వేణుగోపాల భక్త శిరోమణి ---- శ్రీ వీణ కుప్పయ్యార్ - అచ్చంగా తెలుగు

వేణుగోపాల భక్త శిరోమణి ---- శ్రీ వీణ కుప్పయ్యార్

Share This
వేణుగోపాల భక్త శిరోమణి ---- శ్రీ వీణ కుప్పయ్యార్
-మధురిమ 

ఒక కళను గురువుల దగ్గర అభ్యసించడం,అందులో విశేషమైన కృషి చెయ్యడం ,ఉన్నతమైన కళాకారునిగా పేరు తెచ్చుకోవడం ఇవన్నీ జరగాలంటే పూర్వజన్మ సుకృతం,దైవ బలం తోపాటు సంకల్ప బలం అన్ని కావాలి కదా, మరి ఒక వాయిద్యాన్ని అభ్యసించడం ద్వారా వాయిద్యానికే గొప్పపేరు తెచ్చి, వాయిద్యంతో తనపేరుని పెనవేసుకుని ఆచంద్రార్కం వర్ధిల్ల  గలుగుతున్న వ్యక్తి ఎంతట మహానుభావులైఉంటారు???ఎంతటి విశిష్టమైన దైవకృప కలిగియున్నవారై ఉంటారు???
వారేతన అసమానమైన,అనన్యసాధ్యమైన వీణావాదనా నైపుణ్యంతో సరస్వతీదేవి హస్తాలలో నిత్యం శోభిల్లే వీణనే తన ఇంటిపేరు గా మార్చుకోగలిగిన వైణికులు,గాన చక్రవర్తి బిరుదాంకితులు సంగీతత్రిమూర్తులలో ఒకరైన శ్రీత్యాగరాజస్వామి వారి ప్రియశిష్యులు,ఎందరో శిష్యులకు,ప్రశిష్యులకు సాటిలేని మేటి గురువు అయిన శ్రీ వీణకుప్పయ్యార్.
త్యాగరాజస్వామి వారికి ముఖ్యశిష్యులైన వీరు (1798-1860) కాలమునకు చెందినవారు. మద్రాసుకు ఆరుమైళ్ళు దూరంలో ఉన్న తిరువొత్తియ్యూర్ గ్రామానికి చెందినవారు.తమిళ బ్రాహ్మణులు.భారద్వాజ  గోత్రీకులైన వీరు సుప్రసిద్ధ వైణికులగు శ్రీ సాంబమూర్తిశాస్త్రులవారి కుమారులు.సాంబమూర్తి శాస్త్రిగారు ఎంతటి ప్రతిభావంతులంటే "సాంబడు వాయించాలి సాంబడే వినాలి" . ఇక్కడ సాంబడంటే ఈశ్వరుడే వినాలి అని ప్రజలు  చెప్పుకునేవారట.బాల్యంలో సంగీతశిక్షణ తండ్రిగారి దగ్గర ప్రారంభించి తండ్రికి తగ్గ  తనయుడిగా కుప్పయ్యగారు చిన్నతనమునుండి సంగీతములోను,అంతేకాక సంస్కృతములోను,తెలుగులోను కూడా గొప్ప ప్రతిభా పాండిత్యాలను ప్రదర్శించేవారట.
తరువాత శ్రీ త్యాగరాజస్వామి వారి శిష్యులుగా వారితో సుమారు 20సంవత్సరాలు కలిసిఉండి వారి ప్రియశిష్యులవలె మెలగుతూ ఆయనదగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉండేవారట.త్యాగరాజస్వామి వారుకూడా కుప్పయ్యార్ గారి ప్రతిభాపాఠవాలు చూసి ఎంతో ఆనందించేవారట.కాని త్యాగరాజస్వామి దగ్గరకి వచ్చినప్పుడు తను అసలు వీణ వాయిస్తాననే చెప్పలేదుట.కాని త్యాగరాజస్వామి వారి ఇంటిలో ఉన్న వీణ ఒక్కసారైనా వాయించితీరాలి అని మాత్రం అనుకునేవారట.ఓసారి  త్యాగరాజస్వామి వారు,వారి శిష్యులు ఓరోజు  ఇంట్లోలేని సమయంలో వారి వీణ కుప్పయ్యార్ గారు తీసి వాయిస్తున్నారట. ఆద్భుతమైన వీణావాదన విని త్యాగరాజస్వామి వారి భార్య ఎవరువాయిస్తున్నారా అని వచ్చిచూసి కుప్పయ్యార్ గారు వాయించడం చూసి కూడా ఆశ్చర్యపోయారట.వీధిలో గుమ్మం దగ్గరికి రాగానే ఇంటిలోనుంచి మధురవీణా నాదం వినిపించడంతో త్యాగరాజస్వామి వారు గుమ్మం దగ్గరే నిలబడి అలా వింటూనే ఉండిపోయారట.కాసేపైనతరువాత ఇంత అద్భుతంగా వాయిస్తున్నవారి చూడాలనే ఉత్సుకతతో లోపలకి వెళ్ళి కుప్పయ్యార్ వాయించడం చూసారట.
గురువుగారిని చూసిన కుప్పయ్యార్ గారు కూడా కంగారు పడి ఒణుకుతున్న చేతులతో వీణని పక్కనపెట్టి,గురువుగారి అనుమతిలేకుండా వీణని ముట్టుకున్నందుకు క్షమింపమని ఆయన కాళ్ళపై పడ్డారట.కాని త్యాగరాజస్వామి అమితానందంతో..శిష్యుణ్ణి లేవదీసి ఆనందంతో ఆలింగనంచేసుకుని ఇంత అద్భుత వీణావాదనా నైపుణ్యం కలిగిననువ్వు నాకు విషయాన్ని ఎందుకు చెప్పలేదు అని ఆశ్చర్యపోయారట.
గురువుగారి ఆశీర్వాదంతో కుప్పయ్యార్ గారు జగదభి రామ వంటి  ఎన్నో దివ్యనామ సంకీర్తనలు,బేగడ వంటి అపూర్వ రాగాలలో వర్ణాలు,కృతులు,తిల్లానాలు రచించారు.నారయణగౌళరాగం,రీతిగౌళ రాగం  కుప్పయ్యర్ గారి ఇంటిసొత్తు అని ఆరోజులలో  అందరు చెప్పుకునేవారట. ఎందుకంటే అంత అద్భుతంగా రాగాలని పాడేవారట. ఈయనను నారయణగౌళ కుప్పయ్యార్ అనికూడా పిలిచేవారట..అంతేకాదు రాగాలలో ఆయన రచించిన వర్ణాలు  పండితుల కచేరీలలో ఇప్పటికీ వినిపిస్తూనేఉన్నాయి.
కుప్పయ్యార్ గారి కులదైవము మరియు వారి ఇష్టదైవము శ్రీ రాధ,రుక్మిణి సహిత వేణుగోపాలస్వామి.అందుకే గోపాలదాస అనే ముద్రతో వారి రచనలన్నీ సాగాయి.వీణ కుప్పయ్యార్ గారు కోవూరు అస్థాన విద్వాంసులు.వీరి రచనా శైలి కూడా గురువుగారైన త్యాగరాజస్వామి వారి రచనలకి దగ్గరగానే ఉంటాయి.గురువుగారి వలె వేంకటేశ్వర పంచరత్నాలు, శ్రీకాళహస్తీశ్వర పంచరత్నాలు, తిరువొత్తియ్యూరు త్రిపురసుందరీ అమ్మవారి పై విశేషంగా 8 కృతులు రచించారు.
వీరు కొంతకాలం మద్రాసు నగరంలో ఉన్నతరువాత తిరువొత్తియూర్లో స్థిరనివాసం ఏర్పరుచుకుని అక్కడే ఉన్నారు.మద్రాసులో ఉన్నప్పుడు వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిపేవారట.గొప్ప గొప్ప విద్వాంసుల కచేరీలు ఏర్పాటుచేసేవారట. కుప్పయ్యార్ గారు మద్రాసులో ఉన్నప్పుడు వారి ఆహ్వానాన్ని మన్నించి వారి ఇంటికి గురువుగారైన త్యాగరాజస్వామి తిరుపతి తీర్థయాత్రకి వెళుతూ శిష్యుని ఇంటికి వచ్చి  పావనం చేసారట.కుప్పయ్యార్ గారి ఇంట్లో ఉన్న రాధ రుక్మిణీసమేత వేణుగోపాలస్వామి విగ్రహం చూడగానే ఆత్మానందభరితులై "వేణుగానలోలుని కాన వేయి కన్నులు కావలెనే" అన్న కృతిని గానంచేసినారటత్యాగరాజస్వామి. సమయం లో వారింట ఉన్నప్పుడు దేవగాంధారి రాగమును  నిర్విరామంగా ఆరురోజులు గానంచేసారట
ఆరోజుల్లో కళలకు కాణాచి అయిన మైసూరు సంస్థానాన్ని 1856 సంవత్సరంలో దర్శించారట.అప్పుడు మైసూరుకు మహారాజు గా ఉన్న శ్రీ కృష్ణరాజవొడయార్ గారి సమక్షంలో మైసూరు చాముండేశ్వరి అమ్మవారిపై ఇంతపరాకేలనమ్మ అన్న పాట రచించి పాడగా, సంగీత సాహిత్యాలకు పరవసించిన రాజావారు "గాన చక్రవర్తి" అన్న బిరుదు తో సత్కరించారు.
మద్రాసు నగరంలో సంగీత కచేరీలు ఇప్పుడు ఇంత విరివిగా జరగడానికి కుప్పయ్యార్ గారు ఆరోజుల్లో జరిపిన సంగీత సభలే మూలమని ఇప్పటికీ చాలామంది ప్రముఖులు  అభిప్రాయపడతారు.ఈవిధంగా తాను జీవించిన 72 సంవత్సరములు సంగీతంతోనే సహవాసం చేసిన ధన్యులు శ్రీ వీణ కుప్పయ్యార్.
వీరి శిష్యులలో ప్రముఖులు వారి అబ్బాయి అయిన తిరువొత్తుయ్యూర్ త్యాగయ్యార్,శ్రీ కొత్తవాసల్ వెంకటరామయ్యార్,ఫిడేల్ పొన్నుస్వామి మొదలైన వారు.
కుప్పయ్యార్ గారికి ముగ్గురు అబ్బాయిలైతే  తన గురుభక్తికి ప్రతీకగా ఒక అబ్బాయికి త్యాగయ్యార్ అని పేరుపెట్టుకున్నారు.ఆయన తిరువొత్తియ్యూర్ త్యాగయ్యార్ గా తన తండ్రి గారి సంగీతవారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మహావిద్వాంసులు.తన తండ్రిగారి రచనలన్నీ "పల్లవి స్వరకల్పవల్లి" అన్న పుస్తక రూపంలో అచ్చువేయించారు.వీరు కూడా ఎన్నో తానవర్ణాలు,కృతులు రచించారు.దర్బారు రాగంలో వీరి వర్ణం ఎంతో ప్రసిద్ధి చెందినది.

No comments:

Post a Comment

Pages