పంచ మాధవ క్షేత్రాలు - 2 - అచ్చంగా తెలుగు

పంచ మాధవ క్షేత్రాలు - 2

Share This

పంచ మాధవ క్షేత్రాలు - 2

శ్రీరామభట్ల ఆదిత్య శ్రీ బిందు మాధవస్వామి ఆలయం, వారణాసి :
పూర్వం ఒకనాడు ఈ ప్రపంచాన అధర్మం పెరిగి ధర్మం సన్నగిల్లుతున్న సమయంలో సృష్టికర్తయైన చతుర్ముఖ బ్రహ్మ తిరిగి ధర్మస్థాపన చేయాలని నిర్ణయించాడు. అందుకు తగ్గ సమయం కోసం ఎదురు చూడ సాగాడు బ్రహ్మదేవుడు. అదే సమయంలో క్షత్రీయ వంశజుడు అయిన రిపుంజయుడు బ్రహ్మదేవుని కొరకై యఙ్ఞం ప్రారంభించాడు. రిపుంజయుని భక్తికి మెచ్చిన బ్రహ్మ అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు.బ్రహ్మ దేవున్ని చూసిన రిపుంజయుడు చాలా సంతోషించి ఆయనను స్తుతించాడు. రిపుంజయుడి భక్తికి మెచ్చిన బ్రహ్మదేవుడు " రిపుంజయా! నా ఈ ప్రపంచాన అధర్మమూ, అన్యాయమూ బాగా పెరిగాయి. నీవు వెంటనే రాజ్య పాలన చేపట్టి అన్నింటినీ చక్కదిద్దమని కోరాడు." అప్పుడు రిపుంజయుడు బాగా ఆలోచించి, బ్రహ్మదేవుని మాట కాదనలేక సృష్టకర్త ఎదుట ఒక షరతును ఉంచాడు. అదేమిటంటే " ఓ బ్రహ్మదేవా! మీ కోరిక మేరకు నేను రాజ్యపాలన చేస్తాను కానీ. నా రాజ్యంలో మాత్రం దేవతలకు చోటు ఉండకూడదు. అన్నీ నేనుగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను. నా రాజ్యవిషయాలలో దేవతల జోక్యం నేను సహించను" అని షరతు పెట్టాడు. బ్రహ్మదేవుడు ఈ షరతుకు సరేనని అంతర్థానమయ్యాడు.
ఆనాటి నుండి రిపుంజయుడు దివోదాసుడనే నామంతో కాశీ నగర కేంద్రంగా ఈ ప్రపంచాన్ని పాలించడం మొదలుపెట్టాడు. రెండవ కైలాసమైన కాశీక్షేత్రానికి అధిపతి పరమేశ్వరుడు కదా. ఆయన కూడా తనకు ప్రీతిపాత్రమైన కాశీలో అడుగేపెట్టలేక పోయాడు. దివోదాసుడు తన రాజ్యాన్ని న్యాయబద్ధంగా, ఎటువంటి బాధలు లేక అద్భుతంగా పాలిస్తున్నాడు. తన రాజ్యానికి కావలసిన ప్రతి ఒక్కటీ తనే సృష్టిస్తూ తన ప్రజలను పోషించసాగాడు. ఆఖరికి గాలి, నీరు, అగ్ని, వాన ఇలా అన్నింటినీ దేవతలతో సంబంధం లేకుండా తానే పుట్టించాడు.కాశీ క్షేత్రానికి వెళ్ళదలిచిన పరమేశ్వరుడు దివోదాసుడి కారణంగా కాశీలో అడుగే పెట్టలేకపోయాడు. రోజరోజుకూ దివోదాసుడికి గర్వం పెరిగిపోసాగింది. ఎలాగైన దివోదాసుడిని దారిలోకి తేవాలని నిర్ణయించిన పరమశివుడు పార్వతీదేవి రూపాలైన 64 మంది దేవతలను దివోదాసుడి రాజ్యానికి పంపాడు. కానీ కాశీ నగర సౌందర్యానికి మరియు దివోదాసుడి నీతిమంతమైన పాలన చూసి ఆ దేవతలందరూ ఏమి చేయలేక అక్కడే ఉండిపోయారు. ఈ విఫలయత్నం తరువాత పరమశివుడు సూర్యదేవుడిని పంపాడు. సూర్యదేవుడు ఒక జ్యోతిష్యుడి రూపంలో కాశీకి చేరాడు. కానీ ఆయన కూడా ఏమీ చేయలేకపోయాడు.
తరువాత బ్రహ్మదేవుడు ఒక సన్యాసి రూపంలో కాశీకి వళ్ళి దివోదాసుడి చేత అశ్వమేధ యాగం చేయించాడు. ఇక చివరి ప్రయత్నంగా పరమేశ్వరుడు శ్రీమహావిష్ణువు మరియు తన కుమారుడైన గణపతి ఫాయంతో ఒక ఉపాయం ఆలోచించాడు. దాని ప్రకారంగా వినాయకుడు కాశీ నగరానికి ఒక జ్యోతిష్యుడి రూపంలో అద్భుత మైన కాంతి పుంజంతో ఒంటి నిండా విభూతి రేఖలు, సింధూరం రంగు పట్టు బట్ట, ఎర్రటి శాలువా, లావు శరీరంతొ పొట్టి వాడైనా గట్టి వాడే ననిపించాడు వినాయకుడు. తన వాక్కు నిజం అవుతుందని చెప్పుతూ జనాన్ని ఆకర్షించాడు .రాజ మర్యాదలు చేస్తున్నారు.కోరికలు తీర్చుకొంటున్నారు. జరిగిందీ, జరుగుతున్నది, జరుగ బోయేదీ అన్నీ ఖచ్ఛితం గా చెప్పి అందరి మనసుల్ని ఆకర్షిస్తున్నాడు. మనుషులకు ఎలాంటి కలలోస్తాయో చెప్పటం, వారికొచ్చిన కలల విశేషాలను తెలియ జేయటంతో అందరి దృష్టిలోను పడ్డాడు.
ఇలా వినాయకుడి జ్యోతిష ప్రతిభ రాజ ఆస్థానానికి కూడా చేరాంది. రాణి కోరిక పై రాజు దివోదాసు ఆయన్ను ఊరేగింపుగా ఆస్థానానికి గౌరవంగా రప్పిస్తాడు. వారి ఆతిధ్యాన్ని పొంది నాలుగు వేదాలు, సకల శాస్త్రాలు, పురాణాల విషయాలన్నీ వారికి బోధించి మెప్పు పొందాడు. ఒక ఏకాంత ప్రదేశంలో డుంఠి వినాయకుడుతో చక్రవర్తి "మాకు ఈ ప్రజా పాలన తప్ప ఇంకా ఏమీ పని లేదా. ఏదైనా ఉంటె ఆజ్ఞాపిస్తే చేస్తాను" అన్నాడు. అప్పుడు డుంఠి మీరు సమయానికి తగ్గ మాటే అన్నారు. మీ లాగా ఇంతకు ముందేవరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రజాహితంగా పరిపాలన చేయలేదు. భవిష్యత్తులో కూడా చేయబోరు. అన్ని శక్తులను లోబరచుకొని అన్నీ మీరే అయి పాలించారు. వచ్చే రోజులు మంచివి కావు. మీరు కొత్త దృష్టితో జీవించాలి. నేటికి సరిగ్గా పద్దెనిమిదో రోజున మీ జీవితానికి ఒక సుముహూర్తం వస్తోంది. ఒక తేజో రాశి బ్రాహ్మణోత్తముడు మీ దర్శనం కోరుతాడు. ఆయన చెప్పి నట్లు నడుచుకోండి. మీ జన్మ చరితార్ధమయ్యే రోజు ఆ రోజే. అని చెప్పి డుంఠి తన ఆశ్రమానికి వెళ్లి పోయాడు
శివాఙ్ఞ మేరకు కాశీ రాజైన దివోదాసుణ్ణి కాశీ నుండి పంపించివేయడానికి శ్రీ మహవిష్ణువే ఆ బ్రహ్మణుని రూపంలో కాశీకి వచ్చాడు. అయితే తన వేదాంతంతో, మాటల గారడితో నారాయణుడు దివోదాసుడి మనసును వైరగ్యం వైపుకు మరల్చాడు. అప్పుడు దివోదాసుడు తన కుమారిడికి రాజ్యం అప్పగించి తాను అడవులలోకి వెళ్ళి సమాధి చెంది శివునిలో ఐక్యం అయ్యాడు. అలా శివ కార్యం పూర్తి చేసిన నారాయణుడు, కాశీ నగర అందాలను చూస్తూ నగరమంతా విహరిస్తూ, అక్కడి గంగా తీరంలోని పంచగంగా ఘాట్ కు చేరుకున్నాడు...అదే సమయంలో ఆ ఘాట్ వద్ద 'అగ్ని బిందు' అనే పేరు గల ఋషి తపస్సు చేసుకుంటున్నాడు... శ్రీ మహా విష్ణువును చూసిన అగ్ని బిందు భక్తి పారవశ్యంలో నారాయణుని పలు విధాలుగా కీర్తించి,స్తోత్రం చేశాడు. మహర్షి అగ్నిబిందు భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ఋషిని ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు... అప్పుడు అగ్నిబిందు "నారాయణా! నీవు బిందుమాధవునిగా ఈ ప్రదేశంలోనే ఉండి భక్తులను అనుగ్రహించు.." అని అన్నాడు. అగ్నిబిందు కోరిన వరాన్ని ఇచ్చిన నారాయణుడు... తాను ఎప్పుడూ ఈ పంచగంగా ఘాట్ లోనే ఉంటానని అగ్నిబిందు ఋషిని అనుగ్రహించాడు. తాను కృత యుగంలో ఆదిమాధవునిగా, త్రేతా యుగంలో ఆనందమాధవునిగా, ద్వాపర యుగంలో శ్రీమాధవైనిగా, కలి యుగంలో బిందుమాధవుగా పూజలందుకుంటానని చెప్పి అంతర్ధానమౌతాడు....
ఆలయ విశేషాలు:ఈ ఆలయం ఉత్రరప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వారణాసిలో ఉంది. ఈ ఆలయం వారణాసిలోని గంగా నది తీరంలోని పంచగంగాఘాట్ లో ఉంది. వారణాసి చేరుకున్న భక్తులు... గంగా నదిలో పడవ ద్వారా ఈ ఘాట్ కు చేరుకొని, ఈ ఆలయానికి చేరుకోవచ్చు లేదా కాలినడకన పంచగంగాఘాట్ కు చేరుకొని,ఆలయానికి చేరుకోవచ్చు. ఈ పంచగంగా ఘాట్ లోనే బిందుమాధవుడి దయవలనే భక్త కబీర్ దాసు గారికి రామానందస్వామి గారు గురువుగా మారారు. ఆయన రామానందుని శిష్యుడు ఎలా అయ్యాడో కథగూడా ప్రచారంలో వుంది. ఇది భారతంలోని ఏకలవ్యుని కథలాంటిదే. కబీరు నిమ్నజాతిలో పుట్టాడు గనుక రామానందుడు ఆయనను శిష్యునిగా స్వీకరించ లేదట. అయినప్పటికీ కబీరు మాత్రం త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్ముకున్నాడట. ఒకనాడు 'బ్రహ్మ ముహూర్త' వేళలో కబీరు కాశీలోని పంచగంగా ఘాట్‌ మెట్లపై అడ్డంగా పడుకున్నాడట. అలవాటు ప్రకారం ఆ సమయంలో గంగాస్నానానికి వెళ్ళే రామానందుడి కాలు కబీరు శిరస్సును తాకిందట. తన కాలు ఎవరితలకో తగిలినందుకు చింతిస్తూ ఆ స్వామీజీ 'రామ్‌, రామ్‌' అనుకుంటూ స్నానానికి వెళ్ళిపోయాడట. అంతే తాను రామానందుని శిష్యుడనని కబీరు ప్రకటించుకున్నాడట. ఈ కథ విన్న రామానందుడు సంతోషాంతరంగుడై కబీరును తన శిష్యునిగా పరిగణించాడట.
ప్రసిద్ధ యోగి శ్రీత్రైలింగ స్వామి వారు కూడా పంచగంగాఘాట్ లోనే ఉన్నట్టు ఓ కథ కూడా ఉంది.వంగ సంవత్సరం 1207లో శ్రీ త్రైలింగ స్వామీజీ దశాశ్వమేధఘాట్ వదిలి, పంచగంగా ఘాట్‌లోని బిందుమాధవుని వద్ద నివసింపసాగారు. అప్పుడు ఆయన ఎవరితోనూ మాట్లాడేవారు కారు. ఎక్కడికి వెళ్ళేవారూ కాదు. అప్పటినుంచీ అందరూ ఆయనను ‘‘వౌనీబాబా’’ అనేవారు. స్వామీజీ సంజ్ఞలతోనే అన్నిపనులూ నిర్వహించేవారు. చాలా అవసరమనిపిస్తే, ఒకరిద్దరు పుణ్యాత్ములతో ధార్మిక చర్చ చేసి, దాని అర్థతాత్పర్యములు వివరించేవారు. మనస్సులోని సందేహాలను తొలగించేవారు. అందరి పట్ల దయ చూపుతూ ఉండేవారు.

No comments:

Post a Comment

Pages