అందంగా జీవించండిలా... - అచ్చంగా తెలుగు

అందంగా జీవించండిలా...

Share This


అందంగా జీవించడం అనేది ఓ గొప్ప కళ. సృష్టిలోని ప్రతి ప్రాణికి దాని స్థాయికి తగ్గ ఇబ్బందులు ఉండనే ఉంటాయి. అవన్నీ మనకు కనబడవు. ఉదాహరణకు ఒక విరబూసిన రోజా పువ్వును తీసుకుంటే, ముళ్ళ మధ్యలోంచి జీవాన్ని తోసుకు రావాలి, పురుగూ పుట్రా తినెయ్యాలని చూస్తుంటాయి, వాటితో పోరాడాలి, గాలి, ధూళి వంచెయ్యాలని, తుంపెయ్యాలని చూస్తుంటాయి, ఎండ దానిలోని తాజాదనాన్ని పీల్చేయ్యలని చూస్తుంది, వాన, మంచు నాన్చెయ్యాలని చూస్తాయి, ఇంకా పూర్తిగా విరియక ముందే, ఏ సౌందర్య పిపాసులో తుంచాలి అని చూస్తుంటారు, ఇన్నీ దాటుకుని, కణకణంలో సమానమైన రంగు, జీవం, పరిమళం నింపుకుని అది విరబూస్తుంది. లోకం దాని సొగసునే చూస్తుంది తప్ప, ఆ సొగసు మాటునున్నపోరాటాన్ని చూడదు. అలాగే మనకు కూడా ఎదుటివారు చాలా ఆనందంగా ఉన్నారని, మనకే అన్నీ కష్టాలని, పొరబడుతూ చీకాకులు కొనితెచ్చుకుంటూ ఉంటాము. మరి మనకున్న పరిధులలో, పరిమితుల్లో అందంగా జీవించడం ఎలా అంటారా?
మొదలంటా నరికిన మోడు చివర్లో కూడా ఎక్కడో చిన్న ఆశ చిగురులు వేస్తూ ఉంటుంది. ఆ ఆశను మనం చూడాలి, ఆ మోడు వంకే చూస్తుంటే, బ్రతుకు మీద ఆశ చచ్చిపోతుంది. ఆ చిగురు వంక చూస్తే, జీవితం మళ్ళీ చిగురిస్తుంది. అన్ని వేళలా పెద్ద పెద్ద ఆనందాలు మనల్ని వెతుక్కుంటూ రాకపోవచ్చు. కాని చిన్న చిన్న ఆనందాలను వెతుక్కుంటూ, వాటిలో మన సృజన ద్వారా కొత్తగా ఏదైనా సృష్టించినప్పుడు, గొప్ప తృప్తి దొరుకుంది. ఇష్టమైన కళలలో మనసు పెట్టి, ఏదైనా కొత్తగా సాధించినప్పుడు మనకు కలిగే ఉత్సాహం, మరింత ఆనందంగా మనం ముందుకు వెళ్ళేలా చేస్తుంది. ప్రవృత్తిలో సాధించే విజయాలు, వృత్తి బాధ్యతలని మరింత ఉత్సాహంతో నిర్వర్తించేలా ప్రేరణ ఇస్తాయన్నమాట. అందుకే కళతో జీవనకళ ని పెంపొందించుకోవాలి, అప్పుడు ఈ నిత్య పోరాటానికి ఒక ఆలంబన దొరుకుతుంది. అలాగే మంచి సంగీతాన్ని వినడం, మౌనంగా ప్రకృతి ముంగిట్లో సేద తీరడం, మంచి మిత్రులు, శ్రేయోభిలాషులతో మనసు పంచుకోవడం, ఉన్నంతలో బీదసాదలకు సాయపడడం గొప్ప ఊరటను ఇస్తాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో, కాసేపైనా మొబైల్ వంటి గాడ్జెట్ లను పక్కనపడేసి, మనసుకు స్వాంతన చేకూర్చకపోతే జీవితం నిస్సారంగా అనిపిస్తుంది. జీవన శైలి వెంటనే మారకపోవచ్చు, కాని అందులోనే మనకిష్టమైన వాటిని ఎంచుకుని, ఆనందంగా జీవించడం, నిజంగానే ఒక గొప్ప కళ.
ఎప్పటిలాగే పలు భావాల కలబోతలా, అక్షర రంజితమై వచ్చిన ఈ సంచికలో సుద్దాల అశోక్ తేజ గారి ముఖాముఖి, ఆర్టిస్ట్ సతీష్ గారి పరిచయం, నాచన సోమనాధుడి గురించి, ఘంటసాల మాష్టారు గురించిన అనేక విశిష్ట అంశాలున్నాయి. ఇవి కాక సీరియల్స్, కధలు, ప్రత్యేక శీర్షికలు ఎన్నో మీకోసం నిరీక్షిస్తున్నాయి. చదవండి, చదివించండి, దీవించండి.
నమస్సులతో
భావరాజు పద్మిని

No comments:

Post a Comment

Pages