పూజకు పూలు - అచ్చంగా తెలుగు
పూజకు పూలు
ఆండ్ర లలిత 

సుజన  జీవనా రామ సుగుణ భూషణా రామా ...అని పాడుకుంటూ, ఇంత కుంకుమ నుదుటి మీద పాముకుని, గోచీ పోసి  కట్టుకున్న చీర సవరించుకుంటూ  చేతి కర్ర సహాయంతో అడుగులు వేసుకుంటూ, పువ్వుల సజ్జ మరొక చేతిలో పట్టుకుని తన గదిలో నుంచి రాఘవమ్మ సావిట్లోకి వచ్చిందో లేదో, “ బామ్మా, నాదీ బొబ్బ పోసుకోవటం అయిపోయింది, చూడు” అంటు పరుగులు పెడుతూ కాళ్ళకి అడ్డంపడుతూ తన విన్యాసాలు  చూపిస్తున్నాడు ఐదేళ్ల మాధవ. ఇంతలో గడియారం కేసి సమయం ఎంతైయిందా అని చూస్తూ,  అబ్బో చాలా పొద్దెక్కి పోయింది అనుకుంటూ గుమ్మం బయటికి వచ్చి ఉదయభాస్కరుని కిరణాలలో తన గారాల మనుమడుని చూసి మురిసిపోతూ మాధవతో మాట్లాడ సాగింది.
“అబ్బో! ఏది నాకేసి తిరుగు, పండులా ఉన్నావు. నా బంగారు కొండ. నువ్వుకూడా జేజకి దండం పెడతావా? పద మనం  వెళ్ళి పువ్వులు కోసుకొని వద్దాము జేజకి” అంది రాఘవమ్మ సున్నితంగా  మాధవుడి కేసి చూస్తూ,  ఆయురారోగ్యాలు విద్యా బుద్ధులు మాధవునికి ప్రసాదించమని మనసులో కోరుకుంటూ.
అటు పద, ముందు మనము నిత్య మల్లె పువ్వులు కోసుకుందాము. విరగబూసాయి కదూ, మాధవా! ఒక్కసారి గిరగిరా మన తోటలో నీ తలతిప్పి చూడు, రంగు రంగుల పువ్వులు ఎన్ని ఉన్నాయో కదూ. అయినా, ఎందుకు పూయవూ! రోజూ నువ్వు, మన  తోటలో ఉన్న మొక్కలికి  నీ చిన్ని చెంబుతో  నీళ్ళు పోస్తున్నావు కదా! 
“బామ్మా ఇప్పుడే వస్తాను!”అంటూ పరుగు పెట్టాడు మాధవ.
“మాధవా ఎక్కడికి పరుగు పెట్తున్నావు! నన్ను పట్టుకోవూ. లేకపోతే  డాం పడిపోతాను నేను. రా ఇక్కడే ఉండు” అంది హడావిడి గా పూలు కోసుకుంటూ రాఘవమ్మ.
“లేదు బామ్మా. నేను  ఆ కనకాంబరం పూలు కోస్తాను. నువ్వు ఇవి కోసుకో”  అన్నాడు మాధవ బామ్మకేసి తిరిగి.
“అదే చేతితో ఆ ఎదర గులాబీపూల గుబురు పక్కనున్న పారిజాతపూలు కూడా ఏరి తీసుకురారా”అంది బామ్మ రాఘవమ్మ పారిజాతం చెట్టుకేసి చూపిస్తూ.
ఇంతలో హడావిడిగా మాధవ కనకాంబరం పూలు కోస్తూ , బామ్మా ఈ పువ్వుకొయ్యనా అని ఓ పూవు చూపించాడు.
“మాధవా! అది పసిరి మొగ్గ. పసిరి మొగ్గలు కొయ్యద్దు. పూర్తిగా పువ్వు విచ్చుకుంటేనే కొయ్యి. కొన్ని కొన్ని సగమే విచ్చుకుని ఉంటాయి. అవి రేపటికి విచ్చుకుంటాయి! ఆ, మరో మాట..అన్ని పూవ్వులు కోసేయకూడదు. కొన్ని చెట్టుకి వదిలేయాలి. లేకపోతే చెట్టు ఏడుస్తుందట. అదీ కాకుండా మన పెరడు బోసిపోకుండా అదంగా ఉంటుంది కదా! ఏమంటావు?”అంది రాఘవమ్మ మనవడు మాధవతో ఓ నాలుగు అడుగులు చిట్టి తండ్రి కేసి వేసి.
“అవును. బామ్మా ఎన్ని పూలో కదా!” అన్నాడు మాధవ బామ్మ రాఘవమ్మ కోసిన పూలు ఉన్న పూల సజ్జలో చేయి పెట్టి ఆడుతూ. 
అలా ఆడద్దు మాధవా! పువ్వులు నలిగిపోతాయి. చాలా సున్నితంగా ఉంటాయి. కనకాంబరం పూలు కొయ్యి మరి. ఇంకా బోళ్ళున్నాయి చూడు. బాగా విచ్చుకున్నవే కొయ్యి. బామ్మ మాధవ వేసుకున్న చొక్కాకి ఉన్న జేబు చూపించి, నీ చొక్కా జేబులో కోసిన పూలు పోసుకొని రా. ఆ తరువాత మనం ఈ సజ్జలోకి వొంపు కుందాము. అన్నట్టు  ఆ ఎదరున్న గులాబి పూల దగ్గరకు వెళ్ళకే, ముళ్ళుంటాయి. గుచ్చుకుంటాయి. సరేనా. అవి నేను కోస్తాను లే నాన్న. 
చొక్కా జేబుల నిండా నింపుకున్న కనకాంబరం పూలను వంపేటందుకు నందివర్ధనం పూలు కోస్తున్న బామ్మ దగ్గరకు వచ్చి, “బామ్మా సజ్జ పట్టు...పూలు వంపుతా...” అన్నాడు మాధవ
ఇంతలో మాధవుడి కళ్ళు విరిగిన మందార కొమ్మలపై బడ్డాయి.
“బామ్మా చూడు కొమ్మ విరిగిపోయింది”అన్నాడు మాధవ.
“అవును మాధవా! అది  ప్రహారీకి ఆనుకుని ఉందేమో, అందరు కోసేస్తున్నారు. కోసుకోవచ్చు...కాని అడిగి కోసుకుంటే ఎంత బావుంటుంది. ఎవరూ చూడకుండా కోసే హడావిడిలో నిర్దాక్షిణ్యంగా పసిరి మొగ్గలు కూడా కోసేస్తారు. కొన్ని పూలు సగం సగం తుంపి నేలపాలు చేస్తారు మాధవా! చూడు కొమ్మలు కూడా విరిచేసారు. అలా ఎప్పుడూ చేయకూడదు నాన్న. మొక్కలలో కూడా ప్రాణముంటుంది. ప్రేమతో వాటిని చూసుకుంటే...మనకు బోలెడు పూలు ఇస్తాయి. అయినా మనము ఎవరో ఇంట్లో పూలు, వాళ్ళని అడగకుండా తెచ్చి పూజ చేస్తే భగవంతుడు సంతోషిస్తాడా నాన్న! సంతోషించడు. భగవంతుడికి ఆర్భాటాలు అక్కరలేదు. భగవంతుడికి కావలిసింది ప్రేమతో  మనసారా తనని తలుచు కోవటం. పూలు మన పెరటిలో లేకపోతే..పువ్వలు కొనుక్కుని పూజ చేయవచ్చు. ఫరవాలేదు.  స్తోమతలేకపోతే ఒక్క నమస్కారం చేస్తే చాలు. దొంగలించిన పూలతో మటుకు  పూజ చేయక్కరలేదు.. మన పెరటిలో ఒక్క  చెట్టు ఆకు కోసుకొచ్చి పూజచేయచ్చు. లేదూ ఇంట్లో ఉన్న పండు భగవంతుడికి అర్పించి పూజచేయవచ్చు. ఆఖరుకు మంచి నీళ్ళు భగవంతుడు సమర్పించినా భక్తితో   చాలు. ఇంకొకరి మనసు కష్టపెట్టి పూజిస్తే లాభమేమీ ఉండదు. ఇక పద, జేజకి నమస్కారం పెట్టి ,అమ్మ పెట్టిన బువ్వ తిని నాలుగు మంచి కధలు చెప్పుకుందామా మనం. 
‘దొంగతనం చేయకూడదు మాధవా ! దొంగతనం చేసి పూజ చేయవలసిన అవసరం లేనే లేదు’ అన్న బామ్మ మాటలు స్వర్ణాక్షరాలతో గుండెలలో నాటుకుపోయాయి మాధవుడికి. 
***

No comments:

Post a Comment

Pages