దర్శక 'ఆదిత్యుడు' - శ్రీ వి.ఎన్.ఆదిత్య గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

దర్శక 'ఆదిత్యుడు' - శ్రీ వి.ఎన్.ఆదిత్య గారితో ముఖాముఖి

Share This
దర్శక 'ఆదిత్యుడు' - శ్రీ వి.ఎన్.ఆదిత్య గారితో ముఖాముఖి 
భావరాజు పద్మిని 
చిన్నప్పటి నుంచి ఒకటే తపస్సు, ఒకటే తపన, ఒకటే కల ... సినిమా... తన స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు అనేక కష్టనష్టాలకు ఓర్చి, అతి చిన్న వయసులోనే మనసంతా నువ్వే, నేనున్నాను, బాస్, వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకులుగా మంచి పేరు తెచ్చుకున్న వి.ఎన్.ఆదిత్య గారితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీకోసం...
నమస్కారం ఆదిత్య గారు , చిన్నప్పటి నుంచి మీరు సినిమాలు ఎక్కువగా చూసేవారట! ఆ సమయంలో మీరు సినిమా చూడడం కోసం చేసిన ఒక తుంటరి పని ఏదైనా చెప్తారా?
నమస్కారమండి. (నవ్వేసి)అమ్మా, ఇది మా ఇంట్లో నన్ను ఇరికించే ప్రయత్నంలా ఉంది. అయినా సరే, ఒక సంఘటన చెబుతాను.

అప్పుడు నేను మూడో క్లాసు చదువుతున్నాను. మా నాన్నగారు జంగారెడ్డి గూడెంలో స్టేట్ బ్యాంకులో పనిచేస్తూ ఉండగా, ‘ ఛాలెంజ్ రాముడు’ అనే ఎన్.టి.ఆర్ సినిమా రిలీస్ అయ్యింది. ఎలాగోలా ఆ సినిమా చూడాలి. కాని సినిమాలంటే ఇంట్లో ఒప్పుకోరు. అందుకని, ‘మా మాష్టారు హోం వర్క్ ఇచ్చారు, ఛాలెంజ్ రాముడు సినిమా చూసి, అందులోంచి రెండు సీన్లు రాయమన్నారు,’ అని అబద్ధం చెప్పాను. ‘సినిమాలు చూసి రాయమనడం ఏమిటి, ఉండు స్కూల్ కి వచ్చి, మీ మాష్టారిని అడుగుతా’ అన్నారు కోపంగా మా అమ్మగారు. ఆవిడ మా మాష్టారు గారి దగ్గరకు వెళ్ళకుండా ఉండడం కోసం ఒక రోజంతా అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, నీళ్ళు పట్టడం వంటి మొత్తం ఇంటి పనులన్నీ చేసేసాను. మొత్తానికి ఆ సినిమాకి పంపే దాకా ఆవిడ తోకలాగా తిరిగాను. తెల్లారుజామున నాలుగింటికి లేచి కాగులో నీళ్ళు కాచడం లాంటి పనులు చేసాను. తీరా సినిమా చూస్తే అంతగా బాలేదు. అప్పుడు చాలా చిరాకేసింది.
అలాగే ఒకసారి ‘మహాబలుడు’ అన్న సినిమా ఒచ్చింది. అది బాగుందని మా నాన్నగారు ఎవరితోనో చెబుతుంటే విని, ఆయన ఆఫీస్ కు వెళ్ళగానే అమ్మని పట్టుకున్నాము. మా అన్నయ్య శోభన్బాబు ఫ్యాన్. వాడు అప్పట్లో వచ్చిన ‘జూదగాడు’ అనే సినిమా చూడాలని అనుకున్నాడు. అందుకే అమ్మకి మహాబలుడు సినిమాకని చెప్పి, జూదగాడు చూసి వచ్చాము. సాయంత్రం అమ్మా, నాన్నా సాయంత్రం మహాబలుడు సినిమాకు వెళ్తుంటే, మేమూ వస్తామని అన్నాము. ‘అదేవిట్రా మీరు పొద్దున్న వెళ్ళారు కదా!’ అంటే, ‘పొద్దున్న మేము జూదగాడు చూసాము’ అని చెప్పాము. అప్పుడిక మామూలుగా కొట్టలేదు.
స్నేహితులతో దాగుడుమూతలాట ఆడినప్పుడు, నేనెప్పుడూ థియేటర్ లో దాక్కునేవాడిని. అంత సినిమా పిచ్చండి నాకు.

ఇది బాగుందండి. సినీరంగ ప్రవేశం కోసం స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా రావికొండల రావు గారి చుట్టూ 8 నెలలు తిరిగారట?
మామూలుగా కాదండి. అదొక పెద్ద కధ రాయచ్చు. చేతిలో డబ్బుండేది కాదు, విపరీతమైన నడక. ప్రతి సారి మద్రాస్ వెళ్ళడానికి డబ్బులు వెతుక్కోవడం, ఆ తర్వాత ఇంట్లో దొరక్కుండా ఉండడానికి ఏదో కారణం వెతుక్కోవడం, (నవ్వేసి), అలా నేను ఇంట్లో చెప్పిన కధలన్నీ సినిమా తీస్తే ఈరోజున నేను వెయ్యి సినిమాల దర్శకుడిని అవుతాను.
రావికొండల రావు గారు చిన్నప్పుడు ఒక పోస్ట్ కార్డు మీద ప్రతి ఉగాదికి మా నాన్నగారికి శుభాకాంక్షలు పంపేవారు. అందులో ’42, అభిరామ పురం, మద్రాస్’ అని ఉండేది. ఆ కార్డులు నేను 6,7 తరగతులు చదువుతున్నప్పుడు మా ఇంటికి వచ్చేవి. తర్వాత మా ట్రాన్స్ఫర్ల వల్ల మిస్ అయ్యాయి. సినిమాల్లోకి వెళ్లేందుకు అదొక్కటే నాకున్న ఆధారం. అందుకే ఆ ఒక్క పోస్ట్ కార్డు పట్టుకుని, మద్రాస్ వెళ్లి విపరీతంగా తిరిగాను. ఆయన ఇల్లు పట్టుకోడానికే నాకు నాలుగైదు ట్రిప్పులు పట్టిందండి. ఇంట్లో డబ్బులు అడిగితే ఇవ్వరు కాబట్టి ఆల్ ఇండియా రేడియో కి నాటకం రాయడం, ఆ చెక్ రాగానే డ్రా చేసుకోవడం, చెన్నై వెళ్ళిపోవడం, ఇలా చేసేవాడిని. ఇక చెన్నై వెళ్తే ఖర్చులెక్కువ కనుక, ప్రయాణం ఖర్చులు తగ్గించుకోడానికి హైవే మీద వెళ్ళే ట్రక్లు ఎక్కేవాడిని. వాళ్ళు 10 -25 రూపాయిలు ఇస్తే, నెల్లూరు దాకా దింపేసేవారు. పినాకినీ ఎక్ష్ప్రెస్ మొదటి ప్రయాణం ఫ్రీ కనుక, ఆ ట్రైన్ రైల్వే మినిస్టర్ లాంచ్ చేసిన రోజున నేను, మా ఫ్రెండ్ అందులో ప్రయానించాము. ఇప్పుడతను ప్రొడ్యూసర్ గా, నేను డైరెక్టర్ గా మేమిద్దరం సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యాము.

మీరు రచనలు చేస్తారని చెప్పారు కదా, ఈ అభిరుచి మీకు ఎలా కలిగింది?
మా నాన్నగారి ప్రోద్బలమేనండి. మాకు ఏ మాత్రం అక్షరం ముక్క అబ్బిందన్నా అది ఆయన చలవే. మాకు ఇష్టమున్నా లేకపోయినా ఆయన వినిపించిన తెలుగు పద్యాలే మా చెవుల్లో మారుమ్రోగేవి. మంచి మంచి పుస్తకాలు చదవడం మాకు అలవాటు చేసారు. తర్వాత ఆరుద్ర గారి ‘కూనలమ్మ పదాల్ని’ ఏదో ఒక టాపిక్ తీసుకుని, మాతో చెప్పించేవారు. అవి సరళమైన కవిత్వమని, ‘ఉప్పు లేని పులుసు, కంటిలోని నలుసు, చెప్పుకుంటె అలుసు, ఓ కూనలమ్మా’ ఇలా కొన్ని పదాలు కట్టి, మమ్మల్ని చెప్పమనేవారు. ఇలా లయబద్ధంగా ప్రయత్నించడం వలన సాహిత్యం వచ్చిందండి.

మీరు చదువు తర్వాత మీ అమ్మగారి వద్ద తీసుకున్న ఐదేళ్ళ గడువులో మీరు నేర్చుకున్న అమూల్యమైన అంశాలు ఏమిటి?
చాలా ఉన్నాయండి. ఇండస్ట్రీ కి రాకముందు మన ఆవేశాలు కాని, ఆలోచనలు కానీ ఒక్కటీ ఆచరణకు సాధ్యం కానివని బాగా తెలిసింది. ఇది పూర్తిగా విభిన్నమైనది. ఏదో సినిమా చూసి, ‘అమ్మా, నీకిదే ప్రమాణం చేస్తున్నాను. ఐదేళ్ళలో డైరెక్టర్ అవుతాను,’ అని చెప్పినంత ఈజీ కాదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా నేనొక రేస్ గుర్రంలా పనిచేసాను, నా కెరీర్ మంచి చోట మొదలైంది, అందుకని దక్షిణ భారతంలోని ఆరుగురు పెద్ద స్టార్స్ తో పని చేసాను. కమల హాసన్, రజనీకాంత్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, వంటి వారితో పనిచెయ్యడం వలన దర్శకత్వం సులువయ్యింది. ఈ సహదర్శకుడి నుంచి దర్శకుడిగా మారే ప్రక్రియలో కూడా నేనొక ఏడాదిన్నర పాటు విపరీతమైన స్ట్రగుల్ అనుభవించాను. ‘నువ్వంటే నాకిష్టం’ అనే నా మొదటి సినిమా మొదలై ఆగిపోయింది. వెనకెళ్ళి సహా దర్శకుడిగా చేరలేను, ముందుకెళ్ళి సినిమా తియ్యలేను, రాసుకున్న కధ ఏం చెయ్యాలో తెలీదు, ఇలా ఉండేది నా స్థితి. నేను అనుకున్నట్టుగా ఐదేళ్ళలో ఆఫర్ వచ్చినా, ఏడున్నర ఏళ్ళ తర్వాత అదృష్టవశాత్తూ దర్శకుడిని అయ్యాను.

‘మనసంతా నువ్వే’ సినిమాని ఎన్నిసార్లైనా చూడచ్చు. ఈ కధకి ప్రేరణ ఏమిటి?
దీనికి చాలా ఉన్నాయండి. ఇదొక బ్రెయిన్ చైల్డ్ అనేకంటే, ‘కూర్పు’ అని చెప్పవచ్చు. ఈ కూర్పులో నా మేధస్సు కంటే, క్రియేటివిటీ ఎక్కువ పనిచేసింది. ఇలా తీస్తేనే ప్రేక్షకులకు నచ్చుతుంది అని అంచనాలు వేసుకునే వాడిని. నాపై ఏ ఎక్ష్పెక్టేషన్లు లేకపోవడం కూడా నాకు ప్లస్ పాయింట్ అయ్యింది. ఎం.ఎస్.రాజు గారి లాంటి ప్రొడ్యూసర్ ఉండడం వల్ల నాపని సులువయ్యింది. ఆయన అనుభవం సినిమాని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి బాగా ఉపయోగపడింది. అప్పటికే రెండు సినిమాలు చేసి ఉన్న ఉదయకిరణ్ హీరోగా, పరచూరి బ్రదర్స్ మాటల రచయతలుగా, మొత్తం పాటలు సిరివెన్నెల గారే రాసేలా చేసినందువల్ల  అన్నీ కుదిరాయి. సినిమా రెండొందల రోజులు ఆడింది.

అతి చిన్న వయసులోనే దర్శకులుగా మారారు కదా, అప్పుడు మీరు తీసిన తొలి చిత్రమే ఘన విజయం సాధించినప్పుడు మీరు ఎలా అనుభూతి చెందారు?
నాకసలు ఏ ఫీలింగ్ లేదండి. నాకు పూర్తిగా క్లారిటీ ఉంది. ఆ సినిమా హిట్ అవుతుంది అంటే, హిట్ అవ్వాలి, అంతే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సినిమాలో అంజలి లాగా నాకు అన్నీ ముందే తెలిసిపోయేవి. ఈ సినిమా విజయంతో నాకేమీ పెద్ద ఎక్సైట్మెంట్ కలగలేదు. ఈ సినిమా హిత అయ్యాకా, నా మైండ్ ఖాళీ అయిపొయింది. నిజానికి, తర్వాత ఏం చెయ్యాలో నాకు తెలీలేదు. కష్టపడి ఒక మాచ్ గెలుద్దామని అనుకోవడం వేరు, ఆ గెలుపు ఇంకా ఐదారు బాల్స్ ఉండగానే ఒక సిక్సర్ తో వచ్చేసిందే అనుకోండి, తర్వాత ఏం చెయ్యాలి? ఆ ఖాళీ నాలో ఉండిపోయింది.

మరి మీ తర్వాత అడుగు ఎలా పడింది?
అది నేను అనుకుంటే వచ్చింది కాదు, అలా పడిపోయింది. బూరుగుపల్లి శివరామకృష్ణ గారి వద్ద నేను ‘ప్రేమంటే ఇదేరా’ సినిమా టైం లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను. ఆయన ఉదయ్ కిరణ్ డేట్స్, తమిళ దిల్ సినిమా రైట్స్ తీసుకుని, మంచి దర్శకుడి కోసం వెతుకుతూ ఉన్నారు. అప్పటికే మనసంతా నువ్వే సినిమా డబ్బింగ్ టైం లో మంచి పేరు ఒచ్చేసింది. ఎందుకైనా మంచిది, మన కుర్రాడే కదా అని, నాకొక యాభై వేలు అడ్వాన్సు ఇచ్చారు. ఎప్పుడు ఎం.ఎస్.రాజు గారు , కృష్ణ గారు చెయ్యమని పదేపదే కోరడం వలన, కేవలం నిర్మాత లాభపడతారన్న నమ్మకంతో తీశాను. అలాగే జరిగింది.

మీరు సినిమాలు తీస్తున్న సమయంలో జరిగిన వినోదభరితమైన సంఘటన ఏమైనా ఉందా?
చాలా ఉన్నాయండి. ఒకసారి నేనున్నాను సినిమాలోని ‘నీకోసం నీకోసం’ పాత  షూటింగ్ న్యూజిలాండ్ లో అవుతోంది. అప్పుడు సెలవలు కావటాన అఖిల్ మాతో వచ్చాడు. మేమంతా కలిసి ఒక టీం లాగ క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం. మేము ఏ లొకేషన్ కు వెళ్ళినా బస్సు దిగటం, ఒక ప్లాస్టిక్ కుర్చీని వికెట్లుగా పెట్టుకోడం, టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడడం చేసేవాళ్ళం. ఈ లోపు అంతా షూటింగ్ కు రెడీ అయ్యేవారు. అయినా నేను ఓ కన్ను షూటింగ్ మీద వేసి ఉంచేవాడిని. రాజు సుందరం గారు దూరంగా నాగార్జున, శ్రేయ మీద షాట్స్ తీస్తున్నారు. మధ్యలో నేను బాటింగ్ చేస్తూ చూస్తే, హీరో హీరొయిన్లు ఇద్దరూ చాలా ఆర్తిగా స్లో మోషన్లో వచ్చి, కళ్ళనీళ్ళతో హత్తుకునే సన్నివేశాన్ని సుందరం గారు ‘నీకోసం నీకోసం’ అన్న లైన్స్ పై తీస్తున్నారు. నాకొక్కసారి ఫ్యూస్ కొట్టేసింది. వెంటనే బాట్ పడేసి, పరుగెత్తి సుందరం మాష్టారి దగ్గరకు వెళ్లి, ‘దీనికి ఖచ్చితంగా చిన్న పిల్లలు కూడా అనుకరించే స్టెప్ కావాలి. క్లైమాక్స్ ముందు ఇలాంటి సెంటిమెంట్ పాట తీసామా, అందరూ లేచి వెళ్ళిపోతారు,’ అన్నాను. నాగార్జున గారు, ‘ఏం లేదు, నేనే ఈ స్టెప్స్ ఎమోషనల్ గా ఉండాలని చెప్పాను, నీకెందుకు, వెళ్లి క్రికెట్ ఆడుకో’ అన్నారు. ‘లేదు సార్, ప్లీజ్ స్టెప్స్ వెయ్యండి’ అని బ్రతిమాలుతూ ఉంటే, ఇలా ఆడుతూ పరిగెత్తుకు వెళ్లానని అక్కడున్న అందరూ నవ్వసాగారు. ఇది చూసే, నాగార్జున గారు ఈ సినిమాలో గల్లి క్రికెట్ లీడ్ సీన్ పెట్టారు.
అలాగే శ్రీరాం సినిమా క్లైమాక్స్ లో ఉదయకిరణ్, ఆశిష్ విద్యార్ధి భయంకరంగా కొట్టుకుంటారు. ఆశిష్ అవసరమైన దానికంటే కాస్త ఎక్కువ చేస్తారు. అంటే, షూటింగ్ సమయంలో ఆ ఆక్షన్ ఎక్కువ అనిపిస్తుంది, తెరపై చూసినప్పుడు సరిపోతుంది. ఆయన ఆ ఫైట్ లో బాగా ఇన్వోల్వ్ అయిపోయి, ‘హా హు’ అని విపరీతంగా అరుస్తుంటే, నేను కెమెరా పక్కన నిల్చుని, నవ్వసాగాను. అప్పుడాయన నన్ను,’నువ్వు ఫైట్లు తియ్యడానికి పనికిరావు పో, అని, నీ నవ్వులు చూస్తే, నాకు ఎమోషన్స్ రావటంలేదని’ నన్ను పక్కకు పంపెసేవారు. ఇప్పటికీ ఇది తలచుకుంటే నవ్వొస్తుంది.

మీ జీవితంలో మీరు మర్చిపోలేని ప్రసంశ ఏమిటి?
ఒకరోజున తెల్లారుజామున ఆరున్నరకు ఫోన్ అండి. ‘బాబూ నేను విశ్వనాథ్ ని, ఆరు నెలలుగా నీ నెంబర్ కోసం ట్రై చేస్తున్నానమ్మా’ అన్నారు. ‘ఏ విశ్వనాథ్ అండి, ‘ అంటే, ‘కె.విశ్వనాథ్’ అన్నారు. ‘అరె, మీరు నా నెంబర్ ట్రై చెయ్యడం ఏమిటి సర్, మీరు కబురు చేస్తే నేనే వచ్చి వాలేవాడిని కదా, ‘ అన్నాను.’నీకో సంగతి చెప్పాలి, గత ఆరేడు నెలలుగా నేను మార్నింగ్ వాక్ లో ‘ఏ శ్వాసలో చేరితే’ పాటనే వింటున్నాను,’ అన్నారు. ‘అదేంటండి, మీరు తీసిన సినిమా పాటల కంటేనా, అవి చూసే పెరిగిన వాళ్ళం, అందుకే అలాంటి పాట వచ్చింది,’ అన్నాను. ‘కాదు, మా తరం తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో క్లాసికల్ టచ్ అన్నది బ్రతికి ఉండదని అనుకునే వాడిని, కాని, ఇటువంటి పాటను అందరినీ ఒప్పించి సరైన సందర్భంలో నువ్వు వాడినందువల్ల, ఇంకా నా తర్వాత శంకరాభరణం లాంటి మంచి సినిమాలు తీసే దర్శకులు ఉన్నారన్న నమ్మకం నాకు కలిగింది, ఇది నేను గర్వంగా చెప్తున్నాను,’ అన్నారు.
ఆయనే నాకు రోల్ మోడల్. రెండుసార్లు నన్ను మెచ్చుకున్నారు. మనసంతా నువ్వే తర్వాత, నీ స్నేహం ముహూర్తానికి ఆయన వచ్చారు. అందరం దణ్ణం పెట్టాము. ‘మనసంతా నువ్వే’ డైరెక్టర్ ను తీసుకురమ్మని ఆయన ఎం.ఎస్.రాజు గార్ని పంపారు. నేను గదిలోకి వెళ్ళేసరికే చాలా హడావిడిగా ఉంది. నన్నొక చూపు చూసి, ‘నేనడిగింది నిన్ను కాదయ్యా, మనసంతా నువ్వే దర్శకుడిని’ అన్నారు. ‘నేనే సర్’ అన్నాను. ‘ఆదుర్తి సుబ్బారావు లాగా 55 ఏళ్ళు ఉంటాయేమో అనుకున్నాను. నువ్వేంటయ్యా చిన్న కుర్రాడిలా ఉన్నావు’ అన్నారు ఆశ్చర్యంగా. అంటే, ‘అప్పట్లో మా నాన్నగారికి ఆదుర్తి సుబ్బారావు గారి వద్ద పనిచేసే అవకాశం వచ్చిందండి, కాని వెళ్ళలేదు. అందుకే ఆదుర్తి గారి సినిమాలన్నీ మాకు చూపించారు. అందుకే ఆ ప్రభావంతోనే ఇలా తీశాను,’ అన్నాను. ఈ రెండూ నా జీవితంలో మర్చిపోలేని ప్రసంశలు.

ఒక సినిమాకి కావాల్సింది ఏమిటి? భారీ బడ్జెట్, సెట్టింగ్స్ లేక హీరోలా? తెలుగు ‘ప్రేక్షకుల నాడి’ ని మీరు తెలుసుకున్నారా?
తెలుగు ప్రేక్షకుడికి ఒక మంచి సినిమా కావాలండి. ధియేటర్ లో కూర్చుంటే వాళ్ళను విసిగించకుండా, అసహనానికి గురి చెయ్యకుండా, అసందర్భ ప్రేలాపనలు, అనవసరమైన ఆయాసాలు లేకుండా సినిమా తియ్యాలి. ప్రేక్షకులు అల్ప సంతోషులు. అందుకే వాళ్ళను ప్రేక్షక దేవుళ్ళు అన్నారు. మనం ఇండస్ట్రీ లో కూర్చుని వేసిన లెక్కలన్నీ తప్పే. నేను ధియేటర్ లో కూర్చుని వేసిన అంచనాలే కరెక్టని, నేను తెలుసుకున్నాను. రాఘవేంద్రరావు గారు ఇలా అనేవారు, ‘మన ప్రేక్షకులు ఎంత భోలా వారంటేనయ్యా, మనం ఒక సూపర్ హిట్ సినిమా తీస్తే, అది రీమేక్ అని తెలిసినా మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. ఘరానామొగుడు సినిమా సంగతి చెప్పి, అది తమిళ్ రీమేక్ అయినా, ఆహా, రాఘవేంద్రరావు ఎంత బాగా తీసాడో అంటారు. అదే రాఘవేంద్రరావు చిరంజీవితో ‘మంచి దొంగ’ అని ఒక స్ట్రెయిట్ సినిమా తీస్తే, ‘రాఘవేంద్రరావు బిజీ గా ఉండి, ఎవరికో అప్పగించారు, అందుకే ఇలా అయ్యింది’ , అంటారు అంత గొప్పవాళ్ళు ప్రేక్షకులు.

మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటండి?
నేను 100 % సినిమాలకు మాత్రమే పనికొస్తానని నాకు తెలుసండి. ప్రస్తుతానికి తెలుగు సినిమాలకు మూడు కొరతలు ఉన్నాయి, మన పక్కింటి అమ్మాయిలా కనిపించే తెలుగు హీరొయిన్లు, మంచి యువ తెలుగు కధా రచయతలు, దర్శకుడిని నిజంగా నమ్మే మంచి నిర్మాతలు. ఒక దర్శకుడు దర్శకుడిగా, రచయత రచయతగా ఉంటేనే బాగుంటుంది. కొత్తవారు సినిమా తియ్యడంలో వేర్వేరు ఉద్దేశాలు ఉంటున్నాయి. రామానాయుడు గారు, అన్నపూర్ణ స్టూడియోస్ వంటి గొప్ప సంస్థలు ఇదివరలో ఉండేవి. ఇప్పుడొచ్చే నిర్మాతలకు సినిమా తియ్యడం అన్నది ఒక విసిటింగ్ కార్డు లాంటిది. పై మూడింటినీ బాలన్స్ చేసినప్పుడు వచ్చే గొప్ప సినిమాలు తియ్యడానికి నేను విపరీతంగా కృషి చేస్తున్నాను. ఇలాంటి టీం తో మంచి సినిమాలు తియ్యాలన్నదే నా కోరిక.

శ్రీ ఆదిత్య గారు కలకాలం నిలిచిపోయే సినిమాలు తీసి, విజయ శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటోంది - అచ్చంగా తెలుగు.
ఆదిత్య గారితో నా ముఖాముఖిని క్రింది లింక్ లో వినండి.

No comments:

Post a Comment

Pages