శ్రీ మద్భగవద్గీత -15 - అచ్చంగా తెలుగు
 శ్రీ మద్భగవద్గీత -15

ఆరవ అధ్యాయం
ఆత్మ సంయమయోగము
రెడ్లం రాజగోపాల రావు


యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మనితుష్యతి -20 వ శ్లోకం


సుఖమాత్యన్తికం యత్తద్బుద్ధి గ్రాహ్య మతీంద్రియమ్
వేత్తి యత్రన చైవాయం స్థితశ్చలతి తత్త్వతః  -21 వ శ్లోకం


యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః
యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే  -22 వ శ్లోకం


తం విద్యాద్దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితమ్
సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా   -23 వ శ్లోకం


జీవబ్రహ్మైక్యమునకు,ఆత్మసాక్షాత్కారమునకు మూలమైనట్టి యోగముయొక్క మహిమను ఈ నాలుగు శ్లోకముల యందు గీతాచార్యుడు విషదపరచుచున్నాడు. ధ్యానయోగముచే మనస్సు ఆత్మయందులయమై పరమశాంతిని, సుఖమును బొందును. మానవ జన్మకు పరమార్ధము, మానవజీవన గమ్యము భగవంతుని సాక్షత్కారమే. భగవంతుడు ప్రకృతిపై ఆకర్షణను మానవునికి ఎక్కువగా కల్పించాడు.విషయవాసనలపై కలిగినట్లు భగత్సాక్షాత్కార సాధనలపై ఆకర్షణ జనించదు.నిగ్రహించబడిన మనస్సు, అభ్యాసవైరాగ్యములు మానవుణ్ణి తన స్వస్ధానమైన ఆత్మలో లయమొనర్చి పూర్ణానందాన్ని ప్రసాదించును.అజ్ఞానులు విషయవాసనా సేవనెట్లు చేయుచున్నారో జ్ఞానులు యోగసేవ తప్పక చేయవలయును. అట్టి యోగాభ్యాస వశమున జీవుడు తనయొక్క పరిశుద్ధ మనస్సుచే అంతరంగమున ఆత్మను అవలోకించి మహదానందమును పొందుచున్నాడు.
ఆత్మవస్తువు పరోక్షముకాదనియు ప్రత్యక్షముగా చూడవచ్చనియు స్పష్టమగుచున్నది. ఆత్మను దర్శించుటకు తనయొక్క శుద్ధ మనస్సే ఉపకరించగలదు. ఆత్మఎచటనున్నది? భగవంతుడెచటనున్నాడు? భగవంతుని దర్శించుటకు బయటవెదుకనక్కరలేదు.కోటి సూర్య ప్రకాశమైన ఆత్మతనయందే సాక్షాత్కరించగలదు. భగవానుడు తనలోనే అతిసమీపముననే వర్తించుచున్నాడు. ఎవరైతే ఇంద్రియములను, మనస్సును అరికట్టితదేక ధారణతో భృకుటి స్థానంలో చూపునిలుపుతున్నారో వారికి సాక్షాత్కారమగును.ఇందులకెట్టి సంశయమువద్దు. ఇదంతయూ గణితశాస్త్ర ప్రామాణికము. సీతారామాంజనేయ సంవాదమను ఆధ్యాత్మిక గ్రంధరాజములో లోకజనని సీతమ్మవారు భాగవతోత్తముడైన ఆంజనేయునకు కొన్ని సూక్ష్మమైనముద్రలనుపదేశించి హనుమా నీయిష్టదైవమైన రామచంద్రమూర్తి సాక్షాత్కారం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ముద్రలద్వారా పొంది ఆనంద ప్రాప్తిని పొందుము అని చెప్పెను.
ప్రతిమానవునికి మూడవ నేత్రమున్నది ఆ నేత్రము ద్వారానే భగవత్సాక్షాత్కారము  పొందనగును. ఇంద్రియ, మనోబుద్ధులను శాంతపరచి, యోగాభ్యాసపరుడై అభ్యాస, వైరాగ్యములనే ఉపకరణముల ద్వారా సర్వోన్నతమైన ఆనందమయకోశమును చేరుకొనుచున్నాడు. ఆత్మసుఖము అనంతమైనది. ఇంద్రియాతీతమైనది, బుద్ధి నిర్మలమైనపుడు  తన ఉపాధినిగోల్పోయి ఆత్మాకారముగా పరిణమించును. అట్టి నిర్మల బుద్ధిచే ఆత్మసుఖమను భూతముకాగలదు. బుద్ది అత్యంత శుద్ధమైనప్పుడు తన ఇంద్రియ రూపమునుగోల్పోయి బ్రహ్మముగానే పరిణమించుచున్నది.
బుద్ధిగ్రాహ్యమని చెప్పుటవలన ఆత్మ ప్రతివారికిని తెలియబడుచున్నదనియు,అందుకు దిగులుపడవలసిన పనిలేదనియు తెలియబడుచున్నది. ఆత్మసుఖము అనంతమని చెప్పుటచే దృశ్యసుఖములు క్షణికములని వానికై పరుగిడరాదనియు తెలియబడుచున్నది.అట్టి ఆత్మానందమగ్నుడైన యోగి ఆ స్థితి నుండి చలింపడనియు, దానియందేరమించు చుండుననియు వచించబడినది.
మధువును పానమొనరించు మధుపముకు సుమమును వీడనిచ్చగించునా? సచ్చిదానందస్థితిని పొందిన మనుజుడు మిధ్యావస్తువులకై పరుగులిడునా?అట్టి భ్రాంతి కలిగినచో ఆతడింకనూ పూర్ణవస్తువును పొందలేదని అర్ధము ప్రపంచములో అన్ని లాభములకంటెను గొప్పలాభము ఆత్మానందమే.దానిని పొందినప్పుడు తక్కిన ప్రాపంచిక లాభములన్నియు తృణ ప్రాయముగ వీడును.అత్యంత శాంతి,జనన మరణ దుఃఖరాహిత్యము, నిరతియ సుఖము కలుగజేయు ఆత్మానుభవమే గొప్పలాభము.
అట్టి ఆత్మస్థితియందున్నవాడు ఎంతటి బాహ్య ప్రాపంచిక దుఃఖము వచ్చినను చలింపడు. కావున సర్వదుఃఖ నివారణోపాయము ఆత్మసాక్షాత్కారమేయని స్పష్టపడుచున్నది. ఆత్మజ్ఞానములేని వానిని,దృశ్యము సత్యమని నమ్మువానిని చిన్న దుఃఖము కూడా తలక్రిందులుగా చేయగలదు. ప్రపంచములో ధనవియేగము, బంధువియోగము మొదలైనవి క్లేశమును గలుగజేయును గాని ఈ ఆత్మస్థితి రూప "దుఃఖ సంయోగ వియోగము" మాత్రము బ్రహ్మానందము కలుగజేయును. అట్టి స్థితి పట్టుదలతో కూడిన ధీర చిత్తముగలవారికే చేకూరగలదు. అభ్యాసకాలమున ఎన్ని ఆటంకములు వచ్చిననూ జంకక, పట్టుదలతోనుండు చిత్తమే ఆత్మానుభూతిని బడయగలదు. సాధకునిపడగొట్టుటకై మాయ ఎన్నివిధముల యత్నించుచుండును. ఒకప్పుడు సుఖము,మరియొకప్పుడు దుఃఖమునిచ్చుచు మాయమనలను మోసగించుచుండును.వివేకవంతుడు భగవంతునిపై, సద్గురువుపై అచంచల విశ్వాసముగలిగి ధైర్యముతో నిలద్రోక్కుకుని మోక్షమార్గమున ముందుకు సాగవలెను.

సంకల్ప ప్రభవాన్ కామాం స్త్యక్వా సర్వానశేషతః
మనసైవేన్ద్రియ గ్రామంవినియమ్య సమన్తతః  - 24వ శ్లోకం


శనైశనైరు పరమేద్బుద్థ్యా ధృతి గృహీతయా
ఆత్మసంస్థంమనః కృత్వాన కించదపిచిన్తయేత్ -25వ శ్లోకం

ధ్యానము చేయునపుడు ఏ ప్రకారముకూర్చుండవలెనో, దృష్టిని ఎచట నిలుపవలయునో ఆ విషయములన్నింటిని ఇదివరకు చెప్పియుంటిని ధ్యానమెట్లుచేయాలో ఆ పద్దతినిచట నిరూపించుచున్నారు.
కోరికలన్నింటిని పూర్తిగా విడనాడవలెనని మొట్ట మొదట చెప్పియున్నారు. వివేక, వైరాగ్యాదులచే విషయముల గూర్చిన సంకల్పము ఉదయించకుండ చూచినచో ,కోరికలు జనింపనేరవు.ఒక్క విషయాశ మిగిలియున్ను అది సాధకునకు అలవిగాని కీడును చేకూర్చును.అగ్ని, శత్రువు,రోగము,ఋణము,ఆశ కించిత్తు శేషించియున్ను కాలక్రమమున బలపడి ఆపకారము చేయగలవు. కామము అన్నింటిలో ప్రబల శత్రువగుటబట్టి దాని విషయమై ఏమరపాటుతగదని గీతాచార్యుడు మనలను హెచ్చరించెను. కోరికలున్నచో వానిననుభవించుటకు గాను చిత్తము బహిర్ముఖముగ పరుగెత్తుచుండును. లేనిచో అంతర్ముఖముగ ప్రవర్తించును. ధ్యాననిష్ఠునకు కామనా త్యాగమత్యవసరము. కాబట్టి వివేకయుక్తమగు మనస్సుచే ఇంద్రియ సమూహమును బాగుగా నిగ్రహించవలెనని బోధించబడినది.
(ఇంకా ఉంది) 

No comments:

Post a Comment

Pages