తెలుపు గేయం - అచ్చంగా తెలుగు
తెలుపు గేయం
టేకుమళ్ళ వెంకటప్పయ్య

రంగులు చూడగానే ఆకర్షణకు లోనవుతాం. రంగులకీ, మనసుకీ చాలా దగ్గర సంబంధం ఉంది. మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది! ఫేవరెట్‌ కలర్‌ అంటే మన వ్యక్తిత్వమే! ఇష్టపడే రంగును బట్టి మనిషిని అంచనా వేయవచ్చు. ఆ రంగులకు సంబంధించిన లక్షణాలు మనిషిలో కనిపిస్తాయి. అంటే అభిప్రాయాలను నిర్ణయించడంలో రంగులు కీలక పాత్ర పోషిస్తాయి.  మనకిష్టమైన రంగును చూసినప్పుడు మనసుకు ప్రశాంతత, మానసిక ఆనందం కలిగేది అందుకే!! తెలుపు ఒక స్వచ్ఛమైన రంగు. ఇది అన్ని రంగుల సమ్మేళనం. స్వచ్ఛమైన తెల్లని పదార్ధాలు పంచదార, నురుగు, మంచు, ప్రత్తి, పాలు మొదలైనవి.భారతీయ సాంప్రదాయం ప్రకారం తెలుపు పవిత్రత, శాంతి, స్వచ్ఛతకు సంకేతం. తెలుపు రంగు శాంతికి, స్వచ్ఛతకి సంకేతం. ఈ రంగు ఇష్టపడే వ్యక్తులు శాంతి కాముకులు. ఎవరిమీదా ఆధారపడకుండా ఉండాలనుకుంటారు. ఎవ్వరినీ నొప్పించకుండా తమపని తాము చేసుకు పోయే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాంటి స్వచ్చమైన తెలుపు రంగు గురించి ఉన్న ఓ బాలగేయం చూద్దాం.

అమ్మమాట తెలుపు - ఆవుపాలు తెలుపు 
మల్లెపూలు తెలుపు - మంచిమాట తెలుపు
చందమామ తెలుపు - సన్నజాజి తెలుపు
మంచి మనసు తెలుపు - పావురాయి తెలుపు
పంచదార తెలుపు - పాలు పెరుగు తెలుపు
గురువుగారి చొక్కా తెలుపు - గోవింద నామము తెలుపు
జాజిపూలు తెలుపు - జాబిల్లి తెలుపు

బమ్మెర పోతనామాత్యుని సరస్వతీధ్యాన పద్యం:
శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ సుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ


ఈ పద్యం పిల్లలందరికీ నోటికి రావాలి. ఈ పద్యంలో ఎన్ని తెల్లని వస్తువుల గురించి చెప్పారో తెలుసుకోనవలసి యున్నది.  తెల్లని మల్లెలు, చల్లని వెన్నెల, స్వచ్ఛమైన కాంతులు ఎన్ని విధాలుగా ప్రకాశించగలవో అన్ని తెలుపురంగు కాంతుల ఉపమానాలతో అమ్మవారిని పోల్చడం జరిగింది. స్వఛ్ఛమైన ధవళకాంతులలో ఆమె నిండి వుంటుంది. అందుకే స్వచ్ఛమైన మనస్సు కలవారికి సమస్త విద్యలూ సంప్రాప్తిస్తాయి. సంగీత సాహిత్యాలు సరస్వతికి ఆటపట్టులు.
***

No comments:

Post a Comment

Pages