బుద్ధి నాశాత్ ప్రణశ్యతి - అచ్చంగా తెలుగు

బుద్ధి నాశాత్ ప్రణశ్యతి

Share This
బుద్ధి నాశాత్ ప్రణశ్యతి 
మినీకథా చక్రవర్తి కె.బి.కృష్ణ.

ఉన్న పళంగా విజయవాడ వెళ్ళాల్సి రావడం తో ఆర్.టి.సి బస్ లో ప్రయాణమయ్యాను శ్రీమతి తో సాయంత్రం ఆరు గంటలవుతోంది. 
కాకినాడ పొలిమేరలు దాటి, రైసుమిల్లులు, కారు షోరూములూ నిండి ఉన్న తూరంగి గ్రామం మీదుగా వెళ్తున్నాం. ఎటుచూసినా పచ్చని వరి చేలు, చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, నడకుదురు దాటేక మరి ప్రకృతి ఇంకా రమణీయం గా ఉంటుంది. బస్ బయలుదేరి ఇంకా గంట కూడా కాలేదు. కొంత మంది నిద్రలో జోగుతున్నారు, బస్ కదిలితే చాలు జోల పాట పాడినట్లు గా చాలా మంది బస్సుల్లో నిద్రపోతారు అదేమిటో, బస్ లో ఎంత రణగొణ ధ్వని ఉన్నా వారి ఏమీ పట్టదు. 
సూర్యాస్తమయం అయ్యే సమయం, ఆహ్లాదకరంగా ఉంది ప్రకృతి, పంట కాలువలూ కొబ్బరి చెట్లూ, వాటి మీదుగా వచ్చే చల్లని మలయమారుతం. 
బస్ రామచంద్రపురం దాటింది, రోడ్ కి ఒక ప్రక్కనపంటకాలువ, మరో ప్రక్కన ఒక గ్రామం, గుబురుగా పెరిగిన రోడ్ కి రెండు వేపులా చెట్ల, సుందరమైన దృశ్యం. 
ఇంతలో సడన్ బ్రేక్ తో బస్ ఆగింది. లేచి చూద్దును గదా, రోడ్ కి అడ్డంగా ఒకతను నిలబడి బస్ ఆపేడు. బస్ ఆగిన చోట పగడపు రంగులో నిగనిగా మెరిసిపోతున్న ఒక ఓడలాంటి కారు ఆగి ఉంది. దాని ప్రక్కనే నిలబడి ఉంది ఒక సితార లాంటి స్త్రీ.
బస్ డైవర్ కోపం తో " ఏంటయ్యా నీకు తెలియదా, ఇది సూపర్ లగ్జరీ బస్ ఎక్కడ పడితే అక్కడ ఆగదు. పైగా బస్ కి అడ్డం గా నిలబడి పోయావ్ నీకు ఏదైనా అయితే నా కొంప ములుగుతుంది, నాకు బ్రేక్ పడలేదనుకో. సరే ఏంటి నీ గోల ? " అన్నాడుడైవర్.
" మా అమ్మగారు అర్జెంటుగా విజయవాడ ఎల్లాల. మా కారు ఈడ ఆగిపోయింది. కొంచం రావులపాలెం దాకా తీసుకెళ్ళారంటే ఆడికి ఇంకో కారు వస్తుంది. అయ్యగారూ క్షమించండి బాబో, అమ్మగారు తమరికి తెలుసునుబాబో " అంటున్నాడు అతను దీనంగా.
" సరే టికెట్ ఎలాగా ?ఈ బస్ కి రావులపాలెం దాకా హాల్డ్ లేనేలేదు. సరే ఏదో పాటు పడతానే, ఎక్కమను అమ్మగారిని " అన్నాడు. 
ఆమె బస్ ఎక్కింది. ఆమె ఆ ఏరియాలో రాజకీయప్రముఖుని భార్య. 
తళుక్కుమని బస్ లో ఒక మెరుపు మెరిసింది--- 
అంతకు ముందే బస్ లో వెలిగిన ట్యూబ్ లైట్ల కాంతి, ఆమె శరీర కాంతి ముందు వెల వెలబోతోంది. సుమారు ఆరు అడుగుల ఎత్తు ఉంటుందేమో, ఏమిటో మిల్క్ బ్యూటీ అంటుంటారు సినీతారలను, కాని ఈమె నిజంగా మిల్క్ బ్యూటీనే ! ఎటువంటి మేకప్ లేదు, తీర్చి దిద్ది నట్లు గా ఉండే ఆమె కను, ముక్కు, బుగ్గలూ, బుల్లి గెడ్డం, మెరిసిపోయే శరీర కాంతి, పొడవైన శరీరానికి తగినట్లు గా బొద్దుగా శరీర నిర్మాణం. ఆమె శరీర నిగారింపు కి తగినట్లు గా కనకాంబరపు రంగు ఫ్యాన్సీ చీర అదేరంగు జాకెట్ ధరించింది. తెల్లని తెలుపు రంగు లో ఉండే స్త్రీలు అందరూ లేత రంగుల చీరలే కడుతుంటారు అదేమిటో ! చేతులకు నిండుగా బంగారు గాజులు మెడలో ఆరు పేటల చంద్రహారం, ఆమె శరీరకాంతి ముందు వెలవెల బోతున్నాయి. ఆమెనిలబడే ఉంది. దానితో బస్ లోని వారందరూ ఆమెను నఖశిఖ పర్యంతమూ కనురెప్ప వేయకుండా చూసేస్తున్నారు. ఆమె ఈ చూపుల దాడి తట్టుకోలేక చాలా ఇబ్బందిగా నిలబడి ఉంది. ఓహ్, ఏమి అందం ? విశ్వామిత్రుణ్ణి కూడా మతి భ్రమింపచేసే సౌందర్యం, రంభ, ఊర్వశి, మేనకలను ఎవరు చూశారు? కాని ఈమె రంభలా ఉంది.
నేనూ నా శ్రీమతీ డ్రైవరు వెనకాల మూడో సీటు లో కూర్చున్నాం. మా ముందు ముగ్గురు కూర్చునే సీటులో ఇద్దరు మహిళలు విశాలంగా కూర్చుని ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కూర్చున్నట్లు గా కూర్చున్నారు, ఎవరు బస్ ఎక్కినా మనిషి ఉన్నారండీ అని చెబుతూనే ఉన్నారు. కొంతమంది అంతే విశాలంగా కూర్చోవాలని అలా అబద్దాలు చెబుతారు. నేను వెంటనే " అమ్మా సీటు లో ఒకరికి జాగా ఉంది కదా, ఆమెను కూర్చోనియ్యండి " అనగానే ఇద్దరూ సర్దుకుని ఆమెను కూర్చోమన్నారు. బస్ లో అందరూ అదే పని గా ఆమెను చూస్తూనే ఉన్నారు. అంత ఉజ్వలం గా మెరిసిపోతోంది ఆమె. 
ముగ్గురు కూర్చునే మా సీటులో మా ప్రక్కనే ఒక ముసలామె కూర్చుని ఉంది. మా ఎడమ ప్రక్కన ఇద్దరు కూర్చునే సీటులో ఇద్దరు మగవాళ్ళుకూర్చుని ఉన్నారు. ఆ ఇద్దరి లో ఒక వ్యక్తి బాగా పొడవుగా బలిష్టం గా, చక్కని గిరజాలజుటు తో ఉన్నాడు. బస్ లో ఆమె ప్రవేశించడం ఆలస్యం, అతను సీట్లో కుదురుగా కూర్చోవడం లేదు. తన రెండు ప్లస్ రెండు కళ్ళు ఆమె వేపే అప్పగించేసి చూసేస్తున్నాడు. అతనికి బస్ లో పరిసరాలతో సంబంధం ఉన్నట్లుగా అనిపించలేదు నాకు. ఒక్కోసారి సీటు లోంచి లేవబోతున్నాడు. మళ్ళీ కూర్చుంటున్నాడు. అతని ధోరణి, ప్రవర్తన చాలా చిరాకు గా, చిత్రం గా అనిపిస్తోంది.
అతను సరిగ్గా నాకు ప్రక్కనే ఉన్నాడు. అప్పడప్పడు అతను లేవబోయేటప్పడు నాకు తగులుతూ చిరాకు పుట్టిస్తున్నాడు. మందులో ఉన్నాడేమోనని అనుమానం వచ్చింది, కానీ అటు వంటి వాసన రావడం లేదు, బహుశః ఆమె అపురూప సౌందర్యాన్ని చూసూ విపరీతమైన టెన్షన్ పడిపోతున్నాడేమో అనుకున్నాను.
ఇంతలో ఆమె చేతిలో సెల్ మోగింది " నేను ఇవ్వాళ వెళ్ళను రేపు ఉదయం ఇద్దరం వెళ్దామంటే వినకుండా ఆ డొక్కు కారు ఇచ్చి పంపించారు. అది కాస్తా రామచంద్రపురం దాట కుండానే చెడిపోయింది. రామచంద్రపురం రోడ్ మీదే కారు చెడిపోయినచోట మన పాలేరు బస్ఎక్కించాడు అతి కష్టం మీద. రెండు గంటల్లో రావులపాలెం చేరుకుంటాను, అక్కడికి మన కొత్త కారు వేసుకుని రండి వెధవ పనులు తరువాత చూసుకోవచ్చు. ఇక మాట్లాడకండి-- " అని సెల్ నొక్కేసింది. మిల్క్ బ్యూటీ ముఖారవిందం కోపంతో లేత ఎఱుపు రంగులోకి మారిపోయింది. రావులపాలెం లో కారు ఎక్కగానే భర్తగారు అయిపోయాడన్నమాటే, జన్మ అంతా వాడిని సాధిస్తుందేమో అనుకున్నాం మేం ఇద్దరమూ.
ఇంతలో నా శ్రీమతి నా డొక్కలో ఒక పోటు పొడిచి " ఈ బస్ లో ఎక్కకుండా ఉండా ల్సింది. దేవత లా ఉంది కదండీ, అయినా నాకు తెలియక అడుగుతాను ఆమెకు ఆ బంగారు నగలు ఎందుకండీ, ఆమె మేలిమి బంగారం లా మెరిసిపోతుంటేనూ---" అంటోంది, నాకు మాత్రమే వినిపించేట్లుగా,
“ఆమెకు గాని చెబుతావా ఏమిటి ఖర్మగాలి, అసలే కోపంగా ఉందేమో--" అన్నాను. " చాల్లెండి సరసం " అంది.
బస్ మండపేట దాటింది. బస్సులో లైట్ల ఆర్పేసి, బస్ డోర్ దగ్గర ఉన్న లైటు వేశాడు.
లైటు సరిగ్గా ఆమెకు దగ్గరగా ఉండడంతో కాంతి అంతా ఆమె మీదే కేంద్రీకృతమై, ఆ సీట్లో ఒక బంగారుబొమ్మ ఉన్నట్లుగా మరింత కాంతితో ఆమె మిలమిలా మెరిసిపోతోంది. 
మరుక్షణంలో నా ప్రక్కనకూర్చున్నఆజానుబాహువు వ్యక్తి లేచి నిలబడ్డాడు. క్షణంలో ఆమె వద్దకు చేరాడు. ఆమె ముఖానికి తన ముఖానికి దగ్గరగా తీసుకుని చుంబించాడు. ఆమె అధరాలను, బుగ్గలనూ, తన పెదవులతో తాకాలని ప్రయత్నిస్తున్నాడు, ఆమె అతనినుండి విడిపించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది, కాని కుదరడం లేదు. ఈ దృశ్యం మా ఇద్దరికీ ఆమె ప్రక్కనకూర్చున్న ఇద్దరు మహిళలకూ మాత్రమే కనుపిస్తూనే ఉంది. ఏం జరుగుతోందో అర్థం కాక నిశ్చేష్టులమై వింతగా చూస్తున్నాం. ఆమె పక్కనే ఉన్న ఇద్దరు ఆడాళ్ళు లేచి నిలబడి " అదేటండీబాబో అదేం పాడు పనీ, ఆమె మీకు తెలుసునా? తెలిస్తే మాత్రం ? అని ఆమె నుండి అతన్ని తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వెంటనే అతను గభాల్న ఆమెను వదిలేసి ఏమీ జరగనట్లుగా తన సీట్లో కూర్చుండి పోయాడు. ఈ గోలకి బస్ లో లైట్ల వెలిగాయి, ముఖ్యంగా ఆమె పక్కన కూర్చున్నఇద్దరాడవాళ్ళు ఒహటే అరుస్తున్నారు. " అదేటండీ, ఆడిని నాలుగు తగిలించండి, ఆయమ్మను ఆపళాన్న పట్టుకుని ముద్దులెట్టేసుకున్నాడు దుర్మారుడు- " అని వాళ్ళు గట్టి గా అరుస్తోంటే బస్ లో మోనగాళ్ళంతా లేచి అతన్ని పిడిగుద్దులతో దాడి చేయసాగేరు. ఇలాంటి సందర్భాలలో యధాశక్తి ఒక దెబ్బ వేయాలని ప్రతీ వాళ్ళూ అనుకుంటూంటారు, ఇది సహజం, అతను కిమ్మనకుండా దెబ్బలు తింటున్నాడు, చచ్చిపోతాడేమో అనిపించింది సుమా
"స్థాపిట్ అతన్ని కొట్టకండి. నాదే తప్పు. నేను ఈ బస్ అస్సలు ఎక్కనే కూడదు. కారులో ప్రయాణం చేసేవాళ్ళు కారు లోనే తిరగాలి, అందరికీ కనపడకూడదు " అంటూ అరిచింది.
ఆమె అరుపులకు అందరూ ఆగిపోయి అతన్ని వదిలేసి తమ తమ సీట్లలో కూర్చుండిపోయి చెవులు కొరుక్కుంటున్నారు. జరిగిన విషయమంతా చర్చించుకుంటున్నారు. మా వెనుక సీటులో కూర్చున్న యువకుల బృందం " బలే డ్రైవరండీ బాబూ, చిటుకూ, చిటుకూ బస్ లో లైట్ల ఆర్పేస్తాడు, మేం కూడా ఆ ముద్దుల సీను లైవ్ లో చూసేవాళ్ళం కదా, ఎనీ హౌ వుయ్ మిస్ట్ మోస్ట్ రొమాంటిక్ సీన్ " అనుకుంటూ నవ్వుకుంటున్నారు. 
ఆమె మరింతగా ముడుచుకుని కూర్చుని, నేప్కిన్ తో ముఖం తుడుచుకుంటూంది. ఆమె ముఖం ఎఱ్ఱగాకందగడ్డ లా అయిపోయింది.
" డ్రైవర్ గారూ ఒక్క క్షణం బస్ ఆపుతారా? ప్లీజ్? " అని అరిచింది. అంతే రాజాజ్ఞ లాగా బస్ కి సడెన్ బ్రేకులు పడ్డాయి. బస్ ఆగగానే లైట్లు వెలిగాయి. 
ఆమె తన సీట్లోంచి లేచి రౌద్ర రూపం తో ఎర్రగా అయిపోయిన కళ్ళతో మాకు దగ్గరగా ఏమీ జరగనట్లు గా కూర్చున్న అతని దగ్గరకు వచ్చి, అతని రెండు చేతులూ పట్టుకుని ఫెడీఫెడీల్ మని రెండు చెంపలూ వాయించేసింది, అదే కోపంతో అతన్ని సీట్లోంచి కింద పడేసి అతని రెండు చేతులూ వదలకుండా బస్ లో లాక్కుంటూ తెరచి ఉన్న బస్ డోర్ వేపు లాక్కెళ్ళి రెండు చేతులతో, కాళ్ళ తో బయటకు తోసేసింది. అతను బియ్యం బస్తా లాగా డామ్మన్ని బస్ బయట రోడ్ మీద పడిపోయాడేమో. నేను ఆమెను నిశితంగా గమనిస్తున్నాను ఆమె అపర కాళికా దేవిలా కోపావేశాలతో దడదడ లాడిపోతోంది, బస్ లో ఎవరూ ఆమె దగ్గరకు వెళ్ళడానికి ధైర్యం చేయలేకపోయారు. స్త్రీలను ఆది శక్తి అంటారు, అందుకేనేమో అతన్ని బొమ్మలా తోసింది.
అంతే ! బస్ డైవర్ పని పూర్తి అయిపోయినట్లు గా బస్ వేగంగా పోనిచ్చాడు.
బస్ లో పిన్డ్రాప్సైలన్స్ గా ఉంది. జనం అదోరకమైన మూడ్ లో ఉండిపోయారు.
మండపేట నుండి బస్ రావులపాలెం వేపు వెళ్తూ  ఆలమూరు దాటుతోంది. వాడు ఏ ఇటుకల బట్టీల మీద పడిపోయాడో ఏమో.
" భలే చేశావమ్మా, చచ్చూరుకుంటాడు ఎదవన్నరఎదవ --" అంటున్నారు ఆమె ప్రక్కనకూర్చున్న ఇద్దరు ఆడాళ్ళు. 
ఒక గంట లో రావులపాలెం వచ్చేస్తుంది. బస్ లో అస్సలు లైట్లు లేకుండా పూర్తి గా ఆర్చేశాడు డ్రైవరు, బస్ లో జనంలో ఎవరైనా మళ్ళీ అఘాయిత్యం చేస్తారేమో అనేమో.
" ఇదిగో వినండి. మీరు రావులపాలెం వచ్చేస్తున్నారా లేదా ? మండపేట ఆలమూరు మధ్య ఏరియాలో ఒక వెధవ పిచ్చివేషాలేస్తే బస్ లోంచి కిందకుతోసేశాను, మీరు ఆర్జెంట్ గా ఇద్దరు మనుషుల్ని కారు లో పంపించి వాడిని హాస్పటల్ లో చేర్చించమనండి, బ్రతికున్నాడో చచ్చాడోచూడమనండి. గొడవ లేకుండా చెయ్యండి " అంటూ తన భర్త తో మాట్లాడుతోంది తన ఫోన్ లో, ఆడవాళ్ళు ఎంత కోపం వచ్చినా మాతృహృదయంకలవారు అని నేను మనసు ఎంతగానో పొంగిపోయాను. అంతటి అవమానం చేసిన ఆ దుర్మారుడు ఏమైపోతాడోఅని ఆమె జాలిగుండె ఆలోచించడం అపూర్వం అనుకున్నాను. 
రావులపాలెం ఊరు కనుపిస్తోంది. వెంటనే బస్ లో లైట్లన్నీ వెలిగాయి. 
వెంటనే బస్ లో స్పీకర్ల లో గోవింద నామాలు వినిపించసాగేయి. అవును ఇప్పడు భక్తి మార్గం తప్పనిసరి. తనకు ఏమీ పట్టనట్లు గా బస్ వేగం గా నడుస్తోంది. ఇటుక బట్టీలలో ఎండు కొబ్బరి డిప్పలుకాలుతూండడం తో అదో రకమైన మంచి వాసన వస్తోంది. 
కామం తో కళ్ళు మూసుకుపోయి మనిషి గుడ్డివాడయిపోవడం అంటే ఇదేనేమో. ఇంత మంది జనం వున్నా వాడికి జనం తనని ఏం చేస్తారో అన్న భయమూ, అయ్యో పాపం ఆమె ఒంటరిగా ప్రయాణిస్తోంది బాగుండదు కదా అన్న విచక్షణ జ్ఞానమూ లేకపోయింది.
శ్రీ కృష్ణ భగవానుడు శ్రీ మద్భగవద్గీత లో చెప్పినట్లు గా, భోగములను గురించి సదా ఆలోచించు పురుషునకు వాని యందు ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి వలన ఆ విషయముల పట్ల కోరిక ఉదయిస్తుంది. ఆ కోరిక తీరక విఘ్నము లేర్పడినచో క్రోధము కలుగుతుంది. అలా కలిగిన కోపం వలన అత్యంత మూఢభావము వస్తుంది, ఆ మూఢత్వము వలన మతి భ్రమించి జ్ఞానశక్తి నశించి, అలా బుద్ధి నశించిన వెంటనే తాను ఉన్న స్థితి నుండి పతితుడు అవుతాడు.
క్రోధాధ్భవతిసమ్మోహః సమ్మోహాత్  స్మ్రుతివిభ్రమః
స్మ్రుతిభ్రంశాద్భుద్ధినాశో బుద్ధినాశాత్ర్పణశ్యతి.
అయితే బస్ లో ఇంకా కొంత మంది పురుషులు ఉన్నారు గదా ! మరి వారి సంగతి ఏమిటి ? అని అనుకొంటే, అందరూ అతనిలా ప్రవర్తిస్తే, అసలు ఆడవాళ్ళు బయటకు వచ్చి తిరగలేరు కదా ?
ఇలా ఆలోచిస్తుండగా నాకు కునుకు వచ్చేసింది, ఆ తరువాత ఏం జరిగిందో మరి !
OOO OOOOOO

No comments:

Post a Comment

Pages