"మొక్కు"బడులు - అచ్చంగా తెలుగు

"మొక్కు"బడులు

Share This
 (జ)వరాలి కధలు - 22
"మొక్కు"బడులు 
 గొర్తి వేంకట సోమనాధశాస్త్రి(సోమసుధ)

"వచ్చేవారం మనం తిరుపతి వెడుతున్నాం" వరాలి ప్రకటనతో పేపరు చదువుతున్న నేను త్రుళ్ళిపడ్డాను. 
"తప్పదంటావా?" మెల్లిగా నసిగాను.
"నాలుగు నెలల క్రిందటి మొక్కండీ! ఆఫీసు పనులతో సతమతమవుతున్నారని యిన్నాళ్ళూ ఊరుకొన్నాను. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారుగా! అందుకే చెబుతున్నా!మరి వాయిదా వేయకండీ" అంటూ నా కళ్ళలోకి సూటిగా చూసింది.
ఆమె చూపులో తీక్షణతకి భయపడి తలవంచాను.
"నాకొక మాట చెప్పండి. మీరు నాస్తికులు కాదు. శ్రీనివాసుడే నా వెన్నుదన్ను అంటూంటారు. మరి గుడికి వెడదామంటే అలా చూస్తారేమిటి?"
"ఆలయాన్ని అభిమానించినా . . .ఎందుకో . . భక్తిని బజార్లో బాహాటంగా జరిపే బహిరంగ ప్రదర్సనలు చూస్తే నాకు చిర్రెత్తుతుంది. అందుకే. . ."
"అవన్నీ మీరెందుకు చూస్తారు? మనం ఆలయానికి వెడుతున్నాం. దైవదర్శనం చేసుకొంటాం. వస్తాం. అంతే! అజీర్తి చేస్తుందని అసలేమీ తినకుండా ఉండము కదా! ఇదీ అంతే! " వరాలు చెప్పింది నిజమే!
కానీ చుట్టుప్రక్కల జరిగే గొడవలను చూస్తూ ఎంతమంది నిగ్రహించుకోగలరు? దీన్ని అలుసుగా తీసుకొని మీ దేవుడేం చేయలేడా? అని కొంతమంది వ్యాఖ్యానిస్తారు. తప్పక చేస్తాడు. కొన్నాళ్ళు ఓపిగ్గా చూసి ఒకేసారి పెద్దశిక్ష వేస్తాడు.దాన్నెవరూ గమనించరు. అయినా దేవుడికి మనం ఒక్కళ్ళమే కాదుగదా! అందరికీ ముందు చిట్టాలు తయారుచేసి ఎవరికి ఏ సమయంలో ఎలాంటి శిక్ష వేయాలో నిర్ణయిస్తాడు. నాస్తికవాదమంటే కేవలం దేవుణ్ణి తిట్టటమే అన్న వికృత ఆలోచనలతో పేట్రేగిపోవటమేనా? దేవుడి పేరుతో సాటి మానవుడికి సాయపడమంటుంది నిజమైన నాస్తికవాదం.
బుర్రలోకి బలవంతంగా చొచ్చుకొచ్చే ఆలోచనలను దులిపేశాను.
"మొక్కు అంటున్నావు! దేనికోసం?" కుతూహలంగా అడిగాను. 
"మీ ఆఫీసరుకి బదిలీ అయితే వస్తానని మొక్కుకున్నానండీ!" వరాలి జవాబుకు తల తిరిగింది.
"క్రిందటేడంతా చెప్పుడుమాటలు విని మిమ్మల్ని నిత్యం చీవాట్లేసే ఆఫీసరు గురించి చెబుతుండేవారు. గుర్తుందా? దానితో మీరు ప్రతిరోజు చెదరిన మనసుతో యింటికొచ్చే మిమ్మల్ని చూసి చాలా భయమేసేది. ఆ దేవుడి దయవల్ల కొత్త ఆఫీసరు వచ్చాక మీ మొహంలో చిరునవ్వు చూస్తున్నాను. మరి ఆ మొక్కు తీర్చుకోవాలి కద!" మరి నేను మాట్లాడలెదు.
అక్కడకు వెళ్ళటానికి కావలసిన రైలు టిక్కెట్లు, కొండపై ఉండటానికి కావలసిన రూం బుకింగ్ లాంటి పనులన్నీ ముగించి, అనుకున్న రోజుకి తిరుపతికి రైలులో బయల్దేరాం. వరాలు సాటి ప్రయాణికులతో ముచ్చట్లు పెడుతూంటే నేను పై బెర్తు ఎక్కి పడుకున్నాను.
మెలకువ వచ్చేసరికి టకటక అని దరువులు వేస్తున్నట్లు శబ్దం వినిపిస్తోంది. వెంటనే క్రిందకి దిగి వరాలు ప్రక్కన చదికిలబడ్డాను. రైలు నదిమీది వంతెన మీద పోతోంది. అందుకే ఆ లయాత్మకమైన శబ్దం. వరాలు మా సీట్లకి అవతలప్రక్క కూర్చున్న ముసలావిడను గమనిస్తోంది. ఆమె తన మనవళ్ళకు రూపాయి బిళ్ళలు యిచ్చి నదిలో వేయమని చెబుతోంది. వాళ్ళను చూసి వరాలు నవ్వుతూంటే విషయం అడిగాను.
"వాళ్ళు చేస్తున్న పని చూస్తే నవ్వు వచ్చింది" అంది.
"వాళ్ళేం తప్పేమీ చేయటం లేదే? నదిలో నాణాలు వేస్తున్నారు. దానివల్ల పుణ్యం వస్తుందని చేస్తున్నారు" అన్నాను.
"అలా మన పెద్దలు నదిలో నాణాలేయమన్నది యీ నికెల్ నాణాలను కాదు. దేశంలో పారిశ్రామిక విజృంభణ లేని రోజుల్లో జనమంతా త్రాగేది యీ నదుల్లో నీరే! ఇవి పుట్టిన ప్రాంతం నుంచి సముద్రంలో కలిసే ప్రాంతం మధ్యలో కొన్ని వందల కిలోమీటర్లు ప్రవహిస్తాయి. ఆ రోజుల్లో దేశంలో ఎక్కువగా రాగినాణాలు చలామణీలో ఉండేవి. రాగి కలిసిన నీళ్ళు ఆరోగ్యానికి మంచిది. అందుకే రాగి చెంబులోనో, రాగిపాత్రలోనో రాత్రంతా నిలవ ఉన్న నీటిని ఉదయం లేవగానే త్రాగాలనేవారు. రాగి వల్ల నీటిలో రోగక్రిములు పెరుగవు. అదే సూత్రాన్ని తీసుకొని పారే నదిలో రాగి నాణాలను వేస్తే కాలక్రమేణా ఆ రాగి నదినీటిలో మిళితమై దాన్ని పరిశుభ్రపరిచి, ఆ నదీపరివాహకప్రాంతంలో ఎవరు ఆ నీటిని త్రాగినా అనారోగ్యం పాలు చేయదని మన పూర్వీకులు నిర్ధారించారు. ఆ మామ్మగారి చిన్నతనంలో రాగినాణాలుండేవి గనుక వాటిని నదిలో వేయటం ఆవిడకు అలవాటయింది. కానీ ప్రస్తుతం ఉన్న యీ నికెల్ నాణాలవల్ల నదినీరు శుభ్రపడే ఆస్కారమే లేదు. అందువల్ల వేసినా ఫలితం ఉండదు"
" ఈ విషయం నీకు తెలుసు గానీ ఆవిడకి తెలియదుగా! మన దేశంలో అక్షరాస్యత తక్కువ గనుక యిలాంటి వివరాలు మన పూర్వీకులు ప్రజలకు విపులంగా తెలియపరచలేదు. దానివల్ల బూర్జువా మేధావులు జనవిజ్ఞానమంటూ మన సంప్రదాయాలను ఎద్దేవా చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏ అమెరికావాడో చెబితే అప్పుడు మన మేధావులు నమ్ముతారు. ఏం చేస్తాం?" అన్నాను.
మొత్తానికి రైలు తిరుపతి చేరుకోగానే జనమంతా రైల్వే కాంటినుపై పడ్డారు.
మేము కూడా నలుగురితో పాటు కాస్త తిని కొండమీదకి వెళ్ళే బస్సుని పట్టుకున్నాం. ఎంత ఉదయాన్నే వెళ్ళే బస్సయినా భారతదేశంలా జనాలతో కిక్కిరిసి ఉంది. అదృష్టవశాత్తూ వరాలికి సీటు దొరికి కూర్చుంది. ఆమె యిరుక్కొని కూర్చుంటూ నన్ను పిలిచింది. కానీ అలా కూర్చుని వరాలి ప్రక్కన కూర్చున్న ఆమెను యిబ్బంది పెట్టడం యిష్టంలేక నిలబడే వెళ్ళాలని నిశ్చయించుకొన్నాను. బస్సు వెడుతూంటే జనాలంతా తమ కుటుంబ రహస్యాలను బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇదే సందట్లో చూపుల బాణాలు వేసుకొనే కుర్రజంటలు. ఇవన్నీ చూసి ఆనందించే ఓపిక లేక కళ్ళు మూసుకొని నా ఊహల్లోకి వెళ్ళిపోయాను.
పూర్వం రాజులు తమ కోటలలాగే చాలా దేవాలయాలను శత్రువుల బారిన పడకూడదనే తలంపుతో కొండలపై కట్టించారు. ముఖ్యంగా దక్షిణాదిన స్థానికరాజుల పోరాటాలు ఎక్కువగా ఉండేవి. అందులోనూ కృష్ణా గోదావరీ నదుల సంగమప్రాంతమైన యీ తెలుగునేలమీద ఆధిపత్యపోరులు బాగా జరిగేవి. ఆ కాలంలో రాజులకు ధర్మచింతన కన్నా దోపిడీ మనస్థత్వాలెక్కువ ఉండేవి. బంగారునేల వంటి భారతదేశంలో ఎక్కువశాతం పసిడిసంపద ఆలయాలలోనే ఉంటుంది. యుద్ధంలో ఆ ప్రాంతాన్ని గెలుచుకొన్న శత్రురాజులు మొదటగా చూసేది యీ ఆలయాలలోని సంపదను లూటీ చేయటమే! అందుకే ఈ ఆలయాలపై శత్రురాజుల దాడిని నివారించటం కోసం స్థానిక రాజులు దేవలయాలను ఎత్తైన కొండప్రాంతాలపై కట్టించేవారు. ఈ దేవాలయాల నిర్మాణంలో తమ కీర్తిప్రతిష్టలు పదికాలాలు నిలబడాలని చాలా శ్రద్ధతో, పురాణేతిహాసాలను శిల్పాలుగా ఆలయప్రాంగణాన విరాజిల్లేలా చెక్కించేవారు. నిజానికి దేవాలయం హిందూమతానికి చెందిన ప్రార్ధనామందిరం మాత్రమే కాదు, ఎంతో మందికి జీవనోపాధిని చూపించే ఒక వ్యవస్థ. దేవాలయాల్లో పూజారులే కాదు, ఆలయప్రాంగణంలో భక్తుల దయతో బ్రతికే యాచకులు, పూలు పళ్ళు అమ్మే ఎన్నో దుకాణాలు, ఆలయానికి ప్రజలను చేరవేసే రవాణా వ్యవస్థ, ఆ దేవునిపై సాహిత్యాన్ని వెలయించే కవులు, వారి గీతాలను గానం చేసి బ్రతికేవారు, ఆలయాల సక్రమనిర్వహణకు ఏర్పడ్డ పాలనావ్యవస్థ, సాంకేతిక అభివృద్ధి చెందిన యీ రోజుల్లో గతంలో ప్రముఖకవులు వెలయించిన సాహిత్యాన్ని పుస్తకాలుగా ముద్రించే ప్రెస్ లు, వివిధ గాయకులు, వారు గానం చేసిన వాటిని ధ్వనిముద్రణ చేసే రికార్డింగ్ కంపెనీలు. . . యెంతోమందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను జీవనోపాధిని కలిపిస్తున్నాయి. దైవదర్శనంకోసం వచ్చే భక్తులలో ప్రణాళికాబద్ధమైన ఆరోగ్యపు అలవాట్లను యీ గుళ్ళు నేర్పుతాయి. ఉదయాన్నే పరిశుభ్రంగా స్నానం చేసి రోగక్రిములను మోసుకొచ్చే పాదరక్షలను విడచి ఆలయప్రవేశం చేస్తారు. పండుగదినాల్లో రధయాత్రల పేరుతో అనేక జాతుల, మనస్తత్వాల మనుషులంతా ఒకే త్రాటిపైకి వస్తారు. ఆలయాలలో మ్రోగే జేగంటలు సృష్టించే శబ్దం మనుషులలో ఉన్న చింతలను చెదరగొట్టి ఏకాగ్రతను కలిగిస్తాయి. అంతేగాక ఆ శబ్దతరంగాలు శరీరంలో పుట్టించే ప్రకంపనలద్వారా లోపల రక్తనాళాలలో ఏర్పడే చిన్నచిన్న అవరోధాలు తొలగిపోతాయి. మన పూర్వీకులు యిలా ఈ ఆలయవ్యవస్థను ఉపాధికల్పనకు, సామాజిక ఐక్యతకు, శారీరక బాధల నివారణకు అనుకూలంగా రూపొందించారు. కానీ మత్తుపానీయాలతో బాధలను మరిచిపోవాలనే మన తరానికి దైవదర్శనం ఒక ఫాషనుగా మారింది. తమ ఆర్ధిక, అధికార స్థోమతులను,అందచందాలను చాటుకొనే ప్రదర్శానాకేంద్రాలుగా మార్చేస్తున్నారు. ఆలయాలను మన ప్రభుత్వాలు ఆదాయవనరులుగా మాత్రమే చూసి, పనిలేని తమ పార్టీపెద్దలను యీ పాలకమండళ్ళలో ఉన్నతపీఠాన కూర్చోపెడుతున్నారు. వారిలో ఆలయాల ఆదాయాన్ని దోచుకొనే పనే తప్ప వాటి అభివృద్ధికి చర్యలను తీసుకొనే దిక్కుగా ఆలోచించటంలేదు. ముఖ్యంగా హిందూమతసంప్రదాయాలపై శ్రద్ధ ఉన్న వారికి గాక యితరమతాలకు మారినవారి చేతుల్లో వీటిని పెట్టి, లౌకికవాదం పేరుతో పవిత్రమైన ఆలయవ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు. ఈ కుహనాపాలకులపై తిరుగుబాటు చేసి భక్తులు యీ వ్యవస్థను బ్రతికించుకోవాలి.
"ఏమండోయి! ఏమిటి? నిలబడే నిద్రపోతున్నారా? కొండమీదకి వచ్చేశాం. దిగండి" అంటూ వరాలు కుదపటంతో యిహంలో పడి బస్సు దిగాను. కొండపై గదులను అద్దెకిచ్చే కార్యాలయానికెళ్ళి ఆన్ లైనులో నేను చేసుకొన్న బుకింగుని చూపించి, తాళాలు తీసుకొని గదిలోకి అడుగుపెట్టాం. కోనేరుకి కొంచెం దూరంలో గది దొరకటంతో ఆలయం నుంచి వినపడే మంత్రోచ్ఛారణలు, భక్తిగీతాలు మనసుకి హాయిని గొల్పుతున్నాయి. ఉన్నట్లుండి నాలో కవిగాడు నిద్రలేచాడు. వరాలు బాత్రూంలో దూరటం చూసి, నేను దొంగతనంగా తెచ్చుకొన్న డైరీ తీసి గబగబా నాలుగు వాక్యాలు గీకి పారేశాను. 
ఎంత కరుణ చూపావు వేంకటేశ్వరా! చింతలున్న దేహంలోన యింత బుద్ధి నింపినావా? మనిషికి, యితర జీవుల మాదిరే కష్టాలు కన్నీళ్ళూ ఉన్నాయి. ఒళ్ళంతా రోగాలతో కుళ్ళిపోతుంది. కానీ అదే ఒంట్లో యీ లోకాన్ని బాగుచేయాలన్నా, నాశనం చేయాలన్నా తెలివిని కూడా పెట్టాడు. ఎంతైనా ఆ దేవుడు మహనీయుడే! 
వరాలి అలికిడి విని పుస్తకం కట్టి పడేసి అద్దం ముందు జుట్టుని సవరించుకుంటున్నట్లు నటించాను.
" ఆ సవరణలు తరువాత. . .ముందు కాలకృత్యాలు తీర్చుకొని త్వరగా తయారవండి. ఆలయం దగ్గర జనాలెక్కువ లేనట్లుంది. త్వరగా దర్శనం చేసుకొని వచ్చేస్తే, యీ చుట్టుప్రక్కల చూడాల్సినవి చాలా ఉన్నాయి" ఉత్తర్వులు జారీ చేసింది.
"ముందు నువ్వు తెమలవోయి! నాదెంత? అయిదు నిమిషాలు" అంటున్న నన్ను అదోలా చూసి నోట్లో బ్రష్ పడేసుకొని, కొన్ని బట్తలతో బాత్రూంలో దూరింది. 
వెంటనే పరుగులాంటి నడకతో పెట్టె వద్దకెళ్ళి పుస్తకం తీసి నాలో తన్నుకొస్తున్న భావాలను కాగితంపై కక్కేశాను. తను స్నానం కూడా ముగించి ముస్తాబై వచ్చి నన్ను తొందరపెట్టింది. 
"ఆలయం ఎదురుగా యీ గదిని చూస్తుంటే యిక్కడే ఉండిపోవాలని ఉందోయి" అన్నాను.
"ఉంటుంది. వెనకటికి యిక్కడికి దగ్గరే. . .యిద్దరు అన్నదమ్ములు వేటకి వెళ్ళి, అక్కడ వేటకుక్కలను తరుముతున్న కుందేళ్ళను చూసి, 'యీ ప్రాంతమేదో వీరత్వానికి ప్రతీకగా ఉందే! యిక్కడే రాజధాని కట్టేసుకుందాం' అని అక్కడే రాజధాని కట్టుకొని ఉండిపోయారట! ఆ కాలం వేరు, ఆ ప్రాంతం వేరు, వాళ్ళ స్థాయి వేరు. ఇది తిరుపతి దేవస్థానం వారి గది. రెండు, మూడు రోజులు అడగరు, తరువాత మన జాగాలో ఎవరికో గది కేటాయిస్తారు. వాళ్ళొచ్చి మన సామాను బయటపడేస్తారు. ఈ బద్ధకం కబుర్లాపి త్వరగా తెమలండి" వరాలు ఉత్తర్వు వేయటంతో కదలక తప్పలేదు. ఒక గంటలో మేమిద్దరం స్పెషల్ దర్శనం క్యూలోనుంచి వచ్చి సాధారణక్యూలో కలిసిపోయాం. జనం రద్దీ లేనందువల్ల చాలా వేగంగా క్యూ కదులుతోంది. ఉన్నట్లుండి పావుగంటసేపు క్యూ ఆగిపోయింది. వెనకనుంచి జనాల అరుపులు ఎక్కువయ్యాయి. 
"భగవాన్! నీ దర్శనం కోసం రెండు నెలల ముందునుంచి ప్రణాళిక వేసుకుంటాడు. నిన్ను చూసే పది సెకనుల సమయం కోసం ఎన్నో వ్యయప్రయాసలు పడి యిక్కడదాక వస్తాడు. అలాంటి భక్తుడు కొద్ది క్షణాలు నీ ధ్యానం చేస్తూ కాలక్షేపం చేయొచ్చుగా! కాదు. నీ సన్నిధిలో ఉన్న అనుభూతి పొందొచ్చుగా! దానికి మాత్రం వీలు లేదు. ఎంత త్వరగా నీ దర్శనం చేసుకొని యిక్కడనుంచి బయటపడాలా అనే ఆత్రుత. తమ మొక్కుబడులను తీర్చుకోవటానికి వచ్చే వాళ్ళు నీ దర్శనాన్ని కూడా మనస్ఫూర్తిగా గాక మొక్కుబడిగా ఆశిస్తున్నారయ్యా!" మూలుగుతున్న మనసుని చావగొట్టి భగవద్ధ్యానంలో పడ్డాను. క్యూ కదలకపోవటానికి కారణం ఆనోటా, ఆనోటా ప్రాకి నా చెవుల్లో దూరింది.
"ఎవడో పారిశ్రామికవేత్త వచ్చాట్ట. అందుకే మనల్ని ఆపేశారు" వరాలు వెనక్కి తిరిగి నాకు చెప్పింది.
"జనాల్లేరు. తొరగా సూడొచ్చనుకున్నా! ఈడెవడో వచ్చి మన టైం తినేత్తుండాడు. అయినా యిది పెజాసామ్యం గందా! అలా పెద్దోళ్ళను మనకన్నా ముందెట్టా వదిలేత్తారు?" వెనకాల పల్లెటూరి ఆసామి వీరంగం మొదలెట్టాడు.
"ఊరుకోవయ్యా? మీ ఊళ్ళో గుడి కడతాను, చందా యివ్వవయ్యా అంటే ఆ దేవస్థానానికి వ్రాయి, యీ దేవస్థానానికి వ్రాయి అని ప్రక్కకు తప్పుకొంటావు. అలాంటివాటికి ముందుకొచ్చి సాయపడేది యిలాంటి డబ్బున్నవాళ్ళే! అందుకే వాళ్ళకు అర్చకులు ఆ రాచమర్యాదలు చేస్తారు. నువ్వే అలాంటి కొంపలో పుట్టుంటే మాలాంటివాళ్ళు తిట్టుకొంటున్నా నువ్వూ తిన్నగా గుళ్ళోకి దూరిపోయేవాడివికదా!" ప్రక్కనున్న లాజిక్కురాయుడు తగులుకున్నాడు.
"ఏంది పెద్దమాటలు మాట్టాడుతుండావ్?" అని అతను గొంతు పెంచగానే నేను కలగజేసుకొని ఆ ముసలాయన్ని సముదాయించాను. 
"చూడు పెద్దాయనా! మీలాంటి వాళ్ళెందరినో యిబ్బంది పెట్టి ముందుగా దర్శనం చేసుకొనే వాళ్ళకు మీ ఉసురు తగలదంటావా? అదంతా ఆ స్వామే చూసుకుంటాడు" అని అతన్ని ఊరుకోబెడుతూ ఆ లాజికాగ్రేసరుణ్ణి ఆగమన్నట్లు సైగ చేశాను. 
సుమారు గంటలో అవుతుందనుకొన్న దర్శనానికి రెండు గంటలు పట్టింది. దర్శనం అయ్యాక లడ్డులు కొనుక్కొని మాకిచ్చిన గది వైపు వెడుతుండగా కొంచెం దూరంలో ఏదో గొడవ జరుగుతున్నట్లయి వెనక్కి చూశాం. ఇందాకటి పెద్దాయన లడ్డులు కొని నడిచివెడుతూంటే ఎవరో కెమెరా పట్టుకున్న అతను పరిగెడుతూ యితన్ని డీకొట్టడంతో అతని చేతిలో ప్రసాదం నేలపాలయింది. వెంటనే ఆ కెమెరావాడి చొక్కాని వెనకనుంచి గట్టిగా పట్టి గుంజటంతో అతను వెల్లకిలా పడ్డాడు. అతను లేచి ముసలాయనపై తిరగబడటంతో జనం గుమికూడారు. అక్కడే ఆలయ భద్రత కోసం ఉన్న పోలీసు యీ గుంపుని చూసి అక్కడకొచ్చాడు. ఇది చూసి వరాలు అక్కడికి వెళ్ళటంతో ఆమెను అనుసరించక తప్పలేదు. 
"పద పోలీసు స్టేషనుకి" అంటూ ఆ ముసలాయన చెయ్యి పట్టుకున్నాడు పోలీసు.
"ఎందుకు రావాలి?" వరాలి ప్రశ్నకు నాకే కాళ్ళు వణికాయి.
"అదికాదమ్మా! కెమెరామెన్ ని అతను పట్టి గుంజటం వల్ల కెమెరా కొద్దిగా దెబ్బ తింది"
"మరి అతను పరుగున వచ్చి యితన్ని తోసేస్తే దేవుడి ప్రసాదం నేలపాలైంది."
"దాని ఖరీదుకి దీని ఖరీదుకి తేడా లేదా?"
" ఒక వస్తువు ఖరీదుని డబ్బుతో లెక్కగడతారా? మీ దృష్టిలో అవి లడ్డులే కావచ్చు. కానీ భగవంతుడి ప్రసాదంగా యీ పెద్దాయనకి అవి కోట్లతో సమానం. అయినా అతను రోజుకూలీ చేసి సంపాదించిన కష్టార్జితంలో దాచుకొన్న డబ్బండీ! దానికి నష్టపరిహారం కట్టగలరా?" 
"ఏమయ్యా! అతనికి అయిదు లడ్డులు కొని యివ్వవయ్యా! అతను నీకు కెమెరా కొని యిస్తాడు"
" సార్! మీకు ముందే చెప్పాను. అది కేవలం లడ్డు మాత్రమే కాదు. మా స్వామికి నైవేద్యం పెట్టిన ప్రసాదం. అది నేలపాలైతే మాకు ప్రాణం పోయినట్లు ఉంటుంది. అతను పరిగెత్తుకొని వచ్చి యితన్ని తోసేయవలసిన అవసరం ఏమొచ్చింది?" 
"ఏంటమ్మా! పెద్ద మాట్లాడుతావ్? ఆ పారిశ్రామికవేత్తను ఇంటర్వ్యూ చేద్దామని వెడుతూంటే యితను అడ్డువచ్చాడు" 
"సినిమావాళ్ళు, పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకుల వెంటపడి మీ టి.వి. ఛానల్స్ చేసే ఇంటర్వ్యూలేమిటి? మీరే సినిమాల్లో నటించబోతున్నారు? మీరు యిక్కడే ఫాక్టరీ పెట్టబోతున్నారు? ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న కులఘర్షణలపై మీ అభిప్రాయం ఏమిటి? యివేగా! ఈ చొల్లు ప్రశ్నలకు వాళ్ళేదో జవాబు చెబుతారు. అదేదో ఒక వర్గాన్ని కించపరిచే మాటైతే వెంటనే యీ కొండప్రాంతం ఒక రణరంగంగా మారుతుంది. ఒక అయిదు నిమిషాల న్యూస్ కోసం యిక్కడ హడావిడి చేయాలా?్ మీకు యిక్కడకి వచ్చే సెలిబ్రిటీల యోగక్షేమాలు విచారించాలంటే కొండక్రింద అలిపిరి గేటు వద్ద మాటు వేసి పట్టుకొని మీ ప్రశ్నలు అడగండి. అంతేగానీ మనలాంటి సాధారణ మనుషులైన వాళ్ళకి యిక్కడ విలువను పెంచి, వాళ్ళను అహంకారులను చేయకండి. ఈ కొండ మీద పెద్దాయన ఒక్కడే! అదే మా వెంకన్నబాబు. మీరు యిక్కడ షూటింగు చేయాల్సి వస్తే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలను మాత్రమే చిత్రీకరించండి. కానీ వ్యక్తిపూజ యింటర్వ్యూలు కాదు. పాపం వాళ్ళు కూడా వాళ్ళ రంగాల్లో అలిసిపోయి దైవదర్శనంతో సేద తీరాలని వస్తారు. మీరు వారి వెంటపడటం వల్ల ఆ వెంకన్న కన్న తామే గొప్పవాళ్ళమనే అహం వాళ్లలో పెరుగుతుంది. ఇలాంటి అహంకారాలవల్ల ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది. మీ కెమెరామెన్ల ముసుగులో దుండగులు కూడా చొరబడే వీలుంటుంది. గతంలో యిరురాష్ట్రాల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు మీ టి.వి.ఛానల్స్ వాళ్ళు ఒక రాజకీయనాయకుణ్ణి యింటర్వ్యూ చేశారు. ఆయన యిక్కడ ప్రజలను కించపరుస్తూ మాటలన్నాడు. ఆ మాటలకు యిక్కడి జనం రెచ్చిపోయి అతనిపై దాడి చేయాలన్నంతవరకూ వెళ్ళారు. గుర్తుందా? మీ పిచ్చి యింటర్వ్యూలవల్ల యీ కొండమీద రక్తాలు ఏరులై పారొచ్చు. అందుకే మీరంతా యిక్కడ దుకాణాలు మూసేసి అలిపిరి గేటువద్ద డేరాలు వేసుకొని యింటర్వ్యూలు చేసుకొండి. ఏమండీ! యిక్కడ గొడవలు జరక్కుండా ఆపే బాధ్యత మీకు లేదా? ఇకనైనా యీ కొండపై యీ వ్యక్తిగత యింటర్వ్యూలు, భజనలు మీరు ఆపలేరా?" వరాలు దులిపేస్తూంటే ఆమెకు సాయంగా మరికొంతమంది భక్తులు రంగంలోకి దిగారు. 
అదేసమయంలో మాముందునుంచి ఒక గుంపు ఊరేగింపుగా ఆలయంలోపలికి వెళ్తున్నారు. ఆ గుంపు మధ్యలో ఒక నాయకుడు, అతనికి జయధ్వానాలు చేస్తూ అతని భట్రాజులు వెళ్తున్నారు.
"ఏమండీ పోలీసుగారూ! ఈ కొండమీద కీర్తించవలసినది గోవిందుణ్ణే తప్ప యిలా మరొకరికి జయధ్వానాలు చేయవచ్చా? " వరాలి ప్రశ్నకు బదులీయలేక పోలీసు తప్పుకొన్నాడు. 
"పదండమ్మా! ఆఫీసులో కంప్లయింటు యిద్దాం" అన్నాడొకడు.
"ఏమని యిస్తాం? ఏం జరిగిందని యిస్తాం? ఏమన్నా అంటే మనది ప్రజాస్వామ్యం. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు అంటారు. లౌకికవాదం పేరుతో పరమతసహనం మంచిదే! అలాగని మన హిందూతత్వాన్ని సమాధి చేయాల్సిన అవసరం లేదే! రోడ్ల వెడల్పుకోసం పురాతన ఆలయాలను కూలగొడతారు. దానిపై మన స్పందన ఉండదు. ఈ అలుసు చూసుకొనే రాజకీయనాయకులు దేశంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారి కొమ్ము కాస్తున్నారు. మనలో తిరుగుబాటు వస్తే తప్ప యీ ఆలయాలను పరిరక్షించలేము. ఇవి కేవలం ఆలయాలే కాదు. ఎంతోమందికి జీవనోపాధిని చూపే కర్మాగారాలు. వాటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. ముఖ్యంగా యీ కొండపై పవిత్రతను కాపాడాలంటే యీ వార్తాఛానళ్ళను యిక్కడనుంచి నిషేధించాలి. మన సంప్రదాయాలపై వాళ్ళు జరిపే చర్చాకార్యక్రమాలకు ఎవరూ హాజరు కాకూడదు. అలాంటి ఛానల్సును మనమే బహిష్కరించాలి. జరుగుబాటు కావాలంటే తిరుగుబాటు తప్పదు" వరాలి వాగ్ధాటికి అక్కడ జనాలు చూస్తూ ఉండిపోయారు. తన చేతిలోని ప్రసాదాల పాకెట్టుని ఆ పల్లెటూరి అతనికి యిచ్చేసింది. నేను వెళ్ళి మాకోసం మళ్ళీ ప్రసాదాన్ని కొని తెచ్చాను.
" వరాలూ! నీలో యింత ఉద్వేగం ఉందని యిప్పుడే చూశాను" గదికి వచ్చాక వరాల్ని మెచ్చుకొంటూ అన్నాను.
"ఉద్వేగం కాదండీ! ఆవేదన. మన మొక్కుబడులను తీర్చుకొందుకు యీ గుడులకు వస్తాం. కానీ యిక్కడ జరిగే సంఘటనలు మనకు దేవాలయాలపై గౌరవం నశించిపోయేలా చేస్తున్నాయి. వీటిపై జరిగే దాడులను మనం ఆపలేమా?" ఆమె గొంతు వణికింది.
"ఆలయాలపై యీ దాడులు కొన్ని వందల సంవత్సరాలనుంచి జరుగుతున్నదే! అయినా అవి తలను గర్వంగా ఎగరేసి నిలబడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ భగవంతుడే తన ఉనికిని కాపాడుకొంటూ యిన్నేళ్ళుగా నిలద్రొక్కుకోగలిగాడు. నేను రానంటే నువ్వే అన్నావు"మనదృష్టి అంతా గుడిలో దేవుడిపైనే తప్ప గుడిప్రాంగణంలో జరిగే దౌర్జన్యాలపై పెట్టకూడదని. అలా కూర్చున్నావేంటి? లే! మనం చూడవలసినవి చాలా ఉన్నాయి" తొందరచేశాను. 
" ఈ రోజు యిక్కడే ఉండిపోదామండీ! సాయంత్రం మరొకసారి స్వామి దర్శనం చేసుకొందాం" అంటున్న వరాల్ని చూసి జాలి వేసింది. 
"సరే! ఇందాక జరిగిన దానిపై నీ మనసు గాయపడినట్లుంది. దాన్ని మనసులోంచి దులిపేయి" అంటు ఆమెను ఓదార్చాను.
"ఎంతమంది క్షుద్రమానవులు ప్రయత్నించినా మనదేశంలో ఆలయాలకు, ఆడవాళ్ళకు మధ్య ఉన్న అనుబంధాన్ని నిర్మూలించలేరు. ప్రతి యింట్లో ఉదయం లేవగానే దేవుడిపటం ముందు దీపాన్ని వెలిగించేది ఆ యింటియిల్లాలే! ఇన్ని సంవత్సరాలుగా మన సంప్రదాయాలకు రక్షకులుగా నిలబడేది వారే! ఇది మొక్కుబడి మాట కాదు. నగ్నసత్యం" నాలో భావనను సమర్ధిస్తున్నట్లుగా దూరంగా గుడిలో గంట ఠంగున మ్రోగింది.

No comments:

Post a Comment

Pages