జమదగ్ని మహర్షి - అచ్చంగా తెలుగు

జమదగ్ని మహర్షి 

మంత్రాల పూర్ణచంద్రరావు 

   
  

పూర్వము భ్రుగు వంశమునకు చెందిన ఋచీక మహర్షి కుశిక వంశమునకు చెందిన గాధి రాజు కుమార్తె సత్యవతిని వివాహమాడ తలచి తన కోరికను గాధి రాజునకు తెలిపెను. గాధి అతను తన కుమార్తెకు సరి అయిన వాడో కాడో తెలుసుకొనుటకు తెల్లని దేహము,నల్లని చెవులు కల వేయి గుఱ్ఱము లను తెచ్చి ఇచ్చినచో తన కుమార్తెను ఇచ్చెదను అని చెప్పెను. ఇది ఎంత పని అని ఋచీక మహర్షి బయలుదేరి వరుణ దేవుని ప్రార్ధించి అతని వలన ఆ గుఱ్ఱము లను పొంది తీసుకువచ్చి గాధి రాజునకు ఇచ్చెను.
 గాధి రాజు ఋచీకుని శక్తి సామర్ధ్యము లను మెచ్చుకొని తన కుమార్తె అగు సత్యవతి ని ఇచ్చి వివాహము జరిపించెను. వారిద్దరూ ఆశ్రమమునకు చేరెను. సత్యవతి ఉత్తముడయిన బ్రాహ్మణుడు తనకు భర్తగా లభించెను అని సంతసించి భర్తకు అనేకవిధముల పరిచర్యలు చేయుచుండెను. ఋచీకుడు ఆమె సేవలకు మెచ్చి ఒక కోరిక కోరుకొమ్మనెను. ఆమె సంతసించి పుత్రులు లేని తన తల్లితండ్రులకు ఒక కుమారుని, మరియు తనకు ఒక పుత్రుని ఇవ్వమని కోరెను.  ఋచీక మహర్షి అట్లే అని రాజ బ్రహ్మ మంత్రములచే రెండు చలమలను  సృష్టించి ఆమెకు ఇచ్చి మొదటి చలమ  మీ తల్లి కి ఇవ్వు, అది ఉపయోగించిన వారికి సుక్షత్రియుడు జన్మించును, రెండవ చలమ  నీవు ఉపయోగించుము, దాని వలన నీకు ఉత్తమ బ్రాహ్మణుడు జన్మించును అని చెప్పి తను నదీ స్నానమునకు వెళ్ళెను.
ఇంతలో సత్యవతిని చూచుటకు గాధి భార్యాసమేతుడయి ఆశ్రమము నాకు వచ్చెను. ఆ ఆనందములో తను ఉపయోగించవలసిన చలమను  తల్లికి ఇచ్చి వృత్తాంతమును వివరించెను.ఇంతలో ఋచీక మహర్షి వచ్చి జరిగినది తెలుసుకొని సత్యవతిని చూసి నీకు క్షత్రియులను సంహరించే క్రూరుడగు కుమారుడునూ, మీ తల్లికి తపోధనుడగు కొడుకు పుట్టును అని చెప్పెను. సత్యవతి భయపడి క్రూరుడగు కొడుకును కనలేను ఇందులకు తరుణోపాయము చూపుము అని వేడుకొనగా ఆయన కరుణించి అటువంటి వాడు నీకు పుత్రుడిగా కాక పౌత్రుడిగా జన్మించును అని చెప్పెను.కాలక్రమమున సత్యవతికి జమదగ్ని అను పుత్రుడునూ, ఆమె తల్లికి విశ్వామిత్రుడు జన్మించిరి.
ఇట్లు జన్మించిన జమదగ్ని ఉత్తమ గుణ సంపన్నుడయి రేణువు కుమార్తె అగు రేణుకను వివాహమాడెను.జమదగ్ని తన తపోధనముచే ఒక హోమ ధేనువును పొందెను. ఆ ధేనువు కావలసినప్పుడు ఎందరికయినను ఏమి అయిననూ సమకూర్చగల సామర్ధ్యము కలది.దానితో జమదగ్ని రేణుకా దేవి ఏ లోటూ లేకుండా ఉండిరి.
జమదగ్ని రేణుక పతిభక్తికి మెచ్చి నర్మదా తీరమున ఫల పుష్పములతో నిండిన నిర్జన ప్రదేశమున విహరించుచూ క్రమ క్రమమున మన్మధ క్రీడలు ఆరంభించిరి. ఆ సమయమున సూర్యుడు వారి వద్దకు విప్ర రూపమున వచ్చి ఓయీ జమదగ్నీ నీవు బ్రహ్మ మనువడివీ,వేదకర్తవూ అయిన నీవు ఇట్లు పట్టపగలు రతి క్రీడకు పూనుకొనుట ధర్మము కాదు కదా, నీవే ఇట్లు చేసిన మిగిలినవారు కూడా ఇట్లే చేయుదురు కదా అనెను.
అది విని జమదగ్ని సూర్యునితో నీవు పండిత అహంకారముతో ఇట్లు పలికితివి, నేను చతుర్వేద ధర్మాధర్మములు ఎరుగని వాడనా ? అజ్ఞాని స్వకర్మలచే ఎల్లప్పుడూ జడీ భూతుడగును , విజ్ఞాని అగ్నివలె మహాతేజస్సుచే కర్మదోషములు చూడడు. మేము జ్ఞాన మూర్తులము,నారాయణ సంరక్షకుడను, మా భావములు ఆయనకు తెలుసు, మాకు ఆయన భావములు తెలుసు.నీవే కాదు బ్రహ్మ రుద్రాదులు కూడా మమ్ము శిక్షింప జాలరు.అట్టి మాకు నీవు రతి భంగము చేసినావు కావున నా శాపమున నీవు రాహుగ్రస్తుడవయి  పాప ద్రుశ్యుడవు గాక అని శపించెను.
అది విని సూర్యుడు అయ్యా మనము పరస్పరము  పూజ్యులము, అయిననూ నీవు నన్ను శపించితివి, ఇప్పుడు నేను ఊరుకున్న లోకులు నన్ను అశక్తుడు అందురు, కావున నీకు  ఒక క్షత్రియుని చే పరాభవము, అతని చే మరణము కలుగును అని శపించెను .
అప్పుడు జమదగ్ని మరల కోపించి నీవు శివుని చే జితుడవు కమ్మని  శపించెను.. ఈ సంగతి శివుడు విని బ్రహ్మ తో  కలిసి అచ్చటకు వచ్చి వారిని శాంత పఱచి సూర్యునితో నీవు ఒకానొక దినమున రాహుగ్రస్తుడవయ్యి కొందరికి అద్రుశ్యముగా కొందరికి పూర్ణ దృశ్యుడవు గా ఉండును. నిన్ను చూసి సర్వులూ నమస్కరించి పాప విమిక్తులు అయ్యెదరు.. మాలి సుమాలి యుద్ధమున శివుడు నిన్ను జయించును అని చెప్పెను. తరువాత జమదగ్ని ని చూచి నీ తేజ మాత్రమున క్షణములో లోకము అంతయు భస్మీపటలము కాగలదు, కావున కోపము వదులుము,నీవు కార్తవీర్యార్జునుని చే  పరాభవము, ఓటమి,మరణము సంభవించును .అయిననూ విష్ణుమూర్తి నీకు పుత్రునిగా జన్మించి ఇరువది ఒక్క మారులు జగమంతా క్షత్రియులు లేకుండా చేయును, నీ మరణము కూడా లోక కళ్యాణమునకు బీజము అగును, అని చెప్పి అంతర్ధాన మయ్యెను. అంత వారిరువురూ పరస్పరము అభినందించుకుని పూర్వ కర్మలకు ఎవ్వరూ అతీతులు కాదు అని వెడలి పోయిరి.
  రేణుకా దేవి తన భర్తకు సపర్యలు చేయుచూ క్రమముగా అయిదుగురు కుమారులను కనెను.వారు రుమణ్వతుడు ,సుసేషణుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు .
ఒకనాడు రేణుక జలము కొఱకు నదికి పోయెను.అచ్చట చిత్రరధుడు అను రాజు భార్యా సమేతుడయి  జలక్రీడా పరవసుడయి  ఉండగా, వారిని చూసి  రేణుకాదేవి విధి వశమున కోరిక కల్గి వారిని చూచు చుండెను, అందువలన ఆమె పాతివ్రత్యమునకు దోషము కలిగి చేతి యందు ఉన్న కుండ కింద పడి పగిలిపోయేను, ఎపుడయినా ప్రమాద వశాత్తు కిందపడినా నది యందలి ఇసుక తెసి కుండ చేయగా తన పాతివ్రత్య మహిమచే కుండగా నిలపడేది, కానీ ఆ రోజు అట్లు జరగలేదు.. ఇంటికి వెళ్లి భర్తకు చెప్పటమే మేలనుకుని ఇంటికి రాగా చేత కుండ లేకపోవుట చూసి, ఏమి జరిగినదో జమదగ్ని గ్రహించెను.అంతట ఆగ్రహించిన వాడయి ఆమెకు మరణమే శిక్ష అని తలచి కుమారులను పిలిచి ఆమెను సంహరింపుము అని ఆజ్ఞాపించెను. మొదటి నలుగురూ ఆ పని చేయలేక పోయిరి, చివరగా పరశురాముడు ఆమె తలను నరికెను.సోదరులను కూడా సంహరింపుము అనగా అతడు అట్లే చెసెను. అంతట జమదగ్ని పుత్ర ప్రేమతో పరశురాముని ఏది అయినా కోరిక కోరుకొమ్మనగా అతడు మరణించిన తల్లీ, సోదరులను బ్రతికించమని కోరెను.జమదగ్ని   కుమారుని, మాత్రు,భ్రాత్రు   ,వాత్సల్యమునకు మెచ్చి అందరినీ బ్రతికించెను.
       కార్తవీర్యార్జునుడు అను రాజు దత్తాత్రేయుని ఆరాధన చేసి అతని వలన శత్రుజయము, వేయి చేతులు,యశము,బలము,తేజము చెడని ఇంద్రియములను పొంది, దిగ్విజయ యాత్రకు వచ్చిన రావణాసురుని అవమానించెను.తరువాత ఒక సారి అడవిలో సంచరించుచూ జమదగ్ని మహర్షి ఆశ్రమము చేరెను. అప్పుడు జమదగ్ని తన హోమ ధేనువును రప్పించి రాజు గారికి పరివారమునకు షడ్రసోపేత విందు ఇచ్చెను.అప్పుడు ఆ రాజు ఆ గోవు మీద కోర్కె కలిగేను.ఆ గోవు మీద ఉన్న కోరికతో రాజు జమదగ్ని మీద దండయాత్ర చేయగా ఇరువదిపర్యాయములు ఓడిపోయి ఇరువది ఒకటో మారు జమదగ్నిని వధించి, ఆ ధేనువు కొఱకు చూడగా అది ఇంద్రుని వద్దకు చేరి సురక్షితముగా ఉండెను.రేణుకాదేవి భర్తతో సహగమనము చేయుటకు సిద్ధమవగా ఆశరీరవాణి వద్దని చెప్పెను. ఇంతలో భ్రుగు మహర్షి వచ్చి జమదగ్నిని బ్రతికించెను.
   తరువాత పరశురాముడు వచ్చి జరిగినది తెలుసుకుని  తండ్రి అనుజ్ఞ తీసుకుని కార్తవీర్యార్జునుని మీదకు దండ యాత్రకు వెళ్ళి తన గండ్రగొడ్డలి చే ఆ రాజు వేయి చేతులను, శిరస్సును ఖండించెను. తిరిగి తండ్రివద్దకు వచ్చి జరిగినది చెప్పగా అందులకు తండ్రి కోపించి విష్ణుమూర్తి అవతారము అని కూడా ఆలోచించక రాజు ఎంత చెడ్డవాడు అయిననూ అతని చంపుట మహా పాపము, కావున ఒక ఏడాది తీర్ధ యాత్రలు చేసి రమ్మని పంపెను. ఇచ్చట మనకు జనదగ్ని శాంతము, మరియు కుమారుడు అని కూడా చూడకుండా పరశురామునకు శిక్ష విధించుట కనపడును.
     కొంత కాలమునకు కార్తవీర్యార్జుని  కుమారులు తమ తండ్రి మరణమునకు కారణము జమదగ్ని అని తలచి అతనిని చంపెను.రేణుకా దేవి భర్త పై పడి విలపించుచూ  పరశురామా అని ఇరువది ఒక్కమార్లు పిలువగా తీర్ధయాత్రలలో ఉన్న పరశురాముడు తిరిగి వచ్చి తల్లిని, సోదరులను ఊరడించి ఇరువది ఒక్క సార్లు తల్లి పిలిచినది కాబట్టి కార్తవీర్యులనే కాక క్షత్రియులు అందరినీ ఇరువది ఒక్క సార్లు దండయాత్రచేసి సంహరించి ఆ రక్తముతో తండ్రికి తర్పణము చేసెను. రేణుక కూడా భర్త మరణముతో తను కూడా మరణించెను.
   ఇట్లు జమదగ్ని మహర్షి మహా ప్రశాంతుడయి, అరిషడ్వర్గములు జయించి గొప్ప పేరు గడించెను.
   జమదగ్ని మహర్షి శ్రీవత్స గోత్రములో ఒక ఋషి గా వెలుగొందుచుండెను.
****

No comments:

Post a Comment

Pages