వంగిన మ్రాను - అచ్చంగా తెలుగు

వంగిన మ్రాను

 పి.వి.ఆర్. గోపీనాథ్.

           
 "ఇప్పుడా?"
          "అవును. ఏం? అయినా నేనేదో బ్యాంకు దోచడం ఎలా అనే పుస్తకం కోసం పోతున్నట్లు మాట్లాడతావేం?!"
హాస్యం, అసహనం కలిస దూకాయి మురళి గొంతులోంచి.
           "సర్లెండి. మన మొహాలకి అన్ని తెలివి తేటలు కూడానా, అయినా ఈ వయసులో అలాంటి పుస్తకం కొంటే... అత్తయ్యగారో, మామయ్య గారో చూస్తే...?"
లక్ష్మి స్వరంలోనూ అదే స్థాయిలో  నవ్వూ, విస్మయమూ.
       "కాదు లక్ష్మీ. పది రోజులేగా గడువుందీ. ఇప్పుడైనా మొదలెట్టకపోతే యెలాగా ? ఢిల్లీలో ఉండిపోయినా బాగుండేది. కర్మ కొద్దీ వచ్చి పడ్డాం కదా ఈ ఆంద్రాలో..."
         "మరే. అప్పుడు తేరగా అత్తారింటికి వచ్చిపోడానికి హోమ్ టౌన కావల్సి వచ్చెనాయె..."
నవ్వుతూనే అంటించింది.
        పక్క హాల్లోనే ఉన్న సుందరం గారు భార్యకు నవ్వుతూ సంజ్ఞ చేసారు అటు చూడమంటూ...
ఆవిడా నవ్వుతూనే నోటిపై వేలు చూపించింది హుష్ అంటూ.
          నేపథ్యం తెలియాలంటే ఓ ఇన్ని దశాబ్దాలు వెక్కు పోవాలి మరి.
*****
           "బాబూ మురళీ ! ఏదీ అ ఆ లు చెప్పు.." సుందరం తండ్రి రామంగారు మనవడిని దగ్గరకు తీసుకుని లాలనగా అడిగారు.
   వెంటనే వాడాయన ఒడిలోంచి దూకేసి "క్యా, వాట్?" అంటూ వెక్కిరించి బయటకు దౌడు తీశాడు. ఆ రాత్రి, మర్నాడు పొద్దునా కూడా సీన్ రిపీట్ కావడంతో ఉండబట్టలేక "ఏంట్రా ఇదీ. అ ఆ లంటే అలా పారిపోతాడేం" అంటూ. ఆరా తీశాడాయన.
    "ఏం చేయమంటారు నాన్నా? ఇక్కడంతా మరాఠీ, ఇంగ్లీషువారే కదా. కాదంటే హిందీయే. కాన్వెంటులో కూడా  తెలుగు చెప్పే వారు లేకపోవడంతో హిందీయే సకండ్ లాంగ్వేజిగా తీసుకోక తప్పలేదు మరి."
    "మరి. మీరేం చేస్తున్నార్రా?. ఇంట్లో దిద్దించవచ్చుగా". తనూ కల్పించుకుని అడిగింది సూర్యకాంతమ్మ గారు.
ఇహ తప్పదన్నట్లు రాధ  తనూ చర్చలో జొరబడి  "ఎక్కడ అత్తయ్యా. మీరూ చూస్తున్నారుగా. మేం కొంప చేరేసరికే ఏడున్నర దాటుతుందాయె. వాడికి నీళ్ళోసి  అన్నంతినిపించే లోగానే నిద్ర వచ్చేస్తుంది. తిరిగి ఉదయం లేస్తూనే హడావుడి. ఉన్నది ఒక్క నలుసే అన్న మాటేగానీ వాణ్ణి తయారు చేసేసరికి..."
ఇక వినలేనట్లు
          "శనాదివారాలేం చేస్తారే ?!" ఇంకా ఏదో అనబోతుండ రామంగారే కల్పించుకున్నారు
   "నువ్వూరుకో సూర్యం. అసలు వీళ్ళకే ఇష్టం లేనట్లుంది. ఏం చేస్తాం. ప్చ్. "
అప్పటికి తేల్చేసినట్లుగా చర్చ నిలుపు చేయించారాయన.
   కానీ అంతటితో వదల దలుచుకుంటే ఆయన రామంగారెందుకవుతాడు. రెండు రోజులైనా గడిచాయో లేదో శనివారం పొద్దున్నే టిఫిన్ కానిచ్చి తన పెట్టెలో దాచుకున్న పెద్ద బాల శిక్షను బైటకు తీశాడు. అది చూసి కొడుకూ, కొడలితోపాటు భార్య కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకోడం చూసి మరింత రోషం తెచ్చుకున్నా అప్పటికి వారినేమీ అనలేదు.
మధ్యాహ్నం భోజనాలైనాక తన పక్కలో చేరి తాతయ్యా స్టోరీ చెప్పవా అన్న మురళిని దగ్గరకు తీసుకుని
"అనగానగా ఓ కాకీ, దానికి దాహం వేసిందీ... "అంటూ మొదలెట్టాడు. కానీ, వాడు వెంటనే "ఇది కాదూ మంకీ క్రోకోడైల్ స్టోరీ..." అంటూ పేచీ పెట్టాడు. ముందు ఇదీ, తర్వాత  అదీ అనడంతో పెద్దాయనతో పేచీ దేనికన్నట్లు బుద్ధిగా తలూపాడు. కానీ కాకి దాహం తీరకుండానే వాడికి నిద్ర ముంచుకు వచ్చేసింది.
ఆ కథల తర్వాతైనా వాడికి తెలుగు  చెప్పాలనుకున్న రామంగారి ఎత్తు బెడిసికొట్టింది. ఆయనా ఉసూరుమంటూ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఆదివారం పిక్నిక్ వెళ్ళి వచ్చేసరికే రాత్రయింది.  సోమవారం నుంచి షరామామూలు.
ఇలా ఓ రెండు, మూడు సార్లు జరగడంతో ఇహ లాభం లేదనుకుని...
  "ఇలా అయితే ఎలాగరా. మీరైనా ఎటు రాక తప్పదుగా. అయినా మన భాషను మనం నేర్చుకోకపోతే ఎట్లా.."
అంటూ కొడుక్కీ, కోడలికీ కూడా నచ్చజెప్పబోయారు.
నిజమేనండీ. ఏం చేయమంటారూ. చూస్తున్నారుగా. పోనీ, మీరూ ఇంకో వారం ఉంటారుగా ట్రై చేయండి అన్నారు వారు మనసులో అదయ్యే పని కాదనుకుంటూనే...
 కానీ, ఆ మరునాడే సూర్యకాంతమ్మ గారికి సుస్తీ చేసింది. దాంతో వీరు ఇంకో వారం ఉండాల్సి వచ్చినప్పటికీ రామంగారి కోరిక మాత్రం తీరనే లేదు.
*****
క్యాలెండరు కాగితాలు ఒకటొకటిగా చిరిగిపోతూ మురళిని అక్కడి భాషలో ఫిఫ్త్ స్టాండర్డులో చేర్చాయి. ఏదో బంధువులతో ఫోన్లో అరకొరగా మాట్లాడడం తప్పితే తెలుగనేది వారి దరి చేరనేలేకపోయింది. తమ వైపు వచ్చినప్పుడల్లా మనవడిని తనవైపు తిప్పుకోవాలని చూసిన ఆ తాత కోరికైతే తీరలేదుగానీ భగవంతుడాయనకు పెట్టిన గడివు తీరిపోయింది.ఆ వెనకే సూర్యకాంతమ్మ గారూనూ..
ఆ పదిరోజులూ అక్కడ చేరిన బంధు మిత్రులు ఇదే విషయమై సుందరం దంపతులను కొంత హెచ్చరించారు కూడా. అప్పుడే వారిలో కాస్త చలనం కదిలింది.
తిరిగి పుణె చేరాక వారూ కాస్త సీరియసుగానే ప్రయత్నించారు కొడుక్కి తెలుగు కూడా అలవాటు చేయాలని. కానీ వినలే. నో, బోర్, అనీ,కాస్త ఎదిగాక కష్టం అంటూ ఠలాయించాడు. తాతగారి కోరికైనా తీర్చరా అన్నా లక్ష్యపెట్టలేదు. చివరకు విసుగు పుట్టి కొంతా,
"పిల్లలను వారి ఇష్టప్రకారమే చదివించాలి" అన్న సూక్తికి తమకు తోచిన భాష్యం చెప్పుకునే తరం కావడం వల్ల కొంతా వీరూ వాడి ఖర్మ అనుకుని వదిలేశారు.
ఆనాడే తాతగారు నేర్పిన “ ఆ.వె. ఆధరువును బెట్టు నన్య భాషే యైన
అమ్మ భాషకన్న నధికమేది?
మాతృభాష మరువ మానవతకె మచ్చ
పంక్తి వరుని రాత ప్రగతి గీత”!! పద్యాన్నే వంటబట్టించుకుని ఉండుంటే...ప్చ్ !
  సెంట్రల్ సర్వీసులో ఉన్న సుందరంగారికి ఢిల్లీ బదిలీ అయింది. రాధమ్మకూ అక్కడే ఓ పెద్ద కాన్వెంటులోనే కొలువు దొరికింది. మురళికీ మంచి మార్కులూ, ర్యాంకులే గనుక అక్కడా త్వరగానే సీట్ దొరికింది.
దరిమిలా మెరిట్ స్టూడెంటు గనుక. మురళి ఐఏఎస్ చదివి అక్కడే సెంట్రల్ సర్వీసులో చేరాడు.  అదృష్టవశాత్తూ అక్కడే బ్యాంకు ఉద్యోగిని ఐన లక్ష్మితో వివాహమయింది. వివాహం నాటికి వియ్యాలవారందరూ ఢిల్లీలోనే ఉంటుడడం వల్ల తెలుగు తెలుగూ అనుకుంటూ కలిసిపోయారు.
క్రమేపీ పెద్దలు నలుగురూ రిటైరైనారు. లక్ష్మి తల్లిదండ్రులు రాజమండ్రికీ,సుందరం దంపతులు విజయవాడకూ చేరుకున్నారు. తరచుగా అటు వెళ్లాల్స ఉంటుంది గనుక అంత దూరం ప్రయాణ ఖర్చులూ, సెలవూ కూడా కలసి రావడం కోసం ఇద్దరూ తమ హోమ్ టౌన్ గా విజయవాడ, రాజమంమడ్రి నగరాలనే ఎంచుకున్నారు. మాతృభాషగా తెలుగు ఎలానూ తప్పదు.
******
కాలం ఎప్పుడూ మన చేతులలో ఉండదు. ఏవేవో షరతులతో వారు అడిగినదానికల్లా ఔనని ఆంధ్రా, హైదరాబాద్ రాష్ట్రాలను నెహ్రూ కలిపితే,  ఆ తర్వాత తలెత్తిన ముల్కీ, జై ఆంధ్ర ఉద్యమాలను ఆయన కుమార్తె వమ్ము చేసింది. కానీ  తర్వాత తలెత్తిన తెలంగాణం ఏర్పాటు గాక తప్పలేదు.
అయితే, అప్పటి వరకూ కలసి ఉన్న ఉద్యోగులను అటూ ఇటూ పంచడం ఎలాగో సాద్యం కాలేదు. తాను పుట్టేనాటికి భద్రాచలం ఆంధ్రాదే అయినప్పటికీ ఈ నాలుగేళ్ళ కోసం తాను తెలంగాణా వదిలేదని ఖమ్మం కలెక్టర్ భీష్మించుకున్నాడు. దాంతో తప్పనిసరై అంతే సర్వీసున్న మురళిని ఏలూరు పంపాల్సి వచ్చింది.
******
అదీ సమస్య. లక్ష్మిది లెక్చరర్ పోస్టు గనుక ఎక్కడో చోట చేరి నెట్టుకు రావచ్చు. కానీ కలెక్టర్ అన్నాక తప్పని సరిగా నిత్యం ప్రజలతోనూ, స్థానిక సిబ్బందితోనూ మెలగాల్సి ఉంటుంది కదా.. పది రోజుల్లపోనే చార్జి తీసుకోవాల్సి ఉంటుంది.
“హుఁ. చిన్నప్పుడు నాన్న అంత మొత్తుకున్నా వినలేదు. ప్చ్. అనుభవించాల్సిందే మరి.” లోలోన విసుక్కుంటున్న భర్తను చూసి నవ్వలేక చున్నీ నోట్లో కుక్కుకుంది లక్ష్మి.
అటు సుందరం దంపతులు కూడా రోజులతోపాటూ సామెతలూ తిరగబడుతున్నాయల్లే ఉందే అనుకుంటూ......
*****

No comments:

Post a Comment

Pages