శ్రీధరమాధురి – 47 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి – 47

Share This
శ్రీధరమాధురి – 47
(ఇతరులను విమర్శిస్తూ మాట్లాడడం గురించి పూజ్య గురుదేవుల అమృత వచనాలు)


శ్రీమన్నారాయణుడిలో ఐక్యమయ్యే విధానాల గురించి, దైవత్వం గురించి, ఎంతో మంది గొప్ప పండితులు పెద్ద పెద్ద మాటలు చెప్పడం నేను విన్నాను, చూసాను. వీరిలో కనీస మర్యాద, సభ్యత, రసజ్ఞత, అన్నింటినీ మించి ప్రాధమిక మానవ విలువలు లోపించడం నేను చూసాను. ప్రకృతి లోని ప్రతి అంశం లోను, ప్రతి మనిషి లోను వీరు శ్రీ మన్నారాయణుడిని చూసే సామర్థ్యం లేనివారు. కాని మోక్షం గురించి, వైకుంఠం గురించి సుదీర్ఘ ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. అంతా దైవేచ్ఛ, అనుగ్రహం, దయ.

గొప్ప మహనీయుల వద్దకు వెళ్ళకండి. వారు స్వచ్ఛతకు ప్రతి బింబాలు. వారు అగ్ని వంటివారు. అగ్నిలో లయమవ్వాలంటే మీరూ అగ్ని కావాలి. లేకపోతే మీరు మాడిపోతారు. సాధువుల వద్దకు వెళ్ళినప్పుడు ఇదే జరుగుతుంది. వారు ఉద్వేగాలకు, భావనలకు అతీతులు కనుక వేరే ప్రపంచంలో జీవిస్తారు, వేరే అంశాలు మాట్లాడతారు. మనకు అర్థం కాని విషయాల పట్ల మనం ఆకర్షితులమవుతూ ఉంటాము. నేను సాధువును కాను, పాపిని. అందుకే  నేనూ మీలాగే అపవిత్రమైన వాడిని. మనమంతా ఒకే రకం ఈకలున్న పక్షులం. మనం కలిసి గుంపుగా వెళ్ళవచ్చు.

అజ్ఞానంలో ఉన్నవారే ఇతరుల గురించి మాట్లాడతారు. వారికేమీ పని లేదు. అటువంటి సంభాషణల్లో పాలు పంచుకోకుండా జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యంగా ఉండేవారిని నిర్లక్ష్యం చెయ్యడమే మేధావుల విధానం.

మీ వెనుక మీ గురించి మాట్లాడేవారిని పట్టించుకోకండి. ఎందుకంటే, వారికి మీ వెనుక మాత్రమే నిల్చునే అర్హత ఉంది.

మీ గురించి చెడ్డగా మాట్లాడేవారి మాటలను మీరు ఎంత ఎక్కువగా వింటే, అంత నిరాశకు లోనౌతారు. వారు అన్నవాటిని నిర్లక్ష్యం చెయ్యడం నేర్చుకోండి, ఆ చోటును వదిలి, మెరుగైన వాతావరణానికి వెళ్ళండి.

చెడ్డవారిని చంపడం కంటే, చెడు యొక్క సిద్ధాంతాలను చంపడం ఉచితంగా ఉంటుంది. మనలోని ప్రతి ఒక్కరిలోనూ చెడు కోపం, గర్వం, అసూయ, స్వార్ధం, దురాశ, మోహం వంటి వాటి రూపంలో ఉంటుంది.   మీలో ఉన్న ఈ అవలక్షణాలను చంపేందుకు మీరు ఎటువంటి చర్యలను తీసుకుంటున్నారు? కాని, ఇతరుల విషయానికి వచ్చే సరికి, మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మరి మీ సంగతేంటి ? అందుకే మనల్ని మనం సమీక్షించుకుని, ఇతరులను పరిశోధించడం తగ్గించాలి. అప్పుడే మీకు మీకెక్కడ నిల్చునే స్థానం ఉందో తెలుస్తుంది.

చెట్టు పైభాగం పిల్లగాలికి ఊగుతుంది, ఎందుకంటే దాని వేళ్ళు భూమిలో ధృడంగా నాటుకుని ఉన్నాయి కనుక. అందుకే జీవితంలో అన్నీ నాటుకుని సౌకర్యంగా, సవ్యంగా జరుగుతున్నప్పుడు, మీరు ఎక్కువ పొంగిపోతూ ఊగి, ఎక్కువగా మాట్లాడతారు. జాగ్రత్తగా ఉండండి. ప్రకృతి మాత మిమ్మల్ని గమనిస్తోంది. పిల్లగాలి ఏ క్షణంలో నైనా  సుడిగాలిగా మారవచ్చు, బలంగా నాటుకుని ఉన్న మీ మూలాల్ని పెకిలించి వెయ్యవచ్చు. అందుకే సంతులంతో ఉండండి.

కొన్నిసార్లు ఒకరు చాలా పరిణితితో ఉంటారు, వివేకవంతులుగా మాట్లాడతారు. కాని, అదే వ్యక్తి మరొక సందర్భంలో పిల్లతనంతో ఉంటారు. ఒకే వ్యక్తిలో ద్వంద్వ ప్రవర్తనలను చూపే ప్రకృతి మాత స్వభావాన్ని చూసి, నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. అందుకే ఒకే వ్యక్తి కొన్నిసార్లు పిల్లల్లా, కొన్నిసార్లు పెద్దరికంగా ఉండవచ్చు.

దయుంచి నాణానికి మరొక వైపు కూడా ఉందని, ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మరొక ప్రక్క దృశ్యం మీ ప్రక్క లాగానే పవిత్రంగా ఉండవచ్చు. అందుకే విషయం పూర్తిగా తెలియకుండా మాట్లాడవద్దు.

అవసరంలో ఉన్నవారికి సహాయపడేందుకు మీ పరిధులను, సమస్యలను అధిగమించి పరిశీలించండి. కేవలం మీ సమస్యల గురించే మాట్లాడుతూ ఉండకండి. మీ జీవితం ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది జీవితాల కంటే మెరుగైనది. అందుకే మీ సమస్యలకు అతీతంగా వీక్షించి, మీరు నివసించే సమాజానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడండి.

ఇది కంపూటర్ల కాలం.  మీరు డేటా మైనింగ్ గురించి మాట్లాడతారు, మీ పెద్దలతో కూర్చుని, చర్చలలో పాల్గొనండి. వారు చాలా అమూల్యమైన సమాచారాన్ని(డేటా) అందిస్తారు, ఆ ఖాజానాను  సవ్యంగా నిక్షిప్తం చేస్తే(మైనింగ్), ఈ జీవితాన్ని ప్రశాంతంగా జీవించేందుకు అది సహకరిస్తుంది.

పెద్దలతో నిర్లక్ష్యంగా మాట్లాడడానికి మీరు ఆకాశం నుంచి ఊడి పడలేదు. వారు మిమ్మల్ని చక్కగా పెంచి పెద్దచేసి, చదివించారు. దీనివల్లే ఇప్పుడు మీరు బాగా సంపాదించే  వృత్తిలో కుదురుకున్నారు. కనీసం, వారితో మాట్లాడేటప్పుడు సహానుభుతిని కలిగి ఉండండి. జీవితంలోని తర్వాతి దశలో, మీ పెద్దలు గతించాకా, మీ పిల్లలు మీతో తప్పుగా ప్రవర్తించినప్పుడు,  మీరు మీ పెద్దల పట్ల మీ ప్రవర్తనను తల్చుకుని,  పశ్చాత్తాపంతో కృంగిపోకూడదు.

శిష్యుడు : గురువర్యా, కొన్నిసార్లు మేము అత్యంత జాగ్రత్తగా, పదాలను ఎంచుకుని,  గౌరవంగా మాట్లాడతాము.
నేను : ఇది బుద్ధి నుంచి వచ్చేది. దీన్ని చతురత, సున్నితంగా మాట్లాడడం అంటారు. ఈ విధంగా ఉండడమంటే, సత్యానికి దూరంగా ఉండడమే.

ఎల్లప్పుడూ చెడుగా మాట్లాడేవారి నుంచి తగినంత దూరంలో ఉండండి. వారు మీ భవితనే కాదు, ప్రస్తుతాన్ని కూడా నాశనం చేస్తారు. అటువంటి రంధ్రాన్వేషకుల నుండి  దూరంగా ఉండండి.

మిమ్మల్ని నమ్మని వారు మీ గురించి తప్పుగా మాట్లాడతారు. మరి అటువంటి  వ్యక్తులకు, వారి  మాటలకు అంత ప్రాధాన్యతను ఇచ్చి,  పట్టించుకోవడం ఎందుకు? మీకు ప్రాధాన్యతను ఇవ్వని వ్యక్తి మాటలకు మీరు ప్రాధాన్యం ఇవ్వడమెందుకు? ఆలోచించండి.

అతడు – గురుజి, అతను నా ముందు మామూలుగానే ఉంటాడు, కాని నా వెనుక నా గురించి తప్పుగా మాట్లాడతాడు. నానుంచి అతనికి ఏమి కావాలో నాకు అర్ధం కావటంలేదు.
నేను – నేనిది అర్ధం చేసుకోగలను. ఇది చాలా మామూలు విషయం. మామూలుగా అందరూ మీ ముఖం మీద బాగానే మాట్లాడతారు, కాని మీ వెనుక విమర్శిస్తారు.
అతడు – ఎందుకని?
నేను – ఇది చాలా సహజమైన ప్రక్రియ. తల ఎప్పుడూ ఊగుతుంది, కాని కనబడని తోక మాత్రం ఆడుతూ ఉంటుంది కదా.

మీ గురించి ఏదో ఒకటి మాట్లాడి మిమ్మల్ని మీరు ఎక్కువగానో, తక్కువగానో భావించుకునేలా కొందరు చేస్తూ ఉంటారు. మీరు ఇటువంటి వారు ఇరువురినీ అలక్ష్యం చెయ్యాలి. మీరు ఎలా ఉన్నారో, అలాగే బాగున్నారు, అటువంటి వ్యాఖ్యల వలన అమితానందంగానో, లేక నిరాశగానో మారాల్సిన పని లేదు.

ఎవ్వరైనా మీగురించి ఏదైనా మాట్లాడుకోనివ్వండి. మీకున్న పేరును పాడుచెయ్యనివ్వండి. ఏమీ పర్వాలేదు. పనిలో మీరు చూపించే అంకిత భావం, నిజాయితీ ఎల్లప్పుడూ మీ చెంతనే నిలుస్తాయి. మీ వెనుక మాట్లాడేవారు త్వరలోనే వారు తవ్వుకున్న గోతులను వెతుక్కుంటూ వెళ్తారు. ఉత్సాహంగా, నిస్వార్ధంగా, ఇతరుల నుంచి ప్రతిఫలం ఆశించకుండా పని చెయ్యండి.
మీరేదైనా పనిలో ఉన్నప్పుడు, కొంతమంది మిమ్మల్ని చూసి అసూయ పడవచ్చు, కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, కొంతమంది మీ వెనుక మాట్లాడవచ్చు, కొంతమంది బాగా సాయం చెయ్యవచ్చు, కొంతమంది మామూలుగా ఉండవచ్చు. ఇదంతా ఒక పాకేజీ లాగా వస్తుంది. కేవలం కొందరు మిమ్మల్ని పనిలో ఇబ్బంది పెడుతున్నారని ఎన్ని ఉద్యోగాలు మారగలరు? ప్రతి చోటా ఇటువంటి వారే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఎదురు చూస్తూ ఉంటారు కదా !

మీరు మీ విద్యార్హతలకు, అనుభవానికి తగిన ఉద్యోగ స్థాయిలో ఉంటే, మీరు ఇతరుల ప్రవర్తన గురించిన తుచ్చమైన విషయాల గురించి షికాయతులు చెయ్యరు, ఆందోళనకు లోనవ్వరు. అటువంటి స్థితిలో మీరు మీ తెలివిని, బుద్ధిని వాడి, ఆయా వ్యక్తుల నుంచి బయటపడేందుకు మృదువైన మార్గం వెతుకుతారు. లేకపోతె, ఎక్కడైనా మీకు మనఃశాంతి ఉండదు, జీవితంలో ఏ ఉద్యోగంలోనూ తృప్తి ఉండదు. మీ వ్యక్తిగత జీవనం కూడా ఇలాగే ఉంటుంది.
***

No comments:

Post a Comment

Pages