శ్రీమద్భగవద్గీత -11 - అచ్చంగా తెలుగు
శ్రీమద్భగవద్గీత -11
ఐదవ అధ్యాయము 
కర్మసన్యాసయోగము
రెడ్లం రాజగోపాల రావు

శ్రీ భగవానువాచ
యోగయుక్తో విశుద్ధాత్మా
విజితాత్మాజితేంద్రియః
సర్వభూతాత్మ భూతాత్మా
కుర్వన్నపినలిప్యతే
7వశ్లోకం
కర్మయోగమునాచరించువాడు శుద్ధమైన హృదయము కలవాడును,మనస్సును జయించిన వాడును, ఇంద్రియములను జయించిన వాడును,అన్ని ప్రాణులయందుండు ఆత్మయు, తన ఆత్మయు ఒకటేయని తెలుసుకొనిన మనుజుడు కర్మలనాచరించిననూ కర్మలచేనంటబడడు

ఈ లక్షణములన్నియు జ్ఞాని యొక్క లక్షణములే తురీయ స్తితి యందు కర్మయోగము,జ్ఞానయోగము ఒకదానికొకటి పోలియుండును.పైన చెప్పబడిన గొప్పగుణములుగలిగిన మనుజుడు కర్మయందు తగుల్కొనడు.అట్లుగాక కామ్యభావముతో,మలిన చిత్తముతో,నిగ్రహించబడని ఇంద్రియములతో నాచరించిన కర్మలు బంధకములగును.
అంతఃకరణము అనేక చెడు సంకల్పములతోను చెడు గుణములతోను కూడియున్నచో జీవుడాచరించు కర్మ మలినముగానేయుండును.సర్వభూతములయందు తనయాత్మయే గలదను భావము గల మనుజుడు పరప్రాణికి అపకారము చేయలేడు.దయ,ప్రేమ,కరుణ మున్నగు సుగుణములు ఆతని క్రియలందు వ్యక్తమగును కావున ముముక్షవులు సద్గుణములను తప్పక ఆచరించవలయును
బ్రహ్మణ్యాధాయ కర్మాణి
సజ్ఞ్గం త్వక్తాకరోతియః
లిప్యతేన సపాపేన
పద్మపత్రమివామ్భసా
10వ శ్లోకం
ఎవడు తాను జేయు కర్మలను పరమాత్మ కర్పించి ఆసక్తిని విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిచే అంటబడనట్లు పాపముచే అంటబడకుండును.తానుజేయు సతస్తకర్మలను భగవంతునికి సమర్పించి బాహ్యవిషయములన్నియు అద్దమందు ప్రతిబింబమువలే బ్రహ్మమందు కల్పితములైయున్నవని భావించి కర్మలనాచరించువానికి బంధముగాని పాపముగాని అంటనేరదు. జీవన్ముక్తులగు మహనీయులు తాము తరించి ఇతరులను తరింపజేయు నిమిత్తము ఎన్నియో కార్యములను నిరంతరము చేయుచున్నను కర్మబంధము అంటకయున్నారు.కర్మయోగమందలి రహస్యమిదియే.
సర్వ కర్మాణిమనసా
సన్న్యస్యాస్తేసుఖంవశీ

నవద్వార పురేదేహీ 
నైవకుర్వన్నకారయన్
13 వ శ్లోకం
మానవ జీవితము ఆనందమయముగానెట్లుండగలదో ఇచ్చటచెప్పబడుచున్నది.ప్రధమముగా మానవుడు తన ఇంద్రియములను స్వాధీనపగుచుకొనవలెను.ఇంద్రియములు స్వాధీనమందున్న మనుజుని సాధన త్వరితగతిని ఫలవంతమగును.అలలులేని సరోవరమున చంద్రబింబము స్వచ్ఛముగా కనిపించునటుల తేజోమయుడైన భగవంతుడు మనుజుని మనస్సులోతిష్థవేసుకొనును ఇంద్రియ నిగ్రహపరుడగు యోగి ఆత్మయందు నిలకడగలవాడై మనస్సుతో సహా దృశ్యరూపములగు సమస్తకార్యములను త్యజించివైచి సాక్షిగానుండుచు ఈ దేహపట్టణమున సుఖముగనుండుచున్నాడు నిమిత్తమాత్రునిగా కర్మచేయుచు,కర్మఫలాన్ని భగవదర్పణచేయు మనుజునికి బంధరాహిత్యము కలుగుచున్నది.ఆతడు తామరాకు పైన నీటిబొట్టువంటివాడు.
జ్ఞానేనతుతదజ్ఞానం
యేషాంనాశితమాత్మనః

తేషామాదిత్యవజ్ఞానం
ప్రకాశయతి తత్పరమ్
16వ శ్లోకం
ఆత్మ జ్ఞానముచే ఎవని అజ్ఞానము నశింపజేయబడినదో అట్టివారి జ్ఞానము స్వస్వరూపానుభవమును గలుగజేయుచున్నది.ఆత్మ జ్ఞానమును ప్రయత్నపూర్వకముగా శ్రవణ,మనన,నిదిద్యాసముల ఎవరు సంపాదించుకొందురో అట్టివారి అజ్ఞానము జ్ఞానముచే పటాపంచలగునని తెలియుచున్నది.ఆత్మవస్తువు సూర్యునివలె స్వయంప్రకాశమైనది.సుర్యుని మేఘములు కప్పివైచినట్లు ఆత్మను అజ్ఞానము కప్పివైచుచున్నది.జ్ఞానమను ప్రచండవాయువు ఆజ్ఞానమను మేఘాలను తొలగించివైచిన పిదప ఆత్మ సూర్యుడు దేదీప్యమానముగావెలుగొందును.అదియే మోక్ష స్థితి.నిష్కామకర్మ,భక్తి,ధ్యానము, వైరాగ్యాది సాధనలచే ఎట్లైననూ దుఖఃరహితులైనవారు మోక్షమునకై ప్రయత్నించవలయును. మోహాన్ని విడుచుటయే మోక్షము.
విద్యావినయసంపన్నే 
బ్రాహ్మణేగ విహస్తిని

శునిచైవశ్వపాకేచ
పణ్డితాః సమదర్శినః
18 వ శ్లోకము
విద్య వినయము గలిగియున్న బ్రాహ్మణునియందును,గోవునందును,ఏనుగుయందును, కుక్కయందును కుక్కమాంసము వండుకొని తినుచండాలునియందును సమదృష్టిగలవారే జ్ఞానులని చెప్పబడుదురు. జ్ఞాననిష్టులు సమస్తమును ఆత్మరూపముగనే దర్శించుచుందురు వారు ప్రేమ దయయును సర్వులపై సమముగా వర్షించుదురు జ్ఞానులయొక్క సమదృష్టిని దెలుపుటకై ఇచట మానవులలోను,జంతువులలోను కొన్నింటిని ఉదాహరణగా గైకొనబడినవి.మానవులలో ఉత్తమతరగతి బ్రాహ్మణున్ని నీచ శ్రేణి నుండీ కుక్కమాంసమును తిను చండాలుణ్ణి ఎన్నుకొన్నందు వల్ల అన్ని శ్రేణులకు వర్తించినట్లాయెను.జంతువులలో గోవు ఉత్తమతరగతికి,ఏనుగు మధ్యమ తరగతికి, కుక్క అధమ తరగతిని సూచించుచున్నందువలన జంతువులన్నింటిని ఉదహరించినట్లాయెను.వీటన్నింటినీ సమముగా వీక్షించువాడే జ్ఞాని.పండితుడనగా పాండిత్యప్రకర్ష, సాహిత్యకౌశలము గల వాడిగా తలంతురు.కానీ ఇక్కడ గీతాచార్యుడు సమదృష్టికలవాడే పండితుడని నిర్వచించెను.
జనులలో కొందరికి దేహదృష్టి,కొందరికి మనోదృష్టి,మరికొందరికి ఆత్మదృష్టియుండును. దేహదృష్టిగలవారు అధములు మనోదృష్టిగలవారు మధ్యములు ఆత్మదృష్టిగలవారు ఉత్తములు.
శ్రీ ఆంజనేయస్వామి శ్రీరామచంద్రమూర్తితో రామా! దేహపరంగానీకు నాకు తేడా వుంది మనోదృష్టిలోకూడా తేడా తెలుస్తుంది కానీ ఆత్మపరంగా నీవు నేను ఒకటే అన్నాడు.సమదృష్టి కలిగిన జ్ఞానుల నుండీ ఉద్భవించిన కారుణ్యం మానవాళినందరినీ కప్పివేయగలదు.వారి ప్రేమకు అవధులుండవు.
చాలా సంవత్సరాలకు ముందు విషయం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు బెంగుళూరు నుండీ పుట్టపర్తి కారులో వస్తున్నారు.రాత్రి ప్రయాణం వారికి కారు డ్రైవర్ గా శ్రీ రాజారెడ్డిగారు కారును నడుపుతున్నారు.రాజారెడ్డిగారు కూడా ఆ జన్మ బ్రహ్మచారి బాబావారికి విధేయత కలిగిన భక్తుడు. వెనక సీటులో బాబావారు యోగనిద్రలో వున్నారు జాగ్రత్తగా కారు నడుపుతున్న రాజారెడ్డిగారు దిగ్భ్రాంతికి గురయ్యారు.కారుకి కొంచెం దూరంలో పెద్దపాము రోడ్డుకడ్డంగాపోతూవుంది.బ్రేకువేయకపోతే పాము కారుకింద పడిపోతుంది.బ్రేకు వేస్తే స్వామికి నిద్రాభంగమవుతుంది.అనన్య భక్తుడైనరాజారెడ్డి బ్రేకు వేయకుండా స్పీడుగా కారు పోనిచ్చాడు.ఈ సంఘటన చిక్కబళ్ళాపురం దగ్గర జరిగింది. కొద్దిసేపట్లో కారు ప్రశాంతినిలయం చేరింది.స్వామివారు మందిరానికి వెళ్ళి రాజారెడ్డిని పిలిచారు. రాజారెడ్డికి స్వామివారి వీపుపై ఏర్పడ్డటైరు గుర్తులను చూపించేసరికి రాజారెడ్డికి దుఃఖం వచ్చింది.
ఇదే "సర్వభూత హితేరతాః"       
ఇట్లు
సర్వజన శ్రేయోభిలాషి
మీ రెడ్లం రాజగోపాల రావు
పలమనేరు

No comments:

Post a Comment

Pages