దీపం - అచ్చంగా తెలుగు
దీపం 
 కృష్ణ మణి 


నింగిలోంచి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు తెలిసింది
ఎంత అందంగా ఉందోనని !

అన్ని గ్రహాలు ఉన్నట్లు గుండ్రంగా ఉన్నా 
ఆ అందాల ప్రక్రుతి హొయలు 
మనసుని కట్టిపడేసింది 
తెల్లని మబ్బుల ఊయలలు 
దోలాయమానం అంటే ఏంటో రుచి చూపించాయి  

అ నీలి సంద్రం మధ్యలో పచ్చటి మైదానపు ప్రదేశాలు
అక్కడక్కడ గోదుమరంగు ఇసుక ప్రాంతాలు 
కన్నుల పండుగనే చెప్పాలి 

మబ్బుల్ని దాటి భూమిపైకి వస్తుంటే 
ఏవో రేకుడబ్బాలు చువ్వలు దాడి చేసాయి  
భూమికి రక్షణగా 
ఎదో శక్తి ఇలా చేస్తుందని అనుకున్నాను 

మొత్తానికి వాటినుండి తప్పించుకొని  
ఒక చక్కని పచ్చని ప్రాంతంలో దిగి 
అక్కడి ప్రాణుల్ని గమనించాను 
ఒక ప్రాణిపై మరో ప్రాణి ఆధారపడి బతుకుతున్నాయని  
బతకడానికి ఎదుటి ప్రాణిని చంపుకు తింటున్నాయని 
ఆకును పండును కాయను తినే సాత్విక జీవులు కొన్నైతే 
రక్తమాంసాలకై కోరలు గోర్లతో కృరంగా ఉన్నా జీవులు 

బయటికి కనిపించే రంగురంగుల పక్షులకు 
ఎగిరిగంతులేసే అమాయక జంతువులకు 
కిచ్ కిచ్మనే చిట్టిపొట్టి పురుగులకు 
జీవన్మరణ పోరాటమే నిత్యం 
ఆధిపత్య కృరత్వం వల్ల

ఆధిపత్యమంటే ఎవరిదని చూస్తే తెలిసింది 
మనిషనే ప్రమాదకర విష జంతువుదని
     
తెలివి పెంచుకొని అడవిని అలికి 
అందమైన కోటలను 
పేక మేడలను కట్టి 
ఆకాశానికి విషపుగోట్టాన్ని తగిలించి 
తానూ చెడింది కాక 
లోకాన్ని చెరుస్తున్నాడీ మూర్ఖుడు

వాడికి వాడే పోటి పడి
భూమికి గీతాలు గీసి 
పంచుకొని యుద్ధాలు చేస్తున్నాడు  
ప్రకృతిని చిదిమి దీపం పెట్టుకుంటున్నాడు 
సకల జీవాలకూ పెడుతున్నాడు 

కోపం తట్టుకోలేక శపించాను 
ఒక్క క్షణంలో ఈ మనిషి వెయ్యి ముక్కలవ్వుగాక అని 
వెంటనే పెద్ద శబ్దంతో ఒక విస్పోఠనం 

ఉలిక్కిపడి లేచాను నిద్రలోంచి 
నాపై నేనే సిగ్గుపడుతూ!
***

No comments:

Post a Comment

Pages