనే కొత్తరకం బిహేవియరల్ సైంటిస్ట్ లు క్రొత్త నమ్మకాలను పరిచయం చేస్తున్నారు. ఆ మూడు క్రొత్తనమ్మకాల గురించి తెలుసుకుందాం.
పాతతరం వారు నమ్మే మొదటి నమ్మకాన్ని ‘హార్డ్ వర్క్’అంటాం, అంటే ....శరీరంలో అన్ని భాగాల్ని ఉపయోగించి శ్రమించడం అన్నమాటి. కాని వృత్తిలో రాణించి ప్రతిభావంతుడు అవ్వాలంటే మెదడునే ఎక్కువగా వాడి శ్రమించాలి. దీనినే ‘స్మార్ట్ వర్క్’అంటారు. ఉదాహరణకు... ఒక రిక్షా కార్మికుకు రోజంతా ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడితే రోజుకు మిగిలేది కేవలం మూడు వందల రూపాయిలైనా వస్తుందో లేదో చెప్పలేం. వృత్తి వ్యాపారాల్లో పేరు సంపాదించుకున్న కొంతమంది వ్యక్తులు ఒక్క చుక్క చెమటోడ్చకుండా రోజుకు వేలల్లో సంపాదిస్తూ వుంటారు. ఇటువంటి స్మార్ట్ వర్క్ చెయ్యాలంటే బాగా సాధన చెయ్యాలి. ఈ సాధనలో రెండు ముఖ్యమైన అంశాలుంటాయి. వీటిపై దృష్టిపెట్టి ఆత్మపరిశీలన చేసుకుంటూ ముందడుగు వేస్తే ప్రతిభావంతులై వృత్తి వ్యాపారాల్లో రాణించగలరు. అవే 1.నైపుణ్యము (SKILLS)2.విజ్ఞానం (KNOWLEDGE).
1.నైపుణ్యాల్లో అనేక రకాలుంటాయి. మనం చేపట్టిన వృత్తిలో టెక్నికల్ స్కిల్ల్స్ ఎంత ముఖ్యమూ, హ్యూమన్ స్కిల్స్ కూడా అంటే ముఖ్యం. టెక్నికల్ స్కిల్స్ ను వుపయోగించి వృత్తిలో రాణించదానికి హ్యూమన్ స్కిల్స్ కూడా చాలా అవసరం. హ్యూమన్ స్కిల్స్ లో ఎన్నో రకాలు వునప్పటికీ...అనులోని కొన్ని స్కిల్స్ ను నేర్చుకుని సాధనతో పటిష్టం చేసుకోవాలి. మైండ్ మేనేజ్మెంట్,మానవసంబంధాలు,కమ్యూనికేషన్ స్కిల్స్,క్రియేటివిటి,మెమరి,టైం మేనేజ్మెంట్ లాంటి నైపుణ్యతలనుఖచ్చితంగా సాధన చేస్తే వృత్తిలో రాణించగలరు.ఒక వ్యక్తి ‘నిపుణుడు’గా గుర్తిపబడ్డాడంటే పైన పేర్కొన్న నైపుణ్యతలను ఎంతో కొంత సాధన చేస్తున్నాడనే విషయాన్ని మనం గమనించగలం. నైపుణ్యతలోక్కటీవుంటే చాలదు రెండో అంశంలో కూడా ప్రావీణ్యత వుండాలి.
2.విజ్ఞానం చాలా అవసరం.ఏ రంగంలో పనిచేస్తుంటే ఆ రంగానికి సంబంధించిన విజ్ఞానాన్ని అపారంగా సంపాదించుకోవాలి, విజ్ఞానం వల్ల లాభాలున్నాయి. విషయాన్ని వెంటనే అర్ధం చేసుకోగల సామర్థ్యం వుండటం,తెలివిగా ప్రవర్తించడం,నిర్ణయాలు తీసుకోగల సారథ్యం పెరగటం, పరిస్థితులకు వెంటనే స్పందించడం అనేవి పరిజ్ఞానం ఉండడం వల్ల సాధ్యం అవుతుంది.
నైపుణ్యతలు,విజ్ఞానం/పరిజ్ఞానం అనేవి రెండూ స్మార్ట్ వర్క్ లోకి వస్తాయి. ఈ రెండింటి వల్ల మాత్రమే ఒక వ్యక్తి ప్రతిభావంతుడవుతాడని చెప్పలేం. మిగిలిన అంశాలను కూడా పరిశీలిద్దాం.
ఇక పాతతరం వారు నమ్మిన రెండో అంశం. అదే తెలివితేటలు. మెదడు వృద్ధి చెందిన వారందరిలో తెలివితేటలుంటాయి. మెదడు వృద్ధి చెందని వారు ‘మెంటల్లీ చాలెంజ్’ గా పెర్కోనబడతారు. వారు కాకుండా మిగిలినవారు అన్ని విషయాల్లోనూ తమ తెలివిని ప్రదర్శించి వృత్తి విషయంలో తెలివిని ప్రదర్శించక పోడానికి కారణాలుంటాయి. తెలివితేటలనేవి మనకున్న పరిజ్ఞానం పై ఆధారపడి వుంటాయి. పరిజ్ఞానం లేని వ్యక్తి ‘తెలివైనవాడు’అనిఅనిపించుకోలేదు.మనకున్న పరిజ్ఞానాన్ని సృజనాత్మకంగా, సమయస్పూర్తి తో వాడుకోవడమే ‘తెలివితేటలు’ అనిపించుకుంటుంది. కనుక మనకున్న విజ్ఞానాన్ని సృజనాత్మకంగా వాడడం అలవాటు చేసుకోవడం ఎంతైనా అవసరం. ఇంతటితో సరిపోదంటున్నారు ఈనాటి బిహేవియర్ సైంటిస్టులు 
మన ఉద్వేగాలను, ఎదుటివారి ఉద్వేగాలను అర్ధం చేసుకుంటూ మనకున్న విజ్ఞానం/పరిజ్ఞానంతో తెలివిగా మెలగాలంటున్నారు. దీనినే ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ అంటున్నారు. వృత్తి వ్యాపారాల్లో రాణించాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ను వృద్ధి చేసుకోవాలి.
ఇక పాతతరం వారు నమ్మిన మూడో అంశం విషయానికి వద్దాం. అదే ‘అదృష్టం’ ఏ ప్రయత్నం చేయకుండా కలిసి వచ్చేదాన్ని అదృష్టం అంటాం. నిజమే! మనం పుట్టకతో ఎటువంటి అంగవైకల్యం, జబ్బులూ లేకుండా పుట్టి వుంటే మనం పుట్టుకతోనే అదృష్టవంతులంకదా! ఎందుకంటే... అందులో మన ప్రయత్నం ఏమీ లేదు. అంగవైకల్యం,శారీరక రుగ్మతలు వున్నవారు కూడా ఎన్నో అద్భుతాలను చేసి చూపిస్తున్న ఈ రోజుల్లో... అన్నీ వున్నవాళ్ళు అదృష్టవంతులే కదా! అందుకని మన ఆలోచించే తీరును సవరించు కోవాలంటున్నారు బిహేవియర్ సైంటిస్టులు. దీనినే మానసిక దృక్పథం (ATTITUDE) అంటాం. మనం ఆలోచించే తీరులో 6 ‘D’ లు వుంటే వృత్తిలో రాణించడానికి ఉపకరిస్తాయి. వాటిని DESIRE,DESIGN,DIRECTION,DETTERMINATION,DEDICATION,DISCIPLINE అంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆదాయాన్ని పెంచుకుని ప్రతిభావంతుడవ్వాలంటే ఈ లక్షనాలన్నింటినీ అలవరచుకోవాలి. ముందుగా DESIRE అంటే...తపనను పెంచుకోవాలి. కోరికను మించిన స్థాయిలో వుండాలి.
“నేను నా వృత్తిలో ప్రతిభావంతుడుగా రాణించాలి’ అనే తపన మనిషి ఆలోచనా విధానంలో ఒక భాగం అయిపోవాలి. తను సాధించాలనుకున్న లక్ష్యంను ప్రణాళికా బద్ధంగా design చేసుకోవాలి, ఆ డిజైన్ ను ఆచరణలో పెట్టి అదే లక్ష్య దిశ (DIRECTION) లో ముందుకు సాగాలి. లక్ష్యదిశలో ఎటువంటి అడ్డంకు లోచ్చినా నిరాశ,నిస్పృహ చెందకుండా సడలని పట్టుదల (DETERMINATION)తో వుండాలి, ఈ లక్ష్యదిశలో ప్రయాణాన్ని అంకితభావం (DEDICATION)తో చెయ్యాలి. ‘ఏదో ఒకటి’ అనుకోకుండా నైపున్యతను,పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఆలోచనా తీరులో అంకితభావాన్ని ఇంకిపోయేటట్లు చెయ్యాలి. ఈ విధంగా చేస్తూ క్రమశిక్షణ (DISCIPLINE)తో కృషి చేస్తే తప్పకుండా ప్రతిభాశీలుడుగాఅయి తీరుతాం.
పాతతరం వారు నమ్మి ఆచరించి 1.హార్డ్ వర్క్ 2.తెలివితేటలు 3.అదృష్టం అనే అంశాల స్థానంలోనే ATTITUDE,SKILLS,KNOWLEDGE,EMOTIONALINTELLIGENCEలను అభివృద్ధి చేసుకోవాలి. “రెక్కాడితే కాని డొక్కడదు” అనే స్థితి నుంచి ఎటువంటి వ్యక్తులైనా పైన పేర్కొన్న నాలుగు అంశాలను ఆచరిస్తూ సాధన చేస్తూ ముందడుగు వేస్తే రోజుకు వేల రూపాయలు సంపాదించడమే కాకుండా, నలుగురికి ఉపయోగపడే విధంగా ప్రతిభావంతులుగా ఎదుగుతారు. ఆలస్యం ఎందుకు? పదండి ముందుకు.
*****

1 comment:

  1. చాలా చక్కని విశ్లేషణ మరియు ఆచరణాత్మక ధోరణిలో ఆశావహ దృక్పథాన్ని మేళవించి పంచినందుకు ధన్యవాదాలు

    ReplyDelete

Pages