ఆంధ్ర కేసరి - ఆంధ్రకేసరి - టంగుటూరి ప్రకాశం - అచ్చంగా తెలుగు

ఆంధ్ర కేసరి - ఆంధ్రకేసరి - టంగుటూరి ప్రకాశం

Share This
ఆంధ్ర కేసరి - ఆంధ్రకేసరి - టంగుటూరి ప్రకాశం( 1872 - 1957 )
                                                                                                 వ్యాసకర్త: కొంపెల్ల శర్మ


ఆంధ్రకే సరి - 'అంధ్రకేసరి’ టంగుటూరి
అతి సాధారణ కుటుంబంలో పుట్టి, ఆధునికాంధ్ర ప్రజానాయకుల్లో అసాధారణంగా ఎదిగి, ప్రజలే ప్రకాశం, ప్రకాశమే ప్రజలు” అనిపించుకున్న నిస్వార్ధజీవి. అంధ్రమాత ముద్దుల బిడ్డ - టంగుటూరి ప్రకాశం పంతులు. స్వాతంత్య సమరంలో ఒక సేనాని లాగా అగ్రభాగాన నిలచి ప్రజలను ఆకర్షించి, ఉత్తేజపరిచి కార్యోన్ముఖులను చేశాడు. సైమన్ కమీషనుకు వ్యతిరేకంగా రొమ్ము విరిచి పోరాడాడు. 'ఆంధ్రకేసరిగా గణుతికెక్కాడు. న్యాయవాదిగా ఆర్జించిన లక్షలాది రూపాయలు, ఆస్తిపాస్తులు దేశంకోసం హారతికర్పూరంలా వెచ్చించిన త్యాగశీలి, సాహసి, ప్రజాహిత తత్పరుడు ప్రకాశం పంతులు. సహాయ నిరాకరణ ఉద్యమానికి ఊతగా 'స్వరాజ్య’ పత్రిక స్థాపించాడు. ఆంధ్రకాంగ్రేసు అధ్యక్షుడుగా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన సేవలు మరపురానివి. ప్రకాశంపంతులు జీవిత చరిత్ర 'నా జీవితయాత్ర’ ఆయన నిజాయితీకి, నిష్కళంక జీవితానికి అద్దం పట్టి జాతికి స్ఫూర్తి కలిగిస్తుంది.
బాల్యంలోనే హుషారుతనం, కుటుంబంలో అష్టకష్టాలు
గోపాలకృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు 23 ఆగష్టు 1872 న ప్రకాశంగారు జన్మించారు. వల్లూరులో చదువులు ప్రారంభమవ్వగా, అక్షరాలదిద్దుబాటుతో అల్లరితనం, గుండ్లకమ్మ ఈత, సాముగరిడీలు, రౌడీల సహవాసం, వ్యాయామాదుల్లో దిట్టతనాన్ని ప్రదర్శించారు ప్రకాశం వారు. తండ్రి మరణం, తల్లి బ్రతుకుతెరువు కోసం పూటకూళ్ళమ్మ పనితో పిల్లలను చదివించింది. తలవంపులు, ఆత్మగౌరవానికి కించిత్తు భంగం అయినా, పిల్లల బాగోగులను దృష్టిలో పెట్టుకుని, ధైర్యంతో ముందడుగు వేసింది. చాలని సంపాదన వల్ల, వారాలు చేసుకోవడం, పరీక్ష రుసుము కోసం పాతికమైళ్ళు నడచినా లాభించని ఫలితం, తల్లి పట్టుచీర తాకట్టు పెట్టడం, ఫలితాలని యివ్వకుండా పోలేవు కదా. అందరికంటే అధికమార్కులతో ఉత్తీర్ణత నిదర్శనమే.

నాటకకళాసేవాభిరుచి నుంచి న్యాయవాది వరకు
ధార్వాడ నాటకకంపెనీ నాటకాలను ఒంగోలులో వీక్షించడం, ఉర్దూనాటకరచయిత ఉండవల్లి సాహెబ్ ప్రేమాభిమానాలు, స్త్రీపాత్ర ధారణలో తెచ్చుకున్న మంచిపేరు, మిషన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు నాయుడుగారి చలవవల్ల చదువు అబ్బింది. న్యాయవాది కావాలన్న పట్టుదల, మంజూరీ అయిన చాలీచాలనివేతనం మూలాన, ఒంగోలునుంఛి రాజమండ్రి మకాము మార్చడం జరిగింది. మద్రాసు లా కాలేజీలో న్యాయశాస్త్రం చదువు, ఒంగోలులో కొంతకాలం వృత్తి చేయడం, నాయుడుగారిపై ప్రేమవల్ల తిరిగి రాజమండ్రి చేరి స్థిరపడడం జరిగిపోయింది. అలతికాలంలోనే రాజమహేంద్రవరం లో సహన్యాయవాదులకు కంటిపై కునుకు లేకుండ ప్రకాశంగారు వెలిగిపోయారు. ప్రతిభ తప్పక దారులను కల్పిస్తూనే వుంటుంది. ఆంధ్రలో తొలి పురపాలకసంఘస్థాపన రాజమండ్రి అవ్వడం, పోటీదారులను చిత్తుచిత్తుచేసి అధ్యక్షులై నగరపరిపాలనా వ్యవస్థలో కడుమన్ననలను పొందారు.
'
మకారత్రయం పై తల్లితో ప్రతిన'
మకారత్రయంగా పిలువబడే - మద్యం, మాంసం, మగువ లను ముట్టనని మాతృమూర్తి సమక్షంలో ప్రతినబూని, మిత్రప్రోత్సాహంతో, బారిష్టరు పదవికోసం లండనుకు దీక్షాయానం చేశాడు. స్వయంపాకం, శాకాహారంతో చదువు పూర్తిచేయడం, భారతసంఘంలో సభ్యత్వం, దాదాభాయినౌరోజి ని బ్రిటిష్ పార్లమెంటుకు విజయానికి సహాయ సహకారాలనివ్వడం, చదువులో ప్రతిభావంతుడిగా గుర్తింపు కూడ మరొక అధ్యాయంగా ప్రకాశం వారి జీవితంలో జరిగిన సంఘటనలు.

న్యాయమూర్తి బౌద్ధికంగా అవినీతిపరుడు
బారిష్టర్ హోదాతో మద్రాసు హైకోర్టులో వృత్తిని సాగించిన రోజుల్లో, ప్రకాశంగారితోబాటు, యోధులైన భాష్యం అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్, నార్టన్, గ్రాంట్ లాంటి న్యాయవాదదిగ్గజాల మధ్య పేరుపొందడమేకాదు, ఆ వృత్తిపై నిస్వార్ధంగా చెణుకులు, విసుర్లు చెప్పుకున్న చతురుడు. అందుకే ఆత్మవిశ్వాసం, నిరంతర పరిశ్రమ, నిర్భయత పుష్కళంగా పుణికిపుచ్చుకున్న, ప్రకాశం కనువిప్పుగా 'లాటైమ్స్’ పత్రికలో వ్యాసం వ్రాస్తూ, 'న్యాయమూర్తి బౌద్ధికంగా అవినీతిపరుడు’ అని సద్విమర్శ చేశారు. చదువుకోసం అప్పుచేసిన ప్రకాశం, స్వంత గ్రంధాలయం, మంచిపేరు, సంపాదనలను సాధించారు.

గతచరిత్రను మరవని మహనీయులు
తన గతచరిత్రను మరవని ప్రకాశం, సంపాదన తర్వాత విర్రవీగక, బంధుమిత్రకుటుంబాల్ని, పలువిధాలుగా సహాయాలు చేసిన ఘనాఘనులు. పొందిన సహాయానికి కృతజ్ఞతాపూర్వకంగా నాయుడుగారి కుటుంబానికి కూడ సహాయం చేయడం మరువలేదు. తమ్ముళ్ళు శ్రీరాములు, జానకీరామయ్యను కూడ చదువులు చెప్పించారు. శ్రీరాములుగారి కూతురే, ప్రఖ్యాత నటీమణి టంగుటూరి సూర్యకుమారి ఆ కుటుంబంలోని ప్రతిభాముత్యమే.
గాంధి కన్నా మున్ముందుగానే రాజకీయరంగ ప్రవేశం
జాతీయోద్యమం పై ఆకర్షణతో, భారత రాజకీయరంగంలో గాంధీజీ కన్న ముందుగానే, ప్రకాశంగారు ప్రవేశించారు. 1908 లో ప్రముఖ జాతీయనాయకుడు బిపిన్ చంద్రపాల్ మద్రాసు సభలోని ఉపన్యాసాన్ని విని కడు ప్రతిభాప్రేరణలను పొందారు ప్రకాశంగారు. నూతనాధ్యాయం ప్రారంభమైన ఆ సుదినం, ప్రకాశాన్ని, ఆయన జీవితాన్ని, దేశసేవకు పుణ్యాంకితం అయేలా చేసింది. అది భారతావని, ప్రత్యేకంగా ఆంధ్రసీమ, చేసుకున్న పుణ్యంగానే భావించాలి.
స్వరాజ్య పత్రిక ద్వారా సేవలు
జాతీయభావప్రచారవాహినిగా మద్రాసులో 'స్వరాజ్య పత్రిక 1921 లో దినపత్రికగా వెలిసింది. ప్రముఖవర్గం, ఖాసా సుబ్బారావు, కోటంరాజు పున్నయ్య, కృపానిధి లాంటి పాత్రికేయ ఘనాపాటీలు స్వరాజ్యాన్ని ఆకాశానికి ఎత్తివేశారు. ఎవరైనా పైకివస్తూ పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటే, వీటితో అసూయాద్వేషాలు, కంటికి నిదురరాని శతృవులు దాపురిస్తారు. ఆనాటి నుండి ఈనాటి వరకు తనదైన ప్రత్యేకతను నిలుపుకున్న తమిళపరంగా చెలామణి అవుతున్న 'ది హిందూ' అంగ్ల పత్రిక తన ఆధిపత్యానికై స్వరాజ్య పత్రికను అణచివేతకు కంకణం కట్టుకుని ఎన్నో ప్రయత్నాలు చేసినా, స్వరాజ్య పుష్కరకాలంపాటు దిగ్విజయ యాత్ర చేసింది. సునిశిత విమర్శలకు, విశ్లేషణలకు స్వరాజ్య ఆనాడు సరిసములులేని దశదిశల్లో నడిచేది. చివరికి నీతిగా, ఒకరిని కిందకి తొక్కితేగాని మరొకరు పైకెక్కడం భారతరాజకీయాల్లో సుసాధ్యం కానేకాదు అనే భావించవలసివస్తోంది. రాజకీయాల్లోకి పత్రికలు ప్రవేశించడం మాట ఎలావున్నా, పత్రికల్లో రాజకీయాలు ప్రవేశించడం ఆనాటినుంచి వున్నాయన్నది మాత్రం తధ్యం.
గాంధి, రాజాజీలు కూడ ప్రకాశం తర్వాతే
1929లో మద్రాసుకు సైమన్ కమీషన్ పర్యటన. నిరసనగా బహిష్కరించవద్దని ప్రకాశానికి గాంధి సలహానిచ్చినా లెక్కచేయని ప్రకాశం, గోడమీదపిల్లిలా నల్లకళ్ళజోడులోంచి రాజకీయాలను నడిపించిన రాజాజీ అటూ, యిటూ, కాని తెలివైన రాజకీయం, అందరికీ తెలిసినదే. 'సైమన్ కమీషన్ ని బహిష్కరిస్తూ, 'సైమన్ గో బేక్' అని గర్జించిన వేలాదిమంది  ప్రజాప్రదర్శనకు, ప్రకాశం, దుర్గాబాయి, రంగయ్యనాయుడులు నాయకత్వం వహించారు. తుపాకీలగురికి ఎదురొడ్డిన ప్రకాశం, తన నగ్నఛాతిని చూపి, 'రండిరా యిదె కాల్చుకొండిరా' అని గుండెలిడిన గండశూరుడు మన టంగుటూరికి తుపాకులు తలవంచక తప్పలేదు, వేరేదారి లేదు కనక. ఈ సంఘటన ప్రకాశం రాజకీయజీవితం మరింత సుప్రకాశవంతమై రాణించింది. ప్రకాశం గారు సత్యాగ్రహోద్యమాల్లో ముమ్మరంగా పాల్గొనడం, జైలుశిక్షను అనుభవించడంతోబాటు, గాంధీజీని సైతం లెక్కచేయకపోవడంలో, అంధ్రనాయకుల్లో ప్రకాశం ప్రధములుగానే చెప్పాలి.

ప్రకాశం నుంచి సేవాపర్వాలు
సర్దారుపటేలు సలహామేరకు ప్రకాశం మద్రాసునుంచి కాంగ్రేసు అభ్యర్ధిగా విజయం, రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూమంత్రిగా నియామకం, ఆంధ్రకు చేసిన ఘనసేవలు, నభూతోనభవిష్యతి అని చెప్పాలి. మచ్చుకు కొన్ని – రాయలసీమకరువుని ప్రత్యక్షంగా ఎదుర్కోవడం, శిస్తు రెమిషను, ముజరా సౌకర్యాలు, నేటికీ మరువలేని సత్యాలు. క్విట్ యిండియా మూలాన జైలుశిక్ష తర్వాత, ప్రజల ప్రేమాభిమానాలను పుష్కళంగా అందుకున్న ప్రకాశం మద్రాసు ముఖ్యమంత్రిగా, ఫిర్కా అభివృద్ధి ప్రవేశం, ఉత్పత్తి, వినియోగదారుల సహకార సంఘాలస్థాపన లాంటి ప్రత్యక్ష ప్రయోజనాత్మకమైన పనులను చేయడంలో ప్రకాశం తన ప్రతిభను పట్టుదలను ప్రదర్శించారు. రాణింపు రాజకీయాన్ని అధికకాలం నిలవనియ్యరు. అదేపని గాంధిజీ, రాజాజీ లు పన్నిన కుట్ర, కుతంత్ర, కుహనా రాజకీయాలకు ప్రకాశం ప్రభుత్వం పతనానికి దారితీసింది. గాంధిజీ విశ్వభారతానికి మహాత్ముడు కావచ్చు. కాని కొందరికే దర్శనమయ్యే పాక్షిక రాజకీయం ఆయనది. ఈ దక్షిణ భారతీయ రాజకీయానికి రారాజు రాజాజీ. ఆయన రాజకీయప్రస్థానంలో అంకాలు, అధ్యాయాలు ఆయన శైలిలో తమిళదేశపు స్వార్ధరాజకీయాలే తప్ప వేరు కావన్నది సత్యం. గాంధిజీకి ఈ రాజకీయమే సన్నిహితుడ్ని చేసింది కూడాను. ప్రకాశం గారికి కాంగ్రేసుకి విడాకులు యిచ్చి, ప్రజాపార్టీని ప్రారంభించక తప్పలేదు. ప్రత్యేకాంధ్ర కొరకు పొట్టిశ్రీరాములు ఆత్మార్పణతో వెలసిన ఆంధ్రరాష్ట్రం 1953 అక్టోబరు 1 న అవతరణ, ప్రకాశం పంతులుగారిని కర్నూలు రాజధానిగా, ముఖ్యమంత్రితో సఫలీకృతం అయ్యాయి. టంగుటూరి ప్రకాశం అందించిన ఆంధ్రుల గర్వసంకేతాలుగా, శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయం, కృష్ణాబ్యారేజి స్వతంత్రం నిర్మాణం, మచ్చుతునకలు.

సర్వసల్లక్షణసారసంగ్రహం - టంగుటూరి ప్రకాశం పంతులు గారు
సాహసమే ఊపిరి, మొనగాళ్ళకు మొనగాడు, కలిమిలేముల్ని, మంచిచెడ్డల్ని సమదర్శనం గావించిన స్థితప్రజ్ఞత్వం, కృషియే దైవంగా భావన, రాజకీయ రణరంగపు మహాభారతంలో అపర వీర భీష్మాచార్యగా ప్రకాశంగారిని ప్రవచించకుండా మనలేము.
1957
మే 20 వ తేదేన టంగుటూరి ప్రకాశం దివంగతులైనారు.'ఆంధ్ర కే సరి, ఆంధ్రకేసరి’ – టంగుటూరి’ అయినాడని మాత్రం చింతించని ఆంధ్రుడు లేడు అని మన ప్రకాశం పంతులుగారి విషయం లో అందరూ ఏకీభవిస్తారు అన్నది తధ్యం. 





ప్రకాశంగారిపై పెద్దల అభిప్రాయాలు
దేశనాయక శిఖామణియై, తెలుగుజాతి ప్రకాశమ్మై, అవతరించిన ఆంధ్రకేసరి అమరుడైన పురారి అతడు- గాలితోనైనా పోట్లాడే స్వభావం కలవాడు ప్రకాశం. - అయ్యదేవర కాళేశ్వరరావు.
ప్రమాదములున్న చోటనే ప్రకాశంగారుంటారు. –భోగరాజు పట్టాభి సీతారామయ్య
భవ్యగుణముల దివ్యఖనియై భారతాంబకు ముద్దుబిడ్డయి గాఢమైన స్వరాజ్య కాంక్షల గండుమీరిన శూరుడాతడు, సరిసములులేనట్టి యాతడు ప్రజలకున్దేశాభిమానము పంచిపెట్టిన నేతయాతడు.
ఎందరో పుడుతుంటారు, గిట్టుతుంటారు. ప్రకాశం అంతటి వాడు పుట్టడం సామాన్యమా! పుట్టినా వానికి గిట్టుటలేదు. ఆచంద్రతారార్కమూ జీవించియే యుంటాడు ప్రజల హృదయాల్లో.
“మహనీయుల జీవితాలు బోధించును అనవరతం, మనమూ మనజీవితాలను చేయగలం మహోన్నతం, వీడెదము కాలపుతడియిసుకలతీరముపై, మనదు అడుగుజాడలను – పోవుచుధీరులమైఅన్న అమెరికన్ కవి హెచ్.లాంగ్ ఫెలో భావంతో ఈ వ్యాసానికి భరతవాక్యం పలకటం సముచితం. 

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి (ఆగష్ట్ 23) సందర్భంగా శత సహస్ర వందనాలను సమర్పిస్తూ, ప్రకాశం అసమాన ప్రతిభకు వేనోళ్ళ కొనియాడుతూ, నివాళిని సమర్పించుకుంటోంది– అచ్చంగా తెలుగు.
కొంపెల్ల శర్మ – తెలుగురథం (9701731333)


No comments:

Post a Comment

Pages