‘గోపికమ్మా, చాలునులేమ్మా నీ నిదురా!’ - అచ్చంగా తెలుగు

‘గోపికమ్మా, చాలునులేమ్మా నీ నిదురా!’

Share This

గోపికమ్మా, చాలునులేమ్మా నీ నిదురా!’

నండూరి సుందరీ నాగమణి


అట్టహాసంగా సునంద ఇచ్చిన బర్త్ డే లంచ్ ముగిసింది. ఆ ఐదుగురు అమ్మాయిలూ కబుర్లు చెప్పుకుంటూ ఏవేవో పదార్థాలు తెప్పించుకుని తిన్నారు. వాళ్ళు తిన్నదానికన్నా, రుచి చూసి వదిలేసినవే ఎక్కువ...
“థాంక్ యు నందా... చాలా బాగుంది నువ్విచ్చిన ట్రీట్... నువ్వెప్పుడూ ఇలాగే నీ పుట్టినరోజు ఎంతో వైభవంగా చేసుకుంటూ, మాకిలా ట్రీట్ లు ఇస్తూ ఉండాలని నా కోరిక!” నవ్వింది మాలిని.
“అవును... ఒన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే టూ యూ... అందమైన చెలి ఇచ్చిన విందు అద్భుతం...” చెప్పింది మరో స్నేహితురాలు మోహిని.
“ఐస్ క్రీమ్ చాలా బావుంది...నీ మనసులాగే చల్లగా... థాంక్ యు సునందా...” టిష్యూతో పెదవులు అద్దుకుంటూ చెప్పింది డాలీ.  ఆనందంగా కళ్ళెగరేసింది చంచల. గర్వంగా తన చెలుల వైపు చూసింది సునంద.
బంగారు చెంచా నోట్లో పెట్టుకు పుట్టిన సునందకు చదువు ఓ టైం పాస్ కార్యకలాపం మాత్రమే. ఫాషన్ పెరేడ్ కి వెళ్లినట్టు రోజుకో కొత్త డ్రెస్ తో, అధునాతనంగా అలంకరించుకొని కాలేజీకి వెళ్ళటం, తనను పొగిడే ఓ గాంగ్ ని మైంటైన్ చేయటం ఇదే ఆమె దైనందిన కార్యక్రమం. స్నేహం కూడా ఒక స్థాయి వారితోనే... పేద వారన్నా, మధ్యతరగతి వాళ్ళన్నా చిరాకు. వీళ్ళ గుంపు ఏ క్లాసూ పూర్తిగా అటెండ్ అవరు. ఆమె సోకాల్డ్ స్నేహితులు  ఎప్పుడూ ఆమె కారులో పడి సినిమాలకో, షికార్లకో తిరుగుతూ ఉంటారు.
“మేడమ్, మీ బిల్...” తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు వెయిటర్.
ఉల్లాసంగా మిత్ర బృందం వైపు చూస్తూ బాగ్ లోంచి మూడు వెయ్యి నోట్లు తీసి బిల్ ఫోల్డర్ లో పెట్టింది సునంద. ఫోల్డర్ తీసుకు వెళ్ళిన వెయిటర్ బూమరాంగ్ లా వెనక్కి తిరిగి వచ్చాడు.
“మేడమ్, ఐదు వందల నోట్లు, వెయ్యి నోట్లు రద్దు అయ్యాయి కదా... వంద నోట్లు ఉంటే ఇవ్వండి... లేకపోతే మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు అయినా సరే...”
షాక్ తిన్నది సునంద. “వాట్? మొన్న ఇక్కడే కదా డిన్నర్ చేసాము? ఆరోజు తీసుకున్నారే?”
“అవునమ్మా, నిన్న రాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది... మీకు తెలియలేదా? టీవీలో అదే కదమ్మా న్యూసు? మేము బయట బోర్డు కూడా పెట్టాము...” తమ తప్పేమీ లేదన్నట్టు చెప్పాడు వెయిటర్.
చేసేది లేక మేనేజర్ దగ్గరకి వెళ్ళింది సునంద.
“చూడండి. నేను బిజినెస్ మేగ్నేట్ పరాత్పరరావు గారి అమ్మాయిని. ఇలా కరెన్సీ నోట్లు రద్దైనట్టు నాకు తెలియదు... నా దగ్గర అన్నీ వెయ్యి నోట్లు మాత్రమే ఉన్నాయి... మీరు దయచేసి తీసుకుంటే...”
“లేదమ్మా, నేనూ ఇక్కడ ఉద్యోగినే, మా యాజమాన్యం ఒప్పుకోదు. గట్టిగా చెప్పారు తీసుకోవద్దని. మీ దగ్గర కార్డ్ లేదా?”
“లేదు, నేను మైంటైన్ చేయను...”
“మరెలా? మీరు బిల్ కట్టి వెళ్ళాలి... ఇంకో ఆప్షన్ లేదు...”
చేసేది లేక మిత్రబృందాన్ని అదే టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఇంటికి ఫోన్లు చేయసాగింది సునంద. తల్లీ, తండ్రీ ఇద్దరి ఫోన్లూ ఎంగేజ్డ్. లాండ్ లైన్ మ్రోగుతోంది కానీ ఎవ్వరూ తీయటం లేదు...
“ఏమైందే, మీకెవరికీ తెలియదా ఈ విషయం?” కోపంగా అడిగింది సునంద.
“మాకు తెలుసు... కానీ నీకు తెలియదని మాకు తెలియదు...”  చప్పున చెప్పింది చంచల.
“అయ్యో, మరి ఇప్పుడెలాగ? మీ దగ్గర కాష్ లేదా?”
“ప్చ్...” పెదవి విరుస్తూ బాగ్ లు చెక్ చేసుకున్నారు చంచలా, డాలీ, మోహినీ, మాలినీ... ఐదు వందల చిల్లర మాత్రమే దొరికింది.
“నేనంటే, లేటుగా నిద్ర లేస్తాను కాబట్టి నాకీ విషయం తెలియలేదు. మీరేంటే? విషయం తెలిసుండీ చిల్లర డబ్బు బాగుల్లో పెట్టుకోవాలి కదా...” చిరాకు పడిపోతూ అన్నది సునంద.
“మా ఖర్చులెప్పుడూ నువ్వే పెట్టుకుంటావు కదాని...” నసిగింది మాలిని.
“అవును... నీ కార్లోనే తిరుగుతాం ఎప్పుడూ... మాకు ఖర్చులేముంటాయి చెప్పు... మాకీ వందా, రెండు వందలు చాలు...” చెప్పింది మోహిని.
“ఇప్పుడేం చేయాలి?” డెస్పరేట్ గా తండ్రికి మళ్ళీ ఫోన్ చేసింది సునంద. ఏ మీటింగ్ లో ఉన్నాడో కానీ స్విచాఫ్ అని వస్తోంది ఆయన మొబైల్. తల్లి ఫోన్ కూడా నో రెస్పాన్స్.
అమ్మాయిలందరికీ ఏసీ హాల్లో కూడా చెమటలు పట్టేసాయి...
ఇప్పుడు బిల్ కట్టకపోతే పరిస్థితి ఏమిటి? ఏం చేయాలి? డబ్బు కట్టేవరకూ ఇక్కడినుండి కదిలే పరిస్థితి లేదు. ఎవరు ఆదుకుంటారు? అసలేమిటి ఈ పరిస్థితి? డబ్బుంటే చాలు, ఏమైనా సాధించగలనని గర్వపడే తనకు బుద్ధి చెప్పటానికే దేవుడిలాంటి పరిస్థితి కల్పించాడా? ఆలోచనలో పడింది సునంద.
***
“హాయ్...” అందరినీ విష్ చేసింది వాహిని. లేత నీలం రంగు కాటన్ సల్వార్ కమీజ్ లో సింపుల్ గా ఉన్న వాహిని  - సునంద క్లాస్ మేట్.
“హాయ్...” బలహీనంగా విష్ చేసారు సునంద, ఆమె మిత్రబృందం.
సిన్సియర్ గా ప్రతీరోజూ కాలేజీకి చదువుకోసం మాత్రమే వస్తూ, శ్రద్ధగా చదువుకునే వాహినిలాంటి వాళ్ళంటే సునందకి ఎప్పుడూ చిన్నచూపే. దానికన్నా, ఆమె సింప్లిసిటీ, మధ్యతరగతికి చెందినదన్న భావం ఆమె పట్ల ఎప్పుడూ స్నేహభావాన్ని కలిగించలేదు. పైగా తనంటే ఏదో చులకన భావం కూడా...
“మీ సమస్య గురించి మా నాన్నగారు చెప్పారు...” మేనేజర్ సీట్ లో కూర్చుని ఉన్న తండ్రిని చూపించింది వాహిని.
“ఓ... ఆయన మీ నాన్నగారా? వాహినీ, మేము చిల్లర సమస్యలో ఇరుక్కున్నాము... ఏం చేయాలో తోచటం లేదు...” దిగులుగా చెప్పింది సునంద.
“డోంట్ వర్రీ... నా డెబిట్ కార్డ్ తో మీ బిల్ నేను కడతాను...” అంటూ బిల్ ఫోల్డర్ లో కార్డ్ పెట్టి వెయిటర్ ని పిలిచింది వాహిని. ఆమె చేతిలో మూడు వెయ్యి నోట్లు ఉంచింది సునంద.
“రెండువేల అయిదు వందలు అయింది మీ బిల్... ఇదిగో ఐదు వందల చిల్లర...” అని వంద నోట్లు ఐదు ఇచ్చింది వాహిని.
“చాలా థాంక్స్ వాహినీ... ఐ... అయామ్ సారీ... నేను నీతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడే దాన్ని కాను...” గిల్టీగా అన్నది సునంద.
“ఇట్స్ ఆల్రైట్ సునందా... మీరిలా సమస్యలో ఉన్నారని చెప్పి మా నాన్నగారు నన్ను నా డెబిట్ కార్డు పట్టుకుని రమ్మని ఫోన్ చేసారు... ఇకనుంచీ మీరు ప్రతీరోజూ ఏం జరుగుతుందో తెలుసుకోండి... ప్రతీరోజూ న్యూస్ పేపర్ చదవండి. మీ భావనా ప్రపంచంలోంచి బయటకు వచ్చి, చదువుమీద దృష్టి పెట్టండి... మనకోసం లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు మన తల్లిదండ్రులు... అది గుర్తుపెట్టుకోవాలి మనం... సారీ, మీకు తెలియదని కాదు... ఎందుకో చెప్పాలనిపించింది. సరే మరి.. నేను వస్తాను...” లేచింది వాహిని.
“వాహినీ... థాంక్ యు. అంకుల్... మీకు చాలా చాలా థాంక్స్...” రెండు చేతులూ జోడించి మేనేజర్ మాధవరావుకు (వాహిని తండ్రి) నమస్కరించింది సునంద.
“ఫర్వాలేదమ్మా... జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి...” చెప్పాడు మాధవరావు.
“నాన్నగారూ, నేను కూడా బయలుదేరతానండి...” చెప్పింది వాహిని. ఆయన బిల్స్ చూసుకుంటూ తలూపాడు.
బయటికి రాగానే, “ఎలా వెళతావు, నేను డ్రాప్ చేస్తాను...” చెప్పింది సునంద.
“వద్దు, నా స్కూటీ ఉందిలే... ఉంటాను మరి...” అందరికీ చేయి ఊపి, తన వెహికిల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది వాహిని.
“అబ్బా, ఎంత గండం గడిచింది... ఇక మనం కూడా చదువు మీద దృష్టి పెట్టాలి... తప్పదు. బాధ్యతగా ఉండాలి... నా పుట్టినరోజు నాడు కొత్తగా మళ్ళీ పుట్టాను...” తనకు తాను చెప్పుకున్నట్టే తన స్నేహితురాళ్ళతో కూడా చెప్పింది సునంద, తన కారువైపు నడుస్తూ.
 
*****

No comments:

Post a Comment

Pages