సినీగేయ రచయత భువనచంద్ర గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

సినీగేయ రచయత భువనచంద్ర గారితో ముఖాముఖి

Share This

సినీగేయ రచయత భువనచంద్ర గారితో ముఖాముఖి 

భావరాజు పద్మిని 


సినీరంగంలో ఉన్నత స్థాయి గేయ రచయతగా 30 ఏళ్ళ నుంచి విజయయాత్ర చేస్తున్నారు - భువనచంద్ర గారు. క్లాసు పాటలైనా, మాసు పాటలైనా ికలకాలం నిలిచిపోయేలా ఆయన కలంలో కదం తొక్కుతాయి. నిరాడంబర తత్త్వం, మంచితనం, సేవాభావం, అత్యున్నతమైన భావాలు, వైమానిక దళంలో ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో చూసిన నిండు జీవితం కలిసి, ఆయన్ను సమున్నత వ్యక్తిగా మనముందు నిలబెడతాయి. ప్రస్తుతం సాహితీ రంగంలో తన రచనల ద్వారా విశేషమైన సేవ చేస్తున్న భువనచంద్ర గారితో ముఖాముఖి ఈ నెల ప్రత్యేకించి మీకోసం...
మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించిన విశేషాలు చెప్పండి.
మా అమ్మ పేరు చంద్రావతి, గృహిణి. నాన్న సుబ్రహ్మణ్య శర్మ గారు కృష్ణా జిల్లా లోని గొల్లపూడి గ్రామానికి ప్రెసిడెంట్ గా ఉండేవారు. ఆయన 75 సం. క్రితం మా ఊరికి  ప్రెసిడెంట్ గా చేసినా, ఇప్పటికీ నన్ను అక్కడ ప్రెసిడెంట్ గారి అబ్బాయిగా గుర్తుపడతారు. కారణం ఆయన ఊరికి ఉపయోగపడే ఎన్నో పనులు చేసారు. మా ఊరిలో ఉన్న తమ్మిలేరుకు వరదలొచ్చి, అప్పట్లో ఎంతో నష్టం జరిగేదట. అలా జరక్కుండా అప్పట్లోనే ఆయన తమ్మిలేరుకు మెట్లు కట్టించారు.
గేదెల మీద, గాడిదల మీద స్వారీలు, చెట్లెక్కి జామకాయలు, రేక్కాయలు వంటివి కోయ్యదాలు, ఇటువంటి వాటితో నా బాల్యం మధురంగా గడిచింది. మాది చాలా అందమైన ఊరు. మా ఊళ్ళో ఉప్పు తప్ప ఎవరూ ఏమీ కొనేవారు కాదు. అంటే, మా ఊరు అంత సస్యశ్యామలమైనది. ఆ తర్వాత మా కుటుంబం పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడికి షిఫ్ట్ అయ్యింది. నా విద్యాభ్యాసం అంతా అక్కడే కొనసాగింది.
మీరు చిన్నప్పటి నుంచే చదివేవారా? సాహిత్యం పట్ల మక్కువ ఎలా కలిగింది ?
నిజానికి నేను మా అమ్మకు కృతఙ్ఞతలు చెప్పాలి. ఆవిడ ఎక్కువగా న్యూస్ పేపర్ చదివేవారు. ఎవరైనా నాయకులు చనిపోతే కళ్ళనీళ్ళు పెట్టుకునేవారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో ఆవిడ తన ఏడు వారాల నగలు గాంధీ గారి జోలెలో వేసారు.
నాకు పుస్తకాలు చదవడం ఎలా అలవాటయ్యిందో చెబితే మీరు నవ్వుతారు. నేను చిన్నప్పటినుంచి భోజన ప్రియుడిని. అమ్మ చేసే వంటలు అన్నింటికీ వంకలు పెట్టేవాడిని. ఒకసారి ఎందుకో అమ్మ పక్కింట్లో చందమామ తెచ్చి, నేను తింటుండగా నా పక్కన పెట్టింది. నేను అందులో మునిగిపోయి, ఆ రోజున వంకలు పెట్టకుండా తినేసాను. ఇదేదో బాగుందని, అమ్మ ఇంకొన్ని పుస్తకాలు తెచ్చి పెట్టింది. అప్పటినుంచి అమ్మ వంటలకి వంకలు పెడితే ఒట్టు. అలా అమ్మ ఒకేసారి నాలో వంకలు పెట్టడమనే చెడ్డ గుణాన్ని మాన్పించి, పుస్తకాలు చదవడం అనే మంచి అలవాటును పెంచింది.
అప్పటినుంచి బళ్ళో పుస్తకాల కంటే బయటి పుస్తకాలే ఎక్కువ చదువుతుంటే అమ్మ నేను చదువును నిర్లక్ష్యం చేస్తున్నానని భయపడేది. కాని నాన్న, ‘ఇదే అసలైన విద్య’ అంటూ ప్రోత్సహించేవారు.
మీకు చిన్నప్పటి నుంచి సినిమాల పట్ల ఆసక్తి ఉండేదా ?
4,5 ఏళ్ళ వయసులో అనుకుంటాను. నాకు కేవలం నా పేరు రాసుకోవడం రాగానే, సినిమా వాల్ పోస్టర్ ల మీద వేటూరి, ఆరుద్ర గార్ల పక్కన నా పేరు రాసుకునే వాడిని. ఎప్పుడు నాకు కోపమొచ్చినా చిన్నప్పుడు ‘నేను మద్రాస్ వెళ్ళిపోతా’ అని బెదిరించే వాడిని. అనుకోకుండా తర్వాత నేను మద్రాసు లోనే స్థిరపడడం జరిగింది. అలా నాకూ సినిమాకు నాకు తెలిసీతెలియని వయసులోనే అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది..
ఎయిర్ ఫోర్సు లో ఎలా చేరారు?
ఎస్.ఎస్.ఎల్.సి దాకా నిజానికి నేను ఏమీ రాయలేదు, చదువుతూ ఉండేవాడిని. మా ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం లేదు. మా ఊళ్ళోని ఒక గొడ్లపాకలో ఎ.వి.ఎం. మాష్టారని ఒకాయన వచ్చి, ఓ పది మంది పిల్లలకు పాఠాలు చెప్పేవారు. మధ్య మధ్యన అక్కడే గేదెలు పేడేసేవి.
నా 17 వ ఏట మా నాన్న పోయారు. నేను హైదరాబద్ లో ఉండే మా మూడో అన్నయ్య దగ్గరకు వెళ్లాను. అప్పుడే ఎయిర్ ఫోర్సు లో చేరడం జరిగింది. నాకప్పుడు హిందీ కూడా రాదు. ‘మేరా నాం రాజు హై’ అని చెప్పడం ఒక్కటే తెలుసు. కాని, ఈ ఉద్యోగంలో చేరాకా, అనేక భాషలు, సంస్కృతులకు చెందిన వ్యక్తులతో పరిచయం అవడంతో ఇతర భాషలలోని తియ్యదనం తెలిసింది. హిందీ పాటలు తెలుగులో రాసుకుని, పాడుతుంటే, హిందీ సాహిత్యం ఇంత గొప్పగా ఉంటుందా అనిపించేది. హిందీ పాటలు, తెలుగు పాటల్లోని సాహిత్యాన్ని పోల్చుకుని చూసేవాడిని. ఉదాహరణకు ‘జిందగీ భర్ నహీ భూలేంగే వో బర్సాత్ కి రాత్’ అన్న హిందీ పాటని, ‘కురిసింది వాన నా గుండె లోన నీ చూపులే జల్లుగా’ అన్న పాటతో పోల్చి చూసేవాడిని. ఇలా ఒకే వస్తువును అనేక దృష్టి కోణాల్లో చూడడం నాకు అలవడింది.
ట్యూన్ గుర్తు పెట్టుకునేందుకు దానికి తగ్గట్టు, తెలుగు సాహిత్యం రాసుకునే వాడిని. ఇలా తెలియకుండానే ట్యూన్ కి పాటలు రాయడం నాకు అలవాటు అయ్యింది. మనసులో భావాల్ని కాగితాల నిండా నింపేసేవాడిని. కాని, అప్పట్లో ఈ రచనలు మీడియా లో ప్రచురించబడాలంటే హెడ్ క్వార్టర్స్ నుంచి అనుమతి కావాలి. అదెలా తీసుకోవాలో కూడా నాకు తెలీదు. అప్పట్లో సుమారు 4 వేల బ్రహ్మాండమైన పాటలు రాసి పెట్టుకున్నాను. కానీ సినిమాల్లోకి వచ్చాకే తెలిసింది, అవి సినిమాలకు పనికిరావని! హీరో, హీరోయిన్ ఇమేజ్, సన్నివేశం ఇలా వాటికి కావలసిన కెమిస్ట్రీ వేరే ఉంటుందని.
కాని, స్వయంవరం చిత్రంలోని ‘మరల తెలుపనా ప్రియా’ అనే పాట, ‘కొమ్మన కులికే కోయిల ఓ కమ్మని పాట పాడవే’ అనే పాటలు ఆ దర్శకులు నా డైరీ లో నుంచి అడిగి తీసుకున్నవే.
సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది ?
ఆరుద్ర గారి శ్రీమతి రామలక్ష్మి గారు ‘తరాలు’ అన్న టీవీ సీరియల్ నిర్మిస్తే దానికి రాయడం, భానుమతి గారి అత్తగారి కధలు టీవీ సీరియల్ గా వస్తే దానికి రాయడం జరిగింది. ఇలా మహామహుల ప్రక్కన నా పేరు చూసుకునే అదృష్టం కలిగింది. నేను 87 జనవరి 1 వ తేదీన నా ఉద్యోగానికి రాజీనామా చేసాను. సినీరంగంలో నాకు పితృ సమానులు విజయబాపినీడు గారు. ఆయన అప్పట్లో నాతో 'నాకూ పెళ్ళాం కావాలి' లో ఓ పాట రాయించారు. ఆ తర్వాత ఆయన దగ్గర నా రెండో సినిమా 'మా ఇంటి మహారాజు' కి సింగిల్ కార్డ్. ఆ తర్వాత ఆయన తీసిన 'ఖైదీ నం.786' లో మూడు పాటలు రాయించారు. అందులో 'గువ్వా గోరింకతో' పాట పెద్ద హిట్. చిరంజీవి గారి సినిమా కూడా కావడంతో ఆ పాట ద్వారా అందరికీ తెలిసి ఇండస్ట్రీ లో పూర్తిగా నిలదొక్కుకోవడం జరిగింది. ఆ తర్వాత 'గ్యాంగ్ లీడర్' వంటి వరస హిట్లు కావడంతో నాకు మంచి అవకాశాలు రాసాగాయి.
సినీరంగంలో మీకు తగినన్ని అవార్డులు రాలేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా ?
ప్రేక్షకులు ఇచ్చేవే అసలైన అవార్డులు, అప్లై చేసుకుంటే వచ్చేవి కాదు. నా పాటని జనం గుండెకి ఎత్తుకున్నారు, హత్తుకున్నారు. ఒక స్నేహానికన్న మిన్న పాట, అలాగే పెద్దరికంలోని ఇదేలే తరతరాల చరితం అనే పాట నుంచి ఈనాడు, ఇన్నేళ్ళ తర్వాత కూడా నేను రాసిన ‘ గువ్వా గోరింకతో ‘, ‘వాన వాన వెల్లువాయే’ వంటి పాటలు రీమిక్స్ అయ్యి అందరినీ అలరిస్తున్నాయి అంటే, సినీ గేయ రచయతగా ఇంతకంటే నేను పొందాల్సిన అవార్డు ఏముంటుంది చెప్పండి. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఉన్నారు కనుక, వారికి తగినట్లుగా పాట రాసి, నా వృత్తికి న్యాయం చేసాను తప్ప, ఏనాడూ బహుమతులు, అవార్డులు ఆశించలేదమ్మా.
మీరు రాసిన పాటలు అన్నింటిలోకి ప్రేమించుకుందాం రా... చిత్రం లోని ‘సూర్య కిరీటమే నీవా ’ అన్న పాట చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. గతంలో రచయతలు కావ్యాల్లో, కవితల్లో వాడిన ఉపమానాలు ఏవీ ఇందులో కనిపించవు. ఈ పాట అసలు ఎలా పుట్టింది?
ఒకసారి సూర్య గ్రహణం వచ్చింది. అది విడిచేటప్పుడు ఆకాశంలోకి చూస్తే, అదొక డైమండ్ రింగ్ లాగా ఉంది. సూర్యుడి వెలుగును మనం కళ్ళారా చూడలేము కదా, ఆయనకు ఎంత గొప్ప కిరీటం పెట్టినా, ఆయన ప్రకాశం ముందు వెలెవెల పోతుంది కదా, అన్న ఆలోచన వచ్చింది. అలా ‘సూర్యకిరీటమే’ అన్న పల్లవి పుట్టింది. ఆ తర్వాత –చంద్రసుమానివే అన్న మాట, చంద్రుడే చల్లదనంతో ఒక పువ్వులా మారితే ఎలా ఉంటుంది, అలా వెన్నెల, చలువ కలబోసిన చంద్ర సుమమే నాయిక అని చెప్పడం జరిగింది. అలాగే ఇందులో మౌన సరస్సున దాగిన హిమశంఖానివో ‘ అన్న మాట. మౌనం చాలా గొప్ప భాష, ఆ మౌనమే ఒక సరస్సుగా మారితే, ఆ సరస్సులో ఉన్న హిమ శంఖం మ్రోగితే నీ చల్లని మాటలా ఉంటుందా అన్న భావన ఇక్కడ వాడాను. ‘తొలకరి మేఘపు ఛాయలో విరిసిన తారవో’ అన్న వాక్యంలో నల్లటి మబ్బుల మీదుగా ఒక తార వెలిగితే, ఎంత ఉజ్వలంగా ఉంటుందో ఆ తారవే నీవా, అన్న ఉపమానం కనిపిస్తుంది. ఇక వాత్సాయన వన వాసిని, కావేరి – అన్న పల్లవి ముగింపు విషయానికి ఒస్తే, వాత్సాయనుడు ఎనిమిది రకాల స్త్రీలు ఉంటారని చెప్పారు. ఆయనకే ఈ నాయికను ఏ వర్గంలో పెట్టాలా అన్న సందిగ్ధం కలిగి, తెలియక ఆయన వనంలో వదిలేస్తే, అక్కడ విహరిస్తున్న వనవాసినివి నీవా, కావేరి ( ఆ చిత్రంలో నాయిక పేరు) అని ఇలా పల్లవిని ముగించాను. ఇలాగే పాటంతా విశేషమైన ఉపమానాలతో పూర్తి చేసాను. ఇదేమంత కష్టపడి రాసిన పాట కాదు. ఒక్కసారి ఆ పాట ఎమోషన్ లోకి వెళ్తే సుమారు గంట లోపే పూర్తైన పాట ఇది.
మరి మీరు రాసిన పాటలలోకెల్లా చాలా కష్టపడి రాసిన పాటలు ఏవైనా ఉన్నాయా?
ఉన్నాయమ్మా, అటువంటి మూడు పాటల గురించి చెబుతాను. అన్ని పాటలు దాదాపు నేను 5,6 గంటల లోపే రాసాను. అయితే ‘గువ్వా గోరింకతో’ అన్న పాట ట్యూన్ నచ్చి, బాపినీడు గారిని అడిగి మరీ తీసుకున్నాను. చరణాలు అయిపోయాయి, కాని పల్లవే తట్టట్లేదు. పల్లవి కోసం రోజున్నర గింజుకున్నాను. చివరికి చేతులు ఎత్తేద్దాం అనుకున్న దశలో ఒక కొమ్మ మీద చిన్న గువ్వ పిట్ట కమ్మగా కూయడం చూసాను. హమ్మయ్య, దొరికిందిరా, అనుకుని, గువ్వా, గోరింకతో అన్న పల్లవి రాసాను. అది సూపర్ హిట్ అయింది.
మరొక పాట దొంగకోళ్ళు చిత్రం లోది. అందులో హీరో హీరొయిన్ ను రోడ్డు మీదకు తరిమేస్తాడు. సాలూరి వాసూరావు గారి సంగీత సారధ్యంలో, వాణి జయరాం గారి స్వరంలో, కేవలం 4 ఇన్స్ట్రుమెంట్స్ వాడి, ఆ పాటను రికార్డు చేసారు. అప్పుడు వచ్చే పాటను విని అందరికీ గుండె కరిగిపోవాలి. 3 రోజులు మధన పడి, నా వల్ల కాదనుకుని, చెన్నై లో నేను అప్పట్లో ఉన్న 10 x 10 గది మెట్లు దిగిపోతూ ఉండగా, ఎర్నెస్ట్ హెమింగ్ రాసిన నోబెల్ ప్రైజ్ వచ్చిన వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి, ‘Time can destroy a man but cannot defeat him’ అనే మాటలవి. అప్పుడు ‘ఏమని వివరించను, మా బాధ ఎవరికి వినిపించను’ అన్న పాట అది. పై మాటల్నే పాటలోని చరణాల్లో  పొందుపరచాను. ‘’ధైర్యాన్ని కోల్పోని ఏ మనిషిని విధి ఓడించలేదమ్మ ఏనాటికి’ అని రాసాను.
ఇక మూడో పాట, సుమంగళి అనే చిత్రంలోది. ఇందులో నాకొచ్చింది సిటుయేషన్ పరమైన సమస్య. ఇందులో హీరో హీరొయిన్లు డ్యూయెట్ పాడుకునే గీతాన్నే, తర్వాత హీరొయిన్ కూతురు కాలేజి లో పాడాలి, దాన్నే మళ్ళీ హీరొయిన్ చనిపోయినప్పుడు ఆమె శవం వెళ్తుండగా విషాద గీతంగా పాడాలి. ఇదీ సమస్య. మూడు సందర్భాలకి ఒకే పాట ఎలా కుదురుతుంది? ఇక నా వల్ల కాదు, ఎవరైనా సీనియర్ రచయత చేత రాయించుకోమని చెప్పేందుకు వెళ్తుంటే, ఒక మిత్రుడు కనిపించి, ‘journey to the west’ అనే నవల చదివావా? అని అడిగాడు. వెంటనే ‘జర్నీ’ అన్న పదంతో నా బ్రెయిన్ మెయిన్ స్విచ్ ఆన్ అయింది. కృష్ణంరాజు, జయప్రద ఆ సినిమాలో పాడుకునే పాటే, ‘జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ’ అనే పాట. 3 రోజులు నేను ఈ పాటకు కష్టపడ్డా, తర్వాత ఎంతో చక్కటి బిడ్డ పుట్టిందన్న ఆనందం కలిగింది.
మీరు సాహిత్యరంగంలో రకరకాల రచనలు చేస్తున్నారు కదా. ఒక సినీగేయ రచయతగా మంచి పేరున్న మీరు సాహితీ రంగంలోకి రావడం ఎలా సంభవించింది?
మనిషి ఎంత సంపాదించినా, ఒక దశలో ‘ఇది చాలు’ అన్న తృప్తి రావాలి. ఒకప్పుడు నేను రోజుకి నాలుగు సినిమాలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే విధంగా పాటలు రాయాలంటే నేను హైదరాబాద్ లో స్థిరపడాలి. ఒక మనిషి ఎంత సంపాదించినా తనతో పాటు ఏమీ తీసుకుని వెళ్ళలేడు కదా. అందుకే పాట వెనుక నేను పరుగు ఆపేసాను. కాని, పాటే నాదగ్గరికి ఒస్తే రాస్తున్నాను.
సినిమా అనేది ఒక కవికి అమరత్వాన్ని ఇస్తుంది. ఆ పాట విన్నప్పుడల్లా వారు కవిని గుర్తుచేసుకుంటారు. కాని, సినిమాలో ఆ పాట చూసి మర్చిపోతారు. కాని, పుస్తకం అనేది అక్షరాత్వాన్నిఇస్తుంది. పుస్తకం పాఠకుల వద్ద ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే సాహిత్యంలో రంగప్రవేశం చేసి, దాదాపు అన్ని కావ్య ప్రక్రియల్లో రాసాను. ఇప్పటిదాకా వంద కధలు రాబోతున్నాయి, అవి నాలుగు భాగాలుగా ఎమెస్కో వారు ప్రచురించనున్నారు. అలాగే కౌముది పత్రిక కోసం ఇదివరలో మాయానగరం అనే రచన,  ‘మనసు పొరల్లో’ పేరుతో నా స్వీయకధ కొంతమేరకు రాసాను. ఇప్పుడు ‘మూడవ సీత కధ’ పేరుతో అదే పత్రికలో సీరియల్ రాస్తున్నాను. ఇవన్నీ విశేషంగా సాహిత్య దిగ్గజాల మన్ననలు అందుకున్నాయి. ‘అన్ టోల్డ్ స్టోరీస్’ పేరుతోనూ కధలు రాసాను. చైతన్య శ్రవంతి అనే పత్రిక కోసం 3,4 ఏళ్ళు ఆధ్యాత్మిక రచనలు చేసాను. ప్రస్తుతం తిరుప్పావై పాశురాల్ని, తెలుగు పాటలుగా రాస్తున్నాను.
చాలా సంతోషమండి. ఇంత జీవితాన్ని చూసారు కదా, మీ దృష్టిలో జీవన దృక్పధం ఎలా ఉండాలి ?
నాకు ప్రకృతి అంటే ఇష్టం, ఈ ప్రపంచం అంటే ఇష్టం. ఈ ప్రపంచాన్ని చూడడం ఇష్టం. దేశానికి సేవ చేసిన వాడిగా, ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ నాకే చెందినవారు అని నేను భావిస్తాను. కులమతాలకు అతీతంగా ఉంటాను. ఈ జీవితంలో నేను ఎన్నో అనుభూతులను సొంతం చేసుకున్నాను. అవి మంచివైనా, చెడువైనా నావే. వాటి గురించి నేను ఎన్నడూ సిగ్గుపడను. కష్టమైనా, సుఖమైనా దాన్ని మనం సమానంగా తీసుకోవాలమ్మా. ఏదైనా మన జీవితంలోకి వచ్చినప్పుడు, అది మనకు ఏదో నేర్పెందుకే వచ్చిందని భావించాలి. ఇదీ నా జీవన దృక్పధం.
శ్రీ భువనచంద్ర గారు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరిన్ని మంచి పాటల్ని, రచనల్ని మనకు అందిస్తూ విజయ శిఖరాల్ని అధిరోహించాలని మనసారా కోరుకుంటోంది ‘అచ్చంగా తెలుగు’.

No comments:

Post a Comment

Pages