నాకు నచ్చిన కధ(ఇదీ నా కధే)--జీవించటమే ఒక నటన! - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కధ(ఇదీ నా కధే)--జీవించటమే ఒక నటన!

Share This
నాకు నచ్చిన కధ(ఇదీ నా కధే)--జీవించటమే ఒక నటన!
శారదాప్రసాద్ 

మనిషన్న తరువాత రకరకాల కోరికలు ఉంటాయి.కొన్ని కోరికలు శ్రమ,ధనవ్యయం లాంటివి లేకుండా తీర్చుకోవచ్చు. ఉదాహరణకు భార్యా భర్తలు పోట్లాడుకోవటం, అదేనండి,మాట్లాడుకోవటం లాంటివి.ఈ పోట్లాటలో ఆఖరికి మగవాళ్ళే ఓడిపోతారనుకోండి! ఆ విషయం అటుంచితే,కొన్ని కోరికలు తీర్చుకోవటానికి ధనం, శ్రమ ఇవన్నీ అవసరం.నాకూ కొన్ని కోరికలు మిగిలి పోయాయి.అందులో ముఖ్యమైంది,'నటించటం'.ఈ కోరిక మొదటి సారిగా నా భార్య ఎదుట ప్రస్తావించాను. అందుకు ఆవిడ,"ఇంతకాలం బాగానే నటించారుగా!ఇంకా ప్రత్యేకించి నటించటమేమిటి?"అని ఒక వ్యంగ్య బాణాన్ని వదిలింది.రచనా వ్యాసంగం చిన్నప్పుడే మొదలయింది!'పెసినెంట్ (ప్రెసిడెంట్)పట్టయ్య అనే చిన్న స్కిట్ ను వ్రాసాను.అందులో పెసినెంట్ గా మిత్రుడు కోటా  వెంకటేశ్వర్లు నటించాడు. అప్పటినుంచి వాడి పేరు పెసినెంట్ గా మారిపోయింది. ప్రస్తుతం మా పూర్వ విద్యార్థి సంఘానికి కూడా వాడే పెసినెంట్ !అయితే నటించాలనే కోరిక  అలానే మిగిలిపోయింది! ఈ నటనా కండూతి నాకు చిన్నప్పటినుండే ఉండేది.అవి సత్తెనపల్లిలో నేను 4th, 5th ఫారం చదువుతున్న రోజులు!ఈ కండూతి కలగటానికి ప్రేరణ -మిత్రులు బ్రహ్మానందం(నేటి ప్రఖ్యాత హాస్య నటుడు) మరియు బాబూరావు.వాళ్ళు నాటకాలు బాగా వేసేవారు.ఇప్పుడు కూడా వేస్తున్నారేమో వారి శ్రీమతులే చెప్పాలి!స్కూల్ వార్షికోత్సవ సందర్భంలో చిన్న చిన్న నాటికలు  మా హిందీ మాస్టర్ గారైన స్వర్గీయ వాసిరెడ్డి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో,సారధ్యంలో ప్రదర్శించబడేవి. బ్రహ్మానందానికి మొదటి,రెండవ.మూడవ బహుమతులన్నీ వచ్చేవి. He is a born Artist. SSLC పరీక్షలయిపోయిన తర్వాత ,సెలవుల్లో "చింతామణి" లో సుబ్బిశెట్టి పాత్రను పోషించాడు.బాబూరావు కూడా బ్రహ్మానందంతో కలసి నాటికలు వేసేవాడు.ఒకళ్ళు బుస్సీ దొర అయితే మరొకరు హైదర్ జంగ్ లా బాగా  నటించేవారు.వాళ్ళ స్ఫూర్తితో నాకు కూడా ఏదో ఒక వేషం వేయాలనిపించింది.జిల పుడితే గోక్కోవాలి కదా!వెంటనే ఆ విషయాన్ని మా హిందీ మాస్టర్ గారికి చెప్పాను.ఆయన నాకు చిన్న పరీక్ష పెట్టారు.ఆ నాటి వార్తా పత్రికలోని ఒక అంశాన్ని చదవమని పత్రికను ఇచ్చారు. బాగానే చదివానుకుంటాను.ఎందుకంటే, వెంటనే నాటక ప్రయోక్త అయిన మా హిందీ మాస్టర్ గారు 'పెళ్లి పెద్దలు' అనే ఒక చిన్న స్కిట్ ను తయారు చేసి,అందులో నాకూ ఒక పాత్రను ఇచ్చారు.ఆ పాత్రకు ఉన్నది ఒకే ఒక డైలాగు.అది ఏమిటంటే,"బావగారూ!మీ అమ్మాయికీ మా అబ్బాయికీ పెళ్లి చేద్దాం"అని. పంచ,కండువాతో పెళ్లి పెద్దగా నన్ను అపురూపంగా 
తీర్చిదిద్దారు.స్కిట్ మొదలైంది.నేను రంగస్థలం మీదికి వెళ్లాను.నాకు ఉన్న ఒకే ఒక డైలాగును,ఈ విధంగా చెప్పాను,"బావగారూ!మీ అబ్బాయికీ మా అబ్బాయికీ పెళ్లి చేద్దాం" అని.జనం విరగబడినవ్వుతున్నారు, చప్పట్లు,ఈలలతో మార్మోగిపోతుంది.నేను బాగా నటిస్తున్నాని కొంత గర్వం కూడా కలిగి వెంటనే అదే డైలాగును మళ్ళీ చెప్పాను.ఇంతలో,రంగస్థలం పైకి హిందీ మాస్టర్ గారు వచ్చి నన్ను బలవంతంగా ఎత్తుకొని వెళ్ళారు.నేనేమి తప్పు చేసానో,స్నేహితులు చెప్పేటంత వరకూ నాకు తెలియలేదు. తెలుసుకున్న తరువాత నాలోని నటుడు తెరమరుగయ్యాడు. అప్పుడప్పుడూ తొంగి చూస్తుంటాడు.('బాల వాక్కు బ్రహ్మ వాక్కు' అని అంటారు కదా!ప్రస్తుత ప్రభుత్వాలు దేశంలోని అతి తీవ్రమైన సమస్యలను వదలిపెట్టి స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత కల్పించటానికి ప్రయత్నిస్తున్నాయి.అలా చిన్న తనంలోనే నేను 'కాలజ్ఞానం' కూడా చెప్పానన్న మాట!)సరే,ఈ తలనొప్పి అంతా ఎందుకు?దర్శకత్వ రంగంలోకి ప్రవేశిస్తే బాగుంటుంది కదా అనిపించింది.సెలవుల్లో నాలాంటి కండూతిపరులను కొంతమందిని పోగుచేసి నాటిక ఏదైనా వేద్దామనిపించింది.దానికి కొంత డబ్బులు కావాలి కదా! స్నేహితుల్లో ఒకతను ఎప్పుడూ వితంతువు వేషాన్నే కోరుకునే వాడు. ఎందుకంటే,దానికి ఖర్చు ఏమీలేదు.వాడి బామ్మ ధోవతిని ముసుగు వేసుకొని,కొద్దిగా విభూతి పెట్టుకోవటమే వాడి వేషాలంకరణ! అసలు సమస్య అల్లా మరొక స్నేహితుడితో ఉండేది. వాడు ధనవంతుడు.వాడు ధనసహాయం ఎక్కువగా చేసేవాడు. అయితే వాడి వింత కోరికలు తీర్చటమే కష్టం.వాడు పొట్టిగా,బక్కపలచగా ఉండేవాడు.వాడు కోరుకునే వేషాలు వాడి పర్సనాలిటీకి అసలు నప్పవు. Inspector, భీముడు,గజదొంగ, ...లాంటి పాత్రలే వాడికి కావాలని వాడి పంతం. కావాలంటే,ఇంకో 50 రూపాయలు ఎక్కువ ఇస్తాను,నాకు ఇవే వేషాలు కావాలని మంకుపట్టు పట్టేవాడు. వాడికి ఆ వేషాలివ్వటానికి నా మనసు అంగీకరించలేదు. అలా,దర్శకుడిగా కూడా రాణించటానికి అవకాశం కలుగలేదు.రచయితగా బాగానే మంచి పేరు తెచ్చుకున్నాను.అయితే నటించాలనే కోరిక మాత్రం తీరకుండా మిగిలిపోయింది.ఇదే విషయాన్ని ఈ మధ్య మిత్రుడు బాబూరావుకు కూడా చెప్పాను.వాడు కూడా ఏదో ఒక నాటికను త్వరలో సత్తెనపల్లిలోనే వేద్దామని హామీ ఇచ్చి ఆశ కల్పించాడు. జీవితమే ఒక నాటకం,జీవించటమే ఒక నటన అని నా భార్య చెప్పిందంటే ఆవిడ నాలోని నటుడిని గుర్తించినట్లేగా! ఆ కాన్ఫిడెన్స్ తోనే మళ్ళీ నటించాలని కోరిక కలిగింది. ఇంతకూ చెప్పొచ్చేదేమంటే, త్వరలో నన్ను నటుడిగా కూడా చూడబోతున్నారన్నమాట!

2 comments:

  1. చాలా బాగా వ్రాస్తున్నారండీ!

    ReplyDelete
  2. నిజజీవితంలో జరిగే సంగతులను చక్కగా వివరించినందులకు ధన్యవాదాలు శారదా ప్రసాద్ గారు.

    ReplyDelete

Pages