సేవా రత్న - అయ్యదేవర విజయ భాస్కరరావు - అచ్చంగా తెలుగు

సేవా రత్న - అయ్యదేవర విజయ భాస్కరరావు

Share This

సేవా రత్న - అయ్యదేవర విజయ భాస్కరరావు 

భావరాజు పద్మిని 


తమ ఊరిలోనే పేదలకోసం అనేక శిక్షణా తరగతులను నిర్వహిస్తూ ఉన్నారు అయ్యదేవర విజయభాస్కరరావు గారు. అనుకోకుండా, బ్రెయిన్ కాన్సర్ వచ్చి, ఆరు నెలలు ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అందరిలా కృంగిపోక, ఆయనలోని సేవాతత్పరత ద్విగుణీకృతమయ్యింది. తన స్పూర్తిదాయకమైన ప్రసంగాల ద్వారా యువత భావి జీవనానికి ప్రేరణ కల్పిస్తూ, సంస్కరణ రత్న, సేవా రత్న, గురుమిత్ర, ఉత్తమ సామాజిక వేత్త, వంటి  బిరుదులను, సత్కారాలను అందుకున్న ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షకులు శ్రీ. డా. అయ్యదేవర విజయభాస్కరరావు (BCM,MA(lit)) గారితో  ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీకోసం...
మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి. 
నేను అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. చిన్ననాటినుండి నేను మా  తాతాగారైన కీ.శే. ఈశ్వర ప్రగాఢ గోపాలరావు గారి ఇంటివద్దే ఉంటూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివి, మేనమామల సంరక్షణలో పెరిగాను.
మా అమ్మమ్మగారు శ్రీమతి రంగనాయకమ్మ గారు ,మా తాతాగారైన ఈశ్వర ప్రగాఢ గోపాలరావు గారు నన్ను ఎంతో గారాబంగా పెంచి పెద్దచేసి, నాకు చక్కటి విద్యాబుద్ధులతో పాటు సంస్కారజ్ఞానం నేర్పించారు. మా అమ్మగారి పేరు ఇందిరాకుమారి.  ఇక్కడుండగానే  కీ.శే. కోదాటి శేషగిరిరావు గారి కనిష్ట కుమార్తె  చి.ల.సౌ. నాగలక్ష్మీతో  ది. 11.02.1997 న పెద్దలు నాకు వివాహం చేసారు.
నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి సాయి శృతి, చిన్నమ్మాయి శ్రావ్య, పెద్దమాయికి ది.01.12.2014 న చి.భార్గవ ప్రసాద్ తో వివాహం జరిగింది. చిన్నమ్మాయి 10 వ తరగతి దమ్మపేటలో చదువుతోంది. మా కుటుంబానికి గౌ. శ్రీ. ఈశ్వరప్రగడ హరిబాబు (ఖమ్మం) గారు మంచి అండగా ఉండడమే కాక, కావలసిన అన్ని వసతులూ అడగకుండానే ఇస్తూ ఉంటారు. అందుకే వారంటే మా కుటుంబం మొత్తానికీ అమితమైన గౌరవం, భక్తి భావమూనూ.
మీ ఇంట్లో సంఘసేవకులు ఎవరైనా ఉన్నారా ? సేవ మీకు ఎలా అలవడింది?
మా ఇంట్లో సంఘసేవకులు లేరు. కాని మా ఇంట్లో ఉన్నారు. మా తాతగారు ఒక మామూలు టీచర్. ఆయనే నాకు అన్నీ. నేను ఆయన నుండీ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయనే నాకు తండ్రి, స్నేహితుడు. నాకు నలుగురు మేనమామలు, పిన్ని, శంకర రావు గారనే బాబాయ్ ఉన్నారు. వారంతా నన్ను చాలా బాగా చూస్తారు.   ఖమ్మం పట్టణమునకు చెందిన మా మేనమామైన  ప్రముఖ చార్టెడ్ ఎకౌంటెంట్ శ్రీ ఈశ్వరప్రగడ హరిబాబుగారు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరికో ఉపాధి కల్పిస్తూ ఉంటారు.  వీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. నాకు సరైన దశ, దిశ నిర్దేశం చేస్తున్న మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయన. వీరి  ప్రేరణతో నేనూ వివిధ సామాజిక, సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రస్తుతం  సమాజానికి ఏదో చెయ్యాలన్న గట్టి పట్టుదలతో ఉన్నాను.
దమ్ముపేటలో 4 కంప్యూటర్లు, 2 ట్యాబులు, 2 జిరాక్ష్ మెషిన్లు, LED ప్రొజెక్టర్లు నెలకొల్పి, పేదల కోసం చిన్న కంప్యూటర్ సెంటర్ నడుపుతున్నాను. 2500 పైగా పుస్తకాలతో ఒక చిన్న గ్రంధాలయం నడుపుతున్నాను. ప్రతి సంవత్సరం విద్యార్ధులకు పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాను. “పుస్తక దానోద్యమం” అనే వినూత్న కార్యక్రమం చేపట్టాను. దీని ద్వారా లేని వారికి పుస్తకాలు అందించడం, తిరిగి మరలా ఆ సంవత్సరం పూర్తి అయ్యాకా వాటిని సేకరించడం, వాటిని వేరొకరికి ఇవ్వడం చేస్తుంటాను. ఆ విధంగా ఇప్పటికి 1500 మంది విద్యార్ధులకు పుస్తకాలు ఇచ్చాను. పేద విద్యార్ధులకు ప్రతి సంవత్సరం ఇద్దరు లేక ముగ్గురికి పరీక్ష ఫీజు కడుతూ ఉంటాను. అదే విధంగా ప్రతి సామ్. వేసవి శిక్షణా తరగతులు నిర్వహించి, అందులో విద్యార్ధులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ, ఆరోగ్య శిబిరాలు, ఆధ్యాత్మిక విషయాలు, ఆ సందర్భంలో పిల్లల సృజనాత్మక శక్తి వెలికి తియ్యడానికి వివిధ పోటీలు నిర్వహించి, బహుమతులు ఇస్తుంటాను. ఈ సందర్భంలో ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని రప్పించి, వారితో బహుమతులు అందజేస్తుంటాను. ప్రతి సం. ఆయా సందర్భాలను బట్టి పర్యావరణ, ఓటరు, మాతృభాషా, మహిళా, జాతీయ సైన్స్ దినోత్సవం వంటివి నిర్వహిస్తాను. ఈ క్రమంలో పలువురి మన్ననలు పొందడమే కాక అనేక అవార్డులను కూడా అందుకున్నాను. మీ విద్యాభ్యాసం ఎంతవరకు కొనసాగింది? మీ వృత్తి ఏమిటి?
మొదటి నుండి తాతగారి వద్ద పెరగడం వల్ల, తాతగారే నన్ను ప్రైమరీ స్కూల్ దాకా చదివించారు. 1వతరగతి నుండి 5 వ తరగతి వరకు అక్కడ, తర్వాత 6 నుండి 10వతరగతి వరకు దమ్మపేటలో  అమ్మమ్మగారి ఇంటివద్దనుండి, ఇంటర్మీడియెట్ యస్.పి.డి.బి.టి జూనియర్ కళాశాల నందు, డిగ్రీ(బి.కాం) ప్రభుత్వ కళాశాల చింతలపూడి నందు, పి.జి.ఒయు నందు పూర్తిచేసాను.
మీ జీవితంలో అనుకోకుండా మీరు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కున్నారా?
నా జీవితంలో చిన్నతనం నుంచి నిరంతరం ప్రతి సందర్భం లోనూ ఏవో ఇబ్దందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మధ్యనే కొంచెం ఇబ్బందుల నుండి బయటపడుతూ జీవితాన్ని సాఫీగా నడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి సందర్భంలోనూ  సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ  ఆ ఇబ్దందులనుండి బయటపడుతుంటాను.
వ్యక్తిత్వ వికాస తరగతులు ఎలా ప్రారంభించారు?
 నేను చదువుకునేప్పటినుండి సేవాతత్పరత కలిగినవాడనై, నాకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పాలనే ధృడమైన భావనతో   ఉండే వాడిని. 2014 ఫిబ్రవరి నెల నుండి నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు అయిన ATDO శ్రీ జహీరుద్దీన్ గారి ప్రేరణతో ఉపన్యాసాలు ప్రారంభించాను. మొదట కొంత తడబడ్డా, క్రమంగా అందులో పూర్ణత్వం సాధించాను.
2015 మార్చి 4 వ తేదీన  నాకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి, సర్జరీ అయిన  సందర్భంలో   6 నెలలు కామినేని వైద్యశాలలో ఉన్నాను. ఆ సమయంలో నేను ఇంకా ఎన్నో పుస్తకాలు చదివాను. ప్రముఖుల ఉపన్యాసాలు విన్నాను. ఎంతో నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను వెనుతిరిగి చూడలేదు. ఇప్పటివరకు విస్తృతంగా తెలుగురాష్ట్రాలలో అనేక విద్యాసంస్థలలో 400  కి పైగా వ్యక్తిత్వవికాస శిక్షణా తరగతులను ఇచ్చి యున్నాను. ఇకముందు కూడా ఈ విధంగానే నా జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. ఇందుకు నా భార్య నాగలక్ష్మి, అమ్మ ఇందిర, కూతురు శ్రావ్య నాకు ఎంతగానో సహకరిస్తున్నారు.
మీరు రచనలు ఎప్పటినుంచి చేస్తున్నారు? మీ రచనలు/ప్రసంగాల ద్వారా ఎవరికైనా ప్రేరణ కలిగించారా?
అవునండి, ఇప్పటికి వేలాది మంది విద్యార్ధులకు వ్యక్తిత్వ వికాస శిక్షణను ఇచ్చాను.  వాటితో ప్రేరణ పొందిన   అనేకమంది  ఆచరించి, తిరిగి ఫోన్ చేసినపుడు, మీరు మాకు ఆదర్శం అన్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇందుకు నేను చేస్తున్న కృషిని పలువురు శ్లాఘిస్తూ, నాకు పలురకాల అవార్డులు ప్రదానం చేస్తూ ఉంటే నాకు ఇంకా ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వాలనిపిస్తుంది. అన్నిటికంటే ముందు నేను వేర్వేరు ప్రాంతాలను తిరగడం ద్వారా పలు ప్రాంతాల సంస్కృతులు, పద్ధతులు తెలుసుకుంటున్నాను. అది నాకు ఆనందదాయకమైన విషయం.
మీ దృష్టిలో జీవితం అంటే ఏమిటి? జీవన విధానం ఎలా ఉండాలి?
ఎవరికైనా జీవితమంటే వడ్డించిన విస్తరేమీ కాదు. అనునిత్యమూ కష్టపడాలి. సమస్యలుంటాయి అధిగమించాలి. పోటీ ఉంటుంది, ఎదుర్కోవాలి. నీతిగా నిజాయితీగా ఉంటూ, సభ్య సమాజంలో ఉన్నంతలో సాటివారికి సాయపడుతూ మనిషిగా జీవించాలి. ఒక మనిషి గుండె చప్పుడు ఆగినప్పుడు ... ఆ కుటుంబమే కాక, ఆ వీధిలోని వారే కాక, ఆ ఊరు వారు మాత్రమే కాక, ఆ ప్రాంతం వారే కాక, మొత్తం సభ్య సమాజం పస్తున్న రోజున, ఆ మనిషి జీవితానికి సార్ధకత ఏర్పడినట్లు. మీ జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన గురించి చెప్పండి.
చిన్నప్పటినుండి నుండి నన్ను పెంచిపెద్దచేసిన మాతాతగారు ఈశ్వరప్రగడ గోపాలరావుగారు అంటే నాకు అమితమైన ప్రేమ, ఇష్టం. ఎందుకంటే చిన్నతనంలోనే నాకు నాన్న దూరమైతే నన్ను, మా అమ్మను తన దగ్గరే ఉంచుకుని, నన్నొక వ్యక్తిగా తీర్చి దిద్దారు. మా అమ్మమ్మగారు 87 లో గతించినా, మా కోసం ఆయన మళ్ళీ వివాహం చేసుకోలేదు. కూతురు, మనవడు బాగుందాలనేదే ఆయన తపన. ఆయన కొడుకులూ, కూతుళ్ళు వారి వద్దకు రమ్మన్నా, అక్కడ వెళ్లి ఉండక, మా కోసం ఇక్కడే ఉండేందుకు ఇష్టపడేవారు. అటువంటి గొప్ప వ్యక్తి,  గత జులై 1వతారీఖు 2016న పరమపదించడం నాకు తీరని లోటు అంతేకాదు నాకు అప్పటివరకున్న బలాన్నంతా పోగొట్టుకునట్లు అనిపిస్తుంది.
మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
29.01.2017 “Dr. పట్టాభి కళా పీఠం అవార్డ్” ను విజయవాడలో అందుకున్నాను. 26.01.2017 కొత్తగూడెం కలక్టర్ గారిచే అవార్డు అందుకున్నాను
8.01.2017
“సంస్కరణ రత్న” అను బిరుదును మచిలీపట్నం వాణి అను  మాస పత్రికవారు అందచేసినారు.
3.01.2017
“సేవారత్న “ అను బిరుదును  మహాత్మజ్యోతిరావుపూలే ప్రజా సంక్షేమ  సంఘంవారు హైదరాబాదులో  ఇచ్చినారు.
22.10.2O16
కరీంనగర్ లో తెలుగు పరిరక్షణా వేదిక ఆధ్వర్యంలో శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్ష విభాగ నియంత్రణాధికారి  సేనాపతి చేతులమీదుగా"గురుమిత్ర" అవార్డు తీసుకున్నాను.
20.07.2016.
ఇంటర్నేషనల్ థియోలాజికల్  ఫ్యాకర్టీవారు విజయవాడ నందు"గౌరవ డాక్టరేట్"ను అందజేశారు.
2015-16
“ఉత్తమ సామాజిక కార్యకర్త" సి.బి.ఐ. మాజీ డైరెక్టర్ వి.వి. లక్ష్మినారాయణ చేతులమీదుగా ఖమ్మంలోఅందుకున్నాను.
2014- 15
“బెస్ట్ సర్వీస్ మెన్" అవార్డును ఖమ్మంలో కలెక్టర్ గారిచేతులమీదుగా అందుకున్నాను.
2013-14
ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డును జ్యోతిరావుపూలె సంక్షేమ సంఘంవారు ఇచ్చినారు
2012-13
లైయన్స్ క్లబ్  ఆఫ్ దమ్మపేట వారు బెస్ట్ లెక్చరర్  మరియు బెస్ట్ సర్వీస్మెన్ అవార్డ ఇచ్చి యున్నారు.
2005- 06
టి.టి.డి. అన్నమాచార్యప్రాజెక్టుడైరెక్టర్ శ్రీ మేడసాని మోహన్ గారిచే సత్తుపల్లిలో సత్కారం,
2004-05 కాకర్లపల్లి అంబేద్కర్ యువజన సంఘంవారిచేసత్కారం,
2003-04 బ్రాహ్మణ సంఘంచే సత్కారం మరియు సేవాతత్పరుడు అని ప్రశంస.
వీటితో పాటుగా వివిధ స్వచ్చంద సంస్థల ద్వారా నేను పాల్గొన్న వేర్వేరు కార్యక్రమాల్లో తరచూ సన్మానం పొందుతూనే ఉన్నాను.
 మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
నా భార్య నాగలక్ష్మి, అమ్మ ఇందిర, కూతురు శ్రావ్య నాకు ఎంతగానో సహకరిస్తున్నారు .మా కుటుంబ సభ్యులు అంతా నా ఆశయాలకు అనుగుణంగా ఉంటారు. నేను కాన్సెర్ పేషెంట్ ను కావడంతో రోజూ మూడు పూటలా మందులు వేసుకోవాలి. ఈ క్రమంలో నేను ఏదైనా క్యాంపు కు వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యులు నా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటారు. నేను అన్ని విషయాలను వారితో షేర్ చేసుకుంటాను. అమ్మ నాకు తెలియని ఎన్నో విషయాలను చెబుతుంటారు. అలాగే అనేక ప్రాంతాలలో ఉన్న నా మేనమామలు కూడా నాకు అండగా ఉంటూ, తగిన సూచనలు ఇస్తూ ఉంటారు.
భావి సంఘసేవకులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆలోచించక, ఈర్ష, అసూయ, రాగద్వేషాలకు దూరంగా ఉంటూ చిత్తశుద్ధితో పని చెయ్యాలి. ఎక్కడా ఏ సందర్భం లోనూ భేషజాలకి పోకూడదు. ప్రతి వారినీ ఒక రోల్ మోడల్ గా తీసుకుని, ఆదర్శవంతమైన పని విధానాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తీ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు, 10  మంది అతనిని అనుసరిస్తారు. చేసే కొద్దిపాటి సేవే అయినా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. అదే నా ఆకాంక్ష.
 శ్రీ విజయభాస్కర రావు గారు తమ ఆదర్శవంతమైన జీవన విధానంతో, స్పూర్తిదాయకమైన ప్రసంగాలతో మరెందరికో ప్రేరణ కలిగించి, విజయ శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటోంది 'అచ్చంగా తెలుగు.'
వీరి ప్రసంగాలను క్రింది లంకెలలో చూడండి...

No comments:

Post a Comment

Pages