నృత్యర్పిత యన్. విజయలక్ష్మి - అచ్చంగా తెలుగు

నృత్యర్పిత యన్. విజయలక్ష్మి

Share This
నృత్యర్పిత యన్.విజయలక్ష్మి 
భావరాజు పద్మిని 


ఆమె జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు, కాని దైవమిచ్చిన జీవితాన్ని సమస్యలకు జడిసి, రాజీ పడకుండా ధైర్యంగా ఎదుర్కుని, కళా మేరు పర్వతంలా నిలిచారు. ఈ సాటిలేని మేటి కళాకారిణి పరిచయం ఈ నెల శింజారవంలో ప్రత్యేకించి మీకోసం...
జీవితం ఒక ప్రవాహం లాంటిది. కాని, ఒక్కోసారి మంచి వేగంతో సాగిపోతూ ఉండగా ఒక్కోసారి అవరోధాలు ఎదురౌతాయి. అవరోధాలకు జడిసి వెనుదిరిగి పోయేవారు కొందరైతే, అడ్డంకులు తలెత్తినప్పుడు ఓటమిని అంగీకరించక తమ దారి మార్చుకుని, పయనం సాగించేవారు కొందరు. అలుపెరుగని కృషితో పలు రంగాల్లో పతాక స్థాయి ప్రతిభను కనబరుస్తున్న అటువంటి కళాకారిణే  నెట్టూరు విజయలక్ష్మి గారు.

తొలి అడుగులు...

విజయలక్ష్మి గారి స్వస్థలం అనంతపురం జిల్లా హిందూపురం. తండ్రి అంజనప్ప, తల్లి సరోజమ్మకు తొలి సంతానం ఆమె. బాల్యంలో ఆమె తండ్రి ఆమెను న్యాయవాద, నృత్య రంగాల్లో రాణిస్తే చూడాలని అనుకున్నారు. హఠాత్తుగా తండ్రి మరనించడంతో కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో సాయం చేస్తూ తన తండ్రి కల నెరవేర్చలేకపోయారు. చివరికి తన 32 వ ఏట నాట్యం నేర్చుకోవాలని ఉందంటూ ఆంద్ర నాట్య సృష్టికర్త నటరాజ రామకృష్ణ గారి వద్దకు వెళ్ళినప్పుడు, వారు ‘ఈమెలో చిత్తశుద్ధి ఎంతుందో చూద్దామని, మూడు రోజులు తిప్పుకున్నారట. తన వినయం, పట్టుదల, అంకితభావంతో ఆయన మనసు గెల్చుకుని, గురువు చేత్తోనే ‘నృత్యార్పిత’ అన్న బిరుదును అందుకున్నారు ఆవిడ. ఇలా తన తండ్రి మొదటి కలను నెరవేర్చి తారాపధంలో దూసుకుపోతూ ఉండగా, జరిగిందొక అనుకోని ప్రమాదం.

ఒక ప్రదర్శనలో వేదికపై ఉన్న రంధ్రంలో కాలు ఇరుక్కుని, వెనక్కు పడిపోవడంతో వెన్నుపూస దెబ్బతింది. నాట్యానికి శాశ్వతంగా దూరం కావాలని డాక్టర్లు చెప్పారు. అదే సమయంలో ఆమె తెలుగు దేశం పార్టీలో చేరి మూడు పర్యాయాలు మహిళా విభాగ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికల్లో గెలిచి పార్టీకి, ప్రజలకు సేవలు అందించారు.

నాట్యంలో తనదైన ముద్ర
నృత్యంలో విజయలక్ష్మి గారు అలరిప్పు, వినాయక కౌతం, దశావతారాలు, తిల్లాన, వర్ణం, పదములు, జావళీలు, అన్నమాచార్య కీర్తనలు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలలో పలు ప్రదర్శనలు ఇచ్చి, తనదైన ముద్ర వేసారు.
నృత్యార్పిత, ఉత్తమ నాట్యాచారిణి, నృత్య చూడామణి, నాట్యమయూరి, వంటి బిరుదులే కాక, విశిష్ట వ్యక్తిగా జిల్లా పురస్కారం, ఉగాది పురస్కారం వంటి ఎన్నో పురస్కారాలను కూడా పొందారు. ఎన్.టి.రామారావు గారు, సినారె వంటి ప్రముఖుల సత్కారాలను కూడా అందుకున్నారు.


సాహితీ దిగ్గజం
రచయిత్రిగా, కవయిత్రిగా కూడా విశేషంగా రాణిస్తున్నారు విజయలక్ష్మి గారు. వీరి కధలు, కవితలు అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆకాశవాణిలో ఎన్నోసార్లు ఆవిడ రాసిన వ్యాసాలూ, కధలు, కవితలు చదివి వినిపించారు. దీనితో రేడియా ఆర్టిస్ట్ గానూ మంచి గుర్తింపును అందుకున్నారు. పలు సాహితీ సదస్సుల్లో పాల్గొని, సత్కారాలు పొందారు. కర్నూలు జిల్లా ప్రముఖ రచయిత్రి అవార్డు, మద్రాసు తెలుగు విశ్వా విద్యాలయం నుండి కవితా పురస్కారము, పలు సంస్థల నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి సాహితీ అవార్డులు అందుకున్నారు.

రాజకీయ ప్రస్థానం
ప్రమాదవశాత్తూ నాట్యానికి దూరమై, విజయలక్ష్మి గారు
కృంగిపోతున్న తరుణంలో ఆమె గురువు శ్రీ నటరాజ రామకృష్ణ గారు ఆమెలో మనోధైర్యం నింపి, తనకు తెలిసిన ఎన్.టి.రామారావు గారికి సిఫార్సు చేసి, ఆమెను రాజకీయ రంగంలో చేర్చారు. తెలుగుదేశం పార్టీలో విజయలక్ష్మి గారు రాష్ట్ర, మండల, జిల్లా స్థాయిల్లో అనేక పదవులు నిర్వహించారు. జిల్లా ఆహార సలహా సంఘం గౌరవ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లా మద్యపాన నిషేద గౌరవ సలహా సంఘం సభ్యురాలిగా కూడా ఉన్నారు.


సామాజిక సేవిక
సమాజానికి సేవ చెయ్యాలనే సత్సంకల్పంతో విజయలక్ష్మి గారు ‘యశస్వి’ అనే స్వచ్చంద సంస్థను నెలకొల్పి, ఆ సంస్థ ద్వారా బాల బాలికలకు, స్త్రీలకూ ఉచిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బడి మానేసిన పిల్లలకు చదువు బోధించారు.
ఇంతే కాక, కన్నబిడ్డల నిరాదరణకు గురైన వృద్ధుల కోసం ‘అమృత నిలయం’ అనే సంస్థను, తోడు కోసం అన్వేషిస్తున్న వారికి ‘కంపానియన్ క్లబ్’ ను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.


నటనా రంగం
పలు లఘు చిత్రాల్లోనూ, టీవీ కార్యక్రమాల్లోనూ తన నటనా చాతుర్యాన్ని
చూపారు విజయలక్ష్మి గారు. ప్రస్తుత సమాజానికి మంచి సందేశం ఇవ్వడంలో లఘు చిత్రాలు, టెలీ ఫిలిమ్స్ ప్రముఖ పాత్రను పోషిస్తాయని అంటారు ఆవిడ.
ప్రస్తుతం పలు శాస్త్రీయ నృత్య కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న ఆవిడను గురించిన మరొక ఆశ్చర్యకరమైన విషయం కూడా
ఉంది. 62 ఏళ్ళ వయసులో తన తండ్రి రెండవ కలను సాకారం చెయ్యడానికి న్యాయవాద విద్యను(డిగ్రీ) అభ్యసిస్తున్నారు.
స్పందించే మనసు, కళాభిరుచి ఉంటే, ఎన్ని అడ్డుగోడలు ముందర నిలిచినా, మనలోని సృజనను వివిధ కోణాల్లో ఆవిష్కరించుకుని, బహుముఖ ప్రజ్ఞను కనబరచవచ్చని ఆమె ఆచరణాత్మకంగా చూపారు. మనిషి ఒక నిత్య విద్యార్ధి అని, అభిరుచికి వయసేమీ అడ్డు కాదని ఆమె జీవితం నిరూపిస్తుంది. ఒక రంగంలో సవాళ్లు ఎదురైనప్పుడు ఆమె మరొక రంగంలో ప్రయత్నం కొనసాగించారు. నింగిపైన, నీటి నీడలోన ఒక్కసారే మెరిసే తారకలా ,పలు కళా రంగాల్లో అసమాన ప్రతిభను కనబరుస్తూ, తన జీవితాన్ని ఎందరికో ఆదర్శంగా, ప్రేరణగా నిలిపారు. విజయలక్ష్మి గారు మరిన్ని విజయాలను అందుకుని, నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని మనసారా ఆకాంక్షిస్తోంది – అచ్చంగా తెలుగు.

 *** 

No comments:

Post a Comment

Pages