పిఠాపురం క్రానికల్స్ పుస్తక సమీక్ష - అచ్చంగా తెలుగు

పిఠాపురం క్రానికల్స్ పుస్తక సమీక్ష

Share This
పుస్తక పరిచయం - " పిఠాపురం క్రానికల్స్" ( 48 భిన్న కధల సంకలనం)
రచన : రవీంద్ర కంభంపాటి
సమీక్షకులు: అద్దంకి వెంకట్ 


ప్రచురణ : జేవీ పబ్లికేషన్స్, హైదరాబాద్
"పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది" ఈ మాటని ఋజువుచేస్తూ "పిఠపురం క్రానికల్స్" పేరున మొదటి కధని వ్రాసి రచయిత సోషల్ మీడియాలో పెట్టగానే అద్భుత స్పందన రావడంతోబాటూ, పేరున్న రచయితలూ, రచయిత్రులూ కూడా "ఔరా!" అన్నారంటే అతిశయోక్తి కాదు.  మిత్రులూ, రచనలలో ఆరితేరిన మహామహుల ప్రసంశలు చూసి ఆనందం , ఉత్సాహం పొందిన రచయితకి అంతలోనే చాలా మనస్థాపం కలిగించే విధముగా కొందరు అధములు ఆయన రచనని కాపీ చేసి తమ తమ సొంత కధలలాగ తమ గోడలమీద , తమ తమ వాట్సాప్ గ్రూపులలోనూ తిప్పుకున్నారు.
ఏ రచయితకైనా ఒక కధ రచించడం అన్నది ప్రసవవేదనతో సమానం. కధ బయటకిరాగానే కాపీరాయుళ్ళు, చిన్న పిల్లలని ఎత్తుకుపోయే ముఠా సభ్యులలాగ ఎత్తుకుపోయి వారి సొంతకధలన్నట్లు సొషల్ మీడియాలోనూ, వాట్సాప్ గ్రూపులలోనూ ప్రచురించుకోవడంతో, అంతులేని వేదనను  ఈ రచయిత అనుభవించినా, మొత్తం కధలన్నీ వ్రాసారు, వ్రాస్తున్నారు కూడా. నేటి టెక్నాలజీ యుగం లో రచయితలకి "కాపీ" అనేది ముఖ్యమైన అడ్డంకి.

ఇక మనం పుస్తకం విషయానికి వస్తే, ముందుగా కధలూ, నవలలూ అంటే మన మదిలో మెదిలేది ఒక కధానాయకుడూ, నాయకీ, ఒక ప్రతినాయకుడూ వారి మధ్య ఉత్సుకత కలిగించే సన్నివేశాలూ! మలుపులూ, బాధలూ కొండకచో సామాజిక బాధ్యతలతో వచ్చేవే అని ఎక్కువ ఎక్కువగా నమ్మి, అలాంటివే చదవడానికి అలవాటుపడినవారం. కొన్ని సార్లు హాస్యపరమైన కొత్త కొత్తపదాల ప్రయోగం తో కడుపుబ్బ నవ్వించే రచనలూ వచ్చాయి. రచనలు ఎక్కువగా ఒకే ఇతివృత్తంలో "పాత చింతకాయ పచ్చడి కొత్త జాడీలో" అన్నట్లే వచ్చాయి. ఎవరు ఎంత గొప్పగ వ్రాస్తే అంత ఆదరించాము.

మానవ జీవితం ఒక నిత్య విద్యార్ధి ప్రయాణం. మనం పాఠ్యపుస్తకాలో చదివేవి విజ్ఞానానికి సంబంధించినవి. మన జీవితం లో ఒక స్థిరత్వం తీసుకురాగలిగేవి అని ప్రగాఢంగా  నమ్ముతాము. కానీ అదే జీవితంలో పూర్తి స్థిరత్వం ఉండాలి అంటే కావలసినవి కొన్ని విలువలు కూడా అన్నది మనం మరువకూడదు. ఆ విలువలు పాఠ్యపుస్తకాలో ఉండవు, చెప్పినా చిన్నతనం లో కొన్ని కధలు మాత్రమే. అవికూడా ఒక గంభీరతతోనే ఉండేవి.

పాతకాలం పెద్దవాళ్ళూ సమస్యలని చేధించడం లో మంచి సమయ స్ఫూర్తీ చూపించేవారు. ఇవన్నీ ఎలా వస్తాయి, అంటే మన చుట్టూ ఉండే మనుషులూ , వారి తత్వాలూ, వారితో మనకున్న లేక వారిలో మనం చూసిన కోణాలూ, అనుభవాల సారాంశమే మనకి అత్యధిక విలువలు నేర్పుతుంది అన్నది నిర్వివాదాంశం. అందుకే ఇప్పటికీ పెద్దవాళ్ళు "వాడిని చూసి నేర్చుకోరా" అంటారు, కానీ నేటి కాలంలో అది మనకి చాలా తప్పు, మన వ్యక్తిత్వాన్ని కించపరచడం గా భావిస్తున్నాము. ఎదుటివారిని చూసి నేర్చుకోమంటే వారు పాటించే దినచర్యలు, జీవన శైలీ పాటించమని కాదు. వారి లో ఉన్న సుగుణాలూ, వారు చేసే పనిపట్ల వారికున్న శ్రద్ధ మనలని అలవరచుకోమని మాత్రమే.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకూ అంటే అలా మనచుట్టూ  తిరిగే మనుషుల స్వభావాలనూ, వ్యక్తిత్వాలనూ, వ్యవహారశైలీ, సమయస్ఫూర్తి,పక్కవారికి సహాయపడే గుణం,వెటకారాలూ,వ్యంగ్యాలూ,అమాయకత్వం,బేధభావాలు లేకుండా ఒక అసలైన సమాజంలా మానవతతో జీవించడం ఇలా ప్రతి విషయాన్ని హాస్యానికి జోడించి, ఆలోచనకలిగించి , ఆహ్లాదాన్ని పంచి ఇవ్వడం ఈ రచయిత గొప్పతనం. నవరస సమ్మేళితమైన ఈ కధల సంకలనం చదువుతూంటే అది కధలు చదువుతున్నట్లు కాదు, మనం రోజువారీ జీవితం అనుభవిస్తున్నట్లే ఉంటుంది అనడం అతిశయం అస్సలు కాదు. 
అంత గొప్ప కధల సంకలనమే ఈ " పిఠాపురం క్రానికల్స్". ప్రతి కధకీ ఆఖరిపేరా ఒక ముఖ్య ఘట్టం. ఎందుకంటే పాఠకుల ఊహలకి అందకుండా మంచి ముగింపునివ్వడంలో రచయిత విజయం సాధిస్తే ఆ రచనకి పరిపూర్ణత అంటారు. అలా పరిపూర్ణత ప్రతికధకీ ఇచ్చిన ఘనత ఈ రచయితది. 
ఇక పుస్తకానికి ముందు మాటలు అందించిన నలుగురు మహా రచయిత్రులు నాలుగు భిన్న కోణాలలో రచయితని , పుస్తకాన్ని పరిచయం చెయ్యడం చదివితేనే మనకి ఆ రచయిత రచనా పాటవం  తెలుస్తుంది.
ఈ పుస్తకానికి ఒక ప్రత్యేక ఆకర్షణ, రచయిత తనని తాను పరిచయం చేసుకోవడం. ఈ సంకలనం లో ఉన్న 48 కధలకి అదనంగా ఇంకొక కధలా ఆయన పరిచయాన్ని భావించి చదువుకోవచ్చు, అంత చక్కటి పరిచయం ఇచ్చారు.

మనిషి ఒక సంఘ జీవి. మన చదువు, ఉద్యోగాలు మనని ఆర్ధికంగా ఉనంత స్థానాలలో నిలబెదతాయి, కానీ మన విలువలు మన విజ్ఞాన,ఉద్యోగాలకి మరింత శోభని ఆపాదిస్తాయి అన్నది నిజం. ఈ జీవన విలువలు తెలుసుకోవాలంటే ఏ పాఠ్యపుస్తకాలలోనూ దొరకవు, మన చుట్టూ ఉండే మనుషులనుండి, వారి వారి వ్యవహారశైలినుండీ, వారి సమయస్ఫూర్తినుండీ మనం అలవరచుకోవలసిన విషయాలు.
సుమారు 25-30సంవత్సరాల క్రితం వరకూ ఆ విలువలు ప్రతి ఇంటా. ప్రతిగ్రామంలో కనపడేవి. నెమ్మది నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. తన జీవిత ప్రస్థానం లో చిన్నతనం నుండీ ఇప్పటిదాకా , తనకి తారసపడిన ప్రతి వ్యక్తినీ , వ్యక్తిత్వాన్ని సూక్ష్మ దృష్టి తో గమనించి వాటికి నవరసాలూ ఆపాదించి ఆహ్లాదం కలిగించి, మనచేత ఆలోచింపజేసే విధంగా కధలని మలచి, మనకందించారు రచయిత. సున్నిత వ్యంగ్యమూ, హాస్యమూ మేళవించి తనదైన ప్రత్యేక శైలిలో వచ్చిన రచన ఈ " పిఠాపురం క్రానికల్స్ ". 
ఆఖరి మాటగా, ఇది అందరూ చదవవలసిన పుస్తకం అనే చెప్పాలి. ఈ కధలలో పాత్రలు ఉంటాయిగానీ, కధా నాయకులూ, ప్రతి నాయకులూ కొట్టుకోవడాలూ, చంపుకోవడాలూ అనేవి ఉండవు. ముఖ్యంగా పల్లె వాతావరణం నుండి పల్లెటురినుండి జనారణ్యాలయిన పెద్దపట్టణాల దాకా అందరినీ స్పర్శిస్తూ వ్రాసిన ఒక మంచి కధల సంకలనం. రచయిత మరిన్ని రచనలతో మనందరినీ అలరించాలని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.
పుస్తకం వెల రూ.150/- మాత్రమే, విభిన్న పుస్తకాల షాపులలో లభ్యం అవుతోంది. టెక్నాలజీ యుగం లో ఆన్ లైన్లో కొనాలనుకునే వారికీ, విదేశాలలో నివశించే తెలుగువారికి అనువుగా 'కినిగె' లో దొరుకుతున్నాయి. పుస్తకం మార్కెట్ లోకి వచ్చిన వెంటనే కినిగె సంస్థలో మొదటి వారంలోనే టాప్ రేటెడ్ పుస్తకం గా నిలవడం కూడా రచయిత గొప్పదనాన్ని చాటుతుంది.
మొదటి దఫా గా కేవలం 500 కాపీలు మాత్రమే ప్రచురణ జరగడం వలన ఎక్కువమందికి దొరకకపోవచ్చు కాబట్టి పుస్తకం చదవాలనుకున్న వారు తొందరపడడం మంచిది. తొందరలో మరిన్ని పునః ముద్రణలకు వెళ్ళాలని ఆశిస్తున్నాను.
***

No comments:

Post a Comment

Pages