నాన్న కోసం - అచ్చంగా తెలుగు
నాన్న కోసం
కి. శే. జంధ్యాల పాపయ్యశాస్త్రి (కరుణశ్రీ)
రచన: రవీందు కలం

అది శ్రీ జలగం రామా రావు మునిసిపల్ మెమోరియల్ హై స్కూలు, కొత్త పేట, గుంటూరు, పిల్లలందరినీ బడి ఆవరణలో ఉన్న మైదానంలో వరుసలో కూర్చో మన్నారు, ఆవరుసలలో కూర్చున్న వారిలో నేను కూడా ఒకడిని. మా తెలుగు పంతులు గారు మా బడి ప్రధానోపాధ్యాయులు గారు, తదితరులు కలసి, “శుద్ధ స్పటికము వంటి దేహఛాయ కలవాడు, స్పురద్రూపి, పట్టు పంచ, పైన పట్టు అంగీ కట్టుకొని, కళ్ళకి ఒక నల్ల జోడు ధరించి, అపర సరస్వతీ పుత్రుడిలా కని పిస్తున్న ఒక పెద్దాయనను వేదిక పైకి సాదరంగా తీసుకు వచ్చారు.
ఆయన గురించి మా అందరికి ఘనమైన పరిచయం చేయగా, తరువాత వారు ఉపన్యాసం మొదలు పెట్టి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. అప్పటికి వారి ఉపన్యాసాన్ని అర్థం చేసుకో గల ప్రజ్ఞ, వయసు, పరిణతి నాకు లేవు. కానీ వారి ఉపన్యాసంలో వారు చెప్పిన ఒక కధ నా మనస్సును బాగా ఆకట్టుకొంది.
“ఒక పిల్లవాడు, రోజూ, తన తండ్రి కనపడట్లేదు అన్న తపనతో తల్లిని పదేపదే ప్రశ్నించి నట్టు, కానీ అ తల్లి, తన భర్త సైనికుడని దేశం కోసం వీర మరణం పొందాడని కొడుకికి సమాధానం చెప్ప లేక కుమిలి పోతూ, కన్నీరు కారుస్తూ ఉన్నట్టు తరువాత కొంత కాలానికి, గుమ్మం ముందు, శవ పేటికలో తండ్రిని చూసి నట్టు, తన తండ్రి ఏ ధ్యేయంతో వీర మరణం పొందాడో, ఆ ధ్యేయాన్ని తను స్వీకరించి తనూ ఒక సైనికుడై నట్టు” చెప్పారు. తదనంతరం వారు రచించిన ఈ క్రింది కవితను పాడి వినిపించారు. మీరు దీన్ని ఒక్క సారి చదవండి.
1) నాన్నయేడే అమ్మ! నాన్నయేడే?
ఎక్కడికి పొయినాడె? ఎన్నాళ్ళ కొస్తాడె?
వస్తు వస్తూ ఏమి వస్తువులు తెస్తాడె?
రేపు వస్తా డంటు మాపు వస్తాడంటు
చూచి చూచీ కళ్ళు వాచీ పోతున్నాయి
గోలచేస్తాననీ కోప మొచ్చింది టే
అల్లరాబ్బాయినని అలిగి పోయినాడుటే 
నాన్నయేడే అమ్మ!  నాన్నయేడే?
2) అదుగదుగొ మబ్బుల్లో అందాల జాబిల్లి
పంచ కల్యాణి పై బాబయ్య రాడేమె?
ఆ కొండ మీదుగా ఆ మబ్బులో నుంచి 
నాన్న మన యింట్లోకి నడచి వస్తాడుటే?
నాన్నయేడే అమ్మ!  నాన్నయేడే?
3) నిన్న నీ వొళ్ళోను నిదుర పోతుంటేను
నాన్న కల్లో కొచ్చి నన్నెత్తుకున్నాడె
చల్లగా మెల్లగా వొళ్ళంత నిమిరాడె
మా నాన్న చేతుల్లో మైమరచి పోయినానె
నాన్నయేడే అమ్మ! నాన్నయేడే?
4) నాన్న చల్లని చెయ్యి నాన్న తియ్యని ముద్దు
మరచి పోదామన్న మరవు రాకున్నాయె!
తన వెంట ననుగూడ గొనిపోదునన్నాడె
కన్ను లెత్తే సరికి  కనుపించనే లేదె
నాన్నయేడే అమ్మ! నాన్నయేడే?
5) నీ కళ్ళ లో యిన్ని నీటి ముత్యా లేమె!
గుండె టకటక యిట్లు కొట్టు కుంటుం దేమె!
ఎక్కెక్కి యేడుస్తూ యేమి లే దంటావు
చేతు లివి  చూడవే చిక్కి పోయినా యెంతొ
నాన్నయేడే అమ్మ! నాన్నయేడే?
6) రేపు లెన్నో పోయె బాపూజీ రాడాయె
మాయ మాటలు చెప్పి మరపించు తున్నావు
నన్నయిన పంపవే నాన్న దగ్గర కెళ్ళి 
అమ్మ యేడుస్తున్న దని పిల్చు కొస్తాను 
నాన్నయేడే అమ్మ! నాన్నయేడే?
7) అందరబ్బాయిలతో ఆడుకో బోతేను
జనమంత నా వైపు జాలిగా చూస్తారె
నాన్నలే కేడ్చేటి నాలాంటి పసి వాళ్ళ
కన్నీళ్లు తుడుచి, ఓదార్చి వస్తాడుటే
నాన్నయేడే అమ్మ! నాన్నయేడే?
8) ఎక్కడికి పొయినాడె? ఎన్నాళ్ళ కొస్తాడె?
వస్తు వస్తూ ఏమి వస్తువులు తెస్తాడె?

హృదయంతరాళములను తట్టే సునిసిత మైన భావాలను, కరుణరస భరితముగా తన కలంతో పలికించ గల మహనీయుడు మరెవరో కాదు “కరుణశ్రీ” అనే కలం పేరుతొ సుప్రసిద్ధులైన కి. శే. జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు. ఈ మహా కవిని ఈ రకంగా తలచుకునే అదృష్టం మాకు కలిగింది.
తెలుగునాట ఎందరో సాహితీ వేత్తలు వారి విభిన్న సాహిత్య ప్రక్రియల ద్వారా సమాజ ఉద్ధరణని, భారతీయ సంసృతి సంప్రదాయాలని, కుటుంబ వ్యవస్థని పటిష్ట పరచటంలో తమ వంతు కృషి చేసారు అనటంలో అతిశయోక్తి లేదు. అటువంటి మహనీయులందరికీ మరొకమారు మా హృదయ పూర్వక నమస్సుమాంజలి ఘటిస్తూ, మీ అందరికీ ఈ రోజు “Father’s Day” సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు తున్న మీ రవీందులు.
***

No comments:

Post a Comment

Pages