ఈ దారి మనసైనది -4 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది -4
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com

angulurianjanidevi.com


(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది దీక్షిత.)
"నాకు కార్పొరేట్ కాలేజీలో కోచింగ్ యిప్పించండి నాన్నా", అంది తండ్రితో దీక్షిత.
సోమన్నఅప్పడే పొలం నుండి వచ్చి స్నానం చేసి ఆరు బయట చీకట్లో పడుకొని ... "పొలం పైరునంతా పురుగు తినేస్తుంది. మందులకి డబ్బు లెలా? ఈ ఒక్కసారికి సర్పంచి గారిని అడిగితే...." అని ఆలోచిస్తున్నాడు.
దీక్షిత మళ్లీ అడగడంతో బాధగా చూశాడు. కూతురి కోరిక వినగానే ప్రపంచమంతా ఎండిపోయి ఒక్క నీటి చుక్క కూడా దొరకనట్లు నాలుక పిడచకట్టుకుపోయింది సోమన్నకు.
ఎంత ఆశగా పొలంలో పైరు పెట్టుకున్నాడో అంతే ఆశతో కూతుర్ని చదివించుకోవాలని కూడా వుంది. కానీ పురుగుపట్టక ముందు భూదేవికి పసుపరాసినట్లున్న తన చేను ఈ రోజు కళ్లనీళ్లు తెప్పిస్తుంటే కూతురి కోరిక ఆకాశంలో పుష్పమై కన్పిస్తోంది.
కన్న బిడ్డల్ని చదివించుకోవాలని, వాళ్లు అభివృద్ధిలోకి వస్తే "నేను నీరు పోసి పెంచిన చెట్టు ఫలాలేకదా ఇవి " అనిమురిసిపోతూ గర్వపడాలని ఎవరికైనా వుంటుంది. కానీ తన పరిస్థితి అలా లేదు.
ఇప్పుడు తనెంత నిస్సహాయ స్థితిలో వున్నాడో ఎవరికీ అర్థం కాదు. తన బాధ, తనలో కలిగే ఆందోళన. ఎవరూ అర్థం చేసుకోరు. ధనవంతుడికి చీమకుట్టినా, సిటీ అంతా తెలుస్తుంది. మరి తన లాంటి వాడిని పాముకాటేసినా ఎవరూ పట్టించుకోరు అని మనసులో అనుకుంటూ ...
అసలే డబ్బుకి ఇబ్బందిగా వుంది దీక్షా నిన్ను ఆ కాలేజిలో చేర్పించడం కుదరదు. నీ చదువుకి ఏ ర్యాంకు వస్తే దానికి తగిన కోర్స్ లోనే జాయిన్అవ్వు . అంత కన్నా ఎక్కువగా ఆలోచించకు’. అన్నాడు సోమన్న అలా అంటున్నప్పడు 'అయ్యో ! నా బిడ్డ అడిగిన చదువు చదివించుకోలేక పోతున్నానే' అన్న బాధతో అతని గొంతు బొంగురుపోయింది.
ఇన్నాళూ ఏ ఖర్చూ లేకుండానే చదివింది. ఒక్కరోజు కూడాఅది కావాలి, ఇది కావాలిఅని అడగలేదు. ముఖ్యంగా డబ్బు తను ఇస్తేనే తప్ప ఒక్కసారి కూడా చేయిచాపి అడగలేదు. ఇలాంటి కూతురు పుట్టాలంటే ఎన్ని జన్మలు పుణ్యం చేసుకోవాలి.
'బాధ పడుతున్నావా నాన్నాఅంటున్నదీక్షితకి ఆ చీకట్లో తండ్రి ముఖంలో భావాలు కన్పించటంలేదు.
ఎక్కడో మెరుపు మెరిసినట్టు ఆ మెరుపులో తళుక్కుమన్నకూతురి ముఖాన్ని చూసిన సోమన్నకి ఏడుపు వచ్చేలా వుంది.
తనెంతో తెలివైనదని, ప్రతి విషయాన్ని తనతో చెప్పుకుంటూ, ఎంతో ఉత్సాహంగా పనులు తప్ప మరో ధ్యాస లేని తన తండ్రి ఇప్పడింత నిరాశగా, నిర్లిప్తంగా, నిశ్శబ్దంగా వుండటం దీక్షితకి బాధగా వుంది. జీవితం ఆటు, పోట్లమయం అందులో సుఖ, దు:ఖాలు, లాభ, నష్టాలు, గెలువు, ఓటములు నహజం. పుట్టడం, పెరగడం, కోరినది లభించకపోవడం కూడా సహజమే. బాధలేకుండా జీవితమే లేదు. జీవితమంటేనే ఏడ్పు కన్నీరు, చిరునవ్వులు. జీవితమెప్పడూ కన్నుల పండుగ కాదు. చక్కని విందూ కాదు. అదొకస్థితి.
" బాధపడకు నాన్నా" !అంటూ అక్కడే నిలబడితే తండ్రి యింకా బాధపడ్డాడని లోపల కెల్లింది దీక్షిత. సమస్యలు మనిషిని వయసుకి మించి ఎదిగేలా చేస్తాయి. పదిరోజులు గడిచాక, ఫిజిక్స్ లెక్చెరర్ మల్లారెడ్డి దీక్షితకి షార్ట్ కోచింగ్ కి సీటువచ్చినట్లు ఉత్తరం ద్వారా తెలిపాడు.
ఆమెకు ఏదైనా ఇబ్బంది అన్పించినప్పడు తనకి కాల్ చెయ్యమని తన మొబైల్ నెంబర్ యిచ్చాడు. ఆమె సీటు పొందిన కాలేజిలోని తన మిత్రుని నెంబరు కూడా యిచ్చాడు.
అన్ని దానాల కన్న విద్యాదానం గొప్పది. అన్నంపెడితే అప్పటికప్పుడే అరిగిపోతుంది. కాని, విద్య చెబితే బ్రతికి వున్నంత కాలమూ తృప్తే, ఆ తృప్తిని కోరుకునే మల్లారెడ్డికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొంది దీక్షిత.
అందరితో వెళ్లాలనుకొంది కానీ డబ్బులు లేక మహదీర్ అన్నయ్యను మాత్రమే తీసుకెళ్లింది.
ఆ కోచింగ్ కాలేజి భద్రాచలం దగ్గర కృష్ణాసాగర్ అనే వూరిలో వుంది. అది ట్రైబల్ ఏరియా. ఆ ఏరియా ఎక్కడుందో ఆమెకు తెలియదు. ఆమె లక్ష్యం మాత్రమే ఆమె కళ్లకి కనిపిస్తోంది.
ఆమె తల్లిదండ్రుల ఆశీస్సులతో, మల్లారెడ్డిసార్ సహాయంతో మణుగూరు పాసింజర్ ట్రైనెక్కింది. కొత్తగూడెంలో ట్రైన్ దిగి బస్సెక్కి పాల్వంచలో దిగి, ఆటో ఎక్కి, కిన్నెరసాని వైపు వెళ్ళింది. అప్పటికే చీకటి పడింది.
అక్కడికి చేరిన తర్వాత కోచింగ్ అక్కడ కాదని తెలియగానే కంగారు పడింది. ఏం చేయాలో తోచలేదు.ఆ రాత్రికి బయట ఎక్కడైనా వుందామనుకున్నారు. కానీ లాడ్జీలకి డబ్బులు పెట్టలేక, వెంటనే మల్లారెడ్డి సార్కి కాల్ చేసింది. ఆయన వెంటనే అక్కడున్న హాస్టల్ వాళ్లకి ఫోన్ చేసి, ఆమె గురించి చెప్పి, ఆమెకు ఆ రాత్రి అకామిడేషన్ ఇమ్మని రికమెండేషన్ చేయ్యడంతో ఆ రాత్రి ఆమె అక్కడే వుండి పోయింది.
ఎప్పడో మద్యాహ్నం తిన్న తిండితో, చుట్టూ ఏవిూదొరక్క పోవడంతో రాత్రంతా ఆకలి పేగుల్ని కొరికేస్తుంటే అలాగే పడుకొంది. కానీ ఆమెను తన ధృఢసంకల్పమే ఆ రాత్రి అక్కడ వుండేలా చేసింది.
ఉదయాన్నే క్రిష్ణా సాగర్ అడ్రస్ తెలుసుకొని, అక్కడికి బయలుదేరింది. మల్లారెడ్డిసార్ మిత్రుని సహాయంతో కోచింగ్ కాలేజిలో అడ్మిషన్ తీసుకొంది.
అది ట్రైబల్ఏరియా అయినందువల్ల, ఎండాకాలం కావటం వల్ల ఎండలు విలయతాండవం చేస్తున్నాయి. అంతేకాక వాటర్ సరిగ్గా లేక పోవడం రాత్రి టైమ్ లో  హాస్టల్ లో కరెంట్ సప్లయ్ లేక పోవడం ఇబ్బందిగా మారి, డేటైంలో మాత్రమే చదువుకోవడానికి వీలుగా వుండేది.
వాళ్ల కాలేజి నుండి ఇంకో అమ్మాయి అక్కడికి రావటంతో దీక్షితకి చిన్న పాటి కాన్ఫిడెన్స్ వచ్చింది.
కాని ఆ హాస్టల్ పరిస్థితులు ఆమెకు అనుకూలించలేదు. వెంటనే వాళ్ల అన్నయ్య కు ఫోన్ చేసింది.
అదే రోజు బయలుదేరి ఆ రాత్రికి హస్థల్కు చేరుకున్నాడు మహాధీర్.
"కష్టపడకుండా దేన్నీసాదించలేవు దీక్షా! ఈ నెలరోజులు నీది కాదన్నట్లుగా కష్టపడు. రేపొచ్చే ఫలితాన్ని చూసుకొని ఇప్పడు నువ్వు పడ్డ కష్టం గుర్తివచ్చి గర్వపడాలి." అంటూ మహధీర్ ఆమెని మోటివేట్ చేశాడు.
ఆ నెల రోజులు తన క్లాస్మేట్, తనూ కలిసి గ్రూప్ డిస్కషన్స్ చేస్తూ వీధి లైట్ల క్రింద కూర్చొని చదువుకుంటూ, ఓవర్ టైమ్ స్పెండ్ చేశారు.
చదువు విషయం ఎలా వున్నా భోజనానికి, వాటర్కి ఇబ్బందిగా అన్పించి వేదన ఎక్కువై పరీక్షకు ఆరు రోజుల ముందు హన్మకొండలో జులైవాడలో వుండే వాళ్ల  అన్నయ్య రూంకి వచ్చింది దీక్షిత.
మే 4న కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంసెట్ ఎగ్జామ్ రాసింది.
  పరీక్ష రాస్తున్నంతసేపు అదే కాలేజిలో తనకి సీటు రావాలన్న కోరిక, వస్తుందన్న నమ్మకం, ఆమె అనువణువులో వ్యాపించాయి. తొందర, ఆత్రుతా లేకుండా స్థిరమైన తృప్తితో, ఆత్మవిశ్వాసంతో రాసింది.
సాధించాలన్న తపన వుంటే సాధించలేనిది ఏదీ లేదు. అలాగే ధైర్యాన్ని కోల్పోతేఇక కోల్పోటానికి కూడా ఏవిూ మిగలదు.
దీక్షిత ధైర్యశాలి.
నెల రోజుల తర్వాత....
ఎంసెట్ ఫలితాలు వెలువడినాయి.
దీక్షితకి ఎనిమిది వేలల్లో ర్యాంక్ వచ్చింది.
ఆ ర్యాంక్ ఆమెను ఏదో ఒక కోర్స్ లో  సీటు వస్తుందని సంతోషపరచినా, తన ఆశయాన్ని మాత్రం నిరుత్సాహపరిచింది.
"అన్నయ్యా ! నేను తప్పకుండా డాక్టర్ని కావాలి. ఈ సారి కష్టపడి ర్యాంక్ తెచ్చుకుంటాను. నాకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించండి అంది మహధీర్ తో. చెల్లి అభిలాష పై నీళ్లు చల్లలేక...
"చెల్లిని భూమి అమ్మి అయినా కార్పొరేట్ కాలేజిలో కోచింగ్ యిప్పిద్దాం నాన్నా" అనిమహధీర్ అనగానే, సోమన్న సరేఅన్నాడు.
శ్రీ చైతన్య కాలేజిలో స్క్రీనింగ్ టెస్ట్ వుందని పేపర్లో సమాచారం చదివి. రాయటానికి అన్నయ్యను తీసుకొని విజయవాడ వెళ్ళింది.
దీక్షిత స్క్రీనింగ్ టెస్ట్ రాశాక మంచి మార్కులు రావడంతో పదివేల రూపాయలు తగ్గించి, ఇంటెన్సివ్ కోచింగ్ కి అడ్మిషన్ యిచ్చారు.
విజయవాడ శ్రీ చైతన్య కాలేజిలో మయూర్ భవన్ క్యాంపస్లో దీక్షితని  చేర్చారు.
అక్కడ ఉదయాన్నే ఐదు గంటలకి నిద్రలేచి, కాలకృత్యాలు అయ్యాక ఆరుగంటలకే తరగతులు మొదలవుతాయి. ఏనిమిది గంటలకి టిఫిన్ పన్నెండున్నర వరకు క్లాసులు పన్నెడున్నర తర్వాత ఫ్రీ టైం, రిలాక్స్ అయ్యాక రెండు ముపైకి స్టడీ అవర్స్ మొదలు. ఈవినింగ్ ఐదుకి స్నాక్స్ మళ్లీ రెండుగంటలు స్టడీ అవర్స్ ఏనిమిదికి డిన్నర్, తర్వాత ఏనిమిది నుండి పదకొండువరకు నైట్ స్టడీ అవర్స్.
దీక్షిత ఓవర్ టైం చేసి నైట్ పన్నెండు వరకు చదివేది. క్లాసులో తన కష్టానికి ఫలితంగా టాప్ టెన్లో వుండేది. వాళ్ల క్యాంపస్ ఇన్ చార్జి ఆమెను పిలిచి 'ఇలాగే కష్టపడి చదివితే గమ్యాన్ని చేరకోగలవు' అని మోటివేట్ చేశాడు.
శ్రీ చైతన్యలో వచ్చే ప్రతి లెక్చరర్ ఏదో ఒక విధంగా ఆమెను మోటివేట్ చేస్తు, ఆమె ఆలోచనలను పక్క దారి పట్టకుండా ఆమెను తన ఆశయం వైపు సాగేటట్లు చేశారు.
ఆ ఒక్కసంవత్సరం వ్యవధిలో ప్రతి మూడు నెలలకి ఒక సారి క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ బి.యస్.రావ్, రూన్సీలక్ష్మిబాయి క్యాంపస్ విద్యార్థులను చక్కగా మోటివేట్ చేసేవాళ్లు.
కొన్ని రోజుల తర్వాత డిశంబర్లో ఎంసెట్ పరీక్ష నోటిఫికేషన్ పడింది.
ఆ పరీక్ష బాగా రాసింది దీక్షిత.
దీక్షితకి ఆ పరీక్షలో ... ఒక వెయ్యినాలుగు వందల పన్నెండు ర్యాంక్ వచ్చింది.
2007 మేలో జరిగిన కౌన్సిలింగ్లో ఆమెకు కాకతీయ మెడికల్ కాలేజీలో సీటోచ్చింది.

ఆ కాలేజిలోనే ... మైక్రో బయోలజిల్యాబ్ వైపు వెళ్తున్న దీక్షిత .. అనురాగ్ "హాయ్" అనగానే గతంలోకి వెళ్లి, సంజన "హాయ్" అనటంతో గతంలోంచి బయటపడి తను కూడా "హాయ్" అంది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages