నాకు నచ్చిన కథ-కడుపులో కలకలం - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కథ-కడుపులో కలకలం

Share This
నాకు నచ్చిన కథ-కడుపులో కలకలం--తీగల గోపీచంద్.

శారదాప్రసాద్


అనగా అనగా,'పొట్టారాజ్యంలో 'జీర్ణకోశ' పట్టణం ఉంది.అదే పొట్ట రాజ్యాని కంతటికీ రాజధాని.దానిలోనే  ఆ రాజ్యాన్నిఅంతా పరిపాలించే 'పెద ప్రేగు' మహారాజు నివసించేవాడు.'ఆకలయ్య'అనే మహా మంత్రి,'అన్నంరాజా' అనే సేనాధిపతులు కూడా రాజుకు అండగా ఉండి  పొట్టారాజ్యాన్ని నిర్భయంగా ఏలుతున్నారు.ఇట్లా ఉంటుండగా,ఆ రాజ్యంలోకి 'కాఫీ దొరగారు' అనే వర్తకుడు ప్రవేశించాడు.వాడు 'పెద ప్రేగు' మహారాజు వద్దకు వచ్చి,"మేము వర్తకం చేసుకుందామని తమ దేశానికి వచ్చాం.మాకు కొంచెం స్థలం ఇవ్వండి."అని ప్రాధేయ పడ్డాడు.అప్పుడు రాజుగారు ఆ వర్తకులను,వారివద్దనున్న వస్తువలను చూసి సంతోషించి,వారికి కొంత స్థలం ఇచ్చారు.ఇట్లా రోజురోజుకీ కాఫీదొరలు వచ్చి అనేక స్థలాలు ఆక్రమిస్తున్నారు.అప్పుడు ఆకలయ్య మహామంత్రి రాజుగారితో,"అట్లా కొత్త వారికి చోటిస్తే ప్రమాదం,"అని చెప్పాడు.అప్పుడు రాజు గారికి కోపం వచ్చి ."నాకు నీతులు చెప్పటానికి,  నీవెవ్వరవు? నా రాజ్యం నుంచి వెళ్ళిపో!"అన్నారు.అప్పుడు మంత్రిగారు చేసేది ఏమీలేక ఇంకో రాజ్యంలోకి వెళ్లారు.ఇంకేం!కాఫీ దొరలు ఆడింది ఆట పాడింది పాటగా ఉంది.కానీ, మధ్యమధ్య  'అన్నంరాజా' అడ్డు తగులుతున్నాడు.అందుకని.కాఫీ దొరలు మహారాజుకీ,అన్నంరాజాకీ మధ్య పోట్లాట సృష్టించారు.పాపం! రాజు గారు అన్నంరాజును కూడా వెళ్ళగొట్టారు.అన్నంరాజు గారు, ఆకలయ్య గారిని కలుసుకొని జరిగినదంతా చెప్పాడు.ఇద్దరూ కలసి యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు.ఇక్కడ, కాఫీ దొరలు పెదప్రేగు మహారాజుని బంధించి జైల్లో పెట్టి పొట్టా రాజ్యంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు.రోజురోజుకీ వారి దుండగాలు ఎక్కువ అవుతున్నాయి.రోజుకొక  గ్రామాన్ని దోచేస్తూ,ఆ గ్రామ ప్రజలను అన్యాయంగా చంపేస్తూ,స్త్రీలను కూడా హింసిస్తున్నారు. ఇలా కాఫీ దొరలు దొరికిన డబ్బంతా దోచుకెళ్ళుతున్నారు.అప్పుడు ప్రజలు ఆకలయ్య గారి వద్దకు వెళ్లి తమ కష్టాలను విన్నవించుకున్నారు. అప్పుడు,ఆకలయ్య గారు పెద్ద సైన్యంతో కాఫీ దొరల మీదికి యుద్ధానికి వెళ్ళాడు.ఇది గమనించి,కాఫీ దొరలు భయపడి 'వాంతి' అనే రహస్య మార్గం గుండా పారిపోయారు.
(రచన,తీగల గోపీచంద్-1947లో ఆయనకు 16 ఏండ్ల వయసులో,అయిదవ ఫారం చదువుతుండగా వ్రాసిన ఈ బ్రహ్మాడమైన కథ 1947 ఆంద్ర పత్రికలో ప్రచురితమయ్యింది.ఈ రచయిత ప్రస్తుత వివరాలు తెలియవు.ఎవరైనా తెలియజేస్తే సంతోషిస్తాను.ఈ కధలో అంతర్లీనంగా ఉన్న మరో సందేశం ఉందని నాకు అనిపించింది.వర్తకం కోసం వచ్చిన ఆంగ్లేయులను స్వాతంత్ర్య సమరం ద్వారా ఇండియా నుంచి తరిమేసిన  సమరయోధులకు నివాళిగా ఈ కథను వ్రాసారేమోననిపిస్తుంది.రచయిత కథను వ్రాసిన కాలం కూడా 1947 కావటంతో ,ఇది బలపడుతుంది.అంత చిన్న వయసులో ఇంత గొప్ప కథను వ్రాసిన రచయిత నిజంగా అభినందనీయుడు!)
***

No comments:

Post a Comment

Pages