అమ్మ చూసిన అమ్మెరికా! - అచ్చంగా తెలుగు

అమ్మ చూసిన అమ్మెరికా!

Share This
అమ్మ చూసిన అమ్మెరికా!
పెయ్యేటి రంగారావు

పార్వతమ్మ ఇప్పుడు ఫారిన్‌రిటర్న్‌డ్!!
ఆరు నెలల పాటు అమెరికాలో వాళ్ళ అబ్బాయి, కోడలు దగ్గిర వుండి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించి మొన్ననే భారతదేశానికి తిరిగి వచ్చింది. ఔను! విలాసవంతమైన జీవితమే. ఇక్కడ పల్లెటూరులో చిన్న పెంకుటింటిలో ఒక్కర్తీ, ఒక రిఫ్రిజిరేటరు గాని, ఒక ఎయిర్ కండిషనర్ గాని, ఒక కలర్ టి.వి. గాని, ఆఖరికి ఒక మిక్సీ గాని, ఒక గ్యాస్ పొయ్యి గాని లేకుండా అతి సామాన్యమైన జీవితం గడుపుతోంది ఆవిడ. ఆవిడకు మొదటి కానుపు అయిన పదినెలలకే ఆవిడ భర్త అయిన సదానందం గారు పట్నంలో పాదచారిగా వెడుతూ, రోడ్డు పక్కన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఆటోలను, స్కూటర్‌లను, లారీలను ఆపి, ఆబగా వారినుంచి సొమ్ములు వసూలు చేసుకుంటూండగా, కారు పందాలేసుకుని, పట్టపగలు, మిట్టమధ్యాహ్నం, విపరీతమైన ట్రాఫిక్ వున్న రోడ్డు మీద కుర్రాళ్ళు రయ్ రయ్ మని కార్లు పోనిస్తూంటే్, పాపం, చాలా జాగ్రత్తగానే రోడ్డు దాటుతూండగా, ఒక కారు వెనకనుంచి వచ్చి ఢామ్మని గుద్దేసి, ఆగనైనా ఆగకుండా రివ్వున ఎదరకు సాగిపోగా, ఆయన మాత్రం అక్కడికక్కడే మెదడు చితికిపోగా, ఆఖరిశ్వాస విడిచారు.
అప్పటినుంచీ పార్వతమ్మ జీవనపోరాటం మొదలైంది. కొడుకు పదినెలల పసివాడు. భర్తకు వెనకాల ఆస్తిపాస్తులేమీ లేవు ఒక చిన్న పెంకుటిల్లు తప్ప. చిన్న గుమాస్తా ఉద్యోగం వెలగబెట్టేవాడు. ఆయన చనిపోయిన నాటికి వారి బ్యాంకు బేలన్సు పదిహేను పైసల, నూటపదమూడు రూపాయల, ఏడు వేలు! ఓహో, తిరగేసి చెప్పడం జరిగిందా? ఆవిడ జీవితమే తిరగబడిపోయింది కదా? అందుకే అలా చెప్పవలసి వచ్చింది. అదుగో, అప్పటి నించీ ఆవిడ విధితోను, విధాత తోను యుధ్ధ్దం చేస్తూ ఎదరకు సాగిపోతోంది. ఆవిడ పెద్దగా చదువుకున్నది కూడా కాదు. ఎక్కువ చదివిస్తే, ఎక్కువ కట్నాలు పోసి, అంతకన్నా ఎక్కువ చదువుకున్న పెళ్ళికొడుకుని తీసుకురావలసి వస్తుందన్న భయం వల్లను, ఆర్థికంగా అంతంతమాత్రపు జీవితం గడుపుతున్నందు వల్లను, ఆమె తండ్రి ఆమెను ఎక్కువగా చదివించలేకపోయాడు. మరి పదినెలల గుడ్డుని ఎలా పొదగాలి? అందుకే అప్పట్నించీ, ఆవిడ పదిళ్ళలో పాచిపనులే చేసిందో, వంటలక్కగానే బతికిందో ఆ గాధంతా చెప్పుకుంటూ పోతే, ఒక నవల అవుతుంది. కాని ఏం తిన్నదో, ఏం తినలేదో, ఎలా బతికిందో, ఎలా సంపాదించిందో ఆరాలు అనవసరం గాని, మొత్తానికి కుర్రాడిని పెంచి పెద్ద చేసింది. పెద్ద చెయ్యడమేమిటి? చక్కగా విద్యాబుధ్ధులు చెప్పించింది. చక్కగా అంటే, ఇలాగు, అలాగూనా? సాఫ్ట్ వేర్ ఇంజనీరయి పోయినాడు ఆ బిడ్డ, ఏ బిడ్డ? అదే అప్పటి ఆ పదినెలల గుడ్డు.
అక్కడితో పార్వతమ్మ పోరాటం ఆగిందా అంటే, అబ్బే, అదేం లేదు. ఆవిడ నుదురు మీద రాత రాసేటప్పుడు విధాతకి చెయ్యి వణికిందేమో, గీతలన్నీ వంకర టింకరగానే వెళ్ళిపోయాయి. అందువల్లేనేమో, ఆవిడ పుత్రరత్నం చదువు పూర్తి కాగానే, అమెరికాలో మంచి ఉద్యోగం వస్తే అక్కడికి గాల్లో ఎగిరిపోయాడు. ఎగిరిపోయేముందు, గంతకి తగ్గ బొంతే కావాలనుకుని, మరొక స్త్రీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని ప్రేమవివాహం చేసుకుని,ఆమెతో కలిసి మరీ ఎగిరిపోయాడు. ఐతే, అతడికి అమ్మ మీద ప్రేమ లేదనుకునేరు! అదేం లేదు. ఇదుగో, ఏం జరిగిందో మీరే చూడండి.
***
ఆ రోజున పార్వతమ్మ సుపుత్రుడు, రవీంద్ర ఇంటికి వచ్చి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు.
పార్వతమ్మ కంగారుపడింది. ' నాన్నా, రవీంద్రా! ఏం జరిగిందిరా? కోడలు కులాసాగానే వుందా? ఇద్దరూ చక్కగా పట్నంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా అని తృప్తిగా బతుకుతున్నానురా నాయనా. ఏం జరిగిందిరా? చెప్పరా కన్నా? నాకు గుండెదడగా వుందిరా. నా బంగారుబాబువి కదూ? మాట్లాడరా నాన్నా.'
' మా ఆఫీసువాళ్ళు నాకు ప్రమోషనిచ్చి అమెరికా వెళ్ళమంటున్నారమ్మా.'
' ఎంత చల్లని మాట చెప్పావురా కన్నా. ఆ దేవుడెంత దయామయుడురా! బాగుందిరా నాయనా. హాయిగా అమెరికా వెళ్ళు. మరి కోడల్ని కూడా తీసికెళ్తున్నావా?'
' తీసికెడతానమ్మా. కాని, అమ్మా, నిన్ను ఒక్కర్తినీ ఇక్కడ వదిలిపెట్టి నేను వెళ్ళలేనమ్మా. నేనీ ఉద్యోగం వదిలేస్తానమ్మా. ఇక్కడే మన ఊళ్ళోనే ఏదన్నా కూలో నాలో చేసుకుంటూ నీ దగ్గిరే వుంటానమ్మా.'
' ఛీ,ఛీ, ఏమిటా మాటలు? అష్టకష్టాలు పడి, నిన్ను ఇంతవాడిని చేసింది నువ్వు కూలిపని చేసుకోవడానికిరా? అల్లా మాట్లాడావంటే, నా మీద ఒట్టే. శుభమా అని ప్రమోషను వస్తే అలా బాధపడడం తప్పుకదూ? చక్కగా అమెరికా వెళ్ళిరానాయనా. నాకేమిటి. నక్కులా వున్నాను. ఈ ఊళ్ళో అందరూ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. మన పక్కింటి సుందరమ్మ నన్ను విడిచి ఒక్క క్షణం వుండదు. నువ్వేం బెంగపడకుండా వెళ్ళిరా నాయనా.'
' అలాగే అమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అమ్మా. నీకెప్పుడు నన్ను చూడాలనిపించినా నాకు ఫోను చెయ్యి. రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతానమ్మా." రవీంద్ర బెక్కుతూ అన్నాడు.
' అలాగే నాన్నా. నువ్వేం బెంగపెట్టుకోకుండా చక్కగా వెళ్ళు. నీకంతా శుభమే జరుగుతుంది.'
రవీంద్ర కళ్ళు తుడుచుకుంటూ, తల్లి పాదాలు తాకి నమస్కరించుకుని, ఆవిడ ఆశీర్వాదాలు తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు.
రవీంద్ర వెళ్ళేటప్పుడు తనకి నెలనెలా ఏదన్నా డబ్బు పంపిస్తానంటాడేమోనని ఆశగా అతడికేసి చూసింది. కాని అతడు ఆ ఊసే ఎత్తలేదు. ఐనా తన పిచ్చిగాని, ఇక్కడున్నప్పుడు మాత్రం తనకేమన్నా ఇచ్చేవాడు కనకనా?
***
రోజులు గడుస్తున్నాయి. నెలలు గడుస్తున్నాయి. రెండు సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు హఠాత్తుగా రవీంద్ర అమెరికా నించి ఊడిపడ్డాడు. పార్వతమ్మ ఆశ్చర్యపోయింది. ' ఏమిట్రా ఇది? చెప్పాపెట్టకుండా వచ్చేసావు.'
రవీంద్ర తల్లి పాదాలకి నమస్కరిస్తూ అన్నాడు, ' నిన్ను చూడాలనిపించిందమ్మా. వచ్చేసాను.'
' సంతోషం నాయనా. స్నానం చేసిరా. నీకు టిఫిను రెడీ చేస్తాను.'
రవీంద్ర టిఫిను చేస్తూ అన్నాడు, ' అమ్మా! నేనే కాదు, నీ కోడలు కూడా నీకోసం బెంగ పెట్టుకుందమ్మా. అస్తమానూ నిన్ను చూడాలని వుంది, నిన్ను చూడాలని వుంది అంటూ బాధ పడుతోంది. అందుకే ఒక్కసారి నిన్ను అమెరికా తీసికెళ్దామని వచ్చానమ్మా.' నేను నీకు పాస్‌పోర్ట్, వీసా, టిక్కట్టు లాంటివన్నీ ఏర్పాటు చేస్తాను. నాతో వచ్చెయ్యమ్మా. కొద్దినెలలుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దూ గాని.'
పార్వతమ్మ అంది, ' అంతదూరం నేనెల్లా రాగలనురా? పోనీ కోడల్ని కూడా తీసుకురావల్సింది. ఓ నాలుగురోజులుంటే ఆ బెంగ కూడా తీరిపోయేది.'
రవీంద్ర అన్నాడు, ' లేదమ్మా. మంజరి ఇప్పుడు ప్రయాణం చేసే పరిస్థితిలో లేదు.'
పార్వతమ్మ కంగారుగా అంది, ' అయ్యో, మంజరికేమైందిరా?'
' కంగారు పడకమ్మా. మంజరి ఇప్పుడు వుట్టి మనిషి కాదు.'
పార్వతమ్మ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ' ఎంత చల్లని మాట చెప్పావురా? ఐతే నేను తప్పకుండా నీతో వచ్చేస్తాను. ఇప్పుడు కోడలి దగ్గిర నేను వుండితీరాలి.'
ఆ విధంగా పార్వతమ్మకి విదేశీయానం చేసే అదృష్టం దొరికింది. అమెరికాలో ఆరునెలలుండి ఇదుగో మొన్ననే ఇండియా వచ్చింది.
వీధివాకిలి మెట్లమీద కూర్చుని పార్వతమ్మ, ఆమె స్నేహితురాలు సుందరమ్మ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
' ఐతే పార్వతీ! విమానం గాల్లోకి ఎగురుతూంటే నీకు భయమెయ్యలేదే? నాకైతే బస్సు ఎక్కితేనే వాంతులవుతాయి. నీకేమీ కాలేదే?'
' అస్సలు భయమెయ్యలేదే. ఒసే సుందరీ! విమానం ఎంత పైకి వెళ్ళిపోతుందనుకున్నావు? మనం ఆకాశంలో పైన వుంటాం. మన కింద మేఘాలు వుంటాయి. అంటే మనం మేఘాలని కూడా దాటి పైకి వెళిపోతామే. ప్రతి అరగంటకోసారి అందమైన పిల్లలు మన దగ్గిరకొచ్చి, మంచినీళ్ళు, కూలుడ్రింకులు, కాఫీలు, టిఫీన్లు, భోజనాలు అన్నీ పెడుతూ వుంటారు. ఎంతెంత సేవలు చేస్తారే తల్లీ.'
' అబ్బ ఎంత అదృష్టవంతురాలివే తల్లీ. మన ఊళ్ళో ఇంతవరకూ ఎవత్తీ జిల్లాదాటి బైటికి వెళ్ళలేదు. అటువంటిది నువ్వు దేశం దాటి అమెరికా వెళ్ళి వచ్చేసావు. రచ్చబండ దగ్గిర కూడా అందరూ నీగురించే మాట్లాడుకుంటున్నారే.'
అదే సమయానికి అటుగా వెడుతున్న ఆ ఊరి ప్రెసిడెంటు రాజిరెడ్డిగారు పార్వతమ్మని చూసి ఆగి ప్రేమగా పలకరించారు.
' ఏం పార్వతమ్మా? అమెరికా నించి వచ్చేసావా?'
పార్వతమ్మ గౌరవంగా కొంగు బుజం చుట్టూ కప్పుకుని నమస్కరిస్తూ అంది, ' నమస్కారమండయ్యా. వచ్చేసానండి.'
' మన ఊళ్ళో ఇంతవరకూ అమెరికా వెళ్ళిన ఆడది లేదు. నువ్వు మొదటిసారిగా వెళ్ళి వచ్చావు. అమెరికా బాగుందా?'
' చాలా బాగుందండయ్యా. తమరు నిలబడే వున్నారు. లోపలికొచ్చి కూర్చోండి. కాస్తంత మంచితీర్థం పుచ్చుకుని వెడుదురు గాని.'
రాజిరెడ్డి లోపలికి వస్తూ అన్నాడు, ' పాపం, ఈ చిన్న పెంకుటింట్లో, ఫేను కూడా లేకుండా కాలక్షేపం చేస్తున్నావు. అక్కడ ఇల్లంతా ఏ.సి. అయివుంటుంది. ఔనా?'
పార్వతమ్మ ఆయన ప్రశ్నలకి జవాబులు చెబుతూనే వంటింట్లోకి వెళ్ళింది.
' ఔనండి. నేలంతా తివాసీలండి. ఇరవైనాలుగు గంటలూ వేడినీళ్ళు వస్తూనే వుంటాయండి. ఓ తిరగలి, రుబ్బురోలు, పచ్చడి నూరుకునేందుకు కల్వం - ఇవేవీ అక్కర్లేదండి. మైకురోఓవెన్నంటారండి. అందులో మరీ అవసరం అయితే అన్నం కూడా ఉడికించేసుకోవచ్చండి. మిక్సీ అండి. అందులో పచ్చళ్ళు, పొడులు చేసేసుకోవచ్చండి. ఎక్కడికెళ్ళాలన్నా మా అబ్బాయికో కారు, మా కోడలికో కారు వున్నాయండి. మా కోడలు కూడా రివ్వురివ్వున కారు నడిపేస్తుందండి.' అంటూ రాజిరెడ్డికి కాఫీ తీసుకువచ్చింది.
' అదంతా బాగానే వుంది. మరి అమెరికాలో ఏమేం చూసావు? న్యూయార్క్, వాషింగ్‌టన్ను, డిస్నీలాండ్ - ఇవన్నీ చూసేసావా?' కాఫీ తాగుతూ రాజిరెడ్డి అడిగాడు.
' ఓ, చాలా చూసానండి. అసలు నేల మీద కాలు పెట్టనివ్వలేదండి. ఎక్కడికెళ్ళాలన్నా కారులోనే తీసికెళ్ళారండి. విమానంలో కూడా అందులో పనిచేసే అమ్మాయిలు చాలా మర్యాదలు చేసారండి.'
' చాలా అదృష్టవంతురాలివి పార్వతమ్మా. మళ్ళీ ఎందుకొచ్చేసావు? అక్కడే వుండిపోలేకపోయావా?'
' వీసా ఆరునెల్లకే ఇచ్చారండి. మా అబ్బాయి మళ్ళీ తీసికెడతానన్నాడండి.'
' బాగుంది పార్వతమ్మా. మరిక వుంటాను. నీకు ఏ అవసరం వచ్చినా నన్ను కలు.' కాఫీ కప్పు కిందపెట్టి లేస్తూ అన్నాడు రాజిరెడ్డి.
' అయ్యో, అలాగేనండి. నమస్కారమండి.' వినయంగా నమస్కారం పెడుతూ పార్వతమ్మ అంది.
రాజిరెడ్డి వెళ్ళిపోయాడు. సుందరమ్మ వాళ్ళ మాటలన్నీ శ్రధ్ధగా, ఆసక్తిగా వింటూవుంది. రాజిరెడ్డి వెళిపోగానే సంతోషంగా అంది, ' అదృష్టవంతురాలివి పార్వతమ్మా. నీ కొడుకు నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. మళ్ళీ చక్కగా అమెరిగా వెళిపోతావు. ఇంక అక్కడే వుండిపో రాజమ్మా. ఈ ఫేను కూడా లేని చిన్నకొంపలో ఎందుకు దేవుళ్ళాడుతూ వుండటం?'
పార్వతమ్మ అంది, ' అవునే నాకూ పోదామనే వుంది. ఇంకా ఎన్నాళ్ళని వుండాలి? ఆ దేవుడికే ఇంకా దయ రావటల్లేదు.'
సుందరమ్మ ఆశ్చర్యంగా అడిగింది, ' అదేమిటి పార్వతీ? అలా అంటున్నావేమిటి?'
పార్వతమ్మ ఏడుస్తూ అంది, ' అవునే సుందూ. నీ దగ్గిరేం దాచుకోనే? కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది.'
' అదేమిటి పారూ? ఇంట్లో ఎన్నో సదుపాయాలున్నాయన్నావు. అంతా అబధ్ధమేనా?'
' ఔనే. అన్నీ వున్నాయి. నా ముద్దులకొడుకు నన్ను అమెరికా ఎందుకు తీసికెళ్ళాడో తెలుసా?'
' ఎందుకే?'
' వాడి పెళ్ళాం కడుపుతో వుంది. పురుడు పొయ్యడానికి, పుట్టిన బిడ్డకి సంరక్షణ చెయ్యడానికి, ఇంటెడు చాకిరీ చెయ్యడానికి.'
' అంటే?'
' అంటేనా? పొద్దున్నే లేచి స్టౌ మీద వాళ్ళకి పాలుకాచి, టీ చేసి ఇవ్వాలి. తరవాత హడావిడిగా వంట చెయ్యాలి. వాళ్ళిద్దరూ కార్లలో బుర్రున ఆఫీసుకి పరిగెట్టేవారు. ఆ తర్వాత నేను వేక్యూమ్‌ క్లీనరుతో ఇల్లంతా శుభ్రం చెయ్యాలి. బట్టలన్నీ వాషింగ్ మెషీన్లో వెయ్యాలి. అవి తీసి ఆరెయ్యాలి. అవి ఆరిన తర్వాత విస్త్రీ చెయ్యాలి. తరవాత గిన్నెలన్నీ శుభ్రం చెయ్యాలి. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైన పని....రోజూ పాకీదొడ్లు శుభ్రంగా కడగాలి. వాళ్ళ పక్కలన్నీ సర్ది, దుప్పట్లు మార్చాలి. మళ్ళీ రాత్రికి వాళ్ళొచ్చేలోగా వంట చేసి రెడీగా వుంచాలి. పగలు ఒక్క అరగంట నడుం వాల్చడానికి వుండేది కాదు. రాత్రి పదకొండింటికి పడుకోవడం, మళ్ళీ తెల్లవారుఝామున ఐదింటికి ఆదరాబాదరాగా లేవడం. ఒరేయ్! తలకి రాసుకునే కొబ్బరినూనె అయిపోయిందిరా, ఆఫీసునించి వచ్చేటప్పుడు తీసుకురారా అని ఒకసారి సిగ్గువిడిచి అడిగాను. అల్లాగేనే అమ్మా. తప్పకుండా తీసుకువస్తాను. అన్నాడు. సాయంత్రం అడిగాను. అయ్యో మర్చిపోయానే అన్నాడు. రెండురోజులు వరసగా అడిగాను. రోజూ మర్చిపోయాననే చెప్పేవాడు. ఇంక విసుగెత్తి అడగడం మానేసాను. ఒళ్ళు రుద్దుకునే సబ్బు కూడా అయిపోయింది. ఐనా ఇంక వాడిని అడగలేదు. నాకు రోజూ పొద్దున్నే కాఫీ పడాలి. నేను తీసికెళ్ళిన కాఫీపొడుం వారంరోజులకే అయిపోయింది. మళ్ళీ వాడిని తీసుకురారా అంటే అల్లాగేనే అమ్మా అన్నాడే కాని తేలేదు. వాళ్ళు టీ తాగుతారు. ఇంక ఎంత తలనెప్పి వచ్చినా కాఫీ లేకుండా అలాగే బతికాను.'
' మరక్కడ పనివాళ్ళు వుండరా?'
' ఉంటారే. కాని వాళ్ళు చాలా ఎక్కువ తీసుకుంటారు. పాకీదొడ్లు కడగడానికి నెలకోసారో, రెండుసార్లో వచ్చి వందేసి, రెండువందలేసి డాలర్లు తీసుకుంటారుట. మొగుడూ పెళ్ళాలు మాట్లాడుకుంటూంటే విన్నాను. నాకు మధ్యలో చాలా జ్వరమొచ్చిందే. మా అబ్బాయిని డాక్టరు దగ్గిరకి తీసికెళ్ళమన్నాను. ఏమన్నాడో తెలుసా?'
' ఏమన్నాడే?'
' నాకు మెడికల్ ఇన్స్యూరెన్స్ తీసుకోలేదుట. డాక్టరు దగ్గిరకెళితే వేలువేలు డాలర్లు అవుతాయట. అందుకని తనదగ్గరున్న బిళ్లలే ఏవో నా మొహాన పడేసాడు. అలాగే జ్వరంతో వారం రోజులు బాధ పడుతూనే ఇంటెడు చాకిరీ చెయ్యాల్సి వచ్చింది. దేముడు దయతలిచి జ్వరం తగ్గింది కాబట్టి సరిపోయింది. అమ్మా, అమ్మా! నీకోసం నీ కోడలు కూడా బెంగపెట్టుకుందంటే దేవుళ్ళాడుతూ పరిగెట్టాను.'
' మరి అమెరికా అంతా చూపెట్టాడని ప్రెసిడెంటు గారితో అన్నావు?'
' ఔనే. అంతా చూసాను. వాడికి అమ్మనైనందుకు నాకు చాలా గర్వంగా వుందే. వాడి అమ్మ చూసిన అమ్మెరికా ఏమిటో తెలుసునా? రెండు పడగ్గదులు, ఒక వంటిల్లు, ఒక హాలు, మేడమెట్లు, మూడు బాత్‌రూములు, దొడ్లో బట్టలారేసుకునే దండెం. అదేనే నేను చూసిన అమెరికా. వీసా ఆర్నెల్లకే వచ్చిందన్నాడు. అందుకే అదృష్టం బాగుండి మళ్ళీ ఇక్కడికి వచ్చాను.'
సుందరమ్మ నిర్ఘాంతపోయింది!
 ***

No comments:

Post a Comment

Pages