ప్రేమతో నీ ఋషి – 37 - అచ్చంగా తెలుగు
  ప్రేమతో నీ ఋషి – 37
- యనమండ్ర శ్రీనివాస్

( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు.
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి.... కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి మహేంద్రతో తాము కొన్న పెయింటింగ్ నకిలీదని చెప్తుంది. మూడో కంటికి తెలియకుండా ఈ విషయంలో దోషులు ఎవరో కనుక్కోమంటాడు మహేంద్ర. మృణాల్ నకిలీ గిల్సీ పెయింటింగ్ ను కొన్నాడని తెలుసుకుని, అది నిర్ధారించేందుకు ఆఫీస్ కు వెళ్లిన స్నిగ్ధకు అక్కడ మృణాల్ శవం కనిపిస్తుంది స్నిగ్ధ ఆఫీస్ భూగర్భ గదిలో పెయింటింగ్స్ నకళ్ళు తయారుచేసే కర్మాగారం ఉందని తెలుసుకున్న ఋషి, మరిన్ని వివరాల కోసం అప్సరను ఇంటికి వెళ్లి, అక్కడ మృణాల్, అప్సరను ఎవరో కాల్చి చంపడం చూస్తాడు ఋషి. తమ చుట్టూ ఎవరో ఉచ్చు బిగిస్తున్నారని తెలుసుకున్న ఋషి, స్నిగ్ధ జరిగినవన్నీ శర్మ గారికి చెప్తారు. కాని, ఆయన, మహేంద్ర కలిసి ఋషిని తాము చెప్పినట్లు చెయ్యమని బ్లాక్ మెయిల్ చేస్తారు. వాళ్ళను ఎదురుదెబ్బ తీసేందుకు మంచి ప్లాన్ వేస్తాడు ఋషి.. ఇక చదవండి...)

అలా అన్నాకా, అతను స్నిగ్ధ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తన కారులో కూర్చున్నాడు. స్నిగ్ధ మౌనంగా అతడిని అనుసరించింది‌.
అతడు స్నిగ్ధ ఆఫీస్ చేరుకుని లోపలికి ప్రవేశించాడు. కంప్యూటర్ ఆన్ చేసి ,'నేను చెప్పినట్లు రాయి' అన్నాడతను.
స్నిగ్ధ 'ఎందుకు ?ఏం చెయ్యబోతున్నావు?' అని అడిగే ధైర్యం చెయ్యలేదు.
ఎర్రబడ్డ అతని ముఖం చూస్తే ఆమెకు భయం వేస్తోంది. ఆమె ఎన్నడూ ఋషిని అంత కోపంగా చూడలేదు. ఆమె ఋషి చెప్పింది టైపు చెయ్యసాగింది.
అది ఈ విధంగా సాగింది.

గౌరవ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
నిర్వాణ ప్లస్ కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ కు.
మహేంద్ర దసపల్లా మేనేజింగ్ డైరెక్టర్ రాయు లేఖ.
జనవరి 27 2011.

ప్రియమైన బోర్డు సభ్యులకు,
తీవ్రమైన పశ్చాత్తాపంతో, అంతులేని భారంతో నేను నా మనసును మీ ముందు పరుస్తున్నాను. కొన్ని నిజాలు మీ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను. ప్రభుత్వ-వ్యక్తిగత భాగస్వామ్యంతోమన కంపెనీ చేపట్టిన ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియం ప్రాజెక్టు అనేది, నిజానికి గత కొన్నేళ్లుగా మనం పోగుచేసుకున్న అప్పులను కప్పిపుచ్చేందుకు చేసిన ప్రయత్నం.
కంపెనీ యొక్క ఆర్ధిక స్థితి ప్రతి మూడు నెలలకు రానురాను ప్రబలంగా దిగజారుతోంది. మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రతి ప్రయత్నం బెడిసికొట్టింది. సమస్యలను నిర్మూలించాలని చేసిన ప్రతి ప్రయత్నం విఫలమయ్యింది. ప్రత్యేకించి, కంపెనీ ఎదుర్కొంటున్న వివాదాలు కూడా ఎక్కువ కాసాగాయి. కంపెనీ ప్రోత్సాహకులు కూడా కొంత శాతం వాటాను కలిగి వుండడంవల్ల, కంపెనీ యొక్క అల్ప నిష్పాదన ఇక్కడ సమస్య అయ్యింది. దీనికితోడు కోర్టు వివాదాల వలన పుట్టుకొచ్చిన నష్టాలు కంపెనీని స్వాధీన పరచుకొని, వీటన్నింటినీ బాహాటం చేసే స్థితి కూడా ఏర్పడింది. ఇదంతా పులికి ఆహారం కాకుండా, దాని మీద నుంచి ఎలా దిగాలో తెలియకుండా, దానిపై స్వారీ చెయ్యడంలాగా తయారయింది.
ఈ రొచ్చు నుంచి కంపెనీని కాపాడేందుకు చేసిన చివరి ప్రయత్నమే, ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియం ప్రాజెక్టు. రాజకీయ దిగ్గజాల సహకారంతో నేను కంపెనీ యొక్క సమస్యలను స్వల్ప వ్యవధిలో పరిష్కారించాలని ఆశించాను. ఇదంతా జరిగాలంటే అవలంబించాల్సిన ఒకే ఒక్క మార్గం, ప్రభుత్వ నిధులను మంత్రుల యొక్క వ్యక్తిగత ఎకౌంట్లకు బదిలీ చేయడం.
కానీ ప్రాజెక్టు పుంజుకుంటుండగా సమాజంలోనూ, ప్రజా విభాగాల్లోనూ సంస్థ యొక్క గౌరవం పెరుగుతూ ఉండగా, ఎందుకో నా మనసు బలీయంగా గాయపడింది. అందుకే నేను ఈ స్కాము గురించి, దాని వెనుక ఉన్న అసలు కథను గురించి బయటకు వెల్లడించాలని అనుకున్నాను. ఆర్ట్ మ్యూజియం అనేది నిజానికి ఒక నకిలీ ప్రాజెక్టు, దీనికై కనీసం రెండు కోట్లు కూడా ఖర్చు కాలేదు. కానీ ఇది ప్రభుత్వ నిధులను మంత్రులంతా తోడడానికి సహకరించి, వారి ప్రాబల్యంతో ప్రభుత్వ ప్రాజెక్టులను దక్కించుకుని కంపెనీ వ్యాపారంలో నిలదొక్కుకోడానికి, ఉన్న అప్పులను కప్పిపుచ్చడానికి పనికి వస్తుంది.
ఈ నిజాలన్నీ మీ ముందు వెల్లడించాక నేను విషయాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఒక టాస్క్ఫోర్స్ ను ఏర్పాటుచేసి, తగ్గిన నిర్ణయం తీసుకునే అధికారాన్ని బోర్డు సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నాను.
ఇప్పటికీ 20 ఏళ్ల నుంచి నేను నిర్వాణ ప్లస్ తో అనుబంధాన్ని కలిగి ఉండి, కంపెనీ ఎదుగుదలకు ఎంతో కృషి చేశాను. కేవలం కొద్దిమంది ఉద్యోగుల నుంచి కంపెనీ 40 వేలమంది ఉద్యోగుల దాకా,అనేక దేశాల్లో వ్యాపించి విధులు నిర్వహించడాన్ని నేను కళ్ళారా చూశాను. కంపెనీ అన్ని స్థాయిల్లోనూ అద్భుతమైన నాయకత్వ పటిమను, పోటీతత్వాన్ని అందించింది.
నిర్వాణ ప్లస్ ను ఒక ప్రత్యేక సంస్థగా మలచిన నిర్వాణైట్స్ అందరికీ, భాగస్వాములు అందరికీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఈ అవసర సమయంలో వారంతా కంపెనీ తరఫున నిలబడతారని నేను నమ్ముతున్నాను.
ఈ పరిస్థితుల్లో నేను నిర్వాణ ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ గా నా పదవికి రాజీనామా చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న బోర్డు వ్యాప్తి చెందే దాకా నేను ఈ పదవిలో కొనసాగుతాను. ఇలా నేను కొనసాగడం అనేది రాబోయే కొద్ది రోజుల్లో బోర్డు వీలైనంత త్వరగా వృద్ధి చెందడానికేనని తెలియజేస్తున్నాను.
నేనిప్పుడు నన్ను నేను చట్టానికి అప్పగించుకొని తద్వారా జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను.

ఇట్లు,
మహేంద్ర దసపల్లా.
cc. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్.

ఈ లేఖ ఎందుకు రాయబడుతుందో స్నిగ్ధకు అర్థం కాలేదు, ఆమె ఇంకా షాక్లోనే ఉంది. ఋషి మనసులో ఏముందో ఆమె తెలుసుకోలేక పోతోంది. లేఖ టైప్ అవడం పూర్తయిన తక్షణమే, కంపెనీ లెటర్ హెడ్ మీద ఋషి దాన్ని ప్రింటవుట్ను తీశాడు. అతను పాత కాగితాలను బయటకు తీసి మహేంద్ర సంతకాన్ని వెతికి పట్టుకున్నాడు.

మరొకసారి ఉత్తరం చదివాక అతను మహేంద్ర సంతకాన్ని అనుకరిస్తూ దొంగ సంతకం పెట్టాడు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఫాక్స్ నెంబర్ను ఇంటర్నెట్లో నుంచి అతను కనుగొన్నాడు. ఫ్యాక్స్ మెసేజ్ స్టాక్ ఎక్స్చేంజ్ కు చేరేలా అతను జాగ్రత్తలు తీసుకున్నాడు.

(సశేషం)

No comments:

Post a Comment

Pages