అక్షరాల కవిత్వమే - అచ్చంగా తెలుగు

అక్షరాల కవిత్వమే

పుస్తక సమీక్ష - డా.తాడేపల్లి పతంజలి


ప్రసిద్ధమయిన ముళ్ళపూడి వెంకట రమణ బుడుగు పాత్రసృష్టికి ప్రసిద్ద ఆంగ్ల కార్టూను డెనిస్ - ది మెనేస్ స్ఫూర్తిఅంటుంటారు. ఇది ఎంత నిజమో తెలియదు కాని కలిదిండిరామచంద్రరాజుగారి అక్షర దీపాలకు బుడుగు స్పూర్తి, ఉద్దీపనం,ఉత్తేజం, ప్రేరణ (inspiration) రాసేది నేనయినా రాయించేది బుడుగే అని రామచంద్రరాజుగారు కంఠోక్తిగా చెప్పుకొన్నారు.
బుడి బుడి నడకల బుడుగే
సుడులనురేపెను ఎడదను చూపెను వ్యధలన్
చెడునే సహించ వలదని
నడిపెను నా చేయి పట్టి నాకే గురువై
బుడుగే శివుడని దెలియము
బుడుగే వామనుని వోలె భువనాల్ కొలుచున్
పిడుగై దహించు చెడునే
సుడిగాల్లా కలియు దిరుగు శుభములు పంచన్
ఎవరీబుడుగు - చాలామందికి తెలుసు కాని ఒకసారి అతడి మాటలను నెమరువేసుకొందాం.
  1. "నా అంతవాడు నేను. నన్ను ఎవరూ కొట్టకూడదు. నేను నిఝాంగా పెద్దవాడినే అనుకో. ఐతే వాళ్ళే నన్ను కుర్రకుంకా అంటారుగా. అందుకని కొట్టకూడదు.”
  2. సిగరెట్లు తెల్లగా ఉంటాయిలే వీటిని బాబాయిలాంటి కుర్రవాళ్ళు కాలుస్తారు. . మరి నేను పెద్దవాడినిగా, అందుకనే కాలవను.
  3. నేను ఇంఖా పెద్దవాణ్నయ్యాకా జెటకా బండియేనా రైలింజనేనా తోలుతానుగా. అందుకని బీడీలు దాస్తాననుకో. అప్పుడు చెవులో పెట్టుకోవాలిగా, బీడీలు బామ్మ వత్తుల పెట్టెలో దాస్తే భద్రంగా ఉంటాయి.
  4. అగరొత్తులు నల్లగా ఉంటాయి. వాటిని గోడమీద గుచ్చి కాలుస్తారు. సిగరెట్లేమో నోట్లో గుచ్చి కాలుస్తారు.
  5. ధైర్యం అంటే పోలీసుతో మాట్లాడ్డం. ధైర్యం అంటే సుబ్దలష్మితో మాట్లాడ్డం అని కూడా అర్థం అట. ఇలా అని బాబాయి చెప్పాడు.
  6. డికేష్టివరావు అంటే నాకు తెలీదు. బాబాయికీ తెలీదు. వాడికి కూడా తెలీదట. డికెష్టివురావుకు పెద్ద మీసాలున్నాయి. డికెష్టింగ్ చేసేప్పుడు అవి పెట్టుకోవాలట. అప్పుడు టుపాకీ కూడా పట్టుకోవాలట.
  7. బళ్ళకెళ్ళకుండా ఉండాలంటే చొక్కా ఇప్పేసి ముందుగా ఎండలో నించోవాలి. అప్పుడు వీపుమీద పొట్టమీద జొరం వచేస్తుంది. అప్పుడు పరిగేఠుకుని అమ్మదగ్గిరికెళ్ళి గబగబా చూడూ బళ్ళకెళ్ళద్దని చెప్పూ అనాలి. లాపోతే జెరం చల్లారిపోతుంది. బామ్మకి చెప్పేస్తే చాలు. . కడుపునెప్పిమంచిది కాదు ఎందుకంటే పకోడీలు చేసుకొని మనకుపెట్టకుండా తినేస్తారు. అందుకని తలనొప్పి అన్నిటికన్నా మంచిది. ఇది కూడా బామ్మకే చెప్పాలి.
  8. అయిసు ప్రూటువాడిని పిలిచి ముందుగా రెండు ఎంగిలి చేసెయ్యాలి. అప్పుడు అమ్మ కొనిపెడుతుంది. తరువాత ప్రెవేటు చెబుతుందనుకో. ఈ పెరపంచకంలో ప్రెవేటు లేకుండా మనకి ఏం రాదుగదా మరి?
  9. ఒక మేష్ణారేమో చెవి కుడివైపుకు మెలిపెడతాడు. ఇంకో కొన్నాళ్ళకి కొత్తవాడొస్తాడు కదా? వాడేమో ఎడమవైపుకి మెలిపెడతాడు. ఇలా అవుతే చెవి పాడైపోదూ? అందుకని ఎటేపు మెలెట్టాలో కొత్తమేష్టరు ముందుగా పాతమేష్టరును కనుక్కుని రావాలి.
  10. ఈ పెద్దవాళ్ళు ఒకోసారి అబద్ధం చెబితే తిడతారు. ఒకోసారి నిఝాంచెబితే కూడా ప్రెవేటు చెప్పేస్తారు.
  11. చంపడానికి ఇప్పుడు రాచ్చసులు అయిపోయారట. అందుకని మనం పదమూడో ఎక్కం, సిబి పాఠం ఇవన్నీ చదూకోవాలట. అవన్నీ వచ్చెస్తే రాచ్చసులు చచ్చిపోతారట. మనం బాగా చదూకుని ప్పది కాణీలో, వంద కాణీలో తెచ్చినా రాచ్చసులు చచ్చిపోతారట. లాపోతే సీగాన పెసూనాంబనిచ్చి పెళ్ళి చైరన్నమాట. ఇలాగని మా రాద చెప్పింది. రాధంటేఅమ్మలే (వికీపీడియా సౌజన్యం)
ఇలాంటి బుడుగు పిడుగులు కలిదిండి వారి కవిత్వంలో అక్షరదీపాలయ్యాయి.
అల్లవలెను మల్లెమాలవొలెను మైత్రి
పల్లెపట్నమెల్ల చల్లగుండ
కల్లకపటమొద్దు కక్షలింకనుజాలు
ఎల్లకాలముండు యెదను ప్రేమ

అని కలిదిండి వారు స్నేహాన్ని మల్లెమాల తో పోల్లారు.
తైలాలు లేకుండా వెలిగేటి దీపం
విద్యుత్ లేకుండా వెలిగేటి దీపం
హృదయాలలో ఎప్పుడూ నిలిచేటి దీపం
నిజమైన దీపం మా స్నేహ దీపం

వర్గాలు వర్గాలు వదిలితే స్నేహం
వేషాలు దోషాలు మానితే స్నేహం
ప్రాణాలు అర్పించగల్లితే స్నేహం
కష్టాలు నష్టాలు ఓర్చితే స్నేహం

నిరుపేద అయితే ఏమి ఎవడైతే ఏమి
చదువేమి రానట్టి చవటైతేనేమి
అందాలు చందాలు లేకుంటే ఏమి
నిన్ను కాచినవాడే నిజమైన నేస్తం

దోస్తిని మించినది లేదు జగాన
రత్నాలు కంటే మిన్న అది లోకాన
మిత్రుడే కావాలి సుఖమున,శోకాన
అతడు లేకున్నచో నగరమే కాన-

చీకటిలో దారి చూపేది నేస్తం
కళ్ళు తలకెక్కితే దింపేది నేస్తం
మనలోని లోపాలు తెలిపేది నేస్తం
నిజమైన మనిషిగా నిలిపేది స్నేహం....
అని అపూర్వంగా పలికిన దాశరధిని గుర్తుకు తెచ్చారు కలిదిండి వారు. గుప్పమన్న మల్లెమాల వాడిపోతుందేమో కాని స్నేహ మాల వాడిపోదు.అది ఎదలో ఎల్లకాలమూ ఉంటుంది.
కవితరాయ జూడ కదనుదొక్కుచు నొచ్చ
వెలుగు నోచుకోని వెతల కతలు
కల్పితాలు వద్దు కరకు నిజాల్జెప్పు
కవియెగాంచకున్న యెవరుగాంచు
(62)
నాకవిత్వమధర్మాయ వ్యాధయే దండనాయ వా|
కుకవిత్వం పునః సాక్షానృతి రాహుర్మనీషిణః||
(నువ్వు కవిత్వం రాయకపోతే అది తప్పు కాదు. నీకు జబ్బు చేయదు. నిన్నెవరూ తిట్టరు, కొట్టరు. కానీ చెడు కవిత్వం రాస్తే నువ్వు తప్పకుండా నీ పాఠకులను చంపినవాడివవుతావు.) అన్నాడు భామహుడు. వడగాడ్పు నా జీవితం. వెన్నెల నా కవిత్వం -గుర్రం జాషువా
అబద్దాలాడడమంత సులభం అవదు సుమా! కవిత అల్లడం- దాశరధి కృష్ణమాచార్య
ఒకరు రాయమంటే రాయునది కవిత్వం కాజాలదుఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే-శ్రీశ్రీ
ఇలా కవిత్వాని గురించి రకరకాల మాటలు మనం విన్నాం. వెలుగు నోచుకోని వెతల కతలు కవిత్వీకరించాలనే కలిదిండి వారి అభిప్రాయాన్ని ప్రశంసించకుండా ఎలా ఉండగలం?
కందాలు
కంద పద్యాన్ని గురించి కందం మాకందం .,, మాకు అందం.. జడ కందం జడకు అందం ఇలా చాలా చమత్కారాలున్నాయి.
ఓద్వేటి వెంకట కృష్ణయ్య అనే కవి, అప్పటి గద్వాల ప్రభువు సీతారామభూపాలుడు గురించి నాలుగు రకాల కంద పద్యాలుఇలా గమ్మత్తుగా వ్రాసాడు.
సురరాజ విభవ లక్షణ
భరితావనజాస్త్ర రూప వర కవి వినుతా
హరిభక్తి యుక్త విలసత్
కరుణాదినకర సుతేజ గద్వాల నృపా!
పై కంద పద్యంలో లో వనజాస్త్ర నుంచి యధాతథంగా గ్రహించి రెండో కందం వ్రాసాడు.
వనజాస్త్ర రూప వరకవి
వినుతా హరిభక్తి యుక్త విలసత్కరుణా
దినకర సుతేజ గద్వా
లనృపా సురరాజ విభవలక్షణ భరితా!
హరిభక్తి యుక్త విలసత్కరుణా అని మొదలుపెట్టి
హరిభక్తి యుక్త విలస
త్కరుణా దినకర సుతేజ గద్వాలనృపా!
సురరాజ విభవ లక్షణ
భరితా వనజాస్త రూప వరవి వినుతా!
 అని మూడవ కందంవ్రాసాడు.
దినకర సుతేజ గద్వాలనృపా అని మొదలుపెట్టి నాలుగవ కందం వ్రాసాడు.
దినకర సుతేజ గద్వా
లనృపా సురరాజ విభవలక్షణ భరితా
వనజాస్త్ర రూప వరకవి
వినుతా హరిభక్తి యుక్త విలసత్కరుణా!
ఇలా ఒకే కందపద్యాన్ని వివిధ రకాలుగా విభజించి అర్థంభంగం రాకుండా మరికొన్ని కంద పద్యాలను రాసే ప్రక్రియను"చతుర్విధ కందము' అంటారు. ఇలా ఎన్నో కందపద్దతులున్నాయి.
కందము అంటే నీటి నిచ్చె మబ్బు అను అర్ధాన్నిస్వీకరించి కలిదిండివారు
కందము నుండిన జలముల్
అందరి కిచ్చును ఫలమును అక్కర కురియన్
(63)
అన్నారు. నిజమే కదా ! నీరు అందరికి ఫలాన్ని ఇస్తాయి. ఇలా రస భరితంగా 205 కందాల వరం కురిపించారు అక్షర దీపాలులో . ఆస్వాదించడమే మనవంతు, సీగాన పెసూనాంబకి , బుడుగుకి మధ్య సంభాషణలని కందపద్యాలలో వ్యావహారిక భాషలో కలిదిండి ఇలా వ్రాసారు.
నీరే లేకుంటేనిల
వేరే దారేమి యుంది వివరం చెపుమా?
పారే వారుణి చూడోయ్
మారే కాలం గదయిది మహిలో సీ.గా
నీరు లేకపోతే ఇంకోదారి పమిటి?వారుణి వాహిని ఉంది కదా అని సమాజ రుగ్మతలపై చెర్నకోలా వంటి జవాబు
పేరడీలు
ఇందుగలదందు లేదని
సందేహమ్మేలనయ్య సర్వం బదియే
ఎందెందు లేదు కనగా
కంధరము వరకవినీతి కనుమా జీవా
ఇది ఏ కవికి అనుకరణో వేరే చెప్పనక్కరలేదు. అవినీతి ఇందుగలదందులేదని చెప్పటానికి వీల్లేదు.
మన భాష- మన సంస్కృతి
ఏ ప్రాంత సంస్కృతైనా వృద్ధి నొంది విలసిల్లటానికి అక్కడ ప్రజలు మాట్లాడే భాష ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆ భాషలో ఉన్న మాధుర్యం, పూవులోని తావి వలె నలుదెసల పరచుకొని ఆ సంస్కృతి వ్యాపించటానికి తోడ్పడుతుంది.
కం. అచ్చతెనుంగు మనదిరా
పచ్చదనమ్మేజిలుగుల పావడ వొప్పన్
మెచ్చని వరలె లేరయ
వెచ్చని భానుని వలెనిది వెల్లులు జిమ్మన్
అని కవి వ్రాసారు. భాష అందమైనది అని చెప్పటానికి జిలుగుల పావడా అని పోల్లారు.
వెలుగులు చిమ్ముతూ కాసింత వెచదనాన్ని ఇస్తుంది అనిచెప్పటానికి భానునితో పోల్చారు. జయహో.
ఉపసంహారం
కవిత్వం ఒక ఉపాసన. శివోపాసన. శివము అంటే శుభం. లోకానికి శుభాలు కలగాలని కోరుతూ అక్కడక్కడా వ్యంగ్యపు జట్కా మీద నడుస్తూ, బుడుగు గురు బోధలో అక్షర దీపాలు వెలిగించిన కలిదిండి వారి కలం ఇటువంటి బుడుగుల కలకలాలను , ఆ రవళులను మరిన్ని పుస్తకాల రూపంలో నింపాలని ఆశిస్తూ, భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ సెలవు.
****

No comments:

Post a Comment

Pages