పాశానికి ఆవల - అచ్చంగా తెలుగు
పాశానికి ఆవల!!
సత్యవోలు కిరణ్ కుమార్ 

అర్జెంట్ గా వైజాగ్ రమ్మని అమ్మ సడెన్ గా ఫోన్ చేసి చెప్పింది. అంత అర్జెంట్ ఏంటని అడిగితే వచ్చాకా మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది. బెంగుళుర్ నుండి ఫ్లైట్ కాచ్ చేసి వైజాగ్ బయలుదేరాను. ఎయిర్ పోర్ట్ కి అమ్మ, నాన్న ఇద్దరు వచ్చారు. ఇద్దరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి. అమ్మయితే దారి పొడుగునా నా చేతిని పట్టుకుని వదలనేలేదు. ఎక్కడికి వెళ్తున్నాం? ఏం జరిగింది? ఇంత అర్జెంట్ గా ఎందుకు రమ్మన్నారు? అని అడుగుతూనే ఉన్నాను. నాన్న మౌనంగానే కార్ ఫ్రంట్ సీట్ లో కూర్చుని లైఫ్ లైన్ హాస్పిటల్ కి పోనీ అని డ్రైవర్ కి చెప్పారు.
" హాస్పిటల్ కి ఎందుకు? అమ్మమ్మ బాగానే ఉంది కదా? " అడిగాను.
" అమ్మమ్మకేమీ కాలేదురా. " అమ్మ చెప్పింది.
" మరి హాస్పిటల్ ఎందుకు? " అడిగాను.
" నా ఫ్రెండ్ నిన్ను చూడాలని అడిగాడురా. అందుకే... " అన్నారు నాన్న.
" వాట్,,..? " అన్నాను ఆశ్చర్యంగా.
" అవును. నీతో చెప్తూ ఉండేవాడిని కదా, నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ వీరేంద్ర అని. వాడు నిన్ను చూడాలని అడిగాడు. అందుకే.. "
" ఆయన నన్నెందుకు చూడాలనుకుంటున్నారు? "
" నీకే తెలుస్తుంది... "
అమ్మ మరింత గట్టిగా నా చేతిని ఒత్తింది. 
కార్ హాస్పిటల్ కి చేరుకుంది. డైరక్ట్ గా ఐ.సి.యు రూమ్ దగ్గరకి వెళ్ళాము. చిక్కిపోయిన శరీరానికి కృత్రిమ శ్వాసనందించే పరికరాలను అమర్చారు. అవి మోసే బలం కూడా లేదా మనిషికి. ఎముకలు బయటకు పొడుచుకొచ్చి , పొట్టలోపలికి పోయి చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడాయన. 
నాన్న ఆయన దగ్గరకు నడిచి పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చున్నారు. నా వైపు చూసి ’ఇలారా’ అన్నట్టుగా సైగ చేసారు. నేను వెళ్ళి ఆయన పక్కన నుంచున్నాను. పేషెంట్ భుజం మీద నెమ్మదిగా చేయి ఆంచి "  వీరూ... " అని పిలిచారు. ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచి మమ్మల్ని చూసాడు. నాన్న ఆయన్నొకసారి చూసి, నన్ను చూడమన్నట్టుగా నావైపు తిరిగారు. ఆయన కళ్ళు మాత్రమే తిప్పుతూ నన్ను చూసారు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధం కాలేదు. ఎలా ఉన్నారు అనడిగితే అంతకంటే పిచ్చి ప్రశ్న మరొకటి ఉండదేమో అని అనుకుని, ఒక రకమైన అయోమయానికి గురయ్యి, వెంటనే తేరుకుని నమస్తే అంకుల్ అన్నాను రెండు చేతులు జోడించి. ఆయన కళ్ళు చమర్చడం నా చూపు దాటిపోలేదు. లోపలికి పోయిన కళ్ళు ఎక్కువ కన్నీళ్లనే పట్టుకోగలిగాయి. నాన్న వెంటనే ఆయన కన్నీళ్ళు తుడిచారు. నాకంతా విచిత్రంగా ఉంది. ఈయన ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను కలవాలనుకోవడం ఏమిటి? నాకు ఊహ తెలిసిన తరువాత ఎప్పుడూ నాన్న , ఈ అంకుల్ కలుసుకున్న సందర్భాలు కూడా ఏమీ లేవు.  నాన్న ఎప్పుడూ ఈయన గురించి చెప్తే వినడమే గాని, కలిసి మాట్లాడుకోవడాలాంటివి లేవని చెప్పగలను. మరి ఇప్పుడు ఈయన ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలా కలిసారు? నాకేమీ అర్ధం కాలేదు. నర్స్ వచ్చి మమ్మల్ని బయటకి వెళ్ళిపొమ్మంది. మారు మాట్లాడకుండా వచ్చేసాం.
" ఏమైంది నాన్నా ఆయనకి? "
" లివర్ డేమేజ్.. లాస్ట్ స్టేజ్.. "
" అయ్యో.. డ్రింక్ చేస్తారా? "
" బాగా... ఎడిక్ట్.. "
" ఎందుకంతలా ఎడిక్ట్ అయిపోవడం? అంత కష్టం ఏమొచ్చింది? అసలు ఆయన నన్ను చూడాలనుకోవడం ఏమిటి? "
నాన్న నా వైపు ఓ క్షణం చూసారు. 
" ఎందుకంటే వాడి ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత నీపై ఉంది.."
" నేనా? " నా భృకుటి ముడిపడింది. నాన్నను ఒక్క క్షణం చూసి అమ్మ వైపు తిరిగాను. అమ్మ చూపులో ఏదో తెలియని బెంగ.
అప్పుడే అప్పటివరకు నాకు తెలియని ఒక ఆవిడ వచ్చి మా ముందు నుంచుంది. 
" హాయ్, నవనీత్.. " అందావిడ. 
" మీరు? " అనడిగాను.
" వీరేంద్రకి ఫ్రెండ్ ని. నా పేరు రేఖ." అన్నారు.
" ఒకె, హాయ్!! " అన్నాను.
" ఏంటి? అంతా అయోమయంగా ఉందా? " అనడిగారు.
" అవునండి... చాలా కన్ఫూసింగ్ గా ఉంది. " అన్నాను. 
ఆవిడ నా వైపు చూసింది. ఆమె చూపులో ఎంతో స్వచ్చత. 
ఆమె చెప్పడం ప్రారంభించింది. 
" ఎవరితో ఎంత అటాచ్మెంట్ పెట్టుకోవాలో అంతే డిటాచ్మెంట్ కలిగుండాలనేది నా ఫిలాసొఫీ. ఎందుకంటే పుట్టుక ఎంత నిజమో, చావు కూడా అంతే నిజం. ఒక రకంగా పుట్టుక ఒక తీపి అబద్దం. ఎందుకంటే పుట్టుక ఎప్పుడు ఎలా నిర్ణయించబడుతుంతో చెప్పలేము. అమ్మ కడుపులో ఎప్పుడు ఊపిరి పోసుకుంటామో తెలియదు. మనిషి ఈ లోకంలోకి వచ్చాకా పుట్టాడంటారు, కాని ఆ మనిషి ఎప్పుడు ప్ర్రాణం పోసుకున్నాడో సరిగా చెప్పలేము. ఇక చావేమో ఓ చేదు నిజం. దాన్ని ఎవరూ కావాలని కోరుకోరు. అది వస్తే ఏం చేయలేరు. " అని కాసేపు ఆపారు.
నేను నిట్టూర్చాను. మళ్లీ ఆవిడే కొనసాగించారు. " కాని మనిషి ఆశాజీవి. కోరుకున్న ప్రతీదీ నెరవారాలనుకుంటాడు. తాను సాధించలేకపోతే ఎవరి సాయమైనా అడిగైనాసరే నెరవేర్చుకుంటాడు. సిల్లీగా అనిపించినా అది నిజం. నేను డెస్టినీని నమ్ముతాను నవనీత్. చిన్నోడివైనా నువ్వు మెచ్యూర్ గా ఆలోచించేవాడివని నీకో నిజం చెప్తాను. డైజెస్ట్ చేసుకోవాడానికి ప్రయత్నించు. నీ ముందున్న నీ తల్లిదండ్రులు నిన్ను కన్నవారు కాదు. " అన్నారు.
నాకు నించున్నచోట భూమి కంపించినట్టైంది. 
" ఏం మాట్లాడుతున్నారు? " అన్నాను.
" నువ్వు వీరేంద్ర కొడుకువి. " అన్నారావిడ.
" ఏంటమ్మా ఇది? " అన్నాను అమ్మతో.
అమ్మ మౌనం వహించింది. నాన్న నిట్టూర్చి నిలబడ్డారు. " ఏంటి నాన్నా ఇదంతా? " అన్నాను.
నాన్న లేచి నా దగ్గరొకొచ్చి “వీరేంద్రకి ఎవరూ లేనప్పుడు మా నాన్న చేరదీసారు. నన్ను, వీరేంద్రని ఒకేలా చూసారు. పెంచారు. చదివించారు. వీరేంద్ర మా ఇంట్లోనే ఉంటూ నాన్నకు చేదోడువాదోడుగా ఉండేవాడు. మేము కాలేజీలో చదివే రోజుల్లో వీరేంద్ర చెల్లెలుగా భావించే రాగిణిని నేను ఇష్టపడ్డాను. రాగిణి కూడా నన్ను ఇష్టపడింది. మా ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే అస్సలు ఒప్పుకోరన్న విషయం మాకు తెలుసు., ఇంక చేసేది లేక చెప్పకుండా పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను. అందుకు వీరేంద్ర సాయం చేస్తానన్నాడు. రాగిణిని ప్రేమిస్తున్న విషయం మా నాన్నకు తెలిసింది. నేను రాగిణిని పెళ్ళి చేసుకుంటే నాన్న ఆత్మహత్య చేసుకుంటానని నన్ను బెదిరించారు. బ్యాంక్ పని అని చెప్పి అప్పటికప్పుడు  వీరేంద్రని పక్కూరు వెళ్ళమని చెప్పారు. వీరేంద్ర తరువాత వెళ్తానన్నా నాన్న పట్టుబట్టి పంపించారు. వీరేంద్ర రాగిణిని కలిసి మర్నాడు ఉదయాన్నే వచ్చేస్తానని, కొండ మీదున్న గుడి దగ్గర ఉండమని చెప్పి పక్కూరు వెళ్లిపోయాడు. వీరేంద్ర వెళ్లిన కాసేపటికి నాన్న మనుషులతో రాగిణి ఇంటికి వెళ్లి గొడవ చేసారు. అది తెలిసిన నేను ఆ గొడవని ఆపి రాగిణితో ఇదంతా జరగని పని అని సద్ది చెప్పి వచ్చాను. కాని రాగిణి అది తీసుకోలేకపోయింది. మర్నాడు వీడు తిరిగొచ్చి సరాసరి రాగిణి ఇంటికెళ్ళాడు. తను ఏడుస్తుంటే ధైర్యం చెప్పబోయాడు. తను రాత్రి జరిగిన గొడవ గురించి మాత్రమే చెప్పింది. నేను మాట్లాడిన విషయం చెప్పలేదు. అప్పటికప్పుడు నన్ను తీసుకొస్తానని చెప్పి ఇంటికొచ్చాడు. కాని ఇంట్లో పరిస్థితి వేరేగా ఉంది. నాకు మీ అమ్మకి ఇచ్చి పెళ్ళి నిశ్చయించేసారు. అదే విషయం వీరేంద్రకి చెప్పాను. మరి రాగిణి పరిస్థితేంటని నన్ను నిలదీసాడు. నేను సద్ది చెప్పొచ్చానని చెప్పాను. నేను రాగిణిని కలిసానని అప్పుడు అర్ధమైంది. పరుగుపరుగున ఆమె దగ్గరకి వెళ్ళాడు. అప్పటికే లేట్ అయిపోయింది. రాగిణి సూసైడ్ చేసుకుని చనిపోయింది. రక్తసంబంధం లేకపోయినా చెల్లెల్లు కంటే ఎక్కువగా చూసుకున్న రాగిణి చావుకు కారణమైన నేనంటే కోపం ఏర్పడింది. నా దగ్గరకొచ్చి నన్ను కొట్టి తిట్టి ఇంక జీవితంలో నా ముఖం చూపిద్దని చెప్పి అక్కడినుండి నాతో సంబంధాలు తెంచేసుకుని వెళ్లిపోయాడు.
వాడెళ్లిపోయిన కొన్నాళ్లకి మీ అమ్మకి నాకు పెళ్లి అయింది. తరువాత వాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడన్న విషయం ఏమీ తెలియలేదు. తరువాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే వాడిని చిన్నప్పటి నుండి ఇష్టపడిన సారికనే వాడి పెళ్ళి చేసుకున్నాడని! సారిక వాడినే పెళ్లి చేసుకోవాని పట్టుబట్టి చేసుకుందట రేఖ గారు చెప్పారు. " అని రేఖ గారి వైపు చూసారు. 
ఆవిడ నావైపు చూసి " అసలు వీరేంద్ర నా దగ్గరకు రావడమే చాలా నాటకీయంగా జరిగింది. బస్టాండ్ లో ఉన్న నన్ను ఇద్దరు కుర్రాళ్ళు తాగొచ్చి గొడవచేయబోతే వీరేంద్ర వచ్చి నేనెవరో తెలిసున్నట్టుమాట్లాడి నా చేయి పట్టుకుని నన్ను పక్కకి తీసుకెళ్లిపోయారు. అతని చేయి స్పర్శలో నన్ను కాపాడే ఇంటెన్షన్ తప్ప మరొకటి లేదు. నన్ను ఇంటివరకు డ్రాప్ చేసాక నేను ఆ రాత్రి మా ఇంట్లో ఉండిపొమ్మన్నాను. కాదనలేక ఒప్పుకున్నారు. మర్నాడు ఉదయం మాటల్లో తనెందుకు వచ్చేసాడో చెప్పాడు. రెండురోజుల తరువాత సారిక వీరేంద్రని వెతుక్కుంటూ కట్టుబట్టలతో వచ్చేసింది. ఆమెను వెళ్ళిపొమ్మని చెప్పినా ఆమె వినలేదు. పెళ్ళి చేసుకుంటే వీరేంద్రనీ చేసుకుంటానని గొడవ చేసింది. చివరికి వీరేంద్ర సారికల పెళ్ళి జరిగింది. సారిక డెలివరీకి వచ్చింది. అదే హాస్పిటల్లో మీ అమ్మ కూడా డెలివరీకి వచ్చింది.  వీరేంద్ర మీ నాన్నని చూసి , తన స్నేహితుడి భార్య కూడా డెలివరీకి వచ్చిందని తెలుసుకున్నాడు. ఇద్దరి డెలివరీలు కాంప్లికేటడ్ అయ్యాయి. భగవంతుడు భలే ఆట ఆడతాడు నవనీత్. వీరేంద్రకి కొడుకు పుట్టాడు. కాని సారిక దక్కలేదు. మీ అమ్మకి పుట్టిన బిడ్డ పుట్టిన కాసేపటికే చనిపోయింది. సారిక చనిపోయిందని తెలుసుకున్న వీరేంద్ర గుండెలు బద్ధలయ్యేలా రోదించాడు. స్నేహితుడు గుర్తొచ్చాడు. అక్కడి నర్స్ ని అడిగితే అక్కడ తల్లి పోయింది, ఇక్కడ బిడ్డ పోయింది అని చెప్పింది. వెంటనే మరో ఆలోచన లేకుండా తనకు పుట్టిన బిడ్డను తన స్నేహితుడి భార్య దగ్గర పడుకోబెట్టి అక్కడున్న బిడ్డని ఇచ్చేయమని అడిగాడు. ముందు ఆ నర్స్ ఒప్పుకోకపోయినా , ఆమెను బతిమాలి ఒప్పించాడు. అప్పుడు ఆ నర్స్ తో వీరేంద్ర చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తు " ఆ తల్లి కాసేపట్లో లేస్తుంది. తన బిడ్డ కోసం ఆత్రుతగా ఉయ్యాలవైపు చూస్తుంది. అక్కడ ఎవరూ కనపడకపోతే ఆ తల్లి పేగు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించండి. ప్లీజ్, సిస్టర్ తల్లి లేని లోటు మరో తల్లి మాత్రమే తీర్చగలదు. కాదనకండి. ఇందులో నా స్వార్ధం ఏమీ లేదు.. " అంటూ ప్రాధేయపడ్డాడు. ఆమె వీరేంద్ర చెప్పినట్టే చేసింది. నిన్ను మీ అమ్మ దగ్గర పడుకోబెట్టి , అక్కడున్న మృతశిశువుని వీరేంద్రకి అప్పగించింది. అలా వీరేంద్ర కొడుకువైన నువ్వు శేఖర్ కొడుకుగా పెరిగావు. నిన్ను కూడా ఇచ్చేసాకా వీరేంద్ర పరిస్థితి దయనీయంగా మారింది. తాగుడికి బాగా అలవాటు పడ్డాడు. ఎక్కడో మూల ఉన్న పాశం కట్టిపడేసేది. నిన్ను చూడాలనుకునేవాడు. నీతో మాట్లాడాలనుకునేవాడు. కాని ఒకసారి నువ్వు అలవాటు అయితే నిన్నే తన కన్న కొడుకుగా భావిస్తున్న నీ పిచ్చి తల్లిదండ్రులను తన వల్ల ఇబ్బంది రాకూడదని ఊరుకుండిపోయాడు. రెండు నెలల క్రితం వీరేంద్రకి గుండెపోటు వచ్చింది. అప్పుడు మాటల్లో తన కన్న కొడుకు చేత తన తల కొరివి పెట్టించుకోవాలని ఉంది రేఖా అని అడిగాడు. వెంటనే మీరు ఎక్కడున్నారని వాకబు చేసాను. మొత్తానికి ఎలాగోలా మీ నాన్న అడ్రస్ పట్టుకున్నాను. అప్పుడు హెల్ప్ చేసిన అడ్రస్ కూడా కనుక్కుని ముందు ఆవిడని కలిసి, విషయం చెప్పాను. ఆమె తన వంతు సాయం చేయడానికి సిద్ధపడింది. మేమిద్దరం కలిసి మీ నాన్నని కలిసాము. వీరేంద్ర ఆఖరి కోరిక చెప్పాను. ముందు మీ నాన్న నమ్మలేదు. కాని హాస్పిటల్ కి వచ్చి వీరేంద్రని చూసిన మీ నాన్న వెంటనే నిన్ను రమ్మని పిలిపించారు. " అని ముగించింది.
ఐ.సి.యు నుండి పిలుపొచ్చింది.  డాక్టర్ మా వైపు చూసి " సారీ.. హి ఈజ్ నో మోర్.. " అన్నారు. నాన్న చిన్నపిల్లాడిలా ఏడ్చారు. అమ్మ ఉలుకుపలుకు లేకుండా ఉండిపోయింది. రేఖగారైతే రెండు చేతులు నోటికి అడ్డం పెట్టుకుని గొంతులోనే బాధనంతా నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. కాని కన్నీళ్లు మాత్రం ఆమె మాట వినకుండా వచ్చాయి. హాస్పిటల్ ఫార్మాలిటీస్ అయ్యాక వీరేంద్రగారి బాడీని మాకు అప్పగించారు. మధ్యాహ్నం వరకు స్మశానం చేరుకున్నాము. ఒక మెషీన్ లా పంతులుగారు ఏం చెబితే అది చేసాను. వీరేంద్రగారి ఆఖరి కోరిక ప్రకారం ఆయన చితికి నిప్పంటించాను. నా చేతులమీదుగా తలకొరివి పెట్టాలన్న ఆయన కోరికని నెరవేర్చాను. 
నా పక్కనున్న నాన్న కుమిలికుమిలి ఏడుస్తున్నాడు. 
ఆ చితి మంటల వెలుగులో " నాన్నా,, " పిలిచాను. చెంపలకు జారిన కన్నీటితో ఆయన నావైపు తలతిప్పారు. 
" కన్న తండ్రికోసం కంటనీరు కూడా పెట్టలేని జీవితం,, ఏం జీవితం నాన్నా నాది? " అన్నాను. చితిమంటల చిటపట శబ్ధాలు తప్ప అక్కడేమీ లేవు!!! నిశ్చలం... !!
***

1 comment:

  1. మనసు చెమర్చింది చాలా బావుంది కిరణ్ గారు

    ReplyDelete

Pages