శ్రీమద్భగవద్గీత -15 - అచ్చంగా తెలుగు
శ్రీ మద్భగవద్గీత -15

ఆరవ అధ్యాయం

ఆత్మ సంయమయోగము
రెడ్లం రాజగోపాల రావు

యుఞ్ఙన్నేవంసదాత్మానంయోగీవిగతకల్మషః
సుఖేనబ్రహ్మసంస్పర్శమత్యంతంసుఖమస్నుతే  28వ శ్లోకం
మనసు నెల్లప్పుడూ ఆత్మయందే నిలిపి సుఖమును సులభముగా పొందుచున్నాడు. మోక్షము లభించవలెననిన రెండుసాధనలను చేయవలెను.
1.మనస్సులోగల దుర్గుణములను పోగొట్టుకొనవలెను, జన్మజన్మల నుండీ సంక్రమించిన చెడువాసనలను విడిచిపెట్టవలెను.
2.మనస్సును నిరంతరమూ ఆత్మయందు లయింపజేయవలెను. మలినచిత్తమున ఆత్మజ్ఞానముదయించదు.  కల్మష చిత్తమాత్మయందు లయింపదు. దృశ్యవాసనలు, పాపములుగల మనస్సు చంచలముగా నుండును. చంచలమనస్సు ఆత్మయందు విలీనముకాలేదు. కావున దానియందలి దోషములు ప్రయత్నపూర్వకముగా తొలగించి నిర్మలమొనర్చినచో ఆత్మయందు లయించిపోవును. వాసనారాహిత్యము, ఆత్మచింతన రెండునూ ఆవశ్యకములేయని ఈశ్లోకమున చెప్పబడినది. ఒకవైపున చిత్తమును నిర్మలమొనర్చుచు మరియొకవైపున ఆత్మచింతనచే దానిని ఆత్మయందు లయమొనర్చు యత్నము చేయవలెను. ఈప్రయత్నము ఏదియో ఒకానొక కాలమున చేసిన చాలదనియు, నిరంతరము చేయుచుండవలెననియు గీతాచార్యుడు తెలియజేయుచున్నాడు. ఆధ్యాత్మిక సాధన ముఖ్యముగా ధ్యానసాధన నిరంతరప్రక్రియ.
ప్రాపంచిక విషయములు పలు ఆకర్షణీయములు. కావున మనసు ఎప్పుడు అవకాసము చిక్కిన అప్పుడు ప్రాపంచిక ఆకర్షణలవైపు పరుగిడును. అందువల్ల నిరంతరసాధన చేస్తున్న యోగి ఈజన్మలోనే మోక్షాన్ని పొందగలడు. ఆత్మసాక్షాత్కారమనేది వారివారి అభ్యాసాన్నిబట్టి ఈజన్మలోనే సాధ్యపడవచ్చు.లేదా మరలజన్మించిన చైతన్యము మనుష్యజన్మనే పొంది, సాధనాక్రమములో ఉచ్చస్థితిని పొందును. ఈ విషయములన్నియు రాబోవు శ్లోకములలో వివరించబడును.
సర్వభూతస్థమాత్మానం సర్వభూతానిచాత్మని
ఈక్షతేయోగయుక్తాత్మా సర్వత్రసమదర్శనః
29వ శ్లోకం
పూర్ణత్వమును పొందిన ధ్యానయోగి సమస్తచరాచర ప్రాణికోట్లయందును సమదృష్టికలవాడై తనను సర్వభూతములయందున్న వానిగను, సర్వభూతములను తనయందును చూచుచున్నాడు.
ఈ దృశ్యజగత్తంతయు అధిష్టానమగు ఆత్మయందు కల్పింపబడినది. ఆరోపిత వస్తువు అధిష్టానమందే కాపురముండగలదు గాని అన్యత్రకాదు. ఆత్మయే తానని
అనుభూత మొనర్చుకొనిన యోగి, తనయందే ఈజగత్తును వీక్షించుచుండును మరియు జగత్తునందంతట అధిష్టానమగు ఆత్మయే వ్యాపించియున్నది గనుక
జగత్తునందు తనను గాంచును. తాను ఆత్మయేగాని దేహము కాదు,అని అనుకొన్నపుడు మాత్రమే ఈ సర్వాత్మస్థితి సంభవించును. నైతిక క్షేత్రమునకు ఆధారము ఆధ్యాత్మిక క్షేత్రమే. సర్వము ఆత్మయే ఆత్మయందే సమస్తము కలదు అను ఆధ్యాత్మిక సిద్ధాంతమే సమస్తనైతిక సంపదకు, సమస్త దివ్యగుణములకు మూలకందమై యున్నది. సాధకుడు యోగమునందు పూర్ణత్వముబడయుటకు గాను ఇట్టి సర్వసమత్వమును విశాలదృష్టిని అలవరచుకొనవలెను. ఇట్టి సమదృష్టిగలవాడే నిజమైన యోగియని ఎరుగవలెను.
తీవ్రమైన ధ్యాస్థితిలో యోగియెక్క ఆజ్ఞాచక్రము తెరుచుకుని, సూదిమొనంత అణువులో ప్రజ్వలమైన కాంతి, భూనభోంతరాళాలు వ్యాపించి విశ్వవిరాఢ్రూపాన్ని దర్శింపజేస్తుంది.
అదియే జ్ఞాననేత్రం. విశ్వాన్నంతా తనలోనే వీక్షించిన ధ్యానయోగి తనలోనేవిశ్వాన్ని దర్శించి, విశ్వమే తనుగా అనుభూత మొనర్చుకుంటున్నాడు. తనకు విశ్వానికి తేడాలేని స్థితిని  అనుభవిస్తున్నాడు.
అసంశయంమహాబాహోమనోదుర్నిగ్రహంచలమ్
అభ్యాసేనతుకౌంతేయావైరాగ్యేణచగృహ్యతే  -35వశ్లోకం
మనసు చంచలమైనది, దానిని నిగ్రహించుట కష్టసాధ్యమను విషయము నిచట చెప్పబడినది. అటువంటి మనస్సును అభ్యాస వైరాగ్యములచే నిరోధించవచ్చునని శ్రీకృష్మపరమాత్మ
సెలవిచ్చెను. నిగ్రహించుటకు బోధించిన ఉపాయములను గూర్చి విచారించుదము. ఏవిషయానికై మనుజులు వశీభూతులై అనాదికాలము నుండీ ఈసంసారసాగరమున బడి
దరిగానక ఈదులాడుచున్నారో, ఏది ఆత్మానుభూతికి ప్రధానమగు అడ్డుగోడగా నిలిచియున్నదో అట్టిమనస్సు యొక్క నిగ్రహమునుగూర్చి వచించబడినది.
ఈ దృశ్యప్రపంచములోని సమస్తపదార్థములును కాలక్రమమున నశించున వైయున్నవి. తుదకు శరీరమున్ను కొంతకాలమునకు నశించి తీరును. దృశ్యప్రపంచములోని ప్రాపంచిక భోగములు అనుభవించుకొలది తృప్తికలుగదు కదా, దానివలన వాసనలు బలపడి సంసారబంధము వృధియగును. పైగామనస్సు విషయానుభవమునకై బహిర్ముఖమగుచున్న
కొలది ఆత్మవస్తువు దూరమగును. మనోనిగ్రహమందు గమనించవలసిన రెండవ విషయము అభ్యాసము. అభ్యాసముచే, నిరంతరప్రయత్నముచే ఎట్టికార్యమైనను
సాధించబడగలదు. శ్రీపతంజలి మహర్షులవారు కూడా బహుకాల, నిరంతర అభ్యాసముచే మనోనిగ్రహము తప్పక సాధ్యపడగలదని చెప్పియున్నారు. ప్రతిరోజున్నూ
మనస్సును విచార వైరాగ్యములచే బాహ్యమునుండి మరలించి అంతరంగమున ఆత్మధ్యానమందు వినియోగించే అభ్యాసమును బహువిధముల చేయుచున్నచో
అచిరకాలములో మనస్సు స్వాధీనపడి ఆత్మయందే నిరంతరము ప్రీతిని పొందుచుండగలదు. మనస్సును నిగ్రహించలేని వానికి ఆత్మసాక్షాత్కారము లభించదు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages