ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ - అచ్చంగా తెలుగు

ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ

Share This
తెలుగు మొలక, ఆంధ్ర సరస్వతి, కవయిత్రీ తిలక
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ - "శతజయంతి"

కొంపెల్ల శర్మ 

ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ గారి "శతజయంతి" సందర్భంగా సమర్పించిన 'అక్షర' నీరాజనం. 
“ఆధునిక మహిళలు భారతదేశ చరిత్ర తిరగరాస్తారు" అన్నది గురజాడ వారి ఆధునిక దృష్టి. "స్త్రీ వ్యక్తికాదు శక్తి. మన జాతి ఇంతగా దిగజారిపోవడానికి కారణం శక్తి స్వరూపిణులైన స్త్రీలను గౌరవించకపోవడమే"; విద్య ద్వారా మనసు వికసించిన స్త్రీ తన అభ్యుదయ మార్గాన్ని తానె నిర్దేశించుకోగలదు" అన్నారు స్వామి వివేకానంద. సృష్టి లో ఉన్నతురాలు స్త్రీ. ఆమె అబల అన్నమాట అర్థరహితం. సామాజిక మార్పుల అవగాహనతో ఆధునిక మహిళ ప్రగతి సాధించింది. స్త్రీ ఎప్పుడు సమాజాన్ని, రాజ్యాన్ని ప్రశ్నించడం నేర్చుకుందో, ఆమె కవయిత్రి అయింది; సంస్కర్త, సేవాస్ఫూర్తి, కళాకారిణి, ఉద్యమనేత - చతుర అవతారాలకి తనదైన చతురతని, చమత్కృతిని జోడించి అందించిన విధి విధానాలకు పరమన్యాయం చేకూర్చింది.”  మహామహిళల జీవిత ఇతివృత్తాలు సంఘానికి మనోబలాన్ని, పథ నిర్దేశాన్ని చేకూర్చగలవు. మానసిక వికాసాన్ని కలిగించగలవు. సంఘంలో కవులకూ, కళాకారులకు, విద్యావేత్తలకు, సామాజిక కృషివేత్తలకు, ఉదాత్తమైన స్థానాన్ని ఎప్పుడూ ఉంటుంది. ఈ దశదిశల్లో మగవారితోపాటు మహిళలు ఏకాలంలోనూ వెనకబడలేదు. జాతి, దేశం, సంప్రదాయం, సంస్కృతి, జీవనవికాసం ఈ మహిళల వాళ్ళుకూడా సమధికంగానే సంరక్షితమవుతూ వస్తోంది. మహిళల మేథో విశిష్టత, చాతుర్యం, ప్రాబోధికత, జ్ఞానదీప్తి, సేవాస్ఫూర్తి, దేశభక్తి, త్యాగనిరతి,స్వయంకృషి, ఆత్మవిశ్వసం లాంటి లక్షణాల్ని పరమార్థ మానవధర్మం వెలుగు చిమ్మిన తెలుగు వనితల జీవితారేఖా చిత్ర సంచయనికలు సార్థవంతాలు. ఆటమువంటి మన తెలుగు మహిళల మహాప్రస్థానాల్లో గణనీయమైనది, సుగుణభరితమైనది - సారస్వత రంగంలో ప్రథమ శ్రేణిలో ప్రస్తావించాలంటే "సాహితీ రుద్రమ ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ గారి పేరు మున్ముందర అవశ్యముగా ప్రస్తావించవలసిందే. 
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ (1917 - 1996) కవయిత్రీ, పరిశోధకురాలు. ఈమె తనపేరు లక్ష్మీకాన్తమ్మ అని రాసుకున్నారు. ఈమె తండ్రి ప్రముఖ పాత్రికేయులు నాళము కృష్ణారావు. తల్లి ప్రముఖ సంఘసేవకురాలు, ఆంధ్రమహిళాగానసభ స్థాపకురాలు నాళము సుశీలమ్మ. ఈమె పింగళ నామ సంవత్సరం డిసెంబరు 25, 1917 న ఏలూరులోజన్మించింది. ఈమె విద్యాభ్యాసము రాజమండ్రిలోని వీధిబడిలో ప్రారంభమైంది. తరువాత వైశ్య సేవాసదనము యువతీ సంస్కృత కళాశాలలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి ఉభయభాషాప్రవీణ 1935లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలయింది. యల్లాప్రగడ జగన్నాథము పంతులు ఈమెకు ఆధ్యాత్మక గురువు. ఈమెకు తన పదమూడవ యేట మార్చి 24, 1930లో హయగ్రీవ గుప్తతో వివాహం జరిగింది. ఈమె తన ఎనిమిద యేటనుండి 18 సంవత్సరాలు వీణావాదన నేర్చుకుంది. త్యాగరాయ కృతులు నేర్చుకుంది. మొదట ఈమె విష్వక్సేన గోత్రురాలు. వివాహమైన పిమ్మట ఈమె గోత్రము సుకాంచన అయ్యింది. దేవీ ఉపాసకురాలు.
ఈమె రచనలు గృహలక్ష్మి, భారతి, ప్రబుద్ధాంధ్ర, ఆంధ్రమహిళ, కృష్ణాపత్రిక, నవోదయ మొదలైన పత్రికలో ప్రచురింపబడ్డాయి. విజయవాడ, మద్రాసు రేడియోలలో ఈమె రచనలు, ప్రసంగాలు ప్రసారమయ్యాయి.
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు సాంప్రదాయక కుటుంబంలో పుట్టినా, స్వేచ్ఛ లభించడం వల్ల సామాజిక సాహిత్య రంగాలకు సేవ చేశారు.

"మనం మస్తిష్కం గల మాన్యమూర్తులం; ఈ మాన్య ధరిత్రీ మాత ప్రసవించిన మహా పవిత్రమూర్తులం" అని దేశభక్తిని ప్రబోధించిన తీరు అక్షరాలా ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారికే వర్తిస్తుంది.
దేవీస్తవతారావళి, మనసాహితి-మధుర భారతి, కన్యకమ్మ నివాళి, మహిళా విక్రమసూక్తము, వంటి ఎన్నో రచనలు కవయిత్రిగా పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టాయి. కవయిత్రిగా గడించిన పేరుతోపాటు, విశేష పరిశోధకురాలిగా, ఉపన్యాసకురాలిగా, విశేష కీర్తి గడించారు. ఈ దశకి సాక్షిభూతంగా ఆంధ్రుల సంగీత వాఙ్మయ కృషి ఒకటి కాగా, "ఆంద్ర కవయిత్రులు", "అఖిల భారత కవయిత్రులు" అన్న రచనలు మరికొన్ని నిదర్శనాలు. ఆంధ్రుల కీర్తన వాఙ్మయసేవ-లో, వాగ్గేయకారుల గురించి, పదాలు-జావళీలు, తత్త్వాలు-సంకీ ర్తనలు - గురించి సునిశిత పరిశీలనాశక్తితో విశ్లేషించారు. తొట్టతొలి దశలోనే ఆంద్ర కవయిత్రులు పై పరిశ్రమ చేసి, గ్రంథీకరించిన తీరుని గమనిస్తే,లక్ష్మీకాంతమ్మ గారు ఆధునిక యుగం తొలితరపు పరిశోధకుల్లో ముందు వరసలో ముందే ఉంటారు అన్నది నిర్వివాదాంశం.
నాయక రాజుల కాలంలో 17వ శ.లో విజయరాఘవ నాయకుని ఆస్థాన కవయిత్రి పసుపులేటి రంగాజమ్మ తర్వాత కనకాభిషేకం పొందిన ఏకైక కవయిత్రి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారే. ఆకాశవాణి లో 'లలిత భక్తి గీతాలను ప్రసార ప్రారంభించడంలో ఈమె పాత్ర, చొరవ గణనీయం. 
తండ్రి 'మధుర కవి' నాళం కృష్ణారావు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు పదేళ్ల ప్రాయంలోనే వేదికలెక్కి ఉపన్యాసాలిచ్చేవారు. సాహిత్యరంగంలో ప్రవేశించిన తొలినాళ్లలో 'కృష్ణకుమారి' అనే పేరుతొ భారతి మాసపత్రికకు రచనలు పంపేవారు. వ్యాసాలూ,గేయాలు, చారిత్రక పరిశోధనలు, వచన కవితలు, ఖండకావ్యాది పలు సాహిత్య ప్రక్రియల్లోనూ ఈమె రచనలు చేశారు. 
ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ గారు 1996 లో సాహితీప్రియులను దు:ఖసాగరంలో ముంచెత్తి ఈ లోకంనుంచి నిష్క్రమించారు. 
ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ గారి "శతజయంతి" సందర్భంగా సమర్పించిన 'అక్షర' నీరాజనం. 

రచనలు 
దేవీస్తవతారావళి
మనసాహితి - మధుభారతి (గేయములు)
కన్యకమ్మనివాళి (కన్యకాపరమేశ్వరి స్తోత్రము, 1978),
మహిళావిక్రమసూక్తము,
ఆంధ్రుల కీర్తనవాజ్మయసేవ
పరిశోధనా రచనలు - ఆంధ్రుల సంగీతవాజ్మయంపై ఒక పరిశోధన, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు
ఆంధ్ర కవయిత్రులు, 2వ కూర్పు. 1980
హంస విజయము
అభిజ్ఞాన శాకుంతలము
జాతి పిత
ఒక్క చిన్న దివ్వె (చిన్న కవితలు) (1980)
నాతెలుగు మాంచాల (1981)
లజ్జ కిరీటధారిణి
నావిదేశపర్యటనానుభవాలు (యాత్రాచరిత్రలు)
సరస్వతీ సామ్రాజ్య వైభవము (ఏకాంకిక) (1988)
సాహితీరుద్రమ (ఆత్మచరిత్ర) (1993)
కాంతి శిఖరాలు (భక్తి గీతాలు)
భారతదేశ చరిత్ర కొన్ని గుణపాఠములు (చరిత్ర)
సదుక్తిమంజరి (హిందీకవులయిన కబీర్, తులసీదాస్, విందా రహీమ్ సుభాషితాలు తెలుగులో)
అమృతవల్లి (నవల)
కోరలమధ్యన కోటి స్వర్గాలు (నవల)
చీకటి రాజ్యము (నవల)
శ్రీ కన్యకా సుప్రభాతమ్
అముద్రిత రచనలు 
చంద్రమతి కథ (బాలసాహిత్యము)
సాహిత్య వ్యాసమంజరి
ఋతంబరి (గద్యగీతము)
యుగళ సిరి
బిరుదులు 
విద్వత్కవయిత్రి
ఆంధ్ర విదుషీకుమారి
తెలుగు మొలక
ఆంధ్ర సరస్వతి
కవయిత్రీ తిలక
కళాప్రపూర్ణ మొదలైనవి.
సత్కారాలు 
అనంతపురం పౌరులచే కనకాభిషేకము మరియు పౌరసన్మానము
1953లో గృహలక్ష్మి స్వర్ణకంకణము

No comments:

Post a Comment

Pages