శ్రీవిష్ణుసహస్త్రనామ స్తోత్రం - పిన్నలి వేంకట రామ గోపీనాథ్ - అచ్చంగా తెలుగు

శ్రీవిష్ణుసహస్త్రనామ స్తోత్రం - పిన్నలి వేంకట రామ గోపీనాథ్

Share This
శ్రీవిష్ణుసహస్త్రనామ స్తోత్రం - పిన్నలి వేంకట రామ గోపీనాథ్
పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం 



గతంలో పరిచయం చేసిన శతకాలన్నీ చాలావరకు ప్రాచీన కవులువ్రాసినవి కొన్ని 20వ శతాబ్ధం ప్రారంభకాలంలోనివి. అయితే ఈ కాలంలో కూడా అనేకమంది కవులు శతకరచనలను చేస్తూ ఉన్నారు. అయితే ఇవి అంతగా ప్రజాదరణకు నోచుకోకపోవటానికి కారణం ముఖ్యంగా మనలో పుస్తక పఠనాసక్తి లోపించటమే. ఎంతోమంది నూతన కవులు ఎన్నెన్నో శతకాలను వ్రాస్తున్నారు. వారిలో నాకు తెలిసినవారిని కొంతమందిని పరిచయం చెయ్యాలని సంకల్పం. 

కవి పరిచయం:

విష్ణుసహస్త్రనామ స్తోత్రం సంస్కృతం నుండి తెలుగునకు అనువదిస్తు చెప్పిన శతకం. ఈ శతక రచయిత శ్రీ పిన్నలి
వేంకట రామ గోపీనాథ్ గారు. వీరు క్రీ.శ. 1952, మే 1 వ తేదీన జన్మించారు. తల్లి పింగళి కనక దుర్గాంబ తండ్రి కీ.శే. పిన్నలి వేంకటరామ నరసింహారావు. వీరి విద్యాభ్యాసం చాలావర్కు విజయవాడలో జరిగుంది. బీ.కాం వరకు చదివినతరువాత జర్నలిజం చేపట్టి క్రీ.శ. 1976 నుండి 2004 వరకు ఈనాడు, ఆంధ్రప్రభ దినపత్రికలకు సబ్-ఎడిటర్ గా పనిచేసారు. 
వీరి వృత్తి జర్నలిజం ప్రవృత్తి పద్యరచన. ఈ ప్రవృత్తికి 1966-68 కాలంలో శ్రీమాన్ ఓగిరాల వేంకటేశ్వర శాస్త్రిగారు నేర్పిన ఛందస్సు పాఠాలు పునాదులు వేస్తే, 2015 నుంచీ శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారు(అచ్చంగా తెలుగు అనే ఫేస్ బుక్ కూటమి ద్వారా) నేర్పిన పాఠాలు సంపూర్ణ రూపాన్ని తీర్చాయి. అప్పటి నుంచి వీరు తమ రచనావ్యాసంగాని అవిరాళంగా కొనసాగిస్తున్నారు. ఇంతవరకు వీరి రాచనలు.  
1. గీతాసారం ( తాత్పర్యం ఆధారంగా 609 ఆటవెలదులు),
2. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్ ( మకుటం మార్చకుండా 216 ఆట వెలదులు), 
3. కనకధారా స్తవమ్ (ఆటవెలదులు), 
4. మోహముద్గరమ్ (ఆటవెలదులు),
5. షిర్డీ సాయి శతకం(ఆటవెలదులు)
6. శివా శతకం(నీతి కందాలు).
7. శారదాంబా శతకము (ఆటవెలదులు)
ఇవిగాక సందర్భానుసారం వివిధ అంశాలపై వివిధ రకాల ఛందస్సులలో వందలాది పద్యాలు చెప్పారు..
ఇటీవలే వీరు కథా రచనలను ప్రారంభించారు. ఇప్పటి వరకూ 6 కథలు "అచ్చంగా తెలుగు" అంతర్జాల పత్రికలో ప్రచురితం అయ్యాయి. 
వీరి శతకాలు ఏవీ ఇంతవరకూ పుస్తక రూపంలో అచ్చుపడలేదు. 

శతక పరిచయం: 

శ్రీవిష్ణు సహస్త్రనామ స్తోత్రం "వందనాలు హరికి వంద వేలు" అనే మకుటంతో 216 ఆటవెలదులలో రచింపబడిన శతకము. విష్ణుసహస్త్ర నామాలకు చక్కని అచ్చతెలుగులో అందరికి సులభంగా అర్థమయ్యే విధంగా రచించటమే కాక వాని అర్థతాత్పర్యాలను కూడా ఈ రచనలో పొందుపరిచారు. శతకము శ్రీమహావిష్ణువు ధ్యానంతో మొదలయి అనంతుని విశ్వరూపాన్ని మన కళ్ళముందు సాక్షాత్కరింపచేస్తుంది. క్రింది ధ్యాన పద్యాలను చూడండి.

కాంతులీను మణులు కలిగిన యిసుకచే
ప్రభలు వెలుగునట్టి పాలకడలి 
ముత్యములను జేరి మురిపించునగలతో
శేషశయనుడాయె శ్రీహరిపుడు

అటుల శయనించిన శ్రీహరి రూపవర్ణన అద్భుతం

అడుగు లవని యయ్యె ఆ నాభి గగనమే
గాలి వాయువాయె, గనులు నెపుడు
సూర్య చంద్ర భంగి సూడు నీజగతినీ
దిశలు చెవులె, యగ్నిదేవ ముఖము

శౌరి శిరసు జూడ స్వర్గమై భాసిల్లు
సకల ప్రాణులచటె సంచరించు
దివ్యమందిరంబె దేవదేవుని మేను
ముక్తి గోరి నేను మోకరింతు

ఇలా విష్ణుని దివ్యరూపవర్ణన ధ్యానం "వెన్నునికి వేల వందనాలు" తో ముగుస్తుంది. తరువాత స్తోత్ర ప్రారంభం. దాదాపు 9 నుండి పది నామాల వర్ణన రెండు ఆటవెలది వృత్తాలలో చెప్పబడినవి.

కొన్ని పద్యాలను వాని భావార్థాలను కవిగారి మాటలలోనే చూద్దాం 

విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః
భూతకృత్ భూతభృధ్బావో భూతాత్మా భూతభావనః  (నామాలు 1 నుండి 9 వరకు)

1. విశ్వ వ్యాపకుండు విశ్వమంత యతని
వశమునందె యుండు వదలకుండ
మూడు కాలములకుఁ జూడఁ దానధిపతి
వందనాలు హరికి వంద వేలు

2. కర్త, భర్త గానె కలిగి సమత్వము
అన్ని భూతములకు నాత్మగాను
కాంతి నిచ్చు మరియు గల్పించు శుభములు
వందనాలు హరికి వంద వేలు

భావము: విశ్వమంతటా వ్యాపించియున్నవాడు, సర్వమూ తన వశమునందే యుంచుకున్నవాడు, మూడు కాలములకూ అధిపతియైనవాడు, సమస్త ప్రాణకోటికీ సృష్టికర్తయైన వాడు. గనుకనే తానే భర్తగా రక్షణ భాధ్యతలు స్వీకరించి, అన్నిటియందూ సమానత్వము కలిగి వెలుగునిస్తూ సర్వశుభములూ కల్పించేవాడు. అట్టి శ్రీహరికే శతసహస్త్ర వందనాలు.

స్వయంభూః శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః
అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః (నామాలు 37 నుండి 45 వరకు)

1. సొంత నిర్ణయమున సూత్రధారిగ తానె
అవతరించుచునుండు నవనియందు
శంభువనగ తానె యంబర రత్నమే
వందనాలు హరికి వంద వేలు

(అవసరసమయాలలో ఎవరి ప్రమేయమూ లేక స్వయంగానే అవతరించువాడు, శుభములను కలగజేయువాడు, సూర్యుడు కూడా అయిన శ్రీహరికి శతసహస్త్ర వందనాలు)

2. కమలములను బోలు కనులు గల్గినవాడు
ప్రణవనాదమునకె ప్రతినిధాయె
ఆది రహితుడతడె పొందడు మరణము
వందనాలు హరికి వంద వేలు

(కమలములను పోలిన కన్నులు గలవాడు, తానే ఓంకార నాదం అయినవాడు, మొదలూ తుదీ లేనివాడు, అయిన శ్రీహరికి శత సహస్త్ర వందనాలు)

మహాబుద్ధి ర్మహా వీర్యో మహాశక్తి ర్మహా ద్యుతిః
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రి ధృక్ (నామాలు 173 నుండి 180 వరకు)

1. జ్ఞాని తనగ నతడె, గాంచ త్రిమూర్తుల
శక్తి యున్న మేటి శక్తి యుక్తి
మెండు గానె యుండె నిండుగా వెలుగగా
వందనాలు హరికి వందవేలు

(సకలకళా వల్లభుడైన మహాజ్ఞాని, త్రైమూర్త్యాత్మకమైన అంటే సృష్టి స్థితి లయ కార్యాలను తానే అయి నిర్వహించగల సామర్ధ్యము గలవాడు, మహిమాన్విత శక్తి (యిచ్చా శక్తి జ్ఞానశక్తి, క్రియాశక్తి) సంపన్నుడు, సూర్య చంద్రులను, అగ్నిని సైతం మించిన పరమాద్భుతమైన తేజస్సు గలవాడు అయిన శ్రీహరికి శత సహస్త్ర వందనాలు)

నిర్వచింపలేము, నిధులకే నిధి తాను
అంచనాకు రాదు అతని యునికి
వీపుపైన కొండ వేలుపై గిరినెత్తె
వందనాలు హరికి వంద వేలు

(సాధారణ నిర్వచనాలకు అందని రూపసంపద గలవాడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, మహాపర్వతాలను అవలీలగా ఎత్తి ధర్మాన్ని, ఆశ్రిత భక్త గణాలను ఆదుకొన్నవాడు అయిన శ్రీహరికి శతసహస్త్ర వందనాలు)

పైన ఉదాహరించిన పద్యాలు మచ్చుకు మాత్రమే. విష్ణు సహస్త్ర నామాలకు అర్థతాత్పర్యాలను చక్కగా తెలుసుకోవటానికి ఈ శతకం ఎంతగానో ఉపయోగ పడుతుంది. అయితే ఈ శతకము ఇంకా పుస్తక రూపంలో ప్రచూరణకు నోచుకోలేదు. కానీ అచ్చంగా తెలుగు ఫేస్ బుక్ సమూహంలో ఉపలబ్ధం. మీరుకూడా చదవండి. ఇతరులచేత చదివించండి. 

No comments:

Post a Comment

Pages