గీతా జయంతి - అచ్చంగా తెలుగు
గీతా జయంతి ప్రత్యేకం...
ఎందుకీ గీత? ఎవరి కోసము??
 - పి.వి.ఆర్. గోపీనాథ్

------------------------  
ఆ. గీత చదువువారు గీత దాటను లేరు
ఎదల యందు నిదియె పదిలముగను
భద్ర పరచియుండు భక్తులనగ వారె
పొందగలరు ఫలము, లేదు శంక!!
--------------------
కురుక్షేత్రంలో ధర్మ యుద్ధానికి ఆరంభ సూచకంగా  పార్థ సారథుల మధ్య సాగిన సంవాదమే ఈ గీత. అర్జునికి మాధవుడు కర్తవ్య బోధ చేసినదీ గీత ద్వారానే. ఇది జరిగిన మార్గ శీర్ష శుద్ధ ఏకాదశీ పర్వదినమే మనము గీతా జయంతిగా జరుపుకుంటున్నాము.  పదునెనిమిది అధ్యాయములు, ఏడువందల శ్లోకాలలో విస్తరించిన ఈ గీత కేవలం అర్జునునికే కాదు, యావత్ ప్రపంచ మానవాళికి జ్ఞాన బోధ చేస్తున్నదనవచ్చును. దీనిని నిత్యమూ ఎందుకు పఠించాలో కూడా ఆ గీతాచార్యుడే చెప్పాడు. దాని సారమే పై ఆట వెలది.
ఈ గీత నిత్య పారాయణము చేసేవారు విధి విహత అనగా తాము చేయవలసినట్టి కర్మలను వదలుకోలేరు.ఈ ఉపదేశాన్ని తమ హృదయాలలో భద్రపరచుకుంటారు. అట్టివారే  పరమాత్మకు నిజమైన భక్తులు. వారే జ్ఞానాన్వేషులు. వారికే దీని పారాయణ ఫలము లభిస్తుంది. అనగా అట్టివారే పరమ ధామము చేరుకోగలుగుతారు.
గీతలో చెప్పినది అందరూ భావిస్తున్నట్లు చంపమనో, చావాలనో కాదు. మనం చేయదగిన పనులు, చేయరాని పనులే అందులో మాధవుడు సాకల్యంగా వివరించాడు. దీనిని సరిగా అర్థం చేసుకోలేకనే కుల వర్ణ విచక్షణలూ, వివక్షలతో మానవులు కునారిల్లుతున్నారనాలి.
ఆహారం విషయంలో కూడా గీతాచార్యుడు స్పష్టంగా చెప్పాడు. అందులోనూ సత్వ, రజస్తమో గుణాలను ప్రేరేపించేవి వేర్వేరుగా ఉంటాయనీ, సాత్వికాహారమే మనిషి మనుగడను అనగా నడవడికను నిర్దేశిస్తుందనీ స్పష్టం చేశాడు. దాన ధర్మాలు గానీ, కడకు యజ్ఞయాగాదులు సైతం ఈ మూడు గుణాలకు లోబడే జరుగుతూ అందుకు తగిన ఫలితాలే అందిస్తాయని కూడా గీతలో స్పష్టం చేసి యున్నది కదా.
కులాల కుమ్ములాటలకు సమాధానమూ ఆ గీతలోనే నిక్షిప్తమై ఉన్నది. నాలుగు వర్ణాలూ తానే సృష్టించిన మాట వాస్తవమే. కానీ, వాటికి తగిన విధివిధానాలూ నిర్దేశించినాడు. వాటిని సరిగా అవగతం చేసుకుని తగిన విధంగా అనుసరించకపోతే అందరూ ఒకే గాటన కట్టబడతారనీ స్పష్టం చేశాడనేది మనం మరువకూడదు. కదా.
ఇక ఇంద్రియాల విషయం చూద్దాం. మనం భావిస్తున్నట్లు ఆయన ఇంద్రియాలను అణచిపెట్టమనలేదు. కేవలమూ అదుపు చేయమన్నాడు. అంతే. ప్రత్యర్థిపై గెలుపు సాధించడానికీ ప్రత్యర్థినిమొదలుకే మట్టుబెట్టడానికీ గల తేడా తెలుసు కదా. దైవం మనకు వివిధ రకాల జ్ఞానేంద్రియాలు ప్రసాదించినది వినియోగించుకోవడానికే. కాకపోతే వాటిని సద్వినియోగం చేసుకోవాలి అంతే. వైద్యుల కత్తులూ, కత్తెరలూ మంచికీ చెడుకూ కూడా ఉపయోగపడతాయని తెలుసు కదా. వేమన కూడా కామి గాక మోక్షగామి కాడు అన్నాడనేది గమనార్హం. ఆ తర్వాత గాంధీగారి కోతులు సైతం ఏమి చెప్పాయో తెలుసు కదా. కనుక కావలసినది ఇంద్రియ నిగ్రహమే కానీ, వాటిని పూర్తిగా మూసుకుని కూర్చోవడము కాదని కూడా ఈ గీతలోనే చెప్పబడి ఉన్నది.
మరో విషయం. మనలో చాలా మంది సర్వ సాధారణంగా గీత ప్రతులను  సపిండికీరణ సమయాలలోనే పంచి పెడుతుంటాము. అలాగే ఆత్మీయులు మరణించినపుడు అక్కడే వినిపిస్తుంటాము. మహా ప్రస్థానము  ప్రధాన ద్వారము వద్ద గోడలపై కూడా గీతాబోధను చెక్కిస్తుంటాము. మరణ సమయంలో వినిపించాల్సింది నారాయణ జపం మాత్రమే కదా.. అయితే...
“ఏదీ నీది కాదు. నిన్న ఎవరిదో, రేపు మరెవరిదో...ఈ స్వల్పకాలం నీదైనంత మాత్రాన అచ్చంగా నీదే అనుకోవడమేమిటీ...” అనే ఆచార్యుని మాటలే మనలను ఇందుకు ప్రేరేపిస్తున్నట్లున్నాయి. కానీ, వాస్తవానికి అంతకు మించి గీతలో చాలా ఉంది. అదే భగవద్గీత. ఆ వి,యమే మనం మరువరానిది.
చేయదగినదీ, చేయరానిదీ చెప్తూనే ... వాస్తవానికి ఏదీ మానవుల చేతులలో లేదనీ, అన్నిటికీ తానే విధాతననీ స్పష్టం చేశాడనేది గమనించాలి. అయితే ఇదేమీ వితండ వాదానికి దారితీయకుండా...గత జన్మలో కూడా తాను ఇలాగే నిర్దేశించినా లక్ష్యపెట్టనివారినే ఈ జన్మలో కర్మలు బద్ధులను చేస్తాయనీ చెప్పాడు.
అలాగే  పై సద్గుణాలు ప్రోది కావడానికి యోగ విద్య మేలు చేస్తుందంటూ దాని గురించి కూడా వివరించాడీ గీతలో. అదీ గమనార్హమే కదా
నిజమే. గీతను అర్థం చేసుకోవడం చాలా కష్టమే. కానీ, కనీసం అందులో అర్థమైనంత వరకైనా సవ్యంగా త్రికరణ శుద్ధిగా ఆచరించగలిగితే మన జన్మ ధన్యమే కదా.
అందుకే అందరికీ మరోసారి శుభాభి వందనలు తెలుపుకుంటూ గీతా జయంతి శుభాకాంక్షలు.

No comments:

Post a Comment

Pages