'నాట్య విరించి' - పసుమర్తి శ్రీనివాస శర్మ - అచ్చంగా తెలుగు

'నాట్య విరించి' - పసుమర్తి శ్రీనివాస శర్మ

Share This
 'నాట్య విరించి' - పసుమర్తి శ్రీనివాస శర్మ 
భావరాజు పద్మిని 
సంప్రదాయ కూచిపూడి నాట్య కళాకారులుగా, నాట్యంలో ఎంతో మందికి శిక్షణ  ఇచ్చే  మేటి గురువుగా, కూచిపూడికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు, పరిశోధనా పుస్తకాల రచయతగా బహుళ పాత్రలు పోషిస్తున్నారు శ్రీ పసుమర్తి శ్రీనివాస శర్మ గారు. వారితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీకోసం...నమస్కారమండి, మీ నాట్యాభ్యాసం ఏ వయసులో మొదలైంది?
మా స్వగ్రామం కూచిపూడి. చిన్నప్పుడు మాకు తెలీని వయసులోనే కళా క్షేత్రంలో యక్ష గానం చూస్తూ ఉండేవాళ్ళం. ఐదేళ్ళ వయసొచ్చేసరికి కళా క్షేత్రంలోని పెద్దల ప్రదర్శనలు చూసి, మా అంతట మేమే ఇంటిదగ్గర నాట్యం చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత ఏడేళ్ళకి కళా క్షేత్రంలో చేరాను. అప్పుడు ప్రభల
మురళి గారనే ఆయన మాకు శిక్షణ ఇచ్చేవారు. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టడంతో మధ్యలో మానెయ్యడం జరిగింది. ఆ తర్వాత పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు అప్పట్లో అన్నమాచార్య కీర్తనలకు నాట్యం నేర్పుతుంటే, నేర్చుకున్నాను. డొక్కా కుమారస్వామి గారని, ఆయనవద్ద కొన్నాళ్ళు కూచిపూడిలో నాట్యం నేర్చుకున్నాను. 1982 జూలై 2 న  వెంపటి చినసత్యం గారు కుచిపూడిలో ‘నాట్యాచార్యుల పునశ్చరణ తరగతులు’ పెట్టారు. అందులో కూచిపూడిలో ఉన్న కుర్రాళ్ళని అందరినీ తీసుకుని శిక్షణ ఇచ్చారు. ఆయన టీచింగ్, అభినయ విధానాలను చెప్పిన పద్ధతులు, మెళకువలు నాకు బాగా నచ్చాయి. అప్పటినుంచి నా జీవితం మారింది. అప్పట్లో డిగ్రీ చదివుతూ,  ఆయన దగ్గరే నాట్యాభ్యాసం కొనసాగించాను. ’ఎప్పటికైనా నాట్యంలోనే కొనసాగాలన్న’ సంకల్పం అప్పుడే కలిగింది.

సత్యనారాయణ శర్మ గారు యక్షగానాలు బాగా చేస్తూ ఉండేవారు.
ఆయనవద్ద మగవారే ఆడ వేషం వేసే సంప్రదాయం ఉండేది. దాదాపు ఒకపది సంవత్సరాల పాటు వారితో కలిసి ప్రదర్శనలు ఇచ్చాను.
మా అన్నయ్య పసుమర్తి వెంకటేశ్వర శర్మగారు మాచేత నృత్య రూపకాలు తయారుచేయించి, విజయవాడలో ప్రదర్శనలు ఇప్పించేవారు. వారు వీటిని ఆధునిక పద్ధతిలో, వెంపటి చినసత్యం గారి స్టైల్ లో కంపోస్ చేసేవారు. ఇందులో పార్వతి పరిణయం, మహిషాసుర మర్ధిని, దక్ష యజ్ఞం, కీచక వధ,ఇటువంటి రూపకాలు ఉండేవి. వీటిలో ప్రధాన పాత్రలు వేసేవాడిని. పార్వతి పరిణయంలో శివుడు, మహిషాసుర మర్దినిలో అమ్మవారు, కీచకవధలో భీముడు, ద్రౌపది వంటి అన్ని పాత్రలు వేసాను. ఆ తర్వాత చినసత్యం గారి ట్రూప్ లో దాదాపు ఒక 20 నృత్య రూపకాల్లో ప్రదర్శనలు ఇచ్చాను.

చినసత్యం గారితో ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు జరిగిన మర్చిపోలేని ప్రదర్శన ఏమైనా ఉందా?
ఒకసారి కలకత్తాలో వీరభద్రుడి వేషం వేసానండి. ఆ పాత్రలో లీనమైపోయాను. చూసిన వారంతా, ‘వీరభద్రుడంటే ఇలా ఉంటాడని ఇవాళే మాకు తెలిసింది. చాలా మంది పాత్రలు వేస్తారు కాని, మీలాగా ఆ పాత్రను మా కళ్ళముందు సజీవంగా నిలబెట్టేవారు ఉండరు’ అని మెచ్చుకున్నారు. అప్పటికే మూడు నాలుగొందల ప్రదర్శనలు ఇచ్చినా, ఇదొక మర్చిపోలేని సంఘటన.

మీరు గురువుగా నాట్యం నేర్పడం ఎప్పుడు మొదలుపెట్టారు?
92లో నాకు రాజమండ్రి మ్యూజిక్ కాలేజీలో పోస్ట్ వచ్చింది. అప్పటినుంచి
టీచర్ గా ఉండి, చాలామందిని తయారుచేసాను. వారిలో దాదాపు నలభై మంది టీచర్లుగా ఈ రంగంలోనే ప్రసిద్ధులయ్యారు. ఇదే ఉపాధిగా తీసుకున్నారు.

మీరు స్వంతంగా ఏవైనా నృత్యరూపకాలు కంపోస్ చేసారా?
కుమారసంభవం అనే నృత్య రూపకం, అలాగే చినసత్యం గారి అనుమతితో భక్త ప్రహ్లాదుడి యక్షగానాన్ని నృత్య రూపకంగా మార్చడం జరిగింది. ఇవి కాక రైతే రాజు, మోహినీ భస్మాసుర వంటి సోషల్ బాలేలు కంపోస్ చెయ్యడం జరిగింది.

వీటన్నింటిలో బాగా ప్రజాదరణ పొందిన పాత్ర ఏది?
మా అన్నగారు పసుమర్తి రామకృష్ణ గారు సెంట్రల్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా ఉన్నారు. వారి నిర్వహణలో ‘శశిరేఖా పరిణయం’ లో వేసిన దుర్యోధనుడి పాత్ర ఎంత పేరు తెచ్చిందంటే, ఆ వేషం వేస్తే నేనే వెయ్యాలని
అనేవారు. అలాగే ముందు చెప్పిన వీరభద్రుడి పాత్ర, రామాయణంలో
నాకోసం చినసత్యం మాష్టారు తయారుచేసిన హరిదాసు పాత్ర, బాగా పేరు తెచ్చిపెట్టాయి. మహిషాసుర మర్ధిని లో వేసిన అమ్మవారి పాత్రైతే, స్వయానా అమ్మవారే దిగి వచ్చినట్లు ఉందని, పేపర్లో రాసారు.

మీరు ప్రముఖుల ద్వారా అందుకున్న మర్చిపోలేని ప్రసంశ ఏమైనా ఉందా?
సత్యనారాయణ శర్మ గారు నన్ను తన వారసుడినని చెప్పుకున్నారు. ఇదొక
మర్చిపోలేని ప్రశంస. వెంపటి చినసత్యం గారు ఏ పాత్ర వేయించినా దానికి 10  రోజుల రిహార్సిల్ ఉండేది. వేసిన ప్రతి పాత్రకి న్యాయం చేసానని అనేకమంది మెచ్చుకున్నారు.

ఎవరైనా ఆర్టిస్ట్ రానప్పుడు మీరు అనుకోకుండా వేసిన పాత్రలు ఏమైనా ఉన్నాయా?
సత్యానారాయణ శర్మ గారు ఒకసారి అనుకోకుండా నాతో పార్వతి వేషం వేయించారు. అలాగే కావేరి అనే ఒక వేషం ఉంది. 86 లో కూచిపూడిలో జరిగిన నాట్యోత్సవాలలో వేసిన ఈ పాత్రను వెంపటి చినసత్యం గారి దగ్గరనుంచి అనేకమంది బాగా మెచ్చుకున్నారు. ప్రతి పాత్రలో లీనమైపోయి, ఆ రసాన్ని పండించి, పర్ఫెక్ట్ గా చేస్తాను.
దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి వారు కుమార సంభవం అనే
నృత్య రూపకం రాసారు. మొన్న జూలై లో కూడా వారి ముందు ప్రదర్శన ఇస్తే చాలా బాగుంది, అనుకున్నట్టుగా వచ్చిందని మెచ్చుకుని, వారు రాసిన మరో నృత్యరూపకం కూడా ఇచ్చారు.

మీరు విదేశాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చారా?
సత్యనారాయణ శర్మగారు ఒకసారి భారత ప్రభుత్వం తరఫున మమ్మల్ని ఫ్రాన్స్ తీసుకుని వెళ్ళారు. చినసత్యం గారు జర్మని తీసుకువెళ్ళారు. అలాగే మా అన్నయ్య వెంకటేశ్వర శర్మ గారితో అమెరికా వెళ్లి ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అక్కడ కీచక వధ నృత్యరూపకంలో వేసిన భీముడి పాత్ర బాగా హిట్ అయ్యింది. ఆరు నెలల్లో 18 ప్రదర్శనలు ఇచ్చాము. ప్రతి రాష్ట్రంలో హిట్ అయ్యింది, భీముడు వేదిక మీదకి రాగానే అంతా చప్పట్లు కొట్టేసేవారు.

ప్రస్తుతం సంప్రదాయ నాట్యానికి ఆదరణ ఎలా ఉందని అంటారు?
కూచిపూడి నాత్యాభ్యాసంలో రెండు వర్గాలు ఉన్నాయండి. ఒక వర్గం వారు
కేవలం కళ కోసం నేర్చుకుని, కళే జీవితంలా బ్రతుకుతారు. మరొక వర్గం వారు ప్రదర్శనల కోసం, అవార్డుల కోసం నేర్చుకుంటారు. మేము, మా కుటుంబాలు కళకు అంకితమైనవి. మా లాంటి 11 కుటుంబాలు కూచిపూడిలో ఉన్నాయి. మాకు మా పాత్ర, దాన్ని ప్రదర్శించే విధానం, ప్రోగ్రాం బాగుందా లేదా, అని చూస్తాము. ఎవరైనా సలహా ఇస్తే, తీసుకుని, దిద్దుకుని ముందుకు వెళ్తుంటాము. అవార్డుల గురించి ఆలోచించము. ఎవరైనా ఇస్తే తీసుకుంటాము, అంతే. ఈ కళను నిలబెట్టడం మా బాధ్యతగా భావిస్తాము.
అలా ఆశించకుండా ఇప్పటికి నాకు ప్రజలిచ్చిన 7 అవార్డులు ఉన్నాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా నాకు ఉత్తమ టీచర్ గా అవార్డు ఇచ్చింది.

మీరేమైనా పుస్తకాలు రాసారా?
కూచిపూడి పరీక్షలో థియరీ కూడా ఉంటుంది. మా చిన్నప్పుడు ప్రతి గురువు వద్దకు వెళ్లి, విషయాలన్నీ కనుక్కుని, రాసుకుని, చాలా కష్టపడాల్సి వచ్చేది. నేను లెక్చరర్ అయిన ఏడాదిలో పిల్లలకి ఈ ఇబ్బంది లేకుండా మొత్తం నోట్స్ రాసేసాను. 2006 లో దాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చాను. మొత్తం ఆంధ్రా, తెలంగాణలో పరీక్షలకు వెళ్ళే వారికి ఇదొక ప్రమాణ పుస్తకంలా తయారయ్యింది. సర్టిఫికేట్, డిప్లమా కోర్సులకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం లలో టెక్స్ట్ బుక్స్ తయారు చేసాను. ఈ ప్రక్రియలో సిద్ధేంద్ర యోగి చరిత్ర రాయాల్సి వచ్చింది. మేము కూచిపూడికి చెందిన వాళ్ళం కాబట్టి, దాన్ని ప్రామాణికంగా, పరిశోధన చేసి
రాయాలి. అందుకే ఆయన గురించి వివరాలన్నీ సేకరించాను. ఆయన 11 వ శతాబ్దంలో రాసిన పుస్తకం మద్రాస్ లైబ్రరీ లో ఉంది. దాన్ని సేకరించి, ఆ విషయాలు తెల్సుకున్నాను. ఆయన అసలు పేరు సిద్ధరామయ్య, 11 వ శతాబ్దానికి చెందినవారు. షోలాపూర్ లో ఇప్పటికీ ఆయన విగ్రహం ఉంది. ఇవన్నీ పరిశోధించి పుస్తకంగా తెచ్చాను. ప్రస్తుతం కొత్త పుస్తకం రాస్తున్నాను.

మీ భవిష్యత్ ప్రణాలిళికలు ఏమిటి?
ఒక వైపు ప్రదర్శనలు, మరోవైపు పిల్లల్ని తెయారుచెయ్యడం, మూడో వైపు పుస్తకాలు రాయడం. ఇవే నా నిత్య కృత్యాలు. పొద్దుట క్లాసు చెప్తాను, మధ్యాహ్నం ఆలోచించి పుస్తకాలు రాస్తాను, సాయంత్రాలు ఏవైనా ప్రదర్శనలు ఉంటే చేస్తాను.
భామాకలాపం కొన్ని వందల ఏళ్ళుగా ఎంతో మందికి ఉపయోగపడింది. అలాగే  సమాజానికి  మంచి సందేశాన్ని ఇచ్చే ఇటువంటి నృత్యరూపకాలు రాయాలన్నది నా కోరిక. దశరూపకాలలో ఆయా రూపక లక్షణాన్ని బట్టి నృత్య రూపకాలు తయారు చెయ్యాలి. శాస్త్రాన్ని కూడా సమాజానికి అనుకూలంగా తీసుకుని వెళ్ళాలి. మనం ఇచ్చే సందేశం ద్వారా సమాజంలో మార్పు రావాలి. భాష సులువుగా ఉండాలి, అందరికీ అర్ధమయ్యేలా ఉండాలి, శాస్త్రం తప్పకూడదు, అందరికీ ఆనందం కల్పించాలి. ప్రస్తుత తరానికి మన ధర్మం, సంప్రదాయం తెలియజేసే విధంగా సమకాలీన సమస్యల తో, సందేశాత్మకంగా నృత్య రూపకాలు చెయ్యాలని, తద్వారా వారిలో మార్పు తీసుకుని రావాలని, ఒక కోరిక. ఈ విధంగా నృత్యరూపకాలు తయారు చేసినప్పుడే మేము నిజమైన కూచిపూడి కళాకారులం అవుతాము.
శ్రీ పసుమర్తి శ్రీనివాస మూర్తిగారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఆనందంగా జీవిస్తూ, విజయ శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటోంది – అచ్చంగా తెలుగు. 

శ్రీ శ్రీనివాస శర్మ గారి వీడియోలను క్రింది లింక్ లో దర్శించండి.

No comments:

Post a Comment

Pages