ధాత్రి - అచ్చంగా తెలుగు

ధాత్రి

కంభంపాటి రవీంద్ర


లేక్ వ్యూ అపార్ట్మెంట్ ముందు కొంత మంది పెద్దలు, తల్లులు, పనమ్మాయిలు నుంచుని సాయంత్రం పూట వచ్చే స్కూలు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.
'ఇవాళ నాలుగుంపావు అయ్యింది.. ఇంకా బస్సు రాలేదేంటీ ' అని విసుక్కున్నారు బి బ్లాక్ లో ఉండే మహాజన్ గారు.
' చూస్తున్నారుగా సిటీ ట్రాఫిక్ రోజురోజుకూ ఎలా పెరిగిపోతూందో.. పాపం పిల్లలు ఎక్కడో ట్రాఫిక్ లో ఇరుక్కునుంటారు' బదులిచ్చారు పక్కన్నుంచునున్న మీర్ జాన్ గారు
ఇంతలో వరసగా స్కూలు బస్సులు రావడం మొదలెట్టాయి. హిల్ రాక్ బస్సులో నుంచి నీరసంగా ఏడుపు ముఖపెట్టుకుని దిగింది తొమ్మిదేళ్ల ధాత్రి.  వాళ్ళ తాతగారు సీతారామ్మూర్తి గబగబా వెళ్లి స్కూలు బ్యాగు అందుకోబోతే 'ఫర్వాలేదులే తాతయ్యా.. నేను పెద్దదాన్నయ్యానుగా.. నా బ్యాగ్ నేనే మోస్తాను'  అంది.
'అలా కాదమ్మలూ.. చిన్న పిల్లవి.. నీ బ్యాగు మీ నాన్న నెలకోసారి తెప్పించే బియ్యం బస్తా అంత బరువుంటుంది..ఇవ్వమ్మా' అంటున్నా వినకుండా ముభావంగా వాళ్ళ అపార్ట్మెంట్ వేపు నడవడం మొదలెట్టింది.
శేఖర్, థరణి ల ఏకైక సంతానం ధాత్రి.  శేఖర్ తల్లిదండ్రులు సీతారామ్మూర్తి గారు, సుశీల గారు , ధరణి తల్లిదండ్రులు ఆదినారాయణ గారు, లలిత గారు కూడా వారితో కలిసుండేలాగా, రెండు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కలిపి కొనుక్కుని వాళ్ళకనుకూలంగా కస్టమైజ్ చేయించుకున్నారు. శేఖర్, ధరణి ఉదయాన్నే ఆఫీసుకెళ్ళి మళ్లీ రాత్రికెప్పుడో ఇంటికి చేరుకుంటే, ధాత్రి ఆలన పాలన  అంతా ఇరువురి తల్లిదండ్రులు చూసుకుంటారు.
ఇరువురి తల్లిదండ్రులు బాగానే కలిసిపోయారు, దాంతో నలుగురికీ రోజంతా కబుర్లతో కాలక్షేపం, సాయంత్రం మనవరాలు రాగానే చెప్పలేనంత ఉత్సాహం. ఇంటికి వస్తూనే ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాలన్నీ గబగబా ధాత్రి చెబుతుంటే అమ్మమ్మ, నానమ్మలిద్దరూ ఎప్పుడు తిందో పిల్ల అని ముద్దు చేస్తూ ముద్ద పప్పు లొ ఇంత నెయ్యేసి గబగబా ఆ పిల్లకి గోరుముద్దలు తినిపించడం రోజూ చూసితీరాల్సిన సన్నివేశం.   ఒకరోజు సీతారామ్మూర్తి గారితో చెస్ ఆడితే ఇంకో రోజు ఆదినారాయణ గారితో షటిల్ ఆడేది.
అలా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే ధాత్రి ఆ రోజు ఇంటికొచ్చిన తర్వాత ఇద్దరు తాతలూ ఎంత అడిగినా స్కూలు విషయాలు కూడా పెద్దగా చెప్పలేదు. అన్నం కూడా ఏదో తిన్నాననిపించి హోమ్ వర్క్ చేసుకుంటూ కూర్చుంది. ఏమైంది ఈ పిల్లకి అని పెద్దాళ్ళు కూడా కొద్దిగా ఆందోళనగా ఉన్నారు. అసలే శేఖర్ కూడా ఏదో ఆఫీసు పనిమీద రెండు వారాల కోసం అమెరికా వెళ్ళాడు.
ఆ రోజు రాత్రి ఎనిమిదవుతూండగా ధరణి ఇంటికొచ్చీ రాగానే వియ్యపురాళ్ళిద్దరూ ధాత్రి విషయం గబగబా చెప్పేరు. వెంటనే ధాత్రి దగ్గిరికి వెళ్లి నుదురు మీద చెయ్యేసే చూస్తే మామూలుగానే ఉంది.. హమ్మయ్య జ్వరమేమీ లేదని స్నానం చేసి, బట్టలు మార్చుకుని ధాత్రి దగ్గర కూర్చుని అడిగింది ధరణి 'ఏంటమ్మలూ.. అలా డల్ గా ఉన్నావు? స్కూల్లో ఎవరైనా ఏమైనా అన్నారా?  చెప్పు నాన్నా'
కళ్ళమ్మట నీళ్లు తిరుగుతూండగా ధాత్రి చెప్పింది 'అమ్మా.. ఈ సాటర్డే స్కూల్లో మన పేరెంట్స్ తో కలిసి స్టేజ్ మీద మనం చేసే సోషల్ సర్వీస్ గురించి చెప్పాలట.. మా క్లాస్ మేట్స్ అందరూ వాళ్ళ బర్త్ డే  ఆర్ఫనేజ్ లో సెలబ్రేట్ చేసుకుంటామని, వింటర్ లో పూర్ పీపుల్ కి ఇంట్లోని పాత బట్టలు ఇస్తామని ఇలా బోలెడు చెప్పారు.. బెస్ట్ సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళకి మెమెంటో ఇస్తారు.. మరి నేను అవేమీ చెయ్యలేదు కదా.. నేను కనీసం పార్టిసిపేట్ చెయ్యడానికి కూడా పనికిరాను ' అని తల్లిని చుట్టుకుని ఏడ్చేసింది.
' నాన్నా.. బంగారు తల్లీ.. సోషల్ సర్వీస్ అంటే బయటకి వెళ్లి చేసేదే కాదు..నువ్వు చేసినంత సోషల్ సర్వీస్ నాకు తెలిసి నీ ఏజ్ వాళ్ళు ఎవరూ చేసుండరు.. మనం ఇద్దరమూ పార్టిసిపేట్ చేస్తున్నాం.. నేను ప్రైజ్ గ్యారంటీ చెయ్యను కానీ వియ్ విల్ డూ ఎ గుడ్ జాబ్' అని భరోసా ఇచ్చింది ధరణి.
శనివారం రానేవచ్చింది.. పిల్లలందరూ వారి తల్లిదండ్రులతో వచ్చారు. ప్రతీ ఒక్కరూ వారి తల్లిదండ్రులతో వస్తే ధాత్రి వాళ్ళమ్మ ధరణితోనూ, తాతలిద్దరితోనూ వచ్చింది. స్కూల్ ఆడిటోరియం విశాలంగా ఉన్నా తల్లిదండ్రులందరూ ఫొటోలంటూ స్టేజీ దగ్గర గుమిగూడడంతో గొడవ గొడవ గా ఉంది. పార్టిసిపేట్ చేసే పిల్లలందరూ వారి తల్లిదండ్రులతో స్టేజీ ఎక్కి తాము తాము చేసే రకరకాల సోషల్ సర్వీస్ ఏక్టివిటీస్ గురించి చెబుతున్నారు.
ధాత్రి వంతు వచ్చింది, తల్లితో సహా స్టేజీ ఎక్కింది. మైక్ పట్టుకుని ధరణి గోల గోలగా ఉన్న జనంకేసి చూసి అంది 'మనం సోషల్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం కనుక కాసేపు సోషల్లీ రెస్పాంసిబుల్ గా పార్టిసిపేట్ చేసేవారి మాటలు విందామా?'  ఆ మాట బాణంలా తగలడంతో చాలా మంది ఒక్కసారి మాటలు ఆపేరు.  ధరణి కొనసాగించింది  'నేను ఎక్కువ సమయం తీసుకోను.. నేనూ నా భర్తా ఇద్దరమూ ఐ. టి.  లో పని చేస్తాము. మా ఇద్దరి తల్లిదండ్రులతో కలిసుంటాము. కానీ ఏదో బలహీన క్షణంలో మా ఇద్దరికీ మా పెద్దవాళ్ళని  ఇక్కడే వదిలేసి అమెరికా మైగ్రేట్ అయిపోదామనుకున్నాము. చేతిలో బోలెడు ఆఫర్స్ కూడా ఉన్నాయి.. కానీ ఆ సమయంలో మా ధాత్రి ఒక ప్రశ్న వేసింది.. మనం వెళ్లిపోతే తాతల్లో ఎవరికైనా ఆయొస్తే ఏమిటని.. హాస్పిటల్కి వెళ్తారమ్మా అన్నాను..ఒకవేళ చచ్చిపోతే అంది.. నాకేమి జవాబు చెప్పాలో అర్ధం కాలేదు..ఆ తర్వాత ధాత్రి అడిగింది "అమ్మా.. వెళ్తే తాతలిద్దరితోనూ కలిసి వెళ్దాం.. లేకపోతే నేను ఇక్కడ వీళ్ళతో కలిసి ఉండిపోతాను".. ఆ మాటలు నా కాన్షియన్స్ ని ఎక్కడో టచ్ చేసాయి.. సక్సెస్ అవ్వాలంటే యుఎస్ కి వెళ్ళడమే మార్గమా? ఇంతకాలం మనతో ఉన్న పేరెంట్స్ ని అంత ఈజీగా ఎలా వదిలేద్దామనుకున్నాను?  నా యుఎస్ ప్లాన్ తల్చుకుంటే సిగ్గేసింది. ఈ విషయం నా హజ్బండ్ శేఖర్ తో డిస్కస్ చేసాను. తను కూడా ఏకీభవించి ఇండియా లో మా పేరెంట్స్ తో ఉండిపోదాము అన్నారు.. మా విషయం విని మా కొలీగ్స్ ముగ్గురు నలుగురు ఇండియా లో వాళ్ళ పేరెంట్స్ కి దగ్గరగా ఉండిపోదల్చుకున్నారు.. మీరు చెప్పండి..ధాత్రి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ సోషల్ సర్వీస్ కన్నా తక్కువ? ' అని ముగిస్తూంటే సీతారామ్మూర్తి గారు, ఆదినారాయణ గారు స్టేజీ ఎక్కి మేము కూడా రెండు మాటలు మాటాడతామన్నారు.
ఆదినారాయణ గారు మైకందుకుని చెప్పారు' సోషల్ సర్వీస్ అంటే ఇవ్వడం మాత్రమే కాదు..మనతో కలుపుకోగలగడం.. ఇప్పుడు మీ ఎదుట నుంచున్న నేనూ, సీతారామ్మూర్తి గారు వీరి నిజమైన తల్లిదండ్రులము కాదు. మా పిల్లలు మమ్మల్ని మా భార్యలతో సహా వృద్ధాశ్రమంలో వదిలేస్తే ఈ ధరణి, శేఖర్ మమ్మల్ని తల్లిదండ్రులుగా దత్తత తీసుకున్నారు. వారిద్దరికీ చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు.. మాకు తల్లిదండ్రులే కాదు,  అత్తమామలు కూడా కావాలని మమ్మల్ని తల్లిదండ్రులుగా వీరు స్వీకరించారు.. ఇప్పుడు చెప్పండి.. ఇంతకు మించిన సోషల్ సర్వీస్ ఉంటుందా? '
ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. కళ్ళమ్మట నీళ్లు కారుతూండగా ధాత్రి తన తల్లి ధరణి వైపు చూస్తూండిపోయింది...
****

No comments:

Post a Comment

Pages