పోలేరమ్మ దయ - అచ్చంగా తెలుగు

మా బాపట్ల కధలు -11

పోలేరమ్మ దయ

భావరాజు పద్మిని


“ఏటి నాగమ్మా, పోలయ్యకింకా అమ్మోరు దిగలేదా ?” అడిగింది సుక్కమ్మ.
“లేదక్కా, మంచానబడ్డ బిడ్డ బల్లిలా అట్టాగే కరుసుకుని ఉండాడు. తానం లేదు, పానం లేదు. ఒంటినిండా పెద్దమ్మోరు పుల్లు సలిపేస్తా ఉంటే, నీరసంగా మూలుగుతా ఉండాడు బిడ్డ. నా కడుపు తరుక్కుపోతాంది. ఏప మండలు తెచ్చి మంచం మీద పరిసాడు మా మావ. పిల్లాడి ఒళ్ళంతా పసుపు, ఏపాకులు నూరి పూత  రాసినాను. ఇంకేటి సేస్తే తగ్గుతాదో తెలవట్లేదు. బిడ్డడి కష్టం సూడనేక పాణం ఉసూరుమంటాంది అక్కా.”
“దిగులుపడబాక. ఈ జొరమే అంత. తగిలినాదంటే పది పదిహేను దినాలు ఒదలదు. పసుపు, లేత ఏపాకుల ముద్ద నూరి రోజూ పొద్దుగాల, సందేల దినిపించు బుల్లా. గునం కనిపిస్తాది. ఆ చంటోడికి అంటకుండా కాస్త దూరం పెట్టు. నువ్వూ ఆడనే ఎక్కువసేపు కూకోబాక. అంటుకునే జొరమిది. జాగర్త.”
“అట్టాగేలే అక్కా. పోలిగాడికి నయమయ్యి, ఇంటో ఇంకెవరికీ అమ్మోరు రాకపోతే మన బాపట్ల ఊరి దేవత పోలేరమ్మకి సీర పెడతానని మొక్కుకున్నా. ఆ తల్లే కాపాడాలి. ఇగో ఈల్ల నాన్న కోతలకి పోయిండు. వచ్చేతప్పుడు మా నర్సయ్య మావని కాత్త గుళ్ళో అమ్మోరికి టెంకాయ గొట్టి , పిల్లాడి పేర్న పూజ సేయించి, బొట్టు దెమ్మన్నా.” నాగమ్మ సెబుతా ఉండగానే అటుగా వచ్చారు రాముడి బడిపంతులు గురవయ్య గారు.
“మాట్టారు, మీరా ! రాండి రాండి, ఎండన బడొచ్చారు, కాసిన్ని మజ్జిగ నీళ్ళు తెస్తా,” అంటూ నులక మంచం పరిచి లోనికెళ్ళింది నాగమ్మ. బాపట్ల మాయాబజార్ అవతల పొలాల్లో ఉన్న ఎకరం భూమిలో ఓ పక్కగా విశాలమైన గుడిసె వాళ్ళది. వెదుళ్ల కంచె గట్టిన పాకలో రెండు కోళ్ళు,‘ రాముడు’ అనే గొర్రె పోతునూ పెంచుతున్నారు వాళ్ళు. బంతిపూల ప్రహరీ, మందార చెట్ల ప్రహరీతో, మధ్య మధ్య మొలిచిన నందివర్ధనం చెట్లతో పూరిపాకే అయినా నందనవనంలా ఉంటుంది వాళ్ళది.
గంజిలో కలిపిన మజ్జిగ తాగుతూ “పోలయ్యకు తగ్గిందా నాగమ్మా. మాంచి తెలివైన కుర్రాడు వాడు. ఇటుగా వెళ్తూ వాడినోసారి చూసి పోదామని వచ్చాను. ఏమిటి  పోలేరమ్మా, చీరా అంటున్నావు?” అడిగారు గురవయ్య మాష్టారు.
“ఏటి సేప్పేదండి, పిల్లాడికి అమ్మోరు సోకితేనూ, సుక్కమ్మతో కష్టం సెబుతున్నా.” అంటూ జరిగిందంతా ఏకరువు పెట్టింది నాగమ్మ. “మన పోలేరమ్మ మహిమగల తల్లి, ఆ తల్లికి మొక్కుకున్నవుగా ఇక నయమవుతుందిలే,” అంటూ మాష్టారు ఏదో చెప్పబోతూ ఉండగా, రాముడి అరుపులు వినబడ్డాయ్.
ఎలాగో కట్టు తాడు తెంపుకుని, పోలయ్య మంచం దగ్గరకి ఒచ్చి, అతని కాలు నాకసాగాడు రాముడు. దాని తాకిడికి మగతగా కళ్ళు తెరిచి, మంచం మీదే లేచి కూర్చున్నాడు పోలయ్య. పురిట్లో రాముడి తల్లి చనిపోతే, తెల్లగా ముద్దుగా ఉన్న ఆ గొర్రె పిల్లను పొత్తిళ్ళలో దాన్ని సాకాడు పోలయ్య. చెంచాతో పాలు పట్టడం, స్నానం చేయించడం, అన్నీ తానే చేసేవాడు. బడికెళ్ళి రాగానే రాముడినే వెతుక్కోవడం. చేలో రాముడితో పరుగులు తియ్యడం, ఒక ఆట పోలయ్యకి. బజారుకి వెళ్ళేటప్పుడు, పొలానికి నీళ్ళు పెట్టే టప్పుడు, ఎప్పుడైనా సముద్రానికి వెళ్తే గవ్వలు ఎరేటప్పుడు ఒక్కటేమిటి, పోలయ్యకు అన్ని పనుల్లో వెనకే జతగా ఉంటాడు రాముడు. వాళ్ళిద్దరిదీ మాటల్లో చెప్పలేని గొప్ప బంధం. వాళ్ళ అనుబంధాన్ని కళ్ళారా తృప్తిగా చూడసాగారు మాష్టారు.
రాముడి తల నిమురుతున్న పోలయ్యను వారిస్తూ,”ఒరేయ్, జొరం అంటుకుంటాదని దూరంగా కట్టేస్తే, కట్లు తెంపుకుని ఒచ్చినావా ? కూసింత సేపు కూడా వీడిని ఇడిసుండవా, పద నీ పని చెప్తా!” అంటూ తెగిన తాడు పట్టుకు లాక్కెళ్ళింది నాగమ్మ.
మళ్ళీ వచ్చి మాష్టారు దగ్గర నేలమీద చతికిలపడి, “అసలు పెతి ఊళ్ళో ఈ గ్రామ దేవతలు ఎందుకుంటారు ? ఈ పోలేరమ్మ తల్లి గుడి మనూల్లో ఎప్పటినుంచి ఉందండి?” చెంపకు చెయ్యి ఆనించుకుని చూస్తూ అడిగింది నాగమ్మ.
“చెబుతా తల్లీ. పూర్వం ఊళ్లు కట్టేటప్పుడు ఊరి పొలిమేరలో రక్షణ కోసం గ్రామ దేవతలను ప్రతిష్టించి గుళ్ళు కట్టేవారు. దేవతా విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా చేస్తారు కనుక, ఆ దేవతల కింద బీజాక్షరాల యంత్రము ముహూర్తం చూసి ప్రతిష్టిస్తారు కనుక, ఈ గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-భక్తుల కోర్కెలు తీరుస్తారు. ఈ అమ్మోరులు మొత్తం 101 మంది అనీ వారందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజనీ అంటారు. వారిలో, వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ, వూరి పొలిమేరలో వుండే తల్లిని  పొలిమేరమ్మ అన్నారు. ఈవిడే కాల క్రమంలో పోలేరమ్మ అయింది. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిశాచ గణాలను గ్రామములోనికి రాకుండా ఈమె చూస్తుంది. పార్వతీ అమ్మవారే గ్రామాలలో గ్రామదేవతయై వెలసి, గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం. గ్రామ దేవతను పూజిస్తే ఆ దేవత ఆ ఊరి ప్రజలందరినీ కంటికి రెప్పలాగా ఏ వ్యాధులు రాకుండా కాపాడుతుందని ,సకాలంలో వర్షాలను కురిపించి పాడి పంటలను అభివృద్ధి చేస్తుందని గట్టి నమ్మకంతో ప్రజలు ఆమెకు ప్రతి యేట జాతర్లు, కొలుపులు చేసి కొలుస్తారు.
ఇక మన పోలేరమ్మ విషయానికి వస్తే, ఈ ఊర్ని, భావన్నారాయణ స్వామి గుడిని, కట్టిస్తున్నప్పుడు ఆ క్రిమి కంఠ చోళ మహారాజు క్రీ.శ 594 వ సం.లో గ్రామ పొలిమేరలో ఈ పోలేరమ్మను ప్రతిష్టించారట. ఈ ఆలయాన్ని ఫ్రెంచ్ వారు మన సూర్యలంక సముద్ర తీరానికి వచ్చినప్పుడు ధ్వంసం చేసారట. మళ్ళీ 1759 లో శ్రీనివాస జగన్నాధ బహద్దూర్ గా పిలవబడే రాజా కాండ్రేగుల జోగిపంతులు గారు పునర్నిర్మించారు. 1850 లో ఈ ఆలయానికి ఉన్న పెంకుటిపంచ శిధిలమయ్యింది. అప్పుడు 1972 లో గ్రామ ప్రజలతో ఒక కమిటీ ఏర్పడి, ప్రజా సహకారంతో ఈ ఆలయానికి పటిష్టమైన పైకప్పు నిర్మించారు. వైశాఖ మాసంలో భావన్నారాయణ స్వామి ఉత్సవాలు జరిగినప్పుడే పోలేరమ్మకూ ప్రభలు కట్టి, ఉత్సవాలు చేస్తారు. తరతరాలుగా చాకళ్ళు ఈ గుడికి పూజారులుగా ఉన్నారు. చుట్టుప్రక్కల గ్రామాలలో అనేకమంది ప్రజలకు ఈ పోలేరమ్మ కులదేవత.వారంతా ఆదివారం నాడు గుడికి ఒచ్చి, పొంగళ్ళు , మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కోరిన కోరికలన్నీ నెరవేరుతూ ఉండడంతో కులమతాలకు అతీతంగా ఈ ఊరి వారంతా ఈ తల్లి మహిమను నమ్మి, కొలుస్తూ ఉంటారు. ఇక ఆ తల్లిపై భారం వేసావుగా, ఆవిడే చూసుకుంటుంది. ఇక నేను ఒస్తానమ్మా, పోలయ్య జాగర్త,” అంటూ బయల్దేరారు గురవయ్య మాష్టారు.
***
ఆ సందేల చేతి సంచీతో దిగాడు నర్సయ్య పెదనాన్న రత్తన్న. “రత్తప్ప మాంగోరూ ! రాండి రండి . బాన్నారా? ఊళ్ళో అంతా బాగేనా? ఇగో నులక మంచం మీద కూకోండి, ఏడిగా గంజి తెచ్చుకోస్తా.” అంటూ హడావిడిగా గుడిసెలోకి పరిగెత్తింది నాగమ్మ. రత్తయ్యను రత్తప్పా అని పిలవడం అలవాటు ఆమెకు. ఆ మాటా ఈ మాటా అయ్యాకా, పోలేరమ్మ తల్లి మొక్కు సంగతి ఒచ్చింది.
“మన వొంసంలో పోలేరమ్మే మన కులదేవత. కట్టమొచ్చినా, సుఖమొచ్చినా ఎన్నో తరాలుగా ఆ తల్లికే మొక్కుతాండాం. మా దొడ్డ మహిమ గల తల్లి ఆవిడ. అంతేకాదు, ఏడాదికో గొర్రెపోతుని అమ్మకు బలిచ్చి, అటుపైన దాన్ని వండి, చుట్టాలను, పక్కాలను పిల్సి పెట్టడం మన ఆచారం. జీవాల్ని బలియ్యకపోతే ఆ తల్లి కోపగించి, ఇట్టాగే అమ్మోరై పట్టుకుంటది. అన్నట్టు నువ్వు అమ్మకి జీవాల్ని బలిచ్చి ఎన్నేల్లు ఐందిరా ? “ అంటూ ఆరా తీసాడు రత్తప్ప.
“ఆ మజ్జన నాన్న బతికున్నప్పుడు ఇచ్చుడే. ఆ పైన మా పెళ్లైనాంక ఓ పదేళ్ల సంది ఇవ్వలేదులే అప్పా. జీవాల్ని కొయ్యకపోతే అమ్మోరొస్తదా పెద్దప్పా? “ అమాయకంగా అడిగాడు నర్సయ్య.
“మారి? పెట్టినా ఆ తల్లే, తిట్టినా ఆ తల్లే. ఆచారాలు ఒదిలెత్తే ఊరుకుంతదా ? ఎంటనే బలికి మొక్కుకో,  కష్టం తీరుస్తాది , రోగం కుదురుస్తాది,” గట్టిగా చెప్పాడు నర్సయ్య.
“మొక్కాలనే ఉన్నాది, కానీ గొర్రె పోతంటే మాటలా ? అసలే రెండు మూడేళ్ళ బట్టి పంట సరిగ్గా పండక, నేనే వేరే వొళ్ళ పొలంలో కూలీకి పోతాండా. ఇక ఐదారు యేలు బెట్టి గొర్రె పోతు కొని, బలియ్యాలంటే ఎలాగప్పా ?” దీనంగా మొహం పెట్టి అడిగాడు నర్సయ్య.
“ఓరోరి, సంకలో పిల్లాడ్ని పెట్టుకుని, ఊరంతా వెతికాడట నీలాంటోడు. తెగ బల్సిన గొర్రె పోతును ఇంట్లానే బెట్టుకు కొనాల అంటావేందిరా అబ్బీ ? ముందు మొక్కుకో దీన్ని గోసి, మొక్కు తీర్సుకో. పంటా ఇంటా అంతా సక్కబడ్తది,” రాముడు కేసి ఆబగా సూస్తా అన్నాడు రత్తప్ప.
ఒక్క క్షణం చెవుల్లో బడ్డ మాటను నమ్మలేకపోయారు వాళ్ళంతా. తాతొచ్చాడన్న సంబరంలో ఉన్న పోలయ్య  ఆ మాటలు వినగానే మంచం మీది నుంచి దిగ్గున లేచొచ్చి, “ఏంది తాతా ? నాకు బాగవ్వాలంటే రాముడి తలకోసి సంపాల్నా ?  అది నా పానానికి పాణం. దాని సావుతోనే నాకు బతుకు దక్కుతాదంటే నాకీ బతుకే ఒద్దు, “ కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతూండగా అన్నాడు పోలయ్య.
“ఓసోస్, బుడ్డోడికి కూత ఎక్కువే. ఒరేయ్ పోలిగా ! ఆ గొర్రెపోతు ఎన్నాల్లుంటదిరా? దాని బతుకే ఓ పదేల్లు. అందులో ఐదేళ్ళు ఐపోనాది. దాని మీద నువ్వెంత పేమ బెంచుకున్నా అది రేపో మాపో సచ్చూరుకుంటది. అదే అమ్మోరికి బలిచ్చావే అనుకో. ఈ జనమల బాధిడిసి అమ్మనే సేరుకుంటది. మీ ఇల్లంతా సల్లగుంటది.” నవ్వుతూనే అన్నాడు రత్తప్ప.
రత్తప్ప దగ్గరకొచ్చి, సూటిగా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, “తాతా ఓ మాటడుగుతా. ఏం అనుకోబాక. నీకూ వయసయిపోయిందిగా. నిన్నూ అమ్మోరికి బలిచ్చేదా ? అట్టా సేత్తే నీకూ జనమలు తప్పుతవిగా. ఇంటి బయట పెరిగిన గొర్రెను బలిత్తేనే అంత మంచి జరిగితే, ఇంటివాడివైన నిన్ను బలిత్తే ఇల్లంతా ఇంకా సల్లబడ్తదిగా. మొక్కేదా?” అడిగాడు పోలయ్య. రత్తప్ప తనను బలివ్వడం అన్న ఆలోచనకే ఒణికిపోసాగాడు. కొయ్యల్లా నిలబడిపోయారంతా.
“పెద్దంతరం సిన్నంతరం లేకుండా ఏవిట్రా ఆ మాటలు, రోగంతో ఉన్నావని ఊరుకున్నా, లేప్పోతే గూబ గుయ్యిమనేది ఎదవ, పో అవతలికి,” ముందు తేరుకుని అసహాయంగా పోలయ్యను కసిరి తోసాడు నర్సయ్య.
“గుంటడు సిన్నతనంతో ఏదో అన్నాడులే అయ్యా, పానీ. మడిసి బతుకే అంత. తను పెంచిన జీవం కనుక సత్తాదని బాద పడతండాడు. అదే ఎక్కడో పెరిగిన జీవమైతే ఇంత బాద ఉండదుగా. బాదకి కారణం బందమేరా. పెద్దతనంతో ఏదో మంచి సెప్పా. ఆ పైన మీ ఇట్టం, నే పోయోస్తా..” అంటూ లేచాడు, రత్తప్ప.
“ఇదిగో తాతా ! పాణం బతకాలంటే పాణం బలివ్వాలి అంటే, ఈ భూమ్మీద ఈపాటికి ఎవరూ బతికుండేవోళ్ళు కాదు.  నీకు గొర్రె మాంసం తినాలనుంటే, యిందు కావాలనుంటే, బజార్లో తిను, నేను సంపాదించి కొనిస్తా. అంతేతప్ప, కష్టంలో ఉన్న మాలాంతోల్ల దుఃఖాన్ని నీ ఆశ తీర్చుకునేందుకు వాడుకోకు.” వెళ్తున్న తాతనే సూత్తా అరుస్తా చెప్పాడు పోలయ్య.
***
రత్తప్ప వెళ్ళిపోయాడు కానీ, అతని మాటలు నర్సయ్య మనసులో నాటుకుపోయాయి. “జీవాన్ని బలివ్వకపోతే అమ్మోరు తనకు కలిసొచ్చేలా చూడదా ? ఏం చెయ్యాలి?” ఇదే ఆలోచనతో అదో లోకంలో బతుకుతున్న నర్సయ్య ఇంటికి మళ్ళీ పోలయ్యను చూసేందుకు ఒచ్చారు గురవయ్య మాష్టారు. సమయానికి దేవుడిలా ఒచ్చిన ఆయనతో తమ బాధను చెప్పుకున్నాడు నర్సయ్య, నాగమ్మ.
“చూడు నర్సయ్య, జన్మలు దాటాలంటే చెయ్యల్సింది జీవార్పణ కాదు, ఆత్మార్పణ అని బుద్ధుడు, పతంజలి వంటి జ్ఞానులు చెప్పారు.. ఇదివరలో దేవతల జాతరలో మూగజీవులైన మేకపోతుల గొంతు కొరికి, నరికి చంపేవారు. భగవంతునికి ఈ బలి వల్ల ప్రీతి కలుగుతుందనే ఒక మూఢ నమ్మకం అది. ఇప్పుడు జీవాల గొంతు కొరికి చంపడం ఊహించగలమా? ఈ దేవతలకు మాంసభక్షణ ఇష్టమని జంతు బలులు ఇవ్వడం, వీటికి తోడు నిప్పుల్లో నడవడం, సిడి ఊగడం, కొరడా దెబ్బలను తినడం, నోట్లో పదునైన వస్తువులతో పొడుచుకోవడం, రక్తం వచ్చిందాక ఛాతిపై బాదుకోవడం, నుదుటిపైన, పొట్టపై గాయాలు చేసుకోవడం, తలపై గరగలు, దీపాలు పెట్టుకొని ఊరేగడం, ఇవన్నీ గ్రామ దేవతల కొలుపుల్లో చేసేవారు. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి తమ రక్తాన్ని చిందించడం ఒక మార్గంగా అప్పట్లో భావించేవారు. అందుకే ఇటువంటి హింసాత్మకమైన ఆచారాలను పాటించేవారు. ఆ ఆచారాలు ఇప్పటికీ అక్కడక్కడా కొనసాగుతూ ఉన్నా, ఇప్పుడు చాలావరకూ తగ్గిపోయాయనే చెప్పచ్చు. నీకో చిన్న కధ చెబుతాను విను.
“కార్తికేయుడు శివ పార్వతుల కుమారుడు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లితో ఆడుకుంటున్నాడు. ఆటలో అతడు దాని ముఖము మీద గిల్లాడు. ఆట అవగానే అతడు తన తల్లి పార్వతి దగ్గరకు వెళ్ళాడు. అతనికి తన తల్లి బుగ్గ మీద గిల్లిన గాయం కనిపించింది. అప్పుడతడు "అమ్మా నీ బుగ్గ మీద ఆ గాయమేమిటి, ఎంత పెద్ద దెబ్బతగిలిందమ్మా, అసలెలా తగిలింది " అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి, "నువ్వే కదా నాయనా గిల్లావు, ఈ రోజు వుదయము నువ్వు ఆ పిల్లిని గిల్లావు మరచిపోయావా? ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే!” అని చెప్పింది.
“నర్సయ్యా ! ఈ ప్రపంచంలో ఉన్న పురుగూ పుట్రా, పక్షీ జంతువు, మనిషితో సహా ప్రతీ జీవి అమ్మోరికి బిడ్డలేనని పై కధని బట్టి తెలుస్తోంది కదా ! ఒక బిడ్డ క్షేమం కోసం, మరో బిడ్డను బలిస్తుందా ఏ తల్లైనా? “అమ్మా!” అని నోరారా పిలిస్తే, బిడ్డ మీద కోపంగా ఉన్నా సరే, కరిగిపోతుంది తల్లి. తనకున్న దాంట్లో మరికొందరు బిడ్డలకి కూడు, గుడ్డ, నీరు, నీడ ఇస్తే మురిసిపోతుంది తల్లి. ‘అమ్మా, నువ్వు నా బంగారు తల్లివి కదూ! నీకోసం నేను పసుపూ, కుంకుమా కొత్త చీర, గాజులూ తెచ్చాను,” అంటూ ప్రేమగా ఇస్తే పొంగిపోతుంది తల్లి. ‘నువ్వు తప్ప నాకు దిక్కులేదు తల్లీ, నువ్వే రక్షించాలి,’ అని కాళ్ళ మీద పడితే కరిగిపోతుంది ఆ తల్లి. తనకు బలి ఒక్కటే కావాలని అమ్మ చెప్పి ఉంటే, ఒకరినొకరు బలిచ్చుకుని, ఈ పాటికి ప్రపంచమే శ్మశానం అయ్యేది కదా !అడవుల్లో ఆటవికుల్లా పుట్టిన మనం ఈనాడు ఎన్నో పద్ధతులు మార్చుకుని, నాగరికులుగా మారాము. కనుక, మన ముందు తరాల వారి ఆచారాలను ఎన్నో వదిలేసాము. గోదానాలు అవీ చేసే శక్తి లేక  లేక ప్రత్యామ్నాయాలు కనుక్కుని మార్చేసాము. అలా కాకుండా, మనం అసలు మారకుండా ఉంటే ఈనాడు మనం ఆకులు కట్టుకుని, అడవుల్లో తిరిగేవాళ్ళం కదూ ! అలాగే ఈ బలికి బదులుగా, అమ్మకు పొంగలి పెట్టండి, చీరా సారె పెట్టండి, అర్చన చేయించండి. ఓ పది మందికి అన్నం పెట్టండి, మనం ఈ ప్రపంచంలోని ఏ జీవికి ఇసుమంత సాయపడినా, అది అమ్మకు చేసిన సాయమే అవుతుంది. అమ్మ మనసు నవనీతంలా కరిగిపోతుంది. ఆ పోలేరమ్మ దయ మీకు తప్పక కలుగుతుంది. శుభం భూయాత్,” అన్నారు ప్రశాంత వదనంతో మాష్టారు, జ్వరం తగ్గి, దూరంగా రాముడితో పరిగెడుతున్న పోలయ్యను చూస్తూ.
గ్రహణం వీడిన చందమామలా ఆ దంపతుల మొహాల్లో మళ్ళీ వెలుగు తొంగి చూసింది. వినయంగా మాష్టారుకి దణ్ణాలు పెడుతూ ఆనందంగా సాగనంపారు ఆ దంపతులు.
***

No comments:

Post a Comment

Pages