తరాల అంతరం - అచ్చంగా తెలుగు

తరాల అంతరం

దొండపాటి కృష్ణ 



“ఏంటి రాజు ఇలా చేశావ్? అసలు నీకీ ఉద్దేశ్యం ఉందని నేననుకోలేదు. మంచి స్నేహితుడిలా ఉంటున్నావనుకున్నాను. నాతో అంత చనువుగా ఎవరూ లేకపోయేసరికి నీ మాటలకు ముచ్చటపడి చనువు పెంచుకున్నానే కాని మరొకటి కాదు. దానికే నువ్విలా ఊహించుకోవడం ఏం బాలేదు. మీ అబ్బాయిలందరికీ ఎందుకిన్ని ఊహలోస్తాయి. కలిసి తిరిగినా, చనువుగా మాట్లాడినా అది ప్రేమేనా? ఇక్కడితో చాలు రాజు. ఇది పెరిగితే మరోలా ఉంటుంది. నన్నిక్కడితో వదిలేయ్. ఇలాంటివి మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. సారీ రాజు” ఇదీ సారాంశం.
“ఏరా మేం చెప్పిందే జరిగిందా? మొదట్నుంచి చెప్తూనే ఉన్నాం, విన్నావా?” అన్నాడు ఏడుకొండలు. “నన్ను కాసేపు వదిలేయండిరా!” పక్కకు జరిగాడు శాంతిరాజు. “చూడరా కొండలు!వీడితో చనువుగా ప్రపంచమంతా రాసుకుపూసుకు తిరిగితే పేరెంట్స్ ఏమీ అనరు కాని ప్రేమంటే మాత్రం చంపెస్తారంట.ఆడోళ్ళుఅబద్ధం చెప్తే గోడ కట్టినట్లుంటుంది. ఎంత లౌక్యంగా తప్పించుకుందిరా? ఎంత వెధవలా ట్రీట్ చేసిందిరా?” అన్నాడు గోపి. ఆ మాటలకు బయటకు వెళ్ళిపోయాడు శాంతిరాజు. “రాజు..రాజు...ఒరేయ్...రాజు ఆగరా” అంటూ పిలిచాడు గోపి.“కంగారేం లేదులే. ఇంకెక్కడికి వెళ్తాడు.? మన పార్క్ కే వెళ్తాడు. వదిలేయ్ తర్వాత వాడే వస్తాడు” అన్నాడు ఏడుకొండలు. “ఈ బాధలో ఏమన్నా చేసుకుంటాదేమోనని” కంగారు పడ్డాడు గోపి. అంటే ఉన్న ఒక్క బండి కోసం వెతికారు. అది కనిపించలేదు.
* * * * * *
ఫేవరెట్ స్పాట్ దగ్గరికెళ్ళి కూర్చున్నాడు శాంతిరాజు.ఎదురుగానున్న కొలనులో చిందులాడుతూ తిరిగే పక్షులు అతన్ని చూసి నవ్వినట్లుగా, టూరిజం బోటుపై తిరిగేవాళ్ళను చూస్తుంటే తనని గుద్దేయ్యడానికి వస్తున్నట్లుగా, దాటుకుంటూ చుట్టూ నడిచే వాళ్ళను చూస్తుంటే జాలి చూపిస్తున్నట్లుగా, ఎప్పుడూలేనట్లుగా ఎటుచూసినా ఏది చేసినా అందరూ వేలుపెట్టి అతన్నే చూపిస్తూ హేళన చేస్తున్నట్లుగా అనిపిస్తుందతనికి. కృష్ణా జిల్లాను దాటి తూర్పుగోదావరి జిల్లాకు యూనివర్సిటీ లో చదువుకోవడానికి వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు? ఎన్ని గొప్ప లక్యాలు. వాటిని సాధించాలని ఎన్ని ఆలోచనలు. సంవత్సరం గడిచాక ‘స్వప్న’వలనఅన్నీ వెనక్కి జరిగాయి. తన పెరులానే తనతో గడిపినవన్నీ స్వప్నాలేమోనని అన్పిస్తుంది. మనస్సును ప్రశాంతంగా చేసుకోవడానికి కళ్ళు మూసుకున్నాడు. అంతే గతమంతా గింగరాలు తిరిగింది.
యుక్త వయస్సులో సహజంగా జరిగే పరిణామాలకు అతను కూడా మినహాయింపు కాదన్నట్లుగా తనకి తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే తల వంచేశాడు. పరిసరాల ప్రభావమో, పేరెంట్స్ చెంతనే లేరన్న భ్రమో లేక వయస్సులోని వేడి అహమో తెలియదు కాని అవన్నీ మూకుమ్మడిగా దాడి చేసి అతన్ని మార్చేశాయి. ఎమ్.సి.ఏ. కోర్స్ చదవడానికి మంచి ర్యాంక్ సాధించి తన జిల్లాను దాటి యూనివర్సిటీలోకి వచ్చిచేరాక ఆలోచనలన్నీ రెక్కలు విప్పినట్లు తాండవం చేశాయి. కళాశాల నిండా అబ్బాయిలు, అమ్మాయిలు ఒకర్నొకరు చనువుగా వెలుగుతూ కళకళలాడుతూ కన్పించింది. ఈ కో-ఎడ్యుకేషన్ అంతా కొత్త బంగారు లోకంగా తోచింది. వచ్చి స్వర్గంలో పడ్డట్లుగా భ్రమించాడు.
సాధారణ పల్లెనుండి వచ్చినతను అక్కడ సంస్కృతిని తప్పుగా అర్ధం చేసుకున్నాడు. వాళ్ళందరిలో నెగ్గుకురావాలంటే వాళ్ళలాగే మారాలనుకున్నాడు. పూర్తిగా మారిపోయాడు. దుస్తుల అలంకరణలో మార్పులు చేసుకున్నాడు. కేశాలంకరణలో నవీన పద్దతులు అవలంభించాడు. మాటల చాటున దాగున్న అప్రియత్వాన్ని వలికించడం నేర్చుకున్నాడు. అలవాటులేని నడకను అనుసరిస్తున్నాడు. శాంతిరాజంటే శాంతిరాజు కాదిప్పుడు, కొంతమంది మనుషుల అనుకరణలు. అతనిలో అతను కనిపించడం మానేశాడు. చనువులు పెరిగాయి. అర్ధాలు మారాయి. ఆలోచనలు దారి తప్పాయి. ఎప్పుడూ లేని సంతోషంలో ఉంటున్నాడు. సంతోషమే జీవితమనుకున్నాడు. నిజమేకాని అది శాశ్వితమో అశాశ్వితమో తెలుసుకోలేకపోయాడు. తన సంతోషానికి కారణం స్వప్నని తెలుసుకున్న మిత్రబృందం ప్రేమేనని తేల్చేశారు. ఇద్దరు తప్ప. అందుకే ఆ ఇద్దరినీ పక్కన పెట్టాడు. ఇప్పుడీళ్ళే నిజమని నిరూపించిందామే!
మనిషి ఆలోచనలెప్పుడూ ఏదో విషయమై తిరుగాడుతూనే ఉంటాయ్. ముందుకెళ్ళే సంగతేమో గాని వాటిగురించి ఆలోచించడమే ఎక్కువ. అందుకే ఆశ నిరాశల మధ్య జీవితమెప్పుడూ కొట్టుమిట్టాడుతోంది. సహజసిద్దమైన పరిణామాలన్నీ ప్రకృతిలో దినచర్యలుగా జరిగిపోతున్నా అప్పుడప్పుడవి దినదిన గండాలవ్వచ్చు. తల్లీదండ్రుల ఆలోచనలెప్పుడూ తమ పిల్లల ఎదుగుదలపైనే ఉంటుంది. కుటుంబగౌరవానికి విలువిచ్చి దాన్ని నాశనం చేయకూడదని, నాశనమవ్వకూడదని ప్రయత్నిస్తారు.ఫలితంగా పిల్లల విషయంలో నిబందనల్లా తయారవుతాయి. ఒత్తిడికి గురౌతారు. వాళ్ళ ఆలోచనలెప్పుడూ జరుగుతున్నా వాటిపైనే ఉంటాయ్. వయసు పెరుగుతున్న కొద్దీ అవి ప్రజ్వలిస్తూనే ఉంటాయ్. తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువవుతుంది. వారి మధ్య వచ్చే ఈ తరాల అంతరాలు చిన్నచిన్న గొడవలకు దారి తీస్తుంది.బయట వ్యక్తులతో తమ అనుభవాలను పంచుకునే పెద్దలు వాళ్ళ పిల్లల దగ్గర మాత్రం మనస్సు విప్పరు. పెద్దవాళ్ళకు చాధస్తం పెరిగిపోతుందని వాళ్ళు వాదిస్తారు.
పరిపరివిధాలుగా వెళ్ళిన మనస్సుకి ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏదో నిస్సత్తువ ఆవహించినట్లుంది. పరవశింపజేసే ప్రకృతి మారుతూనే ఉంది. మనుషుకులు కూడా మారుతున్నారు. అలాగే వారి మనస్థత్వాలు కూడానూ. అది ఎవ్వరికీ అంతుచిక్కని జటిల పదార్ధమై సమస్యల ఊబిలోకి లాక్కోనిపోతుంది. మార్పు అనివార్యమే కాని మనల్ని మనమే మార్చేసుకోకూడదు. మనం మనం కాకుండా పోకూడదని గ్రహించాడు. స్నేహితులకు తప్ప పేరెంట్స్ కు చెప్పుకోలేడు. తరాల అంతరం అడ్డొస్తుంది. తప్పేకాని తప్పటడుగు మాత్రం కాదు. పేరెంట్స్ స్నేహితుల్లా మెలిగే అవకాశమే ఉండడం లేదు సరికదా అలా ఉంటె ఎక్కడ వారు చేయి దాటిపోతారేమోనని భయం వెంటాడుతుంది. గతకాలపు జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తుంటే స్వప్నతో గడిపిన సందర్భాలతో పోల్చుకుంటే త్రాసు పేరెంట్స్ వైపు మొగ్గు చూపింది. పోల్చుకున్నప్పుడే కదా తేడాలు తెలిసేవి! అందుకే అక్కడితో విషయం మర్చిపోవాలనుకున్నాడు. నిర్ణయమైతే తీసుకున్నాడుకాని మనస్సు మాత్రం గోల చేస్తుంది. బాధ నిలువెల్లా దహించివేస్తుంది. తలపట్టుకొని కూర్చున్నాడు. భుజంపై చేతిస్పర్శ తగిలేసరికి కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగా ఇద్దరు మిత్రులు. “ఎంత కంగారు పడ్దాంరా” అన్నాడు గోపి. “పదా రూమ్ కేల్దాం” అని చేయి పట్టుకొని రాజుని లేపాడు. బండిని తీసుకొని ముగ్గురూ నడుచుకుంటూ రూంకెళ్ళారు.
* * * * * *
“మహేష్ బాబుది ‘వన్-నేనొక్కడినే’ సినిమా వచ్చింది. మాస్ కు అర్ధం కాకపోయినా క్లాసు కు విపరీతంగా నచ్చేస్తుందంటా. మనం కూడా వెళ్దామా?” అడిగాడు ఏడుకొండలు.“అవునా? అయితే వెళ్దాం. టికెట్స్ దొరుకుతాయా?” సందేహాన్ని వ్యక్తం చేశాడు గోపి. “ధియేటర్ నిండా మాస్ ఉంటె కష్టం కాని క్లాసు ఉంటె కష్టం కాదు” అని బయలుదేరారు. రాజు కదల్లేదు. “రాజు! రా వెళ్దాం!” పిలిచాడు గోపి. “మీరు వెళ్ళండిరా! నాకు ఇంట్రెస్ట్ లేదు” అన్నాడు రాజు. “శాంతి.! వారం రోజులయినా నువ్వింకా ఇలాగే ఉంటె ఎలా?” అన్నాడు ఏడుకొండలు. “తను జోక్ చేసిందేమో అనుకున్నా. మెసేజ్ చేస్తే రిప్లై లేదు” బాధపడ్డాడు రాజు. “శాంతి..! కాస్త శాంతంగా ఆలోచించరా! వదిలేయ్ రా” అన్నాడు ఏడుకొండలు.“వదిలేయ్.. వదిలేయ్.. అన్నంత ఈజీ నా వదిలెయ్యడం? చదువుపై మనస్సు పెట్టు.. పెట్టు.. అన్నంత ఈజీ నా? చెప్పినా అర్ధం కాదుగాని నన్ను వదిలెయ్యండి. మీరు వెళ్ళండి” విసుక్కున్నాడు శాంతిరాజు. “నువ్వన్నా చెప్పరా గోపి! ఎన్నాళ్ళని ఇలా ఉంటాడు?” గోపిని చూస్తూ చెప్పాడు ఏడుకొండలు.
“ఒంటికి చిన్న దెబ్బ తగిలినప్పుడు అది మరచిపోవాలంటే మైమరపించే ఇన్సిడెంట్ జరగాలి లేదా ఇంకా పెద్ద దెబ్బ తగలాలి. అప్పుడే ఒకదానినుండి రెండోదానిపైకి మనస్సు మళ్ళుతుంది. ఎప్పుడూ వీడి పక్కనే ఉంటున్నాం కదా అందుకే మన మాటలు వీడికి జోరీగలా అన్పిస్తున్నాయి. ఊహించనిది జరగడం కాని, బాగా ఇన్స్పైర్ చేసే మాటలు గాని కొత్తవాళ్ల వల్ల జరగాలి. అప్పటిదాకా చెవికెక్కదు. వాణ్ని వదిలేయ్. మనం సినిమాకేల్దాం పదా” మొహమ్మీడనే చెప్పేసి వెళ్ళిపోయారు. గోపి మాటలు రాజుని ఆలోచించేలా చేశాయి. ఎక్కడో గుచ్చుకున్నట్లయింది. రూంలో ఉంటె అలాగే ఉంటుందని ఫేవరెట్ స్పాట్ అయిన పార్క్కెళ్ళి కూర్చున్నాడు.
“హాయ్! కంగ్రాట్స్ బాబు” అంటూ శాంతిరాజు పక్కనే ఓ నడివయస్కుడు కూర్చున్నాడు. పార్క్ చుట్టూ జాగింగ్ చేసినట్లున్నాడు కొంచెం ఆయాసంగా ఊపిరి పీల్చుకున్నాడు. ‘కంగ్రాట్స్’ని చెప్పడం – అదీ అపరిచితుడు. ఆశ్చర్యంగా ఉందతనికి.“ఎందుకు సార్?” అడిగాడు రాజు. “ఇందాక జంక్షన్ పక్కనున్న పెట్రోల్ బంకు దగ్గర నువ్వు చూపిన సమయస్పూర్తికి” అన్నాడా పెద్దాయన. “అక్కడా..! నేనేం గొప్ప పని చెయ్యలేదే?” ఆలోచిస్తూ అన్నాడు రాజు. “అంతచేసి చేయలేదంటావేంటి బాబు? బంకు దగ్గర ఒక పెద్దాయన, అతని భార్య, వాళ్ళమ్మాయి ముగ్గురూ నిన్ను ఆపి వాళ్ళ పర్సు పోగొట్టుకున్నారని, అడ్రస్ కూడా పోయిందని తినడానికి ఏమీ లేదని డబ్బులు ఇవ్వమని నిన్ను అడిగితే సమయస్పూర్తిగా ఆలోచించి జంక్షన్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడని, అతనికి చెప్తే దొంగను పట్టుకుంటారని, భోజనం పెట్టించి జాగ్రత్తగా అడ్రస్ కు పంపిస్తారని చెప్పావ్ గా. అది నాకు బాగా నచ్చింది బాబు” అన్నాడాయన. “ఓ అదా! నాకు తోచింది చెప్పానంటే! ఇందులో గొప్పేముంది సార్? నా దగ్గర డబ్బుల్లేవ్. స్టూడెంట్స్ కదా! ఉన్నట్లయితే ఇచ్చేవాడినేమో” అన్నాడు రాజు పెదవిపై చిరునవ్వుతో. ‘అలా కాదు. నువ్వు చేసిందే కరెక్ట్. వాడు చెప్పింది అబద్దమే! అడుక్కోవడంలో ఇదో కొత్త పద్దతి బాబు. నువ్వన్నట్లే నిజంగా పోగొట్టుకుంటే సరాసరి పోలీస్ స్టేషన్ కెళ్ళి కంప్లయింట్ ఇవ్వాలి కదా! అది కాకుండా నిన్ను అడగడమేంటి? ఆయనికి తోడు భార్యా, కూతురూ ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నారు. ఆడోళ్ళ కన్నీళ్లు చూస్తే కరిగిపోని మగాడు ఉంటాడా? ప్రపంచంలో శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? ఈ ఆడోళ్ళ కన్నీరే!అది చూసే రాజులు కొట్లాడుకున్నారు. ప్రేమికులు గొడవలు పడుతున్నారు.పురాణాలకు కారణమయ్యింది. అసలెక్కడ చిచ్చుపెట్టలేదని” ఆగకుండా మాట్లాడేస్తున్నారాయన. అతని మాటలకు ముగ్దుడవుతూ అతన్నే చూస్తూ ఉండిపోయాడు రాజు. ఆడదాని చేతిలో మోసపోవడంతో ఎదుటివ్యక్తి ఆడవాళ్ళని తిడుతుంటే మనసంతా తేలికయిన భావన కలిగిందతనికి.
“అదేంటి సార్ అలా అంటున్నారు? మీకు ఆడవాళ్లంటే పడదా?” అడిగాడు రాజు. “ఎందుకు పడదు? బాగానే పడుతుంది. మా రోజుల్లో బావుండేదయ్య. కాని ఇప్పటి ఆడపిల్లలను చూస్తుంటేనే భయం వేస్తుంది. సంస్కృతి సంప్రదాయాలు ఏమైపోతాయోనని బాధేస్తుంది. ఒక్కప్పుడు అమ్మాయిలకు జాగ్రత్త చెప్పేవారు. ఇప్పుడు అబ్బాయిలకు చెప్పాల్సి వస్తుంది. గుమ్మందాటి అడుగు బయటపెట్టారు సమాజం ఇలా తయారయింది. గరికిపాటి నరశింహారావు గారు చెప్పినట్లు రాబోవు కాలంలో బికినీలు ధరించి మాకివే కంపర్టని పూజలు చేసే రోజులు రావొచ్చేమో” విసుక్కున్నాడాయన. “అందరూఅలా ఉండరు కదా సార్. మరలాంటప్పుడు అందర్నీ కలిపి తిట్టడం కరెక్ట్ కాదేమో” సందేహాన్ని వెలిబుచ్చాడు రాజు. “ఎవరినన్నా ప్రేమించావా?” సూటిగా అడిగాడాయన. ఊహించని ప్రశ్నకు ఆశ్చర్యాన్ని నింపుకుంది అతని మొహం. “ఈ వయసులో ఒక మగాడు ఆడాళ్ళని వెనకేసుకోస్తున్నాడంటేకారణం ప్రేమే! అదే ఇలా చేయించి పిచ్చోళ్ళగా మారుస్తుంది. నిజమేనా?” అడిగాడాయన. “అవును సార్” చెప్పాడు రాజు. “సక్సెస్ అయ్యిందా?” మళ్ళీ అడిగాడాయన. “లేదు సార్” నిష్ఠూర్చాడురాజు. “ఏమైంది?” కొనసాగించాడాయన. “అంత క్లోజ్ గా తిరిగి ఇష్టం అని చెప్పి తీరా ప్రపోజ్ చేశాక ‘నిన్నలా ఊహించలేద’నిఅంటుoదేంటి సార్?” బాధగా అన్నాడు అడిగాడు రాజు.
“ముందే చెప్పానా? మగాడు ముప్పయ్యేళ్ళు వస్తేగాని కుదురుగా ఆలోచించలేడని. ఆడడానికి గడప దాటితే చాలు కొంపముంచే ఆలోచనలన్నీ వచ్చేస్తాయి” అన్నాడాయన. “అలా అనకండి సార్. తను చాల మంచిది. ఏదో కారణం ఉండే ఉంటుంది” సమర్ధించుకున్నాడు రాజు. “మన మగాళ్ళు మారరయ్యా! అంత క్లియర్ గా చెప్పినా ఏదో ఉందని టైం వేస్ట్ చేస్తావెందుకు? ఆలోచిస్తుంటే నీకింకా మెట్యూరిటీ రాలేదేమో అన్పిస్తుంది” రాజు మొహంకేసి చూస్తూ అన్నాడాయన. “నాకు మెట్యూరిటీ వచ్చిందో రాలేదో మీరెలా చెప్పగలరు? మీరన్నట్లు నాకు మెట్యూరిటీ లేకపోతే న్యూస్ పేపర్ లో చెడుగా చదివేవాళ్ళే సార్” కాస్త ఆవేశపడ్డాడు రాజు. “దీనినే భ్రమంటారు. నువ్వు తెలివైన వాడివే కాని పిరికివాడివి. అందుకే తెగించలేక మాట్లాడుతున్నావ్. మెట్యూరిటీ అనేది మనకు గాయమైనప్పుడు ఆ విషయాన్ని మర్చిపోవడంలో ఉండదు. ఆ గాయం మనస్సుకైతే దాన్ని ఆస్వాదించడంలో ఉంటుంది. నీకదే కరువైంది” అన్నాడాయన.
“ఏంటో సార్ మీరు చెప్పేదంతా అయోమయంగా ఉంది” అర్ధం కానట్లు తలూపాడు రాజు. “ప్రేమంటే అదో తియ్యని అనుభూతి అన్నావ్. ఏదైనా చెయ్యగల ధైర్యాన్నిస్తుందన్నావ్. అదో మాయన్నావ్. నువ్వన్న దాంట్లోనే సమాధానముంది. ప్రేమ విఫలమైతే మాత్రం మర్చిపోరేం! సక్సెస్ అంటే పెళ్లి చేసుకోవడంతోనే వచ్చినట్లు కాదు. ఈ లోకంలోకి ఒక బిడ్డను తెచ్చి అతన్ని సన్మార్గంలో నడిపించి సమాజాభివృద్దికి తోడ్పడినప్పుడు మీరిరువురూ చూపిన మమకారాల ఫలితమే విజయం. ఇదంతా అర్ధం చేసుకునే వయస్సు కాదులే” మనస్సుకు హత్తుకుని అన్నాడాయన. శాంతిరాజుకు అహం పెరిగింది. “మీ పెద్దోళ్ళు సెంటిమెంటల్స్ సార్. ఒకదాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. మీకూ మాకూ రెండు జనరేషన్ ల తేడా ఉంది. హడావుడిగా లేచి బయలుదేరి ఆఫీసుకెళ్ళి కస్సుబుస్సులాడి ఎప్పుడో రాత్రి వచ్చి కుటుంబంతో గొడవలు పడే వాళ్ళకేం తెలుస్తుంది సార్ మాలాంటి వాళ్ళ ప్రేమ” అనుకోకుండానే వాదన పెంచేశాడు రాజు.
“హహ్హహ్హ...ప్రేమగురించి మా జనరేషన్ ను కామెంట్ చేస్తున్నావా? నేను నీ గురించి చెప్తుంటే నువ్వు మా జనరేషన్ను కామెంట్స్ చేస్తూ ‘సెంటిమెంటల్స్’ అని పెద్దపెద్ద మాటలంటున్నావ్. అసలు సెంటిమెంట్ అంటే అర్ధం తెలుసా? ఏ నమ్మకమూ లేని ఒక నమ్మకాన్నే సెంటిమెంట్ అంటాం. నీ లవ్ విషయంలో ఎవరు సెంటిమెంటల్స్? చూడు బాబు, మేం మీ వయస్సును దాటి వచ్చిన వాళ్ళం. ఆ సంగతి ఎందుకు ఆలోచించరు? చదువుకున్న వాళ్ళమే. మీ ఆలోచనా సరళి మాకూ ఎరుకే. నీకో విషయం చెప్తా విను. మాకెప్పుడూ ప్రేమనేది భావోద్వేగమే కాని అవసరం కాదు. ఆనందం, కోపం, చిరాకు, బాధల్లాంటి భావోద్వేగాలు ఎలావచ్చి మాయమైపోతాయో ప్రేమ కూడా అలాంటిదే! భావోద్వేగాలను అణచుకుంటే మనల్నే దహించివేస్తాయి. ఎప్పుడూ కోప్పడేవాడు, చిరాకుపడే వాడు బాగుపడలేడు. సర్డుకోలేడు. వాడో మూర్ఖుడని ముద్ర వేస్తారు. ప్రేమ కూడా అంతే! చూపించాల్సినంతే చూపించాలి. తీసుకోవాల్సినంతే తీసుకోవాలి. విచ్చలవిడితనం పనికిరాదు” అంటూ హితబోధ చేశారాయన. “అంటే ఒక భావోద్వేగమే కాని ప్రేమంటే ఇంకేమీ కాదా?” అడిగాడు శాంతిరాజు.
“నీవన్నట్లే ప్రేమంటే తీయని అనుభూతే! ఎందుకో తెలుసా – ఆ అనుభూతి శరీర కలయికలను కోరుకుంటుందని మీరు నమ్ముతారు కాబట్టి. మీ నాన్న ఇతనే అని మీ అమ్మ చెప్పబట్టే తెలుస్తుంది. మీ అమ్మ ఈమె అనేవరు చెప్తారు? ప్రేమే చెప్తుంది. నీవు పుట్టాక చనుబాల కోసం ప్రాకులాడినప్పుడు మీ ఇద్దరి మధ్యనున్న స్పర్శే తెలియజేస్తుంది- అది మీ రక్త సంబంధమని, తల్లీబిడ్డల ప్రేమని. తల్లి కాకుండా ఇంకెవరయినా ఎత్తుకుంటే బిడ్డ ఏడుస్తాడు గమనించావో లేదో! కాబట్టి ప్రేమంటే నీదేననుకోకు బాబు” సున్నితంగా బుగ్గ గిల్లాడు. ఆయనలో కోపంకాని, ఆవేశంగాని ఇసుకంతయినా కనిపించపోయేసరికి ఊపిరి పీల్చుకున్నాడు రాజు. ఇంకొంచం చనువు పెరిగింది.
“మీరు చెప్పేది వింటుంటే నిజమేననిపిస్తుంది సార్. కాని తనని మర్చిపోదామని ఎంత ప్రయత్నించినా మాటి మాటికి గుర్తొచ్చి బాధపెడుతుంది సార్. ఏం చేయాలో తెలీడం లేదు” అన్నాడు రాజు సలహా కోసం. “మరుపు – దేవుడిచ్చిన వరం. మీ పేరెంట్స్ తో ఎన్నిసార్లు గొడవపడ్డావో గుర్తుందా? లేదుకదా! అలాఉండి ఉంటె వాళ్లనేప్పుడో వదిలేసేవాడివి. మేం సెంటిమెంటల్స్ అన్నావ్ గా.! నిజంగానే మేం సెంటిమెంటల్ ఫూల్స్ మే. పిల్లలు చిన్నపట్నుంచి ఎన్ని చేసినా, ఛీ కొట్టినా భరిస్తున్నాం కదా అది మా ప్రేమ తప్పే. ఇదీ అసలైన ప్రేమ” కంటతడి మొదలైంది ఆయనకీ. గతమేదో గుర్తోచ్చినట్లుంది ఆయనికి. ఆర్ద్రతను తగ్గించే మార్గం దొరకలేదు రాజుకి. ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేసి “ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి ఒప్పుకుందనుకో ఏం చేస్తావ్? పెద్దల్ని ఒప్పించో, ఎదిరించో పెళ్లి చెసుకుంటావ్. తర్వాత తన అభిప్రాయాలు మారిపోతే ఏం చేస్తావ్? ఎందుకు చేసుకున్నానురా అని బాధపడతావ్. మారకపోతే అదృష్టమే. కాని ఆ అదృష్టం మగాడికి ఉండదు. ఆడదానికే ఉంటుందిలే! సైన్సు లో అయస్కాంతం గురించి చదువుకునే ఉంటావ్. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని. అది మనుషుల మధ్యేందుకు జరగదు? ఆమెలో ఏదో అయస్కాంతం ఉంది నన్నటు లాగేసింది అంటారుగా! మరి మీ అభిప్రాయాలు, మనస్థత్వాలు వేరని తెలియగానే విడిపోతారెందుకు? ప్రేమించిన అమ్మాయి కాకపొతే వేరే అమ్మాయి. తనలో ఏం చూశావో, ఏం కోరుకుంటున్నావో ఇంకొకరిలో అవే ఉండవని ఎందుకనుకుంటావు?” అని పెద్దాయన అడిగేసరికి శాంతిరాజు నుంచి సమాధానం కరువైంది.
“సర్లే! అసలెందుకు మర్చిపోవాలనుకుంటున్నావ్? అదంతా ఓ మధురమైన జ్ఞాపకమనుకో. గడిచిన కాలమెప్పుడూ జ్ఞాపకాలే. అవే మనల్ని నడిపిస్తాయి. అనుభవాల్ని నేర్పిస్తాయి. ఏదైనా గుణపాఠం నేర్చుకున్నట్లు అన్పిస్తే ఇదొక జ్ఞాపకమనుకో అప్పుడు సమస్య తీరిపోతుంది. గుర్తొచ్చినప్పుడల్లా బాధకు బదులుగా అనుభూతిని పొందుతావు” సావధానంగా చెప్తున్నా పెద్దాయనకు “రూపేష్! త్వరగా రా ఆలస్యమవుతుంది” అనే పిలుపు వినపడగానే “వస్తున్నాను” అనే సమాధానమిచ్చి “ఒకటి గుర్తుంచుకో బాబు! ప్రేమెప్పుడూ జటిల పదార్దమే! అదో మాయా పదమే! మనం దానికి లోంగకూడదు. అదే మనకు లొంగాలి. అసలు అమ్మాయంటే టూత్ పేస్ట్ లాంటిది. రోజుకి ఎంత కావాలో అంతే వాడుకోవాలి లేకపోతే ఇకంతే! పెద్దవాళ్లేన్ని చెప్పినా అవన్నీ వాళ్ళ అనుభవాలు, జ్ఞాపకాలే. వాళ్లనేప్పుడూ చులకనగా చూడొద్దు. వాళ్ళ అనుభవమంత ఉండదు నీ జీవితం. ఎన్ని దెబ్బలు తింటే ఈ స్థానంలోకొచ్చారో అర్ధం చేసుకో. ఈ ప్రపంచంలో తల్లీదండ్రుల ప్రేమను మించింది లేదు, రాదు. నేను చెప్పింది అర్ధమైతే నీ తెలివితేటలకు మంచి స్థానంలో ఉంటావు. లేక నా ప్రేమ నా ఇష్టం అనుకుంటే ఇంకెక్కడా కనిపించవు. ఉంటాను బాబు. ఆల్ ది బెస్ట్” అని చెప్పి భుజం మీదనుంచి చేయి తీసి వెళ్ళిపోయాడు రూపేష్.
ఆ క్షణం. ఆ ఒక్క క్షణం నయనం వంగి కన్నీరు కార్చింది. చేతిలో తేమ పంచుకుంది. రూపేష్ చెప్పినవన్నీ వరుసక్రమంలో చెవున మారుమ్రోగుతున్నాయ్. భ్రమ, ఊహలనుండి విముక్తి కమ్మంటున్నాయ్. తలపైకెత్తి రూపేష్ వైపు చూశాడు. మనస్సు తేలిక పడింది. కొత్త అనుభూతి కలిగింది. అప్పటిదాకా రోడ్డు పక్కనున్న పార్క్ రణగొణధ్వనుల మధ్య ఉన్నట్లు అన్పించినా ఇప్పుడక్కడ ప్రశాంతత కన్పిస్తుంది. గోపి అన్నట్లు కొంతమంది మాటలు ఆవేశం వచ్చేలా చేస్తాయ్. మరికొంత మంది మాటలు బాధను కలిగిస్తాయ్. ఇంకొంతమంది మాటలు తెగింపునిస్తాయ్. స్పూర్తినిస్తాయ్. ధైర్యానిస్తాయ్. ఎప్పుడెవరి మాటలెలా ప్రభావం చూపుతాయో కాలానికే తెలియాలి. రూపేష్ మాటలు మాత్రం శాంతిరాజు మనస్సు లోతుల్లోకి చేరుకున్నాయి. రూపేష్ ప్రభావం శాంతిరాజుపై ప్రస్పుటంగా కన్పిస్తుంది.
తరాల అంతరం దూరాలను పెంచట్లేదు. దూరమైపోతున్న మనుషులను కలుపుతుంది. దూరమైపోతున్న మనస్సులను గుర్తుచేస్తుంది. కనుమరుగవుతున్న సంస్కృతి సంప్రదాయాలను పదిలపర్చుతుంది. తరాల అంతరం ఓ నిఘంటువే! మానవుడికి కావాల్సిన ఓ నిఘంటువే! అది చరిత్ర కావొచ్చు, శాస్త్రం కావొచ్చు, మానవ మనుగడను దారి తప్పకుండా కాపలాకాసే భైరవుడు కావొచ్చని అర్ధం చేసుకున్నాడు శాంతిరాజు. తనముందు కనపడుతున్న క్యాంపస్ ఇంటర్వ్యూ లే తన లక్ష్యంగా నిర్దేశనం చేసుకుని లక్ష్యం కోసం బయలుదేరాడు.
****

No comments:

Post a Comment

Pages