సామ్రాజ్ఞి -13 - అచ్చంగా తెలుగు
సామ్రాజ్ఞి – 13
భావరాజు పద్మిని

(జరిగిన కధ : ప్రస్తుత కేరళ ప్రాంతంలోని సువిశాల సీమంతినీ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల. ఆమె రాజ్యంలో అంతా స్త్రీలే ! అందంలో,కళల్లో, యుద్ధ విద్యల్లో ఆమె ముందు నిలువగల ధీరుడు లేడని ప్రతీతి. ఆమె ఉత్సాహభరితమైన మాటలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. తమతో అనవసరంగా వైరం పెట్టుకున్న కుంతల రాజు విజయవర్మతో మల్లయుద్దంలో గెలిచి, అతని రాజ్యం అతని రాణులకు, కుమారులకు అప్పగించి, అతడిని బందీగా తమ రాజ్యానికి తీసుకువస్తుంది ప్రమీల. రాజ నియమాల ప్రకారం అతను విలాసపురుషుడిగా మార్చబడతాడు. పరిణామ, వ్యాఘ్ర సరోవరాలలో మునిగిన యాగాశ్వం పులిగా మారిపోవడంతో, దిక్కుతోచక శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ ఉంటాడు అర్జునుడు. కృష్ణుడు ప్రత్యక్షమై యాగాశ్వానికి పూర్వపు రూపును తెప్పించి, ఆర్జునుడిని దీవించి, మాయమౌతాడు. పంపా నదీ తీరాన సీమంతినీ నగరాన్ని కావలి కాస్తున్న వారికి దొరుకుతుంది ధర్మరాజు యాగాశ్వం. దాన్ని సామ్రాజ్ఞి తన అశ్వశాలలో కట్టేయించి, యాగాశ్వం కావాలంటే తనతో యుద్ధం చేసి, విడిపించుకోమని, తన దండనాయకి వీరవల్లితో అర్జునుడికి లేఖ పంపుతుంది. తమ రాజ్యంలోని వివిధ బలాబలాలను గురించి అర్జునుడి సర్వసేనానియైన ప్రతాపరుద్రుడితో చెబుతూ ఉంటుంది వీరవల్లి. ఈలోపు విదూషకుడు చతురుడు అక్కడికి వచ్చి, వారికి వినోదాన్ని కల్పిస్తాడు. సంధిచర్చలకు సీమంతిని నగరానికి రావాలన్న కోరికతో వీరవల్లి ద్వారా సామ్రాజ్ఞికి ఒక లేఖను పంపుతాడు అర్జునుడు. ఆమె ఆహ్వానంపై అర్జున సేన   స్ర్తీ సామ్రాజ్యం చేరుకొని, అక్కడి అద్భుత నిర్మాణ వైశిష్ట్యానికి, వన శోభకు ఆశ్చర్యపోతారు . అనివార్యమైన ప్రమీలార్జునుల యుద్ధానికి రంగం సిద్ధమవసాగింది. ఇక చదవండి...)

అతిధి గృహంలో వాతావరణం చాలా గంభీరంగా ఉంది. తమ యాగాశ్వాన్ని తిరిగి తీసుకోవడం కోసం మర్నాడు సామ్రాజ్ఞికి, అర్జునుడికి జరగబోయే యుద్ధం గురించే అందరూ ఆలోచిస్తూ ఉన్నారు.
“జోయ్ జోయ్ ... అర్జున మహారాజా ! మీమీద సమ్మోహన హాస్యాస్త్రం ప్రయోగిస్తున్నాను. దీన్ని ఉపసంహరించడం మీ తరం కాదు. అయినా గాండీవం చేతబట్టి, దీనికి తగిన ప్రత్యస్త్రం ఏమి వేస్తారో నాకు చెప్పండి.” రెండు కర్ర పుల్లల్ని విల్లంబుల్లా చేత బట్టుకుని, అక్కడికి దూసుకొచ్చి అన్నాడు చతురుడు. అందరూ అతని హావభావాలకు నవ్వసాగారు.
“నిజమే చతురా ! యుద్ధభూమిలో అందరు శత్రువులనూ ఒక్కసారిగా మూర్ఛకు గురిచేసే సమ్మోహనాస్త్ర ప్రయోగం నాకు తెలుసుకానీ, సమ్మోహన హాస్యాస్త్రమే ! ఈ అస్త్ర ప్రయోగం వల్ల మూర్చపోయాకా నవ్వుతారా, లేక చతురులైన విదూషకుల చేష్టలకు నవ్వీ, నవ్వీ మూర్చపోతారా? “ నవ్వుతూ అడిగాడు అర్జునుడు.
“ముందే నవ్వుతారు మహారాజా ! మీ అందరినీ చూస్తే తెలుస్తోందిగా. ఇప్పుడీ అస్త్రాన్ని శస్త్రం చేసేసి విసిరేస్తాను, చూడండి,” రెండు పుల్లలనీ కలిపి గదలా భుజం పైన పెట్టుకుని, విచిత్రంగా నడవసాగాడు చతురుడు.
ఒక్కపెట్టున అక్కడ నవ్వులు వెల్లివిరిసాయి. ఈలోగా సర్వసేనాని ప్రతాపరుద్రుడు ఆర్జునుడి వద్దకు వెళ్లి, ఇలా అడిగాడు. “మహారాజా ! ఈ యాగాశ్వ పరిరక్షణా సమయంలోనే నేను మీ రాజ్యంలో చేరడం జరిగింది. కాని, కురుక్షేత్ర యుద్ధ సమయంలో నేను మీవద్ద లేను. అయితే కురుక్షేత్ర సంగ్రామ సమయంలో 18 రోజుల్లో సుమారు కోటి మంది దాకా మరణించారని విన్నాను. కేవలం విల్లంబులు ధరించి ఇంత మందిని సంహరించడం సాధ్యం కాదు కదా !ఇదే విషయం గురించి ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. ఎలాగూ మన చతురుడి చలవ వల్ల అస్త్రాలు, శస్త్రాల ప్రస్తావన వచ్చింది కనుక, వాటిగురించి మీకు తెలిసిన పరిజ్ఞానం మా అందరికీ అందించమని మనవి.”
వెంటనే అందరూ అర్జునుడి చుట్టూ గుమిగూడారు. వారందరి వదనాల్లో ఉన్న ఉత్సుకతను గమనించిన అర్జునుడు ఇలా చెప్పసాగాడు.
“అస్త్ర ప్రయోగ శాస్త్రం చాలా గొప్పది. కొన్ని నీతి సూత్రాలకు కట్టుబడినది. అస్త్రాలు, శస్త్రాలు తెలియాలంటే కావల్సినది విద్యా నైపుణ్యం ఒకటే కాదు, వాటిని ఉపయోగించేటపుడు పాటించవలసిన విచక్షణ, ధర్మం అన్నీ ఉండాలి. ఒక గురువు తన శిష్యుడు ఎవరిమీద పడితే వారి మీద ఈ అస్త్రాలను ప్రయోగించడు , కేవలం ధర్మానికే ప్రయోగిస్తాడు అన్న నమ్మకం కలిగినప్పుడే అవి గురువు శిష్యుడికి ధార పోస్తాడు.”
“సంహరించడమే ఉద్దేశం అయినప్పుడు, ఇక నీతినియమాలు ఎందుకు మహారాజా? ఈ అస్త్ర ప్రయోగంలో ఎటువంటి నియమాలు ఉంటాయి? ” అడిగాడు ప్రతాపరుద్రుడు.
“ఈ దివ్యాస్త్రాలు అన్నీ కొంతమంది దేవతలు, అసురులు, మాయాశక్తుల అధీనంలో ఉంటాయి. ఏ శక్తి అయినా దురుపయోగం చెయ్యనప్పుడే, లోక కల్యాణానికి వాడినప్పుడే వర్ధిల్లుతుంది. వీటిని సంపాదించేందుకే చాలాకాలం తపస్సు చెయ్యవలసి ఉంటుంది. ఉదాహరణకు నేను పాశుపతాస్త్రం సంపాదించేందుకు ముక్కంటి గురించి ఎన్నో సంవత్సరాలు హిమవన్నగాలకు వెళ్లి తపస్సు చేసాను కదా ! మరి అంత కఠోర సాధనతో లభించిన అస్త్రాన్ని విచక్షణ లేకుండా కోపంలో నా బల ప్రదర్శనకు ఇతరులపై వాడితే, ఆ అస్త్రం నిర్వీర్యమై నన్ను వీడిపోతుంది. ఇక ఈ అస్త్ర ప్రయోగంలో ఉన్న కొన్ని నియమాలు ఏమిటంటే...
తనతో సమఉజ్జీ కాని వాడితో, బలహీనుడితో యుద్ధం చెయ్యడమన్నది, ఆ యుద్ధం చేసేవాడికే అవమానం, పాపం. నిద్రిస్తున్న వాడిని, ఆయుధములు విడిచిన వాడిని, జుట్టు ముడి వీడిపడిన వాడిని, వాహనవైకల్యమును పొందిన వాడిని, శరణుజొచ్చిన వాడిని వధించుట ధర్మం కాదు. గోవులను, బ్రాహ్మణులను, బాలురను, వృద్ధులను, అంధులను, మిత్రులను, సఖులను, తోబుట్టువులను, జడులను, ఏమరుపాటున ఉన్న వారిని, నిద్రిస్తున్న వారిని, ఆడువారిని అస్త్రశస్త్రములతో కొట్టడం మహా పాపం. అది ధర్మవిహితం కాదని పెద్దలు చెప్తారు. అట్టి ధర్మమార్గం విడిచి అసుర మార్గం అవలంబించిన వారికి కార్యసిద్ధి కలుగదు. ధర్మం తప్పి, పాండవకుమారులను నిద్రలో సంహరించాడు కనుకనే అశ్వద్ధామ కృష్ణుడి శాపాన్ని పొంది, పిశాచ రూపంలో తిరుగుతున్నాడు.”

“చాలా ఆసక్తికరంగా ఉంది మహారాజా ! అసలు అస్త్రాల్లో ఎన్ని రకాలున్నాయి, శస్త్రాల్లో ఎన్ని రకాలున్నాయి? రెండిటికీ వ్యత్యాసం ఏమిటి?” అడిగాడు అర్జున సేనలో ఉన్న మధుసూదనుడు.

“మంచి ప్రశ్న మధుసూదనా ! మంత్రం ద్వారా శక్తిని ప్రసాదించి దూరంగా ఉన్న శత్రువుపై విసిరే వాటిని అస్త్రాలు అంటారు. అంటే అస్త్ర ప్రయోగం ముందు మంత్రోచ్చారణతో ఆయా దేవతలను అస్త్రం పైకి ఆవాహన చెయ్యాలి. అస్త్రాన్ని వెయ్యటమే కాదు, ఉపసంహారం కూడా తెలిసి ఉండాలి. ఉపసంహారం తెలియనప్పుడు ఆ అస్త్రాన్ని ప్రయోగించడం నిషిద్దం.
ప్రతి అస్త్రానికి ఒక అధిదేవత/అసురుడు/మాయాశక్తి ఉంటుంది. ఆ శక్తి దేనికి పనికివస్తుందో, దాన్ని ఏ సమయంలో, ఎలా ఉపయోగించాలో ఆలోచించే యుక్తి ఉంటేనే యుద్ధంలో విజయం సాధ్యమవుతుంది. ఇప్పుడు మీకు కొన్ని సత్రాల గురించి వివరిస్తాను.
త్వష్ట్ర అస్త్రం – ఇది ప్రయోగిస్తే, సేనలు తమ శత్రువులు ఎవరో గుర్తించలేవు.
ఇంద్రాస్త్రం – ఒక్కసారిగా అనేక బాణాలను ప్రయోగించగలదు.
ఆగ్నేయాస్త్రం: ఇది మంటలను వెదజల్లే ఆయుధం. దీన్ని శత్రువు పైకి ప్రయోగిస్తే నిప్పులు చిమ్ముతూ జ్వాలలను వెలువరిస్తుంది.
వరుణాస్త్రం: ఇది భారీగా నీటిని కురిపిస్తుంది. అగ్నేయాస్త్రాన్ని ఎదుర్కొనేందుకు దీన్ని ప్రయోగిస్తారు.
నాగాస్త్రం: పాము రూపంలో ప్రయోగించే అస్త్రం అది. ఇది శత్రువును చావుదెబ్బ తీస్తుంది.
నాగపాశం: రామ, రావణ యుద్ధంలో రామలక్ష్మణులపైకి ఇంద్రజిత్తు ఈ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రం ప్రయోగిస్తే విషపూరిత పాములు కుప్పలుగా లక్ష్యంవైపు సాగుతాయి.
వాయు అస్త్రం: ఈ అస్త్రంతో శత్రు సైన్యాన్ని అమాంతం గాల్లోకి విసిరేయవచ్చు.
సూర్యాస్త్రం: ఇది సూర్యభగవానుడి అస్త్రం. ఇది ఎంతటి చీకటినైనా పారద్రోలగలదు.
వజ్రాస్త్రం: ఇది ఇంద్రుడి ఆయుధం. దధీచి మహర్షి వెన్నెముకతో రూపొందించిన ఈ ఆయుధం అత్యంత శక్తివంతమైంది. మెరుపుల పోటుతో శత్రువును నిరోధిస్తుంది.
మెహినీ అస్త్రం: మాయ రూపంలో శత్రువుల ఆటకట్టించడం దీని ఉద్దేశం. విష్ణుమూర్తి మోహినీ రూపంలో రాక్షసులను తనవైపు తిప్పుకుంటాడు.
సమ్మోహనాస్త్రం: దీన్ని ప్రయోగిస్తే శత్రు సైన్యమంతా మాయలో చిక్కుకొని నాశనమవుతుంది.
పర్వతాస్త్రం: భారీ సుడిగాలులను సృష్టిస్తుంది. వాటి ప్రభావంతో ఆకాశం నుంచి పెద్ద పర్వతం శత్రువులపై పడిపోతుంది.
బ్రహ్మశీర్షాస్త్రం: ఇది బ్రహ్మదేవుడి ఆయుధం. ఇది దేవతలను సైతం హతమార్చగలదు. అ గర్భస్థ శిశువులను కూడా కాల్చి వేసి వంశ నాశనం చేయగలిగేది. అశ్వత్థాముడు గడ్డిపరక మీదకు దీన్ని ఆవాహన చేసి, పరిక్షితుడి మీదకు దీన్ని ప్రయోగించాడు. కాని అతను తన తండ్రిని చంపామన్న పగతో, విచక్షణ మర్చిపోయి, ఉపసంహారం తెలియకపోయినా ఈ అస్త్రం ప్రయోగించాడు. చివరకు కృష్ణ పరమాత్మ ఆదేశంతో నేను దీన్ని ఉపసంహరించాను.
నారాయణాస్త్రం: ఇది విష్ణువు ఆయుధం. బాణాలు, చక్రాల వర్షాన్ని కురిపించగలదు. ప్రతిఘటించే కొద్దీ దీని శక్తి మరింత పెరుగుతుంది. దీన్ని ఒక్కసారి మాత్రమే ప్రయోగించే వీలుంది.
వైష్ణవాస్త్రం: విష్ణుమూర్తి ఆయుధమైన దీన్ని ప్రయోగిస్తే ఎంతటివారనైనా పూర్తిగా తుదముట్టిస్తుంది.
పాశుపతాస్త్రం: ఇది అత్యంత విధ్వంసాన్ని సృష్టించగల అస్త్రం. ఇది సాక్షాత్తో పరమశివుడి తిరుగులేని అస్త్రం.
ఇవి మచ్చుకు కొన్ని అస్త్రాలు మాత్రమే. మహాశాక్తివంతమైనవి, కామరూపం కలవి అనేక దివ్యాస్త్రాలను ,త్రేతా యుగంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడికి ఉపదేశించారు.”
“హమ్మయ్యో, అన్ని అస్త్రాలే. అయితే రాములవారు ఆ అస్త్రాలతో పాటు అస్త్రాల మంత్రాలు కూడా గుర్తుంచుకోవాలి కదా! చాలా కష్టం” అన్నాడు చతురుడు.
“దివ్యాస్త్ర దేవతలను మంత్రోచ్చారణతో మెప్పించాలి. శత్రువు ప్రయోగించే అస్త్రాన్ని బట్టి, మనం ఏ ప్రత్యస్త్రాన్ని వెయ్యాలో ఆలోచించి ప్రయోగించాలి. అన్నట్టు చతురా, విశ్వామిత్ర మహర్షి దివ్యాస్త్ర ప్రయోగ విద్యనే కాదు, రాములవారి కోరికపై ఆయా దివ్యాస్త్రాల ఉపసంహార విద్యను కూడా రాములవారికి ప్రసాదించారు.” చతురుడి వంక చూస్తూ నవ్వుతూ అన్నాడు అర్జునుడు.
“అందుకే ఆయన్ను శ్రీరామచంద్ర ప్రభువు అన్నారు. ఇటువంటి మహా మేధస్సు ప్రభువులకే స్వంతం. మరి మహారాజా, అస్త్రం అంటే తెలిసింది, ప్రత్యస్త్రం అంటే ఏమిటి? ప్రతి ఒక్కరూ వేసే అస్త్రమా?” తల గోక్కుంటూ అడిగాడు చతురుడు.
అర్జునుడు బిగ్గరగా నవ్వి, “కాదు చతురా!  యుద్ధంలో నాయకుడు ప్రతినాయకుడు ఉంటారుకదా. నాయకుడు వేసేది అస్త్రమైతే ప్రతినాయకుడు వేసేది ప్రత్యస్త్రం. ప్రతినాయకు వేసేది అస్త్రమైతే నాయకుడు వేసేది ప్రత్యస్త్రం. ఉదాహరణకు రామ రావణ యుద్ధంలో రాముడు, రావణుడు వాడిన కొన్ని అస్త్ర ప్రత్యస్త్రాలను గురించి మీకు చెబుతాను. శ్రీరాముడు   ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే రావణుడు ఆ అస్త్రాన్ని ఉపసంహరించేందుకు రౌద్రాస్త్రం ప్రయోగించాడు. అలాగే రాముడు- రావణుడు అస్త్ర ప్రత్యస్త్రాలుగా గంధర్వాస్త్రం – సౌరాస్త్రం, గంధర్వాస్త్రం – గంధర్వాస్త్రం, దైవాస్త్రం – దైవాస్త్రం, గరుడాస్త్రం -    రాక్షసాస్త్రం, మహాశక్త్యాయుధం – మహాశూలం వరుసగా ప్రయోగించారు. చివరికి రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుడిని సంహరించాడు.” చెప్పడం ఆపి, ఒక్కక్షణం ప్రతాపరుద్రుడి వంక చూసాడు అర్జునుడు.
“ఓహో, అంటే, కురుక్షేత్ర సంగ్రామంలో సామూహిక ప్రభావం చూపి, అధికంగా ప్రాణనష్టం జరిగేందుకు సమ్మోహనాస్త్రం, వజ్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, రాక్షసాస్త్రం, వంటి అస్త్రాలను ప్రయోగించారన్నమాట !” అన్నాడు ప్రతాపరుద్రుడు.
ఈలోగా చతురుడు అడ్డుపడి, “ఓ నాకూ అర్ధమయ్యింది. ‘అ’ అనే అచ్చుతో మొదలయ్యే అస్త్రాలలో ‘అ’ ని మింగేసి, హల్లులలో చివర్లో ఉండే ‘శ’ ని పెట్టేస్తే, శస్త్రాలు అయిపోతాయి, అంతేగా !” అన్నాడు.
అందరూ మళ్ళీ నవ్వసాగారు.
అర్జునుడు శస్త్రాల గురించి చెప్పేందుకు సన్నద్ధమయ్యాడు.
(సశేషం)


1 comment:

  1. చక్కటి వర్ణన విశ్లేషణ

    ReplyDelete

Pages