నీకు నేనున్నా – 11 - అచ్చంగా తెలుగు
నీకు నేనున్నా – 11
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com

(జరిగిన కధ: చదువుకునేందుకు హైదరాబాద్ ప్రయాణం అవుతుంటాడు మనోహర్. అతని అక్క కూతురు పద్మ మావయ్యను ఏడిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని, పెద్దల యోచన. పట్నంలో తాను చూసిన ఇంటి ఓనర్ కూతురు మధురిమ మనోహర్ మనసులో ఏదో తియ్యని అలజడిని రేపుతుంది. మధురిమ అక్క చనిపోవడంతో, ఆమె చంటిబిడ్డను పెంచుతూ ఉంటుంది మధురిమ తల్లి. ఒక రోజు బాబును ఆడిస్తున్న మనోహర్ గదికి, బాబును తీసుకోవడానికి వెళ్ళిన మధురిమను చూసి, ఆమె తనకు దక్కలేదన్న అక్కసుతో వారిద్దరికీ సంబంధం ఉందని పుకార్లు పుట్టిస్తాడు హరి. దాంతో పెళ్లి కాన్సిల్ అయిన మధురిమ అనేక అవమానాల పాలు అవుతుంది. గది ఖాళీ చేస్తానన్న మనోహర్ ను వారిస్తుంది మధురిమ తల్లి. మనోహర్, మధురిమ ఇరువురికీ ఒకరిపై ఒకరికి ప్రేమ భావన ఎక్కువౌతూ ఉంటుంది. మధురిమకు పెళ్ళైపోయిందని అబద్ధమాడి, అతని అక్క కూతురైన పద్మతో అతని వివాహం జరిపిస్తుంది అతని తల్లి. అనుకోకుండా మళ్ళీ కలిసిన మనోహర్, మధురిమ పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తుంటారు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి మళ్ళి వస్తానని చెప్పి వెళ్లి, అనుకోకుండా మనోహర్ కి ఆక్సిడెంట్ అయి కోమాలో ఉండిపోతాడు. దానితో అనాధలైన మధురిమ, బాబులను తనతో తీసుకు వెళ్లి ఆశ్రయమిచ్చి, మధురిమకు ఉద్యోగం ఇప్పిస్తాడు దామోదర్ రెడ్డి. మధురిమతో లేడీస్ హాస్టల్ పెట్టిస్తారు చరణ్, విక్రం . హాస్టల్ లో చేరే ఆడపిల్లల విభిన్న మనస్తత్వాలతో కొత్త సవాళ్ళను ఎదుర్కుంటుంది మధురిమ . అందులో వర్ష అనే అమ్మాయి దూకుడుగా ప్రవర్తించి హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది .)
మధురిమ హాస్టల్" వెకేట్ చేసి వేరే హాస్టల్లో జాయిన్ అయింది వర్ష.ఆ హాస్టల్లో వర్ష వుండే రూంలో ఐదుగురు అమ్మాయిలు వున్నారు. ఆ అమ్మాయిలు చాలా డిఫరెంట్గా వున్నారు.
వాళ్లలో ఒక అమ్మాయికి అలంకరణ, అందం గురించి అసలు పట్టదు ఇంకో అమ్మాయి ఆరోగ్యం బాగున్నా ఎందుకో కాలేజీకి వెళ్లదు. మరో అమ్మాయి పనీ పాటూ లేనిదానిలా అటూ ఇటూ తిరుగుతూ ఎదురు షాపు కెల్లి ఏదో ఒకటికొని తింటుంది. ఇంకో అమ్మాయి పక్కపక్కనే కూర్చుని నెట్లో"హలో... హాయ్. చెప్పకోవటం కోసం రోజూ నెట్ కెళ్తుంది. ప్రక్కబెడ్ అమ్మాయి మాత్రం చాటింగ్లో కొత్తగా పరిచయం అయిన ఫ్రెండ్ని లవర్ గా వూహించు కుంటూ ప్రక్కవాళ్ల బుర్రను ఐస్క్రీంలా తింటుంది. ఆ అమ్మాయి పేరు చార్ని.
అందరిలో కన్నా చార్మియే వర్షకి బాగా దగ్గరయింది. ఒక్క చార్మితప్ప మిగతా అమ్మాయిలు ఆ రూంలో వున్నా లేనట్లే అన్పిస్తున్నారు. డల్గా వుండే ఆ వాతావరణం వర్షకి సరిపోవటం లేదు. చార్మి లేనప్పడు ఒంటరిగా, మౌనంగా గడపాల్సి వస్తుంది.మౌనంలోంచి ఏదో మార్పు పుట్టింది వర్షలో.
కాలేజీలో ఒకవైపు ర్యాగింగ్ జరుగుతున్నా, మరోవైపు క్లాసులు జరుగుతున్నాయి.
జీమ్స్ వేసుకోవడం మానేసింది వర్ష. ఎందుకు మానేసిందో వర్షకే స్పష్టంగా తెలియదు. చుడీదార్లు, సేల్వార్ల్లు వేసుకుంటుంది. ట్రెడిషనల్ గా కన్పిస్తున్నఆ డ్రెస్ లో వర్ష అందంగా వుంది. అసలే వర్షది చూపు తిప్పకోలేని అందం. ఇప్పడింకా ఆ రూపం మెరుగులద్దుకొని చూసినకొద్దీ చూడాలనిపిస్తోంది.
వర్ష తన ఫీలింగ్స్ ని ఎక్కువగా చార్మితో చెబుతుంది. వర్ష చెప్పే మాటల్లో కొత్తగా సాత్విక్ విన్పిస్తున్నాడు. సాత్విక్వర్ష క్లాస్ మేట్.
చార్మి కూడా క్లాసులో సాత్విక్ని చూస్తుంది. చార్మినే కాదు ఆ క్లాసులో అమ్మాయిలంతా సాత్విక్ ని ఇంట్రస్ట్గా చూస్తుంటారు. ఆ అబ్బాయి మాత్రం ఎవరివైపు చూడడు. చూడబుల్ గా వుంటాడు. వేసుకునే డ్రెస్ కూడా ఫార్మల్ గా వుంది, డీసెంట్ గా అన్పిస్తాడు. క్లాసులో లెక్చరర్స్ అడిగిన కొశ్చన్స్కి షార్ప్ గా ఆన్సర్ చేస్తుంటాడు. ఏ డౌట్ వచ్చినా వెంటనే లెక్చరర్స్ని అడిగి క్లియర్ చేసుకుంటాడు.
సాత్విక్ ది అందరబ్బాయిల్లా అమ్మాయిలతో మాట్లాడే స్వభావం కాదు. అక్కడంతా అబ్బాయిలు, అమ్మాయిలు క్లోజ్గా మూవ్ అవుతుంటే సాత్విక్ మాత్రం లెక్చరర్స్కి, సూడెంట్స్కి నచ్చేవిధంగా మూవ్ అవుతుంటాడు. వర్షకేమో సాత్విక్ తో మాట్లాడాలని వుంది. పరిచయం పెంచుకోవాలని వుంది. రిజర్వడ్ గా కన్పిస్తున్న సాత్విక్ తో మాటలు కలపాలంటేనే భయంగా వుంది.
పరిచయం లేకపోయినా సాత్విక్ని చూడాలన్న ఆరాటంతో ఈ మధ్యన మధ్యన ప్రత్యేకంగా అలంకరించుకొని, టిఫిన్ తినటం కూడా మరచిపోయి కాలేజీ వెళుతోంది వర్ష. సాత్విక్ దృష్టి తనమీద పడటం కోసం తన డ్రస్సింగ్ మార్చుకొంది. సాఫ్ట్ గా కూల్ గా మాట్లాడటం నేర్చుకుంది. అయినా సాత్విక్ వర్షను పట్టించుకోవటం లేదు.
మనసు ఆపుకోలేక క్లాసుకెళ్లగానే సాత్విక్ ను చూసి "హాయ్! చెప్పింది వర్ష పరిచయం లేని వ్యక్తిని చూసినట్లు చూసి "హాయ్!" అన్నాడు సాత్విక్ క్యాజువల్గా మళ్లీ వర్ష వైపు చూడలేదు. గోడకేసి తల బాదుకోవాలనిపించింది వర్షకి. తనపట్ల ఏమాత్రం చలించని సాత్విక్ని చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు.
స్వాతిక్ గుర్తొస్తే తిండి తినాలనిపించడం లేదు. నిద్రపోవాలనిపించడం లేదు. రాణా వర్ష సెల్ కి ఫోన్ చేస్తుంటే వర్షకి విసుగ్గా వుంది రాణా ఫోన్ చేసిన ప్రతిసారి వర్ష కట్ చేస్తోంది. వర్ష కట్ చేసేకొద్దీ యింకా ఎక్కువగా చేస్తున్నాడు రాణా. రాణా విసిగిపోయి మెసేజ్ పంపాడు. ఒక్కటికాదు. చాలా మెస్సేజ్ లు పంపాడు. ఆ మెసేజ్లు చూడాలన్న ఇంట్రెస్ట్ లేదు వర్షకి, మనసంతా సాత్విక్ ని నింపుకొని వున్న వర్షకి రాణా ఫోన్ కాల్స్ ముల్లులా గుచ్చుకుంటున్నాయి. అది భరించలేక తన సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని, దిండు క్రిందపెట్టుకుంది. స్వాతిక్ ను తలచుకుంటూ పడుక్కుంది.
*****
జూనియర్ల క్లాసులకి సీనియర్లు వచ్చి ఫ్రెషర్స్ పార్టీ రేపు అని డిసైడ్ చేశారు. జూనియర్ల పేర్లను ఓ లిస్టరాసి యిమ్మని అడిగారు సీనియర్లు. అలాగే రాసిచ్చారు జూనియర్లు
“ఫ్రెషర్స్ పార్టీ రూం నెంబరు ట్వంటీ సెవెన్లో జరుగుతుంది. అక్కడికి రండి! జూనియర్ అమ్మాయిలందరు శారీలు కట్టుకురండి! జూనియర్ అబ్బాయి లందరు టక్ చేసుకొని రండి!" అని జూనియర్లతో చెప్పి అక్కడ నుండి వేగంగా సెమినార్ హాల్ దగ్గరికి వెళ్లారు సీనియర్లు
సెమినార్ హాలంతా అందంగా డెకరేట్ చేశారు సీనియర్లు
ఫ్రెషర్స్ పార్టీ కోసం వర్ష పడున్న హడావుడి అంతా ఇంత కాదు. కారణం ఆ అమ్మాయి కట్టుకోబోయే శారీయే. శారీ అంటేనే సరిపడని వర్ష ఆరోజు శారీ కట్టుకోగానే తనలో తనకు తెలియని అందాన్ని చూసుకొంది. వర్ష కట్టుకున్న శారీ చార్మిది. ఆ శారీ గులాబిరంగులో వర్క్ చేసి మోడరన్ గా వుంది. చిన్న జడ అల్లుకొని, ఆ జడలో గులాబి పువ్వు పెట్టుకొంది. స్టోన్స్ నక్లెస్ సెట్ పెట్టుకుంది. అది కూడా చార్మిదే అలంకరణ పూర్తి అయ్యాక చార్ని స్మూటీ మీద ఎక్కి కాలేజీ గేటు ముందు దిగింది వర్ష.
కాలేజి గేటుముందు దిగుతున్న వర్షను చూడగానే కొందరబ్బాయిలు.....
“వావ్ మైండ్ బ్లోయింగ్! వాట్ ఎ బ్యూటీ!" అని వర్షకి విన్పించేలా అంటూ వెళ్ళిపోయారు.
వాళ్ళ మాటలు వింటున్న వర్షకి తన అందంమీద తనకి కాన్ఫిడెన్స్ పెరిగింది.
వర్ష, చార్మి రూం నెంబరు ట్వంటీ సెవెన్కి వెళ్లారు.
ఫ్రెషర్స్ పార్టీ జరిగేది ఆ రూంలోనే.
పార్టీ మొదలు కావటానికి ఇంకా టైముంది.
ఫ్రెండ్ఫంతా ఒకరినొకరు "హాయ్! అంటూ విష్ చేసుకుంటున్నారు. అక్కడంతా హడావుడిగా వుంది. సీ.డీ.లోంచి లేటెస్ట్ సాంగ్స్ విన్పిస్తున్నాయి.
అంతలో సీనియర్స్లో ఒక అమ్మాయి మైక్ పట్టుకొని
“ప్లేజ్! సిట్ రైట్ బి ఇన్ యువర్ ప్లేసెస్" అంటూ మైక్ లో చెప్పింది. ఆ అమ్మాయి అలా చెప్పగానే అబ్బాయిలు ఒకవైపు, అమ్మాయిలు ఒకవైపు కూర్చున్నారు. రంగు రంగుల శారీల్లో అమ్మాయిలు. డీసెంట్గా టక్ చేసి అబ్బాయిలు ఎవరిసీట్లలో వాళ్లు ఆ సీట్లకే గౌరవాన్ని ఇచ్చేలా వున్నారు.
ప్రిన్సిపాల్ వచ్చి కేక్ కట్ చేసి అందరికి "ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోయారు.
సీనియర్స్ అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు లేచి స్పీచ్ ఇచ్చారు.
తర్వాత యాంకరింగ్ చేసే అమ్మాయి, అబ్బాయి మైక్ పట్టుకొని "ఇప్పటివరకు మా స్పీచ్ విన్నారు కదా! ఇప్పడు మీలో ఎవరైనా వచ్చి మాట్లాడతలచుకుంటే మాట్లాడవచ్చు” అంటూ జూనియర్స్ కి ఒక ఛాన్స్ ఇచ్చారు.
స్పీచ్ ఇవ్వటానికి అక్కడున్న జూనియర్స్ ఎవరికీ ధైర్యం చాలలేదు.
స్పీచ్ ఇవ్వటానికి సాత్విక్ లేచాడు. అందరు క్లాప్స్ కొట్టారు.
వర్ష చూపులు సాత్విక్ మీదనే అతుక్కుపోయాయి.
సాత్విక్ మైక్ పట్టుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు.
“ రేస్పెక్టేడ్ సీనియర్స్ అండ్ మైడియర్ ఫ్రెండ్స్ సీనియర్స్ చెప్పిన మాటల్ని మేము తప్పకుండా పాటిస్తాము. ఇంతవరకు కాలేజీలో లెక్చరర్స్ చెప్పే లెసన్స్ మాకు బాగా అర్థమవుతున్నాయి. అలాగే మాకు వచ్చే డౌట్స్ కూడా లెక్చరర్లెంతో బాగ క్లియర్ చేస్తున్నారు. థాంక్స్ ఫర్ ద గివింగ్ అప్పార్చునిటీ ” అంటూ మైక్ అక్కడ పెట్టి కూర్చునాడు సాత్విక్.
సాత్విక్ గొంతులో విన్పించిన క్లారిటి వర్ష గుండెలో గిలిగింతలు పెట్టింది.
సీనియర్లు నిన్న రాసుకున్న లిస్ట్ లోంచి ఒక అమ్మాయి పేరు, ఒక అబ్బాయి పేరు పిలుస్తూ కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు.
ఆ గేమ్స్ చూడటానికి ఆసక్తిగా కనిపిస్తున్నాయి ఆడటానికి ఉత్సాహంగా అన్పిస్తున్నాయి.
అమ్మాయిల్లోంచి వర్షని అబ్బాయిల్లోంచి సాత్విక్ ని పిలిచి ఒకబౌల్ లో కొన్నిరకాల గింజల్ని ఉంచి, అందులోంచి సజ్జ గింజల్ని ఏరమని చెప్పారు సీనియర్లు. సాత్విక్ ప్రక్కన నిలబడి గేమ్ ఆడుతున్నందుకు థ్రిల్లింగ్ గా వుంది వర్షకి. తనకా అవకాశం వస్తుందని వూహించలేదు. కానీ అందులో ఏవి సజ్జ గింజలో తెలుసుకోవటానికి చాలా టైం పట్టింది వర్షకి. సాత్విక్ ఏరుతున్నగింజల్ని చూసి తనుకూడా ఏరటం మొదలుపెట్టింది వర్ష. కాని సీనియర్స్ ఇచ్చిన సిక్స్ టీ సెకెన్స్ లో సాత్విక్ ఎక్కువ గింజల్ని ఏరి విన్నయ్యాడు. సాత్విక్కి సీనియర్స్ ఒక చిన్న డిక్షనరీని గిఫ్ట్ ఇచ్చారు.
తర్వాత సీనియర్స్ చాలా గులాబి పువ్వులను తెచ్చి ఒకచోట పెట్టారు. జూనియర్ అమ్మాయిలందర్ని వరుసగా స్టేజీమీదకి పిలిచారు.
చూడండి జూనియర్స్! మీరంతా సీనియర్స్ దగ్గరుండే గులాబీ పువ్వులను కొని స్టేజి మీదున్న జూనియర్ అమ్మాయిల కివ్వండి! ఎంతమంది అమ్మాయిలకైనా యివ్వండి! కానీ ఇచ్చిన వాళ్లకి మళ్లీ యివ్వకూడదు" అంటూ సీనియర్స్ అబ్బాయిలు జూనియర్స్ అబ్బాయిలతో చెప్పారు.
సీనియర్స్ చెప్పినట్లే జూనియర్స్ అబ్బాయిలు సీనియర్స్ దగ్గరున్న గులాబీ పువ్వులను కొని, చాలా ఉత్సాహంగా స్టేజిమీదున్న అమ్మాయిలకి ఇచ్చారు.
ఎక్కువ పూలు వర్షకే వచ్చాయి.
వర్షను 'మిస్ రోజ్’ అనౌన్స్ చేశారు.
‘మిస్ రోజ్’ గాసెలెక్టయిన వర్షకి ఏమాత్రం సంతోషంగా లేదు. కారణం సాత్విక్ వర్షకి రోజాపువ్వు ఇవ్వలేదు.వర్షకే కాదు ఆ అబ్బాయి ఏ అమ్మాయికి యివ్వలేదు. చూస్తూ కూర్చున్నాడు.
నెక్స్ట్ గేమ్ మొదలయింది. అలా వరుసగా ఒక గేమ్ తర్వాత ఒక గేమ్ జరుగుతోంది.
సాత్విక్ విన్నయ్యినప్పడు అందరి క్లాప్స్ ఆగిపోయాక కూడా వర్ష క్లాప్స్ వినిపిస్తూ సాత్విక్ హృదయాన్ని వింతగా తాకుతున్నాయి. వర్ష ముఖంలో కన్పిస్తున్నఆనందం స్వాతిక్ మనసుని కదిలిస్తుంది.. అనుకోకుండానే సాత్విక్ చూపులు వర్ష చూపుల్ని తడుముతున్నాయి. కారణం అంతకముందు బౌల్ లో గింజలు ఏరుతున్నప్పడు సాత్విక్ ప్రక్కన వర్ష మామూలుగా నిలబడలేదు. సిగ్గుల మొగ్గయి నిలబడింది. ఆ సిగ్గు ఎప్పుడైనా బాగా యిష్టపడిన వ్యక్తి ముందే వ్యక్తం చేస్తుంది ఏ తరం ఆడపిల్ల అయినా, అది క్యాచ్ చేశాడు సాత్విక్.
ఎందరిలో వున్నా వర్ష ఎక్కువగా సాత్విక్ నే చూస్తోంది. వర్ష చూపులు సాత్విక్లో అలజడి కల్గిస్తున్నాయి. సాత్విక్ కూడా వర్షను చూస్తున్నాడు. సాత్విక్ అలా చూస్తుంటే - సాధించలేనిదేదో సాధించానన్న ఆత్మవిశ్వాసం కలిగింది వర్షలో.
వర్ష విన్నయ్యినప్పడు కూడా అందరి క్లాప్స్ ఆగిపోయాక సాత్విక్ క్లాప్స్ విన్పిస్తూ వర్ష హృదయాన్ని వింతగా తాకుతున్నాయి.
గేమ్స్ అన్నీ అయ్యాక జూనియర్లని సీనియర్లు డాన్స్ చెయ్యమన్నారు. పాటలు పాడమన్నారు. వాళ్లలా అడగ్గానే జూనియర్లలో హుషారొచ్చింది. ఒక్కసారిగా ఆ వాతావరణం సందడిగా మారింది. డాన్స్లతో పాటలతో అక్కడంతా ఒకలాంటి ఊపు, ఉత్తేజం వచ్చాయి. ఒకవైపు నుండి క్లాప్స్ విన్పిస్తుంటే జూనియర్లంతా ఉత్సాహంతో, ఉల్లాసంతో ఊగిపోతూ తమలోని టాలెంట్ ని రకరకాలుగా బయటపెట్టారు.
ఫైనల్గా అబ్బాయిలకి పెట్టిన గేమ్స్ లో సాత్విక్ విన్నయ్యాడు.
అమ్మాయిలకి పెట్టిన గేమ్స్ లో వర్ష విన్నయ్యింది.
ఆ పార్టీలో సీనియర్స్ంతా కలిసి సాత్విక్ "మిస్టర్ ఫ్రెషెర్”గా వర్షని ‘మిస్ ఫ్రెషర్’ గా డిసైడ్ చేశారు.
ఆ ఇద్దర్ని స్టేజి పైకి రమ్మని ఆహ్వానించారు సీనియర్లు.
వర్ష సాత్విక్ స్టేజిపైకి వెళ్లి నిలబడ్డారు.
విజయోత్సాహంతో ఆ ఇద్దరి ముఖాలు వెలిగిపోతున్నాయి. వర్ష తలపై కిరీటం పెట్టి ‘మిస్ ఫ్రెషర్’ అని రాసి వుండే రిబ్బంని మెడలో వేసి సత్కరించారు.
సాత్విక్ తలపై తలపాగా పెట్టి ‘మిస్టర్ ఫ్రేషేస్’అని రాసివుండే రిబ్బన్ని మెడలో వేసి సన్మానించారు.
ఆ ఇద్దరు ఆ స్టేజిపై స్పెషల్ గా ఫోకస్ అయ్యారు.
ముందుగా వర్ష కి సాత్వికే షేక్ హాండ్ ఇచ్చికంగ్రాట్స్ చెప్పాడు. థ్యాంక్స్ చెబుతూ వర్ష కూడా సాత్విక్కి 'కంగ్రాట్స్ చెప్పింది.
ఫ్రెషర్స్ పార్టీ ముగిసింది.
*****
కాలం శరవేగంగా కదులుతోంది.
వర్షతో మంచిగా మాట్లాడుతున్నాడు సాత్విక్,
సబ్జెక్ట్ పరంగా ఒకరికి ఒకరు హెల్స్ చేసుకుంటున్నారు.
సాత్విక్ ఇష్టా,ఇష్టాలను తెలుసుకొంది వర్ష
సాత్విక్ ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకొంది.
ఒకర్ని విడిచి ఒకరు వుండలేకపోతున్నారు.
సాత్విక్! నువ్వెందుకు నాకెప్పుడూ గుర్తిస్తూనే వుంటావు? ఒక్కసారి గుర్తొచ్చి వూరుకోవు. తింటున్నప్పుడు గుర్తొస్తావు. చదువుతున్నప్పడు గుర్తొస్తావు. తిరుగుతున్నప్పుడు గుర్తొస్తావు. నిద్రపోతున్నప్పుడు గుర్తొస్తావు. నువ్వలా గుర్తొస్తేనే నాకు సంతోషంగా వుంటుంది. ఎందుకిలా అన్పిస్తుంది నాకు?” అంటూ అడిగింది వర్ష.
బైక్కి స్టాండ్ వేసి, ఓ కాలు క్రిందపెట్టి బైక్ మీద కూర్చుని వున్న సాత్విక్ వర్ష నే చూస్తున్నాడు. బైక్ ప్రక్కన నిలబడి హేండిల్ పై చేయివేసి కదిలిస్తూ సాత్విక్ నే చూస్తోంది వర్ష. వర్ష చెంపల్ని ముద్దుగా తాకి, వర్ష అడిగినదానికి సమాధానంగా నవ్వాడు సాత్విక్.
నవ్వటం కాదు సాత్విక్ నాకెప్పుడూ కలగని ఫీలింగ్స్ నీ వల్లనే కలుగుతున్నాయి" అంది వర్ష. ఆలోచిస్తున్నవాడిలావర్ష ముఖంలోకి చూశాడు.
నువ్వు కూడా తక్కువేం కాదు వర్షా! రాత్రి నా కలలో భలే తమాషా చేశావు. అలాంటి తమాషాలు చెయ్యటం నీ ఒక్కదానికే చెయ్యడం సాధ్యమా అన్పించింది నాకు” అన్నాడు సాత్విక్.
ఏంటా తమాషాచెప్పు, చెప్పు " అంటూ కళ్లతోనే నవ్వుతూ అడిగిందివర్ష.
రాత్రి నిద్రపోదామని కళ్లు మూసుకున్నాను వర్షా! నువ్వు నా కనురెప్పల చాటున దాగి తెగ అల్లరి చేశావు. నా కళ్లలోంచి జారిపోతావేమోనని గట్టిగా కళ్ళు మూసుకున్నాను ... అప్పుడు నా కళ్లలో నువ్వు గుచ్చుకున్నట్లే బుగ్గల మీదికి జారావు...ఆ జారిన తడిలోంచి మళ్ళీ ఈదుకుంటూ వెళ్ళి నా కనురెప్పలపై చేరావు... ఆ తర్వాత మెల్లగా నా బుగ్గల మీదికి దిగావు... అప్పడేం చేశావో తెలుసా? పుప్పడి లాంటిదేదో నీ పెదవులతో నా బుగ్గలపై, పెదవులపై అద్దావు. నీ శ్వాసేమో బుద్దిగా నా ఊపిరిలో ఊపిరై రాత్రంతా నాతో కబుర్లు చెప్పింది. అదండీ! రాత్రి తమరు నాతో చేసిన తమాషా!” అంటూ వర్ష కళ్లలోకి చూశాడు సాత్విక్.
మధ్యలో ఎక్కడా ఆపకుండా జాగ్రత్తగా విన్నది వర్ష.
విన్న వెంటనే సాత్విక్ భుజంమ్మీద గట్టిగా గిల్లింది. కెవ్వుమన్నాడు సాత్విక్.
హాస్టల్లో ఏం తింటున్నావే! ఇంత బలంగా గిల్లావ్?" అని నవ్వుతూ అన్నాడు సాత్విక్ భుజం తడుముకుంటూ.
వాల్లిద్దరలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వుంటే, అటువైపుగా వెళ్తూ రాణా చూశాడు.
రాణా హృదయం భగ్గుమంది.
స్వాతిక్ తో మాట్లాడాలంటే వర్ష సెల్లో బ్యాలెన్స్ లేదు. అందుకే హాస్టల్కి కొద్ది దూరంలో వుండే బేకరీ ముందు నిలబడి ‘కాయిన్ బాక్స్’ లో కాయిన్స్ వేస్తూ
సాత్విక్తో మాట్లాడాలంటే వర్ష.
వర్ష భుజాల దగ్గర వెచ్చటి వూపిరి తగిలినటై, వులిక్కిపడి చూసింది వర్ష.
ప్రక్కనే రాణా నిలబడి వున్నాడు. రాణాను చూడగానే ఒక్కక్షణం షాకయింది.
ఫోన్ కట్ చెయ్యగానే అర్థం చేసుకొని వదిలేస్తాడనుకొంది వర్ష అలా వదలకుండా జిడ్డగాడిలా ఇలా వస్తాడనుకోలేదు. విసుగ్గా ముఖం చిట్టించి, ఏమిటన్నట్లుగా రాణా వైపు చూసింది వర్ష.
ఏం లేదు వర్షా!ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చెయ్యట్లేదు. ఎన్ని మెసేజ్లు పంపినా రెస్పాన్స్ లేదు. అసలు ఆ సాత్విక్ ఎవడు? నాకన్నాఎక్కువా వాడు" అన్నాడు రాణా.
సాత్విక్ని వాడు' అనగానే రాణా అంటే మండింది వర్షకి.
ఎక్కువ, తక్కువలు కొలవటానికి సాత్వికేమైనా వస్తువా రాణా! నా కాబోయే భర్త అంది ఏమాత్రం తడబాటు లేకుండా వర్ష.
మరి నేను?? అడిగాడు రాణా.
‘బాయ్ ఫ్రెండ్ వి’ అది కూడా తెలియదా రాణా? అంది వర్ష.
వర్ష మాటలు రాణాను బాగా ఉడికించాయి.
"బాయ్ ఫ్రెండ్ అంటే నీ దృష్టిలో మగవాడు కాదా? బాయ్ ఫ్రెండ్ కి మనసు ఉండదా?ప్రేమించే అర్షత ఉండదా?వుండదా?బాయ్ ఫ్రెండ్ పెళ్లికి పనికిరాని ‘మాడా’ లా అన్నాడు రాణా.
"బాయ్ ఫ్రెండ్‘మాడా’లో కాదో నాకెలా తెలుస్తుంది రాణా నేనేమైనా టెస్ట్ చేసి చూశానా?"
వర్ష మాటలు ఎక్కడో తాకినట్లే చురుక్కుమంది రాణా కి
"పొగరుగా మాట్లాడుతున్నావ్ ఏం చూసుకుని?అన్నాడు కోపంగా
“నాకేది కన్పిస్తే అది చూసుకుంటున్నాను. అది పొగరెలా అవుతుంది?”అంది చాలా నెమ్మదిగా వర్ష.
“నన్నట్టే రెచ్చగొట్టకు. తిక్కరేగి ఆ కళ్లు పీకేశానంటే మళ్లీ చూసుకోటానికి
కళ్లు కూడా లేకుండాపోతాయి నీకు" అన్నాడు రాణా
రాణా మాటలు ఆ అమ్మాయికి బాధను కల్గించాయి.
“నా కళ్ళ పీకేస్తావా? నా కళ్లు నిన్నేం చేశాయి రాణా? అంది వర్ష.వర్ష మాటల్లో ఆశ్చర్యం, బాధ మిళితమై విన్స్టించింది.
“ఏం చేశాయా!వాటికి బలుపు ఎక్కువై, మనుషుల్ని చూడటం మానేశాయి" అన్నాడు రాణా.
నువ్వు మనిషివైతే కదా చూడటానికి? అంది వర్ష రాష్ గా వెంటనేవర్ష చెంప చెల్లు మనిపించాడు రాణా.
దిమ్మ తిరిగిపోయింది వర్షకి అప్పటికప్పుడే వర్ష చెంప ఎర్రగా కందిపోయింది. మండుతున్న చేపమాను తడిమి చూసుకుంది.
“అసలు నన్ను ఈ వరంగల్ రప్పించింది నువ్విలా కొట్టటానికా? ఇది నీ ఊరని రెచ్చిపోతున్నావ్ కదూ! నువ్వు నా చెంప మీద కొట్టినట్టు సాత్విక్తో చెబుతాను. ఇక్కడ నాకెవరూ లేరని అనుకోకు’ అంది వర్ష
“చెప్పు!చెస్తే వాడేం చేస్తాడు నన్ను? అసలు నిన్ను ఈ ఊరు రప్పించింది నేను. బి.టెక్ లో చేర్పించింది నేను. నిన్ను కొట్టినా, తిట్టినా నేనే చేయాలి. మధ్యలో వాడెవడూ? వాడేమైనా బాడీ బాడీ బిల్డరా? వెదవ పోజులు కొడుతున్నావ్!”” అంటూ సాత్విక్ని అవమానించినట్లు మాట్లాడుతున్న రాణా నోరు ఎలా మూయించాలో అర్థం కావటంలేదు వర్షకి.
వర్షను తన దారికెలా తెచ్చుకోవాలో అర్థం కావటం లేదు రాణా కి.
చూడు వర్షా! ఇది నీ ఊరు కాదు కాబట్టి ఇక్కడెంత తిరిగినా నిన్ను అడిగేవాళ్లు లేరనుకున్నావ్ కదూ అడిగేవాళ్లు లేకపోవచ్చు కానీ తిరుగుతున్నప్పుడు మనిద్దర్ని చూడనివాళ్లు లేరు. నువ్వు నాతో తిరిగినట్లే ఇప్పడు సాత్విక్తో తిరుగుతున్నావ్ అప్పడు నిన్నునాతో చూసినవాళ్లే ఇప్పడు సాత్విక్తో చూస్తున్నారు. చూసేవాళ్ల దృష్టిలో నువ్వు సాత్విక్ మనిషివా? లేక నా మనిషివా? అంటూ నెమ్మదిగా వర్ష ముఖంలోకి చూస్తూ అడిగాడు రాణా.
“సరే! రాణా! తిరిగాను. తిరిగానని చూసినవాళ్ళే కాదు. నేను కూడా ఒప్పుకుంటున్నాను. అయితే ఇప్పుడేమంటావు?” అంటూ వర్ష కూడా నెమ్మదిగా అంది.
“ఏముంది? ముందు తిరిగింది నాతో కాబట్టి నన్ను పెళ్ళి చేసుకో. ఏ ప్రాబ్లం వుండదు” అన్నాడు రాణా.పెళ్లి మాట ఎత్తగానే చిర్రెత్తకోచింది వర్షకి.
నేను నిన్నుపెళ్ళిచేసుకోను" అంది కచ్చితంగా వర్ష.
“నన్ను నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఒళ్లు చీరేస్తాను” అంటూ బెదిరించాడు రాణా.
"నువ్వు చీరేస్తే చీరిపించుకోటానికి నేనంత చేతకానిదాన్ని కాదు. హరి కూతుర్ని నీ అంతు చూస్తాను" అంటూ వర్ష కూడా బెదిరించింది.
వాడెంత వెధవో నిన్నిలా గాలికి తిరగమని వదిలేశాడు" అంటూ వర్ష తండ్రి హరిని తిట్టాడు రాణా
మా డాడీని కూడా తిడుతున్నావ్? కామన్సెన్స్ లేదా నీకు?? అంది వర్ష
మీ డాడీ ఇక్కడ లేడు కాబట్టి తిట్టి వదిలేస్తున్నాను. కన్పిస్తే చంపేసేవాడ్ని అయినా నీలాంటి వాళ్లకి తండ్రులైన వాళ్లంతా చచ్చినవాళ్లతోనే సమానం. మళ్లీ వాళ్లను అదేపనిగా చంపనవసరం లేదు. ఇక కామన్సెన్స్ అంటావా? అది నాదగ్గర లేకనే నీ దగ్గర నేర్చుకున్నాను. నేను నీ దగ్గర నేర్చుకున్న కామన్ సెన్స్ అంతా మోయలేక కొంత ఇంట్లో పెట్టి వచ్చాను. నేకేమైనా అవసరమైతే చెప్పు రేపు పట్టుకొస్తాను” అంటూ ఎగతాళిగా మాట్లాడుతున్న రాణా తో మాట్లడబుద్ది కాలేదు వర్ష కి.
రాణాతో ఈ బాధేంటి?ఈ మాటలేంటి తనకి? అసలిదంతా తన తండ్రి వల్లనే జరిగింది. తన తండ్రి ఎప్పుడు చూసినా తల్లితో గొడవ పాడుతుండేవాడు. ఆవేశం వచ్చినప్పుడల్లా గొడ్డును బాదినట్లు కొడుతుండేవాడు. ఆ బాధ చూడలేక అమ్మమ్మ రోషానికి వచ్చేది. ఇక వాళ్ళతో గెలవలేక చివరకి ఆ కోపాన్నంతా తన మీద చూపిస్తుండేవాడు. ఆ తిట్లు, ఆ వాతావరణం భరించలేకనే మనశ్శాంతి కోసం ‘నెట్ కెళ్ళి కూర్చునేది ఆ టైంలో నీకునేనున్నానంటూచాటింగ్ లో పరిచయ మయ్యాడు రాణా. అలా పరిచయమైన రాణాతో ఇపుడింత తలనొప్పి వస్తుందని వూహించలేదు. ఇప్పడీ రాణాని ఎలా వదిలించుకోవాలి?
ఆలోచిస్తూ రాణావైపు చూసింది వర్ష
చూడు రాణా! సాత్విక్ నా బాయ్ఫ్రెండ్ కాదు. నేను ఇష్టపడి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి సాత్విక్కి నీకు చాలా తేడా వుంది. ఆ తేడా ఒక్కమాటలో చెరిగిపోయేది కాదు. ఇన్ని రోజులు నిన్ను బాయ్ ఫ్రెండ్ లాగే చూశాను. నా దృష్టిలో బాయ్ఫ్రెండ్ కి మంచిస్థానం ఉంది. దాని విలువ పోగొట్టకు” అంటూ ప్రశాంతంగా నచ్చచెప్పింది వర్ష. నిర్లక్ష్యంగా చూశాడు రాణా.
“నీ లాంటి దానికి కావలసింది విలువలు, ఇష్టాలు కాదు. డాబాల చుట్టూ,బేకరీల చుట్టూసినిమా థియేటర్ల చుట్టూతిప్పే డబ్బున్న అబ్బాయిలు. అయినా నిన్ను అని ఏం లాభం. నిన్ను నమ్మి నీ వెంట తిరిగే ఆ సాత్విక్ గాడిని తన్నాలి ముందు" అన్నాడు రాణా
“మధ్యలో సాత్విక్ను తీసుకురాకు. ఆ పేరు పలికే అర్హతలేదు నీకు”అంది వర్ష సీరియస్ గా సభ్యతగా మాట్లాడటం చేతకాని రాణా నోటివెంట సాత్విక్ పేరు వినలేకపోతోంది వర్ష.
“అవున్లే! ఏ అర్హతా లేని వెధవను నేను. అందుకే బుద్దిగా నా వెంట తిరుగుతున్న నిన్ను ఇప్పడు వాడివెంట తిప్పకుంటున్నాడు" అంటున్న రాణా మాటలు వర్ష ఒంటిమీద వాతలు పెడుతున్నట్లు అన్పించాయి.
నన్ను సాత్వికేం తిప్పకోవటంలేదు. నేనే సాత్విక్ని తిప్పకుంటున్నాను" అంది వర్ష అలా చెబితే రాణా వదిలేస్తాడనుకొంది వర్ష
“ఆ... నువ్వో పెద్దఅతిలోక సుందరివని నువ్వు తిప్పకుంటుంటే నీ వెంట గుడ్డివాళ్లలా తిరుగుతున్నాం" అన్నాడు వెటకారంగా.
రాణా వెటకారం వర్షను బాగా రెచ్చగొట్టింది.
మీరంత గుడ్డివాళ్లలాగ నావెంట తిరగటానికి, నేనేమైనా నడ్డిదాన్న! అందగత్తెను. నేను అందగత్తెను కాబట్టే నన్ను డాబాలకు, సినిమాలకు తిప్పాన్!
నాతో తిరగటం కోసం మీనాన్న సంపాయించిన డబ్బంతా నీళ్లలా ఖర్చుచేశావ్!నీలాంటి కొడుకులుండబట్టే తండ్రులు అప్పులు చేసి ఏడుస్తున్నారు అంది వర్ష వాస్తవాన్ని రాణా కళ్లమందు పెడుతూ.
ఆశ్చర్యపోయాడు రాణా, టైట్ ఫిట్ డైస్లతో స్పీడ్ మూమెంట్స్తో తనవెంట పిచ్చిదానిలా తిరిగిన ఆ వర్షేనా ఈ వర్ష? అనుకున్నాడు మనసులో రాణా.
“చూడు రాణా!‘బాయ్ ఫ్రెండ్’ అనే దొంగ ముసుగు వేసుకొని, హాస్టళ్లలో వుండే అమ్మాయిల వెంట తిరుగుతూ, ఏ టైంలోపడితే ఆ టైంలో ఆడపిల్లల్ని సిటీ అంతా తిప్పే నీలాంటివాళ్లు బాయ్ఫ్రెండ్లు కాదు. వీధి రౌడీలు. ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మోడరన్ రౌడీలు. నీలాంటి వాళ్లు వుండబట్టే అమ్మాయిలు సొంత అన్నయ్యల ప్రక్కన నడవాలన్నా భయపడ్లున్నారు" అంది వర్ష
వర్ష అలా అంటుందని వూహించలేదు రాణా. వర్ష తనని వీధి రౌడీతోపోల్చడం దారుణంగా అన్పించింది. ఎంత ఆపుకుందామన్నా ఆగని కోపంతో ఊగిపోయాడు రాణా.కోపంతో
“సరే! నేను ప్రొఫెషనల్ కోర్స్ చదువుతున్న మోడరన్ రౌడీనే ఒప్పకుంటున్నాను. రౌడీలకి పెళ్లిళ్లు అవుతాయి. భార్యలుంటారు. అలాగే నా భార్య స్థానంలో ఎప్పటికైనా నువ్వే వుంటావు" అంటూ కోపంగా రాణా చాలెంజ్ చేస్తుంటే వాళ్ల ఫ్రెండ్ వచ్చి రాణాని అక్కడనుండి లాక్కెళ్లాడు.
అలా వెళ్తున్న రాణా వర్షకి గడ్డిపోచలా కన్పించాడు.
అక్కడ నుండి వర్ష కదిలి హాస్టల్ కెళ్లింది.
******
ఇంకా పేరుపెట్టని కొత్త హాస్టల్ అది ఆ హాస్టల్ గేటు చాలా పెద్దగా పంది వర్ష ఉండేది ఆ హాస్టల్లోనే అని రాణాకి తెలుసు. సరాసరి వర్ష కోసం హాస్టల్లోపల కెళ్ళాడు రాణా. పర్మిషన్ లేకుండా లోపలకి రాణా వైపు కోపంగా చూస్తూ
“ఎవరు కావాలి మీకు?” అంది హాస్టల్ మేడమ్
“నాకు వర్ష కావాలి” అంటూ రాణా అడిగిన తీరు రాష్ గా వుంది.
“వర్షా!నీకోసం ఎవరో వచ్చారు" అంది హాస్టల్ మేడమ్.
లోపల నుండి రాణాను చూడగానే గుండె జల్లుమంది వర్షకి. మళ్లీ ఏం గొడవ చేస్తాడోనని భయపడింది హాస్టల్లో వుండే అమ్మాయిల ముందు ఏం మాట్లాడినా తన పరువుపోతుంది. మేడమ్ దగ్గర ఇంప్రెషన్ పోతుంది. అందుకే బయటకు రాలేదు వర్ష
నన్ను చూడగానే బయటకు రాకుండా లోపల దాక్కుంది. ముందు పిలవండి!” అంటున్న రాణా గొంతులో అదే రాష్ నెస్.
వర్ష బయటకు రాకపోవటం చూసి, మేటర్ అర్థమయింది హాస్టల్ మేడమ్ కి.
"ముందు నువ్వు బయటకెళ్లు బాబూ!” అంది కూల్ గా హాస్టల్ మేడమ్
"ముందు దాన్ని బయటకు పిలవండి! తర్వాత నేను వెళ్తాను" అన్నాడు రాణా.
‘నువ్వేదో గొడవ పెట్టుకోటానికి వచ్చినట్లున్నావ్! అదంతా ఇక్కడ కుదరదు. నువ్వు బయటకెళ్లు, ప్లీజ్!” అంది మేడమ్.
నేను వెళ్లను, అది నాకు సమాధానం చెప్పాలి. అది నన్ను పెళ్లి ఎందుకు చేసుకోదో చెప్పి తీరాలి. నా దగ్గర లేనిది, ఆ సాత్విక్ గాడిలో వున్నదేంటో నాకు తెలియాలి" అంటూ అక్కడే వున్న బల్లమీద బలంగా గుద్ది మరీ అడిగాడు రాణా.
రాణా అరుపులు విని కొంతమంది అమ్మాయిలు బయటకొచ్చారు.
ఇదేదో పెద్ద రభస అయ్యేలా వుందని హాస్టల్ మేడమ్ కంగారు పడింది.
“మీరేంకంగారుపడకండి! నేను మీ జోలికి రాను. నన్ను అది మోసం చేసింది. అది నన్నుపెళ్ళిచేసుకునేంత వరకు నేను వదలను ఆ పెళ్లేదో యిప్పడే జరగాలి. అంతవరకు నేనిక్కడ నుండి కదలను” అంటూ ఆవేశంగా పెద్దగా అరుస్తూ అక్కడే కూర్చునాడు.
రాణా అరుపులకి అమ్మాయిలంతా భయపడుతున్నారు.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages