పుష్యమిత్ర - 19
- టేకుమళ్ళ వెంకటప్పయ్య
జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో హిమాలయాలపైన బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు సైనిక కవాతు సమయంలో సింహకేతనునితోబాటూ, బృహద్ధ్రధునీ వధించి సింహాసనం అధిష్టించి సుపరిపాలన సాగించి, అగ్నిమిత్రునికి రాజ్యం కట్టబెట్టి హిమాలయాలలో జ్ఞాన సమాధిలో ఉన్నప్పుడు బాబాజీ ద్వారా తను కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద సంచరించాలని ఆదేశించడంతో ఆశ్చర్యపోతాడు. శ్రీహరికోట(షార్) పై బాంబింగ్ చెయ్యడానికి రెండు సబ్మెరైన్స్ కృష్ణాపట్నం ఓడ రేవు వైపు వస్తున్నట్టు తెలుసుకున్న భారత్ నేవల్ అధికారులు వారిని సజీవంగా పట్టుకుని బంధిస్తారు. వారిని మిలిటరీ అధికారులు ఇంటరాగేట్ చేసి కొన్ని నిజాలు బయటికి కక్కిస్తారు. సబ్మెరైన్ల జాడ తెలియక పాక్ మిలిటరీ ఛీఫ్ ఖయూం అనే అండర్వాటర్ స్పెషలిస్ట్ను పంపుతాడు. ఖయూం మైపాడు రేవులో ఫిష్ బోట్ వారికి లంచం ఇచ్చి ఎక్కి కృష్ణాపట్నం వేపు సాగిపోవడాన్ని గమనించిన కోస్టు గార్డు చెన్నై షిప్-యార్డ్ కు విషయం అందజేస్తాడు. (ఇక చదవండి)
“సెరపిండిటీ” బోట్ అడ్వాన్సుడ్ టెక్నాలజీతో తయారయింది. శరవేగంతో ముందుకు సాగిపోతోంది బంగాళాఖాతంలో తూర్పు దిక్కుకు. "మీరు 4 రోజులు సముద్రంలో చేపలుపట్టి అమ్మితే ఎంతవస్తుందో అంత ముందుగానే ఇచ్చేశాను. అందువల్ల మీరు నేను చెప్పినట్టుగా వినాలి. నేను చెప్పిన దిశగా వెళ్ళండి" అన్నాడు జీ.పీ.యెస్. లో లాంగిట్యూడ్-లాటిట్యూడ్లను గమనిస్తూ ఖయూం. "ఠీక్ హై సాబ్" అని ముందుకు ఉత్సాహంగా సాగిపోతున్నాడు బోటు నడిపే నరసింహన్. బోటులో బావమరది శేషన్, ఆర్ముగం ఉన్నారు. శేషన్ తెలుగువాడే "శేషయ్య" తమిళియన్ గా నటిస్తాడు అంతే. ఇంకా 100 కిలోమీటర్లు వెళ్తే గానీ సబ్మెరయిన్ మాయమయిన ప్రదేశం రాదు. ఈలోపు డెక్ ఎక్కి బైనాక్యులర్స్ తో పరిస్థితులను పరీక్షిస్తున్నాడు ఖయూం.
వాకీటాకీ మోగడంతో ఉలిక్కిపడి ఎత్తాడు నరసింహన్.
"నంబియార్ చెట్టిని మాట్లాడతాండా"...ఓవర్.
“సార్..నేను నరసింహన్.. చెప్పండి. ఓవర్".
"నీవు వెంటనే బోటు తిప్పుకుని తిరిగి మైపాడు బీచ్ కి వచ్చేయ్! పెద్ద ప్రమాదం ఉంది. ఒక గంటలో. ఎందుకు ఏమి అని అడక్కుండా వచ్చెయ్! అంతే. ఓవర్". పెట్టేశాడు.
ఇప్పుడేం చెయ్యాలి. 50 వేలు తీసుకున్న అతనికి ఏమి సమాధానం చెప్పాలి. అని అలోచించి బోట్ ను వెనక్కు టరన్ చేశాడు. ఒక్క సారి బోటు మళ్ళీ పశ్చిమం వేపుకు తిరగ్గానే ఉలిక్కిపడ్డాడు డెక్ పై ఉన్న ఖయూం. వెంటనే దిగి వచ్చి... "క్యాహూవా" అని అడిగాడు.
"సార్ మాఓనర్ గారు ఏదో ప్రమాదమని చెప్తున్నాడు. మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వెనక్కి వచ్చేయమని గట్టిగా చెప్పాడు. కావాలంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం!
"నో డేంజర్ నేను చెప్తున్నా పోనీయ్" అని అరిచాడు.
వినలేదు నరసింహన్. వెంటనే జేబులోనుండి సిగరెట్ లైటర్ లాంటిది తీసి రెండు నిముషాల్లో రివాల్వర్ లాగా చేసి నరసింహన్ కణతపై గురిపెట్టి. "ఎక్స్ ట్రా వేషాలొద్దు బోటు వెనకక్కు తిప్పు" అన్నాడు. విషయం గమనించిన శేషన్ ఎవరూ చూడకుండా లైఫ్ జాకెట్ వేసుకుని సముద్రంలో దూకేశాడు. ఆర్ముగం, నరసింహన్ భయంతో వణికి పోతూ.."సార్! ఇది మా ఓనర్ ఆర్డర్స్. తప్పితే మా శవాలు సముద్రంలో తేల్తాయి. మా మాట వినండి" అన్నారు.
నేను ఇప్పుడే మిమ్మల్ని షూట్ చేసి బోట్ హ్యాండోవర్ చేసుకుంటున్నాను. అని ఇద్దర్నీ చంపి సముద్రంలో పడేశాడు. బోట్ ను మళ్ళీ తూర్పు వైపుకు తిప్పి వెళ్ళసాగాడు. శేషన్ సముద్రంలో సహాయం కోసం చూస్తూ పశ్చిమంగా ఈదుతున్నాడు.
* * *
"మిస్టర్ నంబియార్! బోట్ రాలేదు కదా మైపాడుకు ఇంకా.... ఏమైంది?" చెన్నై షిప్-యార్డ్ ఛీఫ్ అడిగిన ప్రశ్నలు ఫోన్లోనే గుటకలు మింగుతున్నాడు.
"సార్! ఏమైందో తెలీడంలేదు. వాకీటాకీ కి ఎవరూ జవాబు చెప్పడంలేదు" అన్నాడు.
"మేము సప్లై చేసిన ట్రాక్ ఇన్స్ట్రుమెంట్ బోట్ లో ఇంజిన్ అడుగున వుంచారా?"
"యెస్ సార్! అన్ని బోట్లకూ ఉంది సార్".
"ట్రాక్ నంబర్ ఎంత?"
"సెరపెండిటీ నంబర్ 110 సార్!" అన్నాడు ఒక్కసారి నోట్-ప్యాడ్ చూసి.
"సరే మేము చూస్తాము. ఈ లోపు నువ్వు నీ బోట్ ఇంకోటి అక్కడికి పంపి ఏమయిందో వాకబు చెయ్యి."
"యెస్ సార్!" అన్న వెంటనే "మైపాడు బీచ్లో నా బోటు ఏది ఉన్నా అర్జెంటుగా కాంటాక్టు చెయ్యమని
చెప్పండి" అని కోస్టు గార్డ్ కు చెప్పి వూపిరి పీల్చుకున్నాడు నంబియార్.
* * *
శేషన్ ఈదుకుంటూ వస్తూ ఉండగా మరబోటు "జల్ దర్శన్" ఒకటి దూరంగా కనపడింది. అతి కష్టం మీద వాళ్ళ బోటును చేరగలిగాడు. విషయం విన్న వాళ్ళు వెంటనే జరిగిన విషయమంతా నంబియార్ చెట్టికి చెప్పారు. నంబియార్ అంతా చెన్నై కోస్టుకు వివరించాడు. వెంటనే నేవల్ బృందం రంగంలోకి దిగింది.
* * *
ఖయూం ఎక్కడైతే సబ్మెరైన్లు చివరిసారిగా సిగ్నల్స్ పంపాయో దాదాపు కృష్ణాపట్నం ఓడరేవుకు దగ్గరగా అంటే ఆ లాంగిట్యూడ్-లాటిట్యూడ్ కు చేరుకున్నాడు. బోట్ ను చిన్నపాటి లంగర్ వేసి నిలకడగా ఉంచి సముద్రంలోకి దూకి అటూ ఇటూ రెండుమూడు కిలోమీటర్ల దూరం వెదకాడు. తనకు పాక్ ఇచ్చిన పరికరాలతో సందేశాలు పంపి చూసాడు. అంతా నిశ్శబ్దం. వెంటనే బోట్ పైకి చేరి మంచినీళ్ళు తాగుతూ ఉండగా నాలుగు వేపుల నుండీ ఇండియన్ నేవల్ వాళ్ళ బోట్స్ చుట్టుముట్టబోతూ ఉండగా గమనించిన ఖయూం సముద్రంలో దూకేశాడు. నలుగు గజ ఈతగాళ్ళు కూడా దూకారు. కానీ ఖయూం సముద్రం అడుగుకు కూడా వెళ్ళగలిగిన ట్రైనింగు ఉన్నవాడు. బాగా అడుక్కి వెళ్ళిపోయాడు. అంతే. మరి చిక్కలేదు వాళ్ళకు. వెదికి వేసారిన ఇండియన్ నేవల్ ఈతగాళ్ళు పైకి వచ్చి ఆ బోట్ ను దానిలోని వస్తువులను స్వాధీనం చేసుకుని వెనక్కు తీసుకెళ్ళిపోయారు.
* * *
"సార్! ఖయూం రిపోర్టింగ్ టు హెడ్ క్వార్టర్స్"
"వెంటనే పాక్ అధికారులు అలర్ట్ అయ్యారు"
"యెస్ మిస్టర్ ఖయూం వాట్ హేపెండ్ టు అవర్ సబ్మెరైన్స్?"
"ఏమో సార్ అంతా మాయగా ఉంది. ఎంత వెదికినా దొరకలేదు. నా మీద ఇండియన్ మిలిటరీ దాడి చేశారు. తప్పించుకుని అలా అలా వైజాగ్ పట్నం చేరాను. ఫ్లైట్ ఎక్కి దిల్లీ. ఆ తర్వాత అక్కడికి వస్తాను.
"ఓకే"
విషయం విన్న పాక్ మిలిటరీ ఛీఫ్ తలపట్టుకున్నాడు. సబ్మెరైన్ల ఆచూకీ చెప్పలేకపోతే ప్రెసిడెంట్ నా తల తీసేస్తాడు. ఏమి చెప్పాలి. కరిముల్లా కూపీ లాగడానికి వెళ్ళిన జిలానీ బాషా ఏమయ్యాడో తెలీదు. ఏమిటిదంతా! మన ఇంటెలిజెన్సు డిపార్టుమెంట్ తెలివితేటలు ఏమయ్యాయి? అల్లా! కాపాడు.
* * *
"శ్రీహరికోటపై దాడికి పాకిస్తాన్ వ్యూహం. ఆదిలోనే విఫలం చేసిన భారత్ నేవీ అధికారులు."
న్యూజ్ పేపర్ హెడ్ లైన్సు.
క్రిష్ణాపట్నం: పాక్ సైనికులు రహస్యంగా రెండు సబ్మెరైన్లతో ఇక్కడి ఓడరేవుకు సమీపంలో 50 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలోని భారతజాలాలలో వేచి ఉండడం చూసిన చేపలు పట్టే మరబోట్ల మత్స్యకారులు భారత ప్రభుత్వానికి విషయం చేరవేశారు. వెంటనే చర్యలు తీసుకుని వారిని పట్టుకుని వాఙ్మూలం తీసుకున్న భారత ప్రభుత్వం విషయం తెలిసి నివ్వెరపోయింది. దగ్గరలోని రాకెట్ కేంద్రమయిన షార్ ను వారు టార్గెట్ ఎంచుకుని దాన్ని ధ్వంసం చేయాలని వచ్చినట్లు వారు తెలియజేశారు. వారిని తగు బందోబస్తుతో దిల్లీకి పంపారు. ఈ విషయమై ప్రధాని ఐక్యరాజ్యసమితికి ఆయా సభ్య దేశాలకు ఫ్యాక్స్ ద్వారా ఫొటోలతో, వారి వాఙ్మూలాల ప్రతులతో విషయం తెలియజేశారు. ఖైదీలను, వాఙ్మూల పత్రాలను ఇంటర్నేషనల్ కోర్టుకు అప్పజెప్పనున్నామని భారత్ ప్రెసిడెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయం తెలిసిన పాక్ ప్రెసిడెంట్ దీన్ని ఖండిస్తూ ఇది ఏ దేశమో తమపై చేసిన కుట్ర అని వ్యాఖ్యానించారు. (సశేషం)
No comments:
Post a Comment