అపరగాన సరస్వతి --డి.కె పట్టమ్మాళ్ - అచ్చంగా తెలుగు

అపరగాన సరస్వతి --డి.కె పట్టమ్మాళ్

Share This
అపరగాన సరస్వతి --డి.కె పట్టమ్మాళ్
మధురిమ 

రెండునెలలవయసులో రమణమహర్షులవారి  అమృత హస్తాలద్వారా తేనె ని నాలుకపై రాయించుకోగలిగే భాగ్యంతో ఎవరైనా పుట్టారంటే  అంటే వారు కారణజన్ములు కారా మరి?ఎనిమిదేళ్ళ వయసులో కంచికామకోటి పీఠాధిపతిశ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామివారు నవరాత్రిపూజలో పెట్టిన కలశంలోని కొబ్బరికాయని ప్రసాదంగా పొందే మహత్ భాగ్యాన్ని పొందారు అంటే వారు నిస్సందేహం గా  కామక్షీకటాక్షవీక్షణాల నుండీ ఉద్భవించినవారే!!కాదనగలమా???
ఓసారి దేవలోకంలో ఒక విషయంపై  విపరీతమైన వాగ్వివాదం జరిగిందట. ఇంతకీ విషయం ఏంటంటే??"అందరినీ అనగా దేవ,మానవ,యక్ష,కిన్నెర,కింపురుష,గంధర్వులందరినీ మంత్రముగ్ధులను చేసే సంగీతం ఏంటి?"సరస్వతీ మాత యొక్క వీణనుండి వినిపించే అమృతతంత్రీ నాదమా? లేక సకలజగత్తునీ సమ్మోహనపరిచే మురళీధరుని వేణుగానమా?లేక కైలాసాన్నే కుదిపివేయగల నందీశ్వరుని మృదంగవిన్యాసమా??లేక తన అందెలరవముతో 14లోకాలనీఆనందడోలికలలో ఓలలాడించే  పరమేశ్వరుని ఆనంద తాండవమా??
చివరికి బ్రహ్మదేవుడు జనులను మంత్రముగ్ధులనుచేసే చక్కటిగుణాలన్నిటినీ కలబోసి సంపూర్ణ సరస్వతీ అనుగ్రహంతో విదుషీమణిని సృష్టించి, కంచికామాక్షి కటాక్షవీక్షణాలద్వారా  దివ్యసృష్టిని  ప్రతీరోజు తనను దర్శించడానికి వచ్చే కాంతిమతి-కృష్ణస్వామిదీక్షితార్ దంపతులకు వరప్రసాదంగా ఇచ్చాడు.
వర పుత్రిక మరెవరో కాదు సుమారు 70 సంవత్సరాలపాటు కర్ణాటక శాస్త్రీయసంగీతామృతంతోరసికులైన సంగీతాభిమానులందరినీ ముగ్ధమనోహరులిని చేసిన విదుషీమణి,సనాతన సంప్రదాయలను పాటిస్తూ మన కట్టుకి బొట్టు కి మారుపేరుగా నిలిచిన ఆదర్శ గృహిణి,సంగీత సామ్రాజ్ఞి శ్రీమతి డి.కె.పట్టమ్మాళ్.
1919 సంవత్సరంలో మార్చి 19వతేదీన మోక్షపురి గా పిలువబడే   కాంచీపురంలో  కృష్ణస్వామి దీక్షితార్-కాంతిమతి పుణ్యదంపతులకు జన్మించారు శ్రీమతి దమాళ్ కృష్ణస్వామి పట్టమ్మాళ్.తల్లి తండ్రుల్లు ఆమెకు అలమేలు అని నామకరణం చేసినప్పటికీ కుటుంబంలో చాల కాలం తరువాత అమ్మాయి పుట్టడంతో ఆమెను "పట్ట" అని ముద్దుగా పిలిచేవారు.తండ్రి గారు కృష్ణస్వామి గారు కాంచీపురం దగ్గర ఉన్న  దమాళ్ అనే చిన్న గ్రామంలో ఉపాధ్యాయులుగా పని చేసేవారు.ఆయన తను జీవించినంతకాలం ప్రతీరోజూ కామాక్షి అమ్మవారి గుడికివెళ్ళినారట.కంచి కామాక్షి అమ్మవారిగుడికి వచ్చిన సత్పురుషులను,సాధుపుంగవులను నిత్యం సేవిస్తూ ఉండేవారు.అంతేకాదు రమణమహర్షి,కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహస్వాములవారి శిష్యులు కూడా.
పుట్టింది సనాతన సాంప్రయదాయాలు కట్టుబాటులు నూటికి నూరుపాళ్ళు పాటించే కుటుంబంలో...ఇక ఆరోజుల్లో బ్రాహ్మణ స్త్రీలు బయటసభలలో పాడడం ఒక నిషిద్ధమైన చర్య...పట్టమ్మాళ్ గారి అమ్మగారికి మంచి సంగీత జ్ఞానం ఉన్నా ఎప్పుడూ బయటసభలలో పాడలేకపోయారు కారణం పట్టమ్మాళ్ గారి తాతగారు అందుకు సమ్మతించేవారు కాదట.ఇలాంటి బంధాలన్నీ ఛేదించి ప్రపంచమంతా పర్యటించగలిగారంటే అది ఎంత గొప్ప విషయం మరి!.
కాని తండ్రి గారికి మాత్రం శాస్త్రీయసంగీతం అంటే ఎంతో ఇష్టం అలాగని తనకుమార్తెని పెద్ద విద్వాంసురాలిగా చూడాలని కూడా ఎప్పుడూ అనుకోలేదుట కానీ ఆమె స్వరం ఎంతో శ్రావ్యం గా ఉంటుందని తెల్లవారుఝామున మూడుగంటలకే నిద్దురలేపి ముకుందమాల,శ్యామలా దండకం,శ్రీకృష్ణ కరుణామృతం వంటివి చిన్నారి అలమేలుకి నేర్పిస్తూ ఉండేవారట
కృష్ణస్వామి దీక్షితార్ గారికి పట్టమ్మాళ్ గారి కన్నా ముందే అబ్బాయి జన్మించారు. వారే ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ డి.కె రంగనాథన్ గారు.అలాగే పట్టమ్మాళ్ గారి తరువాత కూడా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వారే శ్రీ డి.కె.జయరామన్,శ్రీ డి.కె.నాగరాజన్.నాగరాజన్ గారు యు.ఎస్. లో స్థిరపడి అక్కడ ఎందరో శిష్య ప్రశిష్యులను తయారు చేయగా జయరామన్ గారు మద్రాస్ నగరంలో ఆతరంలో ప్రఖ్యాత విద్వాంసులలో ప్రముఖులు.
నారయణ పిళ్ళై అనే ప్రఖ్యాత వ్యాపారవేత్త ప్రతీ సంవత్సరం కాంచీపురంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహించేవారు.అక్కడ అరియకుడి రామానుజం అయ్యంగార్,ముసిరి సుబ్రమణ్యం అయ్యర్,రాజరత్నం పిళ్ళై వంటి సంగీత విద్వాంసులందరూ కచేరీలు చేస్తూ ఉండేవారు.పట్టమ్మాళ్ గారు తన అన్నయ్య మరియు తమ్ముళ్ళతో కలిసి అక్కడికి వెళ్ళి కచేరీలు వినేవారట...నలుగురు తోబుట్టువులూ విన్నది విన్నట్టుగా ఇంటికి తిరిగి వచ్చి పాడేసేవారట.తన కుమార్తెలో ఉన్న అద్భుత గ్రహణాశక్తిని ,పట్టుదలని చూసి ఆమెకు సంగీతం నేర్పించాలని,చదువు కూడా చెప్పించాలని బాల్య వివాహం చెయ్యరాదని నిర్ణయించుకున్నారు.అందుకే పట్టమ్మాళ్ గారు ఎప్పుడూ అంటూ ఉండేవారు "నేను నాజీవితంలో ఇద్దరు వ్యక్తులకు ఎప్పుడూ ఋణ పడి ఉంటాను ఒక్కరు నా తండ్రి ఇంకొకరు నా భర్త" అని.
తమిళ దేశంలో పుట్టిన పట్టమ్మాళ్ గారి తొలిగురు తెలుగువారు కావడం మన తెలుగు వాళ్ళ అదృష్టం.....కచేరీల లో విన్న పాటలు అక్కా తమ్ముళ్ళు ఇలా ఇంట్లో పాడుకుంటూ ఉంటే అదే వీధిలోంచి వెళుతున్న సంగీతం మాష్టారు గారు ఆగి వాటిని విని,ఆనందంతో లోపలకి వెళ్ళి వారి తండ్రి గారిని వీరి గురువు ఎవరని అడిగారట.అప్పుడు తండ్రిగారైనటువంటి కృష్ణస్వామి దీక్షితులవారువారి పిల్లలకు ఇంకా ఎవరూ గురువు లేరని వారు విన్నదే అలా పాడుకుంటున్నారని చెప్పగా వారి ప్రతిభా పాఠవాలకి ఆనందపడి తాను వారికి గురువునవుతానని చెప్పారట....భగవత్ అనుగ్రహం ఉంటే అన్నీ అలా సమకూరుతాయేమో, ఆయన శాస్త్రీయ సంగీతంతో పాటుగా తెలుగు భాషని,అందులోనే రచింపబడ్డ ఎన్నో త్యాగరాయ కృతులను నేర్పించారుట.ఆవిడకి సంగీతం నేర్చుకోవటం తప్ప ఇంకేమీ తెలియదుట అందుకే వారి పేరు కూడా పట్టమ్మాళ్గారికి తెలీదుట వారిని "తెలుగు వాద్యార్" అని మాత్రం పిలిచేవారట.
ఈవిధంగా 9ఏళ్ళ వయస్సులో ప్రారంభించిన సంగీత శిక్షణ ఎందరో ప్రముఖులదగ్గర సాగింది.పట్టమ్మాళ్ గారికి సుమారు 10ఏళ్ళ వయసు ఉన్నప్పుడు తండ్రి గారు ఆవిడని ప్రభుత్వ  సంగీత పరీక్ష రాయించడానికి మద్రాసు తీసుకు వచ్చారు. పరీక్ష లో ప్రాయోగికం(ప్రాక్టికల్) కూడా ఉండడం వలన  ముగ్గురు న్యాయమూర్తుల ఎదుట పాడవలిసి వచ్చింది.వారు ముగ్గురూ సంగీత సామ్రాజ్యంలో మహాచక్రవర్తులవంటి వారైన "టైగర్ వరదాచారిగారు,ఆచార్య సాంబమూర్తిగారు,ముత్తుస్వామి దీక్షితులవారి తమ్ముడైనటువంటి బాలస్వామి దీక్షితుల వారి మనుమడైన అంబి దీక్షితులవారు."
వారు ముగ్గురూ చిన్నారి పట్టమ్మాళ్ ని "నువ్వు ఏమి పాడతావు అని అడిగినప్పుడు...కాంభోజి రాగంలోని శ్రీ సుబ్రమణ్య నమస్తే అన్న కీర్తన అద్భుతంగా పాడేసేరికి అంబి దీక్షితులవారు ఆనందంతో పొంగిపోయి వెంటనే పట్టమ్మాళ్ గారి తండ్రి గారితో కాంచీపురం తిరిగి వెళ్ళద్దని తానే స్వయంగా  పట్టమ్మాళ్ కి సంగీతం నేర్పిస్తానని చెప్పారంటే ఆవిడఎంత అద్భుతంగా పాడి ఆయనని మెప్పించారో అర్థం అవుతుంది.
అంబి దీక్షితులవారు ఎట్టియాయపురం మహారాజుగారి సంస్థానంలో విద్వాంసులుగా ఉండేవారు అందుకే వారు పట్టమ్మళ్ గారిని అక్కడికి తీసుకుని రమ్మనారట.ఈవిధంగా అంబి దీక్షితులవారిదగ్గర ముత్తుస్వామి దీక్షితులవారి ఎన్నో అద్భుతమైన కృతులను నేర్చుకోగలిగిన అదృష్టవంతురాలు మన పట్టమ్మాళ్ గారు.
మద్రాసు నుండీ ఎట్టియాయపురం వెళ్ళేముందు అంబీదీక్షితులవారు "జస్టీస్ టి.ఎల్.వెంకటరామ అయ్యర్"అనే మద్రాసు హై కోర్టు లాయరు గారి దగ్గరికి తీసుకువెళ్ళారట ఎందుకంటే ఆయన వృత్తి రీత్యా లాయరు అయినా వారు ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలు  పాడడం లో వారికి వారే సాటి మేటి కూడా.
ఈవిధంగా వెంకటరామ అయ్యర్ గారి దగ్గర మధ్యమావతి రాగంలోని ధర్మసంవర్ధిని, ఆనందభైరవిరాగంలోని మానసగురుగుహ, సుద్ధసావేరిలోని ఏకాంబరేశ్వర నాయికే వంటి అద్భుతమైన కీర్తనలు నేర్చుకోగలిగారు.వెంకటరామ అయ్యర్ గారుS తరువాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా కూడా పని చేసిన గొప్ప వ్యక్తి..కాని మంచి సంస్కృత పండితులుమరియు శాస్త్రీయ సంగీత విద్వాంసులు కూడా.
ముత్తుస్వామి దీక్షితారు గారి కీర్తనలు పాడడంలో పట్టమ్మాళ్ గారు చాలా పేరు తెచ్చుకున్నారు.ఆవిడ ప్రతిభ కనబరచడానికి కారణం వెంకటరామ అయ్యర్ గారే అని పట్టమ్మాళ్ గారే ఎన్నోసార్లు తన గురువుగారి తలచుకుంటూ చెప్పేవారు. ఆవిడ గురుభక్తి అంత  అపారమైనది.
ఈవిధంగా ఎందరో మహానుభావులు  వేరు వేరు దశలలో ఆమెకి దిశానిర్దేశ్యం చేసారు ఇదికూడా దైవ నిర్ణయమేమరి.
తమిళ త్యాగయ్య గా ప్రఖ్యాతి గాంచిన శ్రీ పాపనాసం శివం గారు బ్రోచేవారెవరురా వంటి ఎన్నో అద్భుతమైన కీర్తనలు రచించిన మహానుభావులు.వీరు రాసిన ఎన్నో కీర్తనలు స్వయంగా వీరే పట్టమ్మాళ్ గారికి నేర్పించారు.వీరే పట్టమ్మాళ్ గారిని చలనచిత్ర సీమకి కూడా పరిచయం చేసి నేపధ్యగానంలో కూడా ప్రోత్సహించిన వ్యక్తి. తమిళనాడులో కోటీశ్వర అయ్యర్ అనే గొప్ప వాగ్గేయకారులుండేవారు వారు 72మేళకర్త రాగాలలోని రచనలు చేసిన మహానుభావులు పట్టమ్మాళ్ గారు వారిదగ్గర క్లిష్ట తాళాలలో ఎన్నో కృతులను నేర్చుకున్నారు.
ఇక ఎన్నో వర్ణాలను,జావళీలను,పల్లవులను శ్రీ విద్యాల నరసింహులు నాయుడు గారి దగ్గర నేర్చుకున్నారు.వీరందరు కాక అరియకుడి రామానుజ ఆయంగార్ ని తన మానస గురువుగా భావించేవారు. ఇలా ఎందరో గొప్ప గొప్ప విద్వాంసులవద్ద ఎప్పుడూ నేర్చుకుంటూనిత్యవిద్యార్ధిని గా ఉంటూ తన జ్ఞానాన్ని దినదిన ప్రవర్ధమానం గావించుకున్నారు.
ఇక వారి కచేరీల విషయానికొస్తే అసలు ఆవిడ పాఠశాలకి వెళ్ళి చదువుకోవడమే రోజుల్లో అనర్థమైన పనిగా చుట్టుపక్కల అందరూ విమర్శిస్తూ ఉండేవారట...సంగీతం నేర్చుకుంటున్న రోజుల్లో సుమారు 10సం వయస్సు ఉన్నాప్పుడు పాఠశాలలో సతీసావిత్రి నాటకం లో సావిత్రి పాత్ర పోషించారావిడ.అదే ఆవిడ మొట్టమొదటి కచేరీ గా చెప్పచ్చు,అందులో ఆవిడ పద్యాలు ఎంత అద్భుతంగా పాడారంటే శ్రోతలలో కూర్చున్న పటుచీరల కొట్టు యజమాని అప్పటికప్పుడు నగల దుకాణానికి వెళ్ళి ఒక బంగారు పతకం తెచ్చి ఆమెకి బహుకరించాడట.అదే ఆమె తొలి పతకం అని చెప్పేవారట.ఈవిధంగా పాఠశాల యాజమాన్యం,గురువులు,కుటుంబంవాళ్ళు అందరు ఎంతో సంతోషించారట.కాని మర్నాడు మాత్రం అనుకోని సంఘటన జరిగింది.
మార్నాడు వార్తాపత్రికలో పాఠశాలలో జరిగిన కార్యక్రమంగురించి,అందులో ప్రదర్శించబడిన నాటకం గురించి అందులో సావిత్రి పాత్ర పోషించిన పట్టమ్మాళ్ గురించి,ఆమె గెలుచుకున్న పతకంగురించి ఆమె ఫోటో తో సహా ప్రచురించబడ్డాయి. విషయం తెలుసుకుని ఇంట్లో వారంతా భయభ్రాంతులయ్యారు.తండ్రి కృష్ణస్వామి గారైతే తన కూతురి భవిష్యత్తు ఇక అయిపోయిందనీ,ఇక ఆమెకు ఎప్పటికీ వివాహం కాలేదని ఎంతో విచారించసాగారు.ఇప్పుడు చదువుకోవడానికి మనకి విడ్డూరం గా ఉన్నా రోజుల్లో బ్రాహ్మణ కుటుంబంలో అమ్మాయి బయట అడుగు పెట్టడమే తప్పు అలాంటిది అమ్మాయి ఫోటో కూడా వార్తాపత్రిక లో రావడం అంటే ఇక వారి పరువు పూర్తిగా పోయినట్లేట.బంధువులందరూ ఇంటి ముందు పోగై కృష్ణస్వామి ని ఓదార్చడం మొదలెట్టారు.
ఇదే సమయంలో అగ్ని కి ఆజ్యం పోసినట్లు ఆవిడ ప్రశంసలు పేపర్ లో చూసి కొలొంబియా గ్రాంఫో కంపెనీ వారు ఆమె తో రికార్డు పాడించుకుంటాము అంటూ వచ్చారు.వారిని ఆగ్రహంతో బంధువులందరూ తరిమి తరిమి కొట్టారట.అలాంటి సమయంలో కాంచీపురంలోనే  నివసించే స్వాతంత్ర్య సమరయోధులైనటువంటి డా.పి.ఎస్.స్రీనివాసన్ గారు,శ్రీ ఎస్.సత్యమూర్తి గారు, పాట్టమ్మాళ్ గారి పాఠశాల ప్రాథానోపాధ్యురాలైనటువంటి శ్రీమతి అమ్ముకుట్టి అమ్మాళ్ గారు,పాట్టమ్మాళ్తండ్రి గారికి "మీ అమ్మాయి గాత్రం సామాన్యమైనది కాదు సాక్షాత్తు సరస్వతీ స్వరూపం అమ్మాయి... అమ్మాయి కి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. కట్టుబాట్లకు,ఆచారాలకు లోబడి గాన సరస్వతి పురోగమనాన్ని అడ్డుకోకు..ఆమె మామూలు స్త్రీ కాదు కారణ జన్మురాలు"అని  నచ్చచెప్పగా కృష్ణస్వామి గారు సంఘం నుంచి తన బంధు జనం నుండీ  ఎంతో వ్యతిరేకత ని ఎదురుకున్నా పెద్దవారు చెప్పిన మాటలని కూడా గౌరవించి ఆమె కచేరీలు చెయ్యడానికి ఒప్పుకున్నారు...అంత ప్రతిభ ఉన్నా ఇలా ఇన్ని శృంఖలాలు ఛేదిస్తే తప్ప ఆమెకు కచేరీ చేసే అవకాశం కూడా రాలేదంటే ఆరోజుల్లో పరిస్తితులు ఎలా ఉండేవో అర్థం అవుతుంది. ఈవిధంగా ముగ్గురి పుణ్యం వల్లనే గానసరస్వతి సంగీత  ప్రపంచానికి అందబడింది.ఇది సత్యం.
ఇక వెంటనే కొలొంబియా వారు చిన్నారి పట్టమ్మాళ్ తో వెంటనే ఒక గ్రాంఫోన్ రికార్డ్ కూడా విడుదల చేసారు.చాలా సంవత్సరాలవరకూ పట్టమ్మాళ్ గారే కొలొంబియా వారి "బాలకళాకారిణి" గా ఎన్నో రికార్డులు విడుదల చేసారు కూడా.
కచేరీల మహా ప్రస్థానం అలా మొదలైందన్నమాట.మద్రాసు లో మొదటి కచేరీ అయితే 1932లో ఎగ్మోర్ లోని మహిళా సమాజంలో ఇచ్చారు...మద్రాసు దాటి మొట్టమొదటి సారిగా 1934లో బొంబాయి నగరంలోను,ఆంధ్ర ప్రదేశ్లో 1935లో ఇవ్వడం  జరిగింది.
ఆవిడ కచేరీలు మరియు పెద్ద పెద్ద వారిదగ్గర నేర్చుకోవడం ఇలా కొనసాగుతూ ఉండగా 21సంవత్సరాల వయసులో శ్రీ ఈశ్వరన్ అయ్యర్ అనే ఇంజనీరు గారితో ఆమె వివాహం తిరుచానూరులో జరిగింది.21సంవత్సరాలకు పెళ్ళి కూడా రోజుల్లో ఒక వింతేమరి.
పరమేశ్వరుడు కూడా పార్వతి మాతకు శరీరం లో సగభాగం మాత్రమే ఇచ్చాడు కాని ఈశ్వరన్ గారు  మాత్రం తన వృత్తిని  కూడా వదిలిపెట్టి జీవితం అంతా ఆమెకు చేయూతగా నిలబడం లోనే అంకితం చేసారు.పురుషాధిక్యత పూర్తిగా  రాజ్యమేలుతున్న ఆరోజుల్లో ఆమె ప్రగతికి ఆయన సోపానమైనారు.ఆమె కచేరీలకు బయట ఊర్లు వెళ్ళినప్పుడు తమ ఇద్దరు పిల్లలైన శివకుమార్ ,లక్ష్మణ్ కుమార్ ఆలనా,పాలనా చూడడం,ఇల్లు చూసుకోవడం ఇక ఆవిడకి సంగీతం తప్ప ఏదీ తెలియదుట..మద్రాసులో కనీసం రైలు ఎక్కడ ఎక్కాలో కూడా తెలియని అమాయకురాలు కాబట్టే ఆమె ప్రయాణాల ఏర్పాట్లు చూడడం ఇలా అన్నీ  ఆయనచూసుకోగలిగారు కాబట్టే ఆవిడ తన సంగీత జైత్రయాత్ర కొనసాగించగలిగారు.స్త్రీకి పెళ్ళైన తరువాత  సంసారం , బయటకి వెళ్ళి రాణించడం రెండు సమాంతరరేఖల్లాంటి దారులు భర్త తిర్యగ్రేఖ లాగా రెండు మార్గాలను కలిపి సమన్వయం చెయ్యగలిగే స్నేహితుడై ఇంట్లో ఇల్లాలిని గెలిపించగలిగినప్పుడే తప్ప ఆవిడ బయట తన ప్రతిభ ని నిరూపించడం అసాధ్యం. విషయంలో పట్టమ్మాళ్ గారు మాత్రం చాల అదృష్టవంతులనే చెప్పాలి. మాట ఆవిడ జీవించి ఉన్నప్పుడు పదే పదే చెప్తూఉండేవారు కూడా. ఇక వారి కచేరీలలో విశిష్టతల గురించి చెప్పాలంటే ఆవిడ వచ్చి కూర్చుని కచేరీలో పాడడమే ఒక విశేషం శ్రోతలకి.1930లు ప్రాంతంలోశాస్త్రీయ సంగీత విద్వాంసులందరూ పురుషులే.అన్ని గాన సభలలోనూ వారి కచేరీలే.రాగం,తానం,పల్లవి వంటి క్లిష్టమైన పద్ధతులు పాడడం వంటివి వారికే చెల్లుతుంది అన్నట్లుగా ఉండేవారుట..అలాంటి సమయంలో పట్టమ్మాళ్ గారు కచేరీలలో కష్టమైన రాగాలలో,లయలలో ఎంతో అద్భుతంగా పల్లవులనుఆలపించేవారట.జి.ఎన్.బాలసుబ్రమణ్యం వంటి కాలంలోని విద్వాంసులు ఆవిడ పల్లవులు పాడే బాణీని,తానాన్ని పాడే విధానాన్ని ఎంతగానో ప్రసంసించారంటే ఆవిడ  ప్రతిభా పాఠవాలు మనకి తేటతెల్లం అవుతున్నాయి.
చాలామందికి ఆవిడ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలుగానే తెలుసు కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆవిడ గొప్ప దేశభక్తురాలు.స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజుల్లో ఆవిడ కచేరీలు చేసేటప్పుడు తప్పకుండా కొన్ని దేశభక్తి గీతాలు ఆలపించేవారు.ముఖ్యంగా ప్రముఖ తమిళ మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతి గారి  దేశభక్తి కవితలు పాటలు తప్పకుండా పాడేవారు. ఆరోజుల్లో ఈవిడ దేశభక్తి గీతాలు వినడానికే కొందరు స్వాతంత్ర్యసమరయోధులు ఆవిడ కచేరీలకు వచ్చేవారట.అవి వినడానికిఎంతో ఉత్తేజభరితం గా సాగేవి.దేశభక్తిని పెంపొందించుకునేలాగా  కూడా ఉండేవట.
తన అద్భుతమైన గళంతో స్వాతంత్ర్యపోరాటానికి అందరినీ సిద్ధంచేస్తున్నట్లుగా పాటలు విన్నవారికి  అనిపించేదిట. ఇప్పటివరకూ సంగీతవిద్వాంసునికీ దక్కని ఒక అపూర్వమైన గౌరవం ఆవిడకిమాత్రమే దక్కింది అదేమిటంటే మనకి స్వాతంత్ర్యం వచ్చిన రోజు  అనగాఆంగ్లకాలమానంప్రకారం సరిగ్గా 1947 ఆగష్ట్ 14 తేదీ అర్థరాత్రి సరిగ్గా 12 గంటలకు దేశభక్తి గీతాన్ని రేడియో లో పాడే అదృష్టాన్ని పొందిన ధన్యురాలు.
అప్పుడేకాదు మనకి స్వాతంత్ర్యం వచ్చినతరువాత కూడా ఆఖరికి 75ఏళ్ళ వయసులో కూడా కచేరీ ముగించేటప్పుడు ఎప్పుడూ దేశభక్తి గేయంతోనే ముగించేవారట.
ఆవిడ జీవితం లో ఇంకో గొప్ప విశేషం ఏమిటంటే ఆవిడ తమ్ముడు శ్రీ డి.కె జయరామన్ గారు,ఇద్దరుకుమారుల్లో ఒక్కరైన శ్రీ .శివకుమార్ గారు,కోడలు లలితా శివకుమార్ గారు,మనుమరాళ్ళు శ్రీమతి గాయత్రీ సుందరరామన్, ఇంకో మనవరాలు డా.నిత్యశ్రీ మహాదేవన్,మునిమనవరాలు లవాణ్య సుందరరామన్ వీరందరూ ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తున్న కుటుంబ సభ్యులు.కొడుకు,కోడలేకాదు మనవరాలు ,మునిమనవరాలు కూడా కళావారసత్వాన్ని అందిపుచ్చుకోవడం ఎంత సౌభాగ్యం.. శారదామాతకి  ఆవిడ జరిపిన స్వరార్చనాపుణ్యం ఊరికే పోతుందా ఇలా ఇన్నితరాలకు పుణ్యఫలం లభించింది మరి!! ఇంకా కొనసాగుతూనే కూడా ఉంటుంది మరి.
ఆవిడ కచేరీలు ప్రారంభించిన తొలిరోజుల్లోనే ఆవిడకి చలనచిత్ర పరిశ్రమలో పాడే అవకాశం లభించినా కొన్ని దేశభక్తి ప్రధానంగా ఉన్న సినిమాలలో మాత్రమే పాడి మిగిలిన అవకాశాలన్నీ సున్నితంగా తిరస్కరించారు. కేవలం భక్తిరసప్రధానమైన శాస్త్రీయ సంగీతానికే తన జీవితం అంకితం అని చెప్పేవారట.
2000 సంవత్సరంలో ఆస్కార్ అవార్డ్ గ్రహీత శ్రీ .ఆర్ రెహ్మాన్ గారు భారత దేశంలోని ప్రముఖ సంగీతజ్ఞులందరి చేత పాడించిన జన గణ మన లో కూడా గాత్ర విద్వాంసులలో మొట్టమొదటి గా కనిపించేది శ్రీమతి పట్టమ్మాళ్ గారే 80ఏళ్ళు పైబడ్డ సమయంలో కూడా ఆవిడ కంచు కంఠం ఆలయంలో ఘంటానాదంలానే  ప్రతిధ్వనించడం అనితర సాధ్యం.
ఇక ఆవిడ పొందిన సన్మానాలు,సత్కారాల జాబితా అంతా మీ ముందు ఉంచాలంటే నాకు చిన్నప్పుడు చదువుకున్న పొడుపుకథ జ్ఞాపకం వస్తోంది."చాపచుట్టలేము,డబ్బులు లెక్కెట్టలేము " అంటే ఆకాశం,నక్షత్రాలు  అన్నట్టుగా అవి కూడా అంతే...అవి ఆవిడ సంగీత జ్ఞానం లాగా అనంతం.
ముఖ్యంగా కొన్నిటి గురించి చెప్పుకోవాలంటే  సెప్టెంబర్ 3వతేదీ 2014 సంవత్సరంలో రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు భారతదేశంలోని ఎనిమిది మంది సంగీత దిగ్గజాలను ఎంపికచేసుకుని 8 తపాలా బిళ్ళలను విడుదల చేసారు.అందులో పట్టమ్మాళ్ గారు ఒకరు.
సంగీత త్రిమూర్తులంటే మనకి త్యాగరాజ స్వామి,ముత్తుస్వామి దీక్షితులవారు,శ్యామశాస్త్రులవారు మాత్రమే అని తెలుసు కానీ ముగ్గురు శక్తిస్వరూపిణులైనటు వంటి విదూషిమణులనుకర్నాటక సంగీత స్త్రీ త్రిమూర్తులుగా పిలుస్తారు వారు శ్రీమతి డి.కె పట్టమ్మాళ్,శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, శ్రీమతి ఎం.ఎల్.వసంత కుమారి గార్లు.
పౌరసన్మాన సత్కారాలైనటువంటి పద్మభూషణ్,పద్మవిభూషణ్,ప్రఖ్యాత సంగీత విద్వాంసులు టైగర్ వరదాచారిగారి చేత గాన సరస్వతి అన్న బిరుదు,భారత ప్రభుత్వంచేత రాష్ట్రపతి పురస్కారం, బెంగుళూరు సంగీత అకాడమీ వారిచేత సంగీత రత్న అనే బిరుదు,మద్రాస్ సంగీత అకాడమీ వారిచే సంగీతకళానిధి ,ఆంధ్రా సంగీత అకాడమీ వారిచే సంగీత విద్యానిధి కాంచీపురం శంకరమఠం వారిచే "సంగీత కళారత్నం" బిరుదు ప్రధానం ,కేరళా ప్రభుత్వంవారి స్వాతిపురస్కారం ఇలా ఎన్నో,ఎన్నెన్నెన్నో.
ఆవిడ సంగీతం,శిష్యులు,బిరుదులు,సాధనేకాదు సౌభాగ్యం కూడా అనంతం కాదు అజరామరం....అందుకే 90ఏళ్ళ వయసులో 2009 సంవత్సరంలో జూలై 16 తేదీన సుమంగళి గానే శాశ్వత శారదా సానిధ్యాన్ని చేరుకున్నారు.
ఆవిడ జీవితసారాన్ని కొన్ని మాటల్లో ఇలా చెప్పారు అవి
సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న వాక్కుని జీవించినంతకాలం ఆచరించి  తన శిష్యప్రశిష్యులకు ఇదే మంత్రోపదేశం లాగ చెప్పేవారట.
కచేరిలకోసం,కాసులకోసం కళ ని నేర్చుకోవద్దు.కళని  కళకోసమే నేర్చుకోండి..ప్రతిభకి తప్పకుండా గుర్తింపు లభిస్తుంది.
భావనికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి..
ఆత్మతో అనుసంథానం చేసుకుంటూ పాడండి
మీ బలహీనతలను తెలుసుకుని వాటిని కూడా బలంగా మార్చుకుని జీవించండి.
గురు కటాక్షం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమే.
పట్ట"అమ్మ" చెప్పిన సలహాలు కేవలం సంగీతం అభ్యసించేవాళ్ళకే కాదు ఏవృత్తిలోని వారికైనా ఉపయోగపడేవే.

మాతృభక్తితోపితృభక్తితోగురుభక్తితోదైవభక్తితోపతిభక్తితోదేశభక్తితోతనకంటే చిన్నవారిపై ఎనలేని అభిమానముతో  చెరగని చిరునవ్వుతో సంస్కృతీ,సాంప్రదాయాలు పాటిస్తూ నిబద్ధతతో,పద్ధతితో జీవితాన్ని గడిపిన అపర గాన సరస్వతి శ్రీమతి పట్టమ్మాళ్ గారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.  

No comments:

Post a Comment

Pages