వీళ్ళే! - అచ్చంగా తెలుగు
వీళ్ళే!       
--డా.పి.వి.ఎల్.సుబ్బారావు 
      

1.పొలాల్లో హలాల్తో దున్నేవాళ్ళు
మట్టి తట్టల్తో ఎత్తేవాళ్ళు
కార్ఖానాల్లో స్వేదం చిందించేవాళ్ళు
కష్టాన్ని నిత్యం ఓర్చేవాళ్ళు

2.సరిహద్దుల్లో కాపలా కాసేవాళ్ళు
మనభద్రతకోసం బతికేవాళ్ళు
మనసామానులు మోసేవాళ్ళు
పిల్లలకి కొరియర్లు తీసుకెళ్లేవాళ్ళు

3.ఇల్లిల్లూ తిరిగి కూరలమ్మేవాళ్ళు
అడిగి అడిగి పూలమ్మేవాళ్ళు
ఊరుశివార్ల గుడారాలలో బతికేవాళ్ళు
బొమ్మలు చేసి మోసి అమ్మేవాళ్ళు

4.కట్టెలు కొట్టుకుని మోసేవాళ్ళు
రొట్టెలు ఇతరులకు చేసేవాళ్ళు
తోపుడుబళ్ళు లాగే వాళ్ళు
బళ్ళపై పళ్ళెట్టుకుని అమ్మేవాళ్ళు 

5.ఇంటింటా పేపర్ వేసేవాళ్ళు
గుమ్మాల్లో పాలప్యాకెట్లుంచేవాళ్ళు
ఇంట్లో అంట్లుతోమేవాళ్ళు
ఇళ్ళకి నీళ్ళు మోసేవాళ్ళు

6.పెట్రొల్ బంకుల్లో ఆయిల్ కొట్టేవాళ్ళు
టీ దుకాణాల్లో గ్లాసులు కడిగేవాళ్ళు
వర్కుషాపులో లో హెల్పర్లు
వాహనాల కోసం క్లీనర్లు

7.రోజూ రాళ్ళుకొట్టేవాళ్ళు
ఎప్పుడూ జోళ్ళుకుట్టేవాళ్ళు
అనాధలుగా బతికేవాళ్ళు
చీకటి వ్యాపారులకు చిక్కేవాళ్ళు

8.చీకటికి,వెలుగుకి తేడాలేనోళ్ళు
చలికి ఎండకి చలించనోళ్ళు
జీవితంలో ఎదుగుదలలేనోళ్ళు
గుట్కాప్యాకెట్తో శ్రమని మరచేవాళ్ళు

9.ఇలా ఎందరో మనలో ఉన్నారు
కష్టపడుతున్నామని తెలియని వారు
దోపిడి అంటే స్పృహే లేనివారు
దొరికినపని తప్పక చేసినవారు

10.పనికి ఫలితమెంతో తెలియని వారు
కష్టఫలమంతా ధారపోసేవారు
నైపుణ్యాలు నేర్వని వారు
గొడ్డుల్లా చాకిరీ చేసేవారు

11.బాల్యం ఎలాగడిచిందో?
జీవితం తెలిసిన దగ్గరనుండీ
వీడని చుట్టం "పేదరికం"
వదలని నేస్తం "ఆకలే"!

12.బతుకు చెట్టుని నిలబెట్టే
కనపడని వేళ్ళు వీళ్ళే!
చేయూత ఇవ్వలేకున్నా ,
ఎన్నడూ చీదరించుకోకండి!

13.మనం కళ్ళుంటే చూడగలం
మనం కాళ్ళుంటే  నడవగలం
మనం చేతులుంటే తినగలం
కాని..వీళ్ళుంటేనే బతకగలం! 

14.వీళ్ళ కాయకష్టమే
అరిష్టాల్ని ఎదిరిస్తుంది
నష్టాల్ని పూరిస్తుంది
అవసరాలకి నిలుస్తుంది!
***
No comments:

Post a Comment

Pages