ప్రేమతో నీ ఋషి – 22 - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి – 22

యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ కంపెనీ వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో జరగనున్న ఆర్ట్ వేలానికి వారిద్దరూ వెళ్తుండగా,  దారిలో స్నిగ్ధకు ఆర్ట్ మ్యూజియం కోసం వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన  స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో మాట్లాడాలని అతని గదికి వెళ్తుంది. ఇక చదవండి...)
మొదట కొద్ది నిముషాలపాటు మౌనం వారిమధ్య రాజ్యమేలింది. ఋషి సోఫాకు ఒక మూలన కూర్చుంటే, స్నిగ్ధ మరొక వైపున కూర్చుంది. మౌనాన్ని ఛేదించేందుకు ఋషి టీవీ ఆన్ చేసాడు. ఒక మానసిక వైద్యుడు ప్రేక్షకుల ప్రశ్నలకు కౌన్సిలింగ్ ఇస్తూ సమాధానాలు చెబుతున్న కార్యక్రమం ప్రసారమౌతోంది.
“ఋషి, నన్ను క్షమించు,” స్నిగ్ధ నిజాయితీగా తప్పు ఒప్పుకుంటూ అంది. “జరిగిన దానికి నిన్ను క్షమించమని కోరుతున్నాను, ఇదంతా నా తప్పే.” ఆమె దుఃఖంతో నెమ్మదిగా రోదించసాగింది, ఆ దుఃఖం గదంతా వ్యాపించినట్లు ఉంది. ఋషి నెమ్మదిగా వెళ్లి, ఆమె చేతిని పట్టుకున్నాడు.
“స్నిగ్ధ, నువ్వు నా గురించి ఏమి అనుకుని ఉంటావో, నేను అర్ధం చేసుకోగలను. బాధపడకు – స్వార్ధం అనేది స్వచ్చమైన ప్రేమకు కొలమానం వంటిది. కానీ, నేనూ నిజాయితీగా చెప్తున్నాను, నేను అప్సర ఇంటికి విశ్వామిత్ర పెయింటింగ్ కోసమే వెళ్లాను. ఇప్పటికి, నేను చెప్పగలిగింది ఇంతే. ఎందుకంటే, నీ ప్రశ్నలు అన్నింటికీ జవాబు చెప్పే ముందు, నేనింకా కొన్ని నిజాలను నిర్ధారించుకోవాల్సి ఉంది. ఒకవేళ నేను చెబుతున్నది నిజమని నువ్వు నమ్మితే, మున్ముందు నేను చెయ్యబోయే విచారణలన్నింటిలోనూ నాకు నీ సహకారం కావాలి. నాకు నీ తోడు ఎంతో అవసరం.”
“ఋషి, ఈ అంశాన్ని ఆవరించి ఉన్న రహస్యాలను నేను నెమ్మదిగా అర్ధం చేసుకుంటున్నాను, కాని ఆ పోర్ట్రైట్ కు సంబంధించి, ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. కాని, ఇప్పుడు నీ ఉద్దేశం స్పష్టమయ్యింది కనుక, నేను ఆనందంగా ఉన్నాను.”
అలా ఆమె చెబుతూ ఉండగా, అతను నెమ్మదిగా స్నిగ్ధ చేతిని తన చేతిలోకి తీసుకుని, ఆమెను గట్టిగా హత్తుకున్నాడు.  ముఖంపై ఉన్న ఆమె ముంగురులను ఆమె చెవి వెనుకకు సవరిస్తూ అతనామెకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చెయ్యసాగాడు. ఆమె కూడా అతని వెచ్చని కౌగిలిలో సేదదీర్చుకోవాలనుకుంది. ప్రస్తుతం ఆమె మనసులో ఉన్న ఒత్తిడిని తొలగించుకునేందుకు ఆమెకు ఆ మెత్తనైన కౌగిలి ఎంతో అవసరం.
వారలా హత్తుకుంటూ ఉండగా, టీవీలో ఉన్న సైకాలజిస్ట్ ను ఎవరో ఒక ప్రశ్న అడిగారు. –“ముద్దు అనేది క్షమాపణ చెప్పేందుకు ఒక విధానంగా వాడవచ్చా ?”
సైకాలజిస్ట్ ఇలా బదులిచ్చారు – “ప్రతిరోజూ మీరు నిద్రపోయే ముందు ప్రశాంతమైన భావనలతో ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే ఇక్కడ మీరే ముందు క్షమాపణలు చెప్పైనా సరే, మీరు ప్రేమించే వారంతా ప్రశాంతంగా నిద్రపోయేలా శ్రద్ధ తీసుకోవాలి. తర్వాత మీరు ప్రేమించే వారి చేతిని అందుకోవాలి. వారి చేతిని మీ చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కాలి. నెమ్మదిగా వారి ముఖాన్ని చేతిలోకి తీసుకుని, నుదుటిపై ముద్దాడి, “ఐ లవ్ యు” అని చెప్పాలి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వాదనతో రోజు ముగిసే అవకాశం ఎవరూ ఇవ్వకూడదు.”
స్నిగ్ధ అప్పటికే ఆయన సూచనలను పాటిస్తోంది. ఆమె పెదాలు ‘కలర్ఫుల్ ‘ అన్న పదాన్ని ఉచ్చరించగానే, దాని అర్ధం ఋషికి చేరి, అక్కడినుంచి అతను చొరవ తీసుకున్నాడు, స్నిగ్ధ సహకరించింది.
ఋషి స్నిగ్ధ కళ్ళలోకి చూసి, ఆమె జుట్టును క్లిప్ నుంచి తొలగించి, సుతారంగా ఆమె తలను తాకి, తన తలను కూడా అటుప్రక్కకు తిప్పాడు. స్నిగ్ధ కూడా అతనికి అనుకూలంగా తిరిగి, అతని వైపు జరగసాగింది. తర్వాత కొద్ది క్షణాల పాటు వారి శక్తి మొత్తం సేదదీరిన పెదవులపై, మూసిన కళ్లపై, కేంద్రీకరించబడింది. వారి పాదాలు నెమ్మదిగా భూమిని విడవసాగాయి. ఒకరిచేతులు ఒకరిని తడమసాగాయి. వారు ప్రతి క్షణాన్ని నెమ్మదిగా, మృదువుగా ఆస్వాదించసాగారు.
వారిమధ్య యుగాలు క్షణాల్లా కరిగిపోయాయి, మరికాసేపటికి ఒకరినుంచి ఒకరు విడివడి, ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకున్నారు. తృప్తిగా ఋషి నవ్విన నవ్వు, స్నిగ్ధలో అన్ని రకాల సానుకూల సంకేతాల్ని నింపింది. సహాచార్యమనే వరంలో తడిసిన ఇద్దరూ ఒత్తిడి తగ్గి తేలికపడ్డారు. అదొక చక్కటి ముద్దు – అది స్నిగ్ధ తనువులో పులకింతలు రేపింది, కాని ఋషికి అప్పుడే ఆమె పెదవులను వదలాలని అనిపించలేదు.
*****
“లేడీస్ అండ్ జెంటిల్మెన్ ! 10 వ బిజినెస్ స్టార్స్ ఆఫ్ ఇయర్ అవార్డు సెర్మోనీ కి స్వాగతం.” అంది స్టేజి మీదున్న ఆంకర్ ప్రేక్షకులను ఉద్దేశించి.
స్నిగ్ధ, ఋషి కూడా గార్డెన్ హోటల్ లో ఉన్న ప్రేక్షకుల్లో కూర్చున్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ విభాగంలో మహేంద్ర బిజినెస్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకోనున్నాడు. భారతీయ పరిశ్రమలో ఎవరెవరిని ఈ అవార్డులు వరిస్తాయా అన్న ఉత్కంఠత ఆ హాల్ నిండా అలముకుంది. ఆ వేడుకలకు ఆర్ధిక మంత్రి ముఖ్య అతిధిగా బహుమతులు అందించేందుకు వచ్చారు.
ఆర్ధిక మంత్రి ప్రారంభోపన్యాసంతో, మరికొందరి ప్రసంగాలతో కార్యక్రమం మొదలైంది. జాతిని సుసంపన్నం చేసేందుకు బిజినెస్ లీడర్లు చేస్తున్న కృషిని ఆర్ధికమంత్రి అభినందించారు. ఆయన ప్రత్యేకించి, “నిర్వాణ ప్లస్” వంటి బ్రాండ్ లను నిర్మించి, అతి కొద్ది సమయంలోనే దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్ళిన  మహేంద్రను గురించి ప్రస్తావించారు.
మరొక సమయంలోనైతే, స్నిగ్ధ, ఋషి ఆ క్షణాలను అత్యంత ఆరాధనా భావంతో ఆస్వాదించేవారు. కాని, వారి మనసులు ముందు నుంచే విశ్వామిత్ర పెయింటింగ్ తో నిండిపోయి ఉన్నాయి. అయినప్పటికీ, నకిలీ పెయింటింగ్ ను కొన్నందుకు మహేంద్ర స్నిగ్దను తిడతాడని వారు అన్నివిధాలా నిర్ధారించుకున్నారు. విశ్వామిత్ర పెయింటింగ్ విషయంలో జరిగిన విషయాలన్నిటినీ మహేంద్రను కలిసి చెప్పేందుకు ఆమె నిరీక్షిస్తోంది.
ఈ అవార్డుల ప్రదానోత్సవం తర్వాత, మహేంద్ర ఒక హాలిడే ట్రిప్ కోసం 15 రోజుల పాటు USA కు వెళ్లనున్నాడు. అందుకే మరింత ఆలస్యం కాకుండా, ఈ విషయంలో మహేంద్ర సూచనలను వీలైనంత త్వరగా తీసుకోవాలని వారి కోరిక.
“ఈ ఏడాది ‘బిజినెస్ స్టార్ ఆఫ్ ద ఇయర్’ కాటగిరి అవార్డు దక్షిణ భారత సాఫ్ట్వేర్ దిగ్గజం, నిర్వాణ ప్లస్ ఎం.డి & సి.ఇ.ఓ. మిష్టర్ మహేంద్ర దసపల్ల గారికి అందించబడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన మహేంద్ర, పుడుతూనే నాయకులు అవరని, సంకల్పబలంతో, ఉన్నత లక్ష్యాలతో జీవితంలో విజయాన్ని సాధించాలన్న తపనతో రూపొందించబడతారని నిరూపించారు. ఆయన జీవితం మంచి భవిత కోసం విదేశాలకు వెళ్లడం ఒకటే మార్గమని భావించే, భావి భారత పౌరులకు ఒక ఉదాహరణ. తన స్వంత నగరంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పరచి, దగ్గరలోని 50 గ్రామాల్లో ఛారిటబుల్ ట్రస్ట్ లను స్థాపించి, మహేంద్ర తాను సామాజికంగా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించే వాణిజ్యవేత్తగా నిరూపించుకున్నారు. మిష్టర్ మహేంద్ర, ఈ అవార్డును స్వీకరించేందుకు మేము మిమ్మల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. “ అంది ఆంకర్. స్టేజి మీద మహేంద్ర సాధించిన  విజయాలను చాటే ఆడియో విజువల్ క్లిప్ ను బ్యాక్ డ్రాప్ లో వెయ్యసాగారు.
మహేంద్రపై కురిసిన ప్రశంసలను విని, స్నిగ్ధ చాలా ఆనందించింది. ఒకవైపు ఆ సదస్సులో పాల్గొనడం ఆమెకు ఆనందదాయకంగా ఉన్నా, మరొకవైపున ఈ వేడుకలు త్వరగా ముగియాలని ఆమె భగవంతుడిని ప్రార్ధించసాగింది. ఆమెకు వెంటనే మహేంద్రను కలిసి ఆయన డ్రీం ప్రాజెక్ట్ లో దొర్లిన పొరపాటును వివరించాలని ఉంది.
ప్రద్యుమ్న ఆర్ట్ మ్యుజియం ప్రతిష్టకు భంగం కలిగించే ఈ పొరపాటును మహేంద్ర వద్ద ఒప్పుకునేందుకు ఆమెకు అసౌకర్యంగా ఉంది. కాని, ఎవరో న్యూస్ వారు తర్వాత ఈ విషయాన్ని కనుగొని అతనికి చెప్పెముందే, మ్యుజియం తెరవక ముందుగా తామే చెప్పడం మంచిదన్న తలపు ఆమెకు కాస్త ఊరట కలిగిస్తోంది.
మహేంద్ర ఆర్ధిక మంత్రి నుంచి అవార్డు తీసుకుని, తన ఉద్వేగాలను పంచుకునేందుకు పోడియం వైపు వెళ్ళాడు. “ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ సందర్భంగా నేను మన గౌరవ ఆర్ధిక మంత్రిగారికి,  నిర్వాహకులకు, నా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. కాని, నిజం చెప్పాలంటే, టీం నిర్వాణ ప్లస్ లో ఉన్న 40,000 మంది ఉద్యోగులు ఈ దేశానికి సేవలు అందించేందుకు నాతో నిలబడ్డారు. నేను ఈ అవార్డును నా టీం మెంబెర్స్ అందరికీ అంకితం చేస్తున్నాను, వారి సహకారం లేకుండా, ఇది సాధ్యమయ్యేది కాదు.”
అతను వ్యాపారవేత్తగా తొలిదశలో తన అనుభవాలను, ఎదుర్కున్న ఇబ్బందులను గురించి చెప్పాడు. ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనప్పుడు తన సంస్థ ఆశలు ఒదులుకున్న బలహీన క్షణాల్ని, ఆ సమయంలో అండగా నిలచిన శ్రేయోభిలాషులను గురించి ఆయన క్లుప్తంగా చెప్పారు. తర్వాత, అంత తక్కువ సమయంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు తమ సంస్థ తీసుకున్న నిర్ణయాల్ని గురించి చెప్పారు. ప్రేక్షకుల్ని ఉద్దేశించి మాట్లాడాకా, అతిధులకు కృతఙ్ఞతలు చెప్పి, మహేంద్ర తన చోటికి వెళ్లి కూర్చున్నారు.
స్నిగ్ధ ఆయనకు ఒక ఎస్.ఎం.ఎస్ పంపింది. – “బాస్, మీరు ఎయిర్పోర్ట్ కు వెళ్లేముందు, నేను ఋషి మీతో కొద్ది నిముషాలు మాట్లాడాలి. కాస్త ప్రమాదకరమైన పరిస్తితి. మాకు మీ సూచనలు కావాలి.” మహేంద్ర వెనక్కు తిరిగి, స్నిగ్ధ వైపు చూసి, ఆమె సందేశం చదివినట్టుగా సైగ చేసి, అంగీకార సూచకంగా తలూపాడు.
“పది నిముషాల్లో ఈ హాల్ ప్రక్కన ఉన్న బోర్డు రూమ్ కు రండి.” అని వెంటనే బదులిచ్చాడు. ప్రేక్షకులంతా తమ పరిచయాలు పెంచుకునే పనిలో ఉండగా, ఆర్ధిక మంత్రి మరొక సమావేశానికి బయల్దేరారు. మహేంద్రతో సహా కొంతమంది వ్యాపారవేత్తలు ఆయనను సాగనంపేందుకు కదిలారు.
ఒక జర్నలిస్ట్ హఠాత్తుగా ఆర్ధిక మంత్రిని ఆపి, “సర్, అవినీతి, నల్ల ధనాన్ని నిరోధించే ప్రయత్నాలు ప్రభుత్వం కేవలం మాటల్లోనే చేస్తూ సరిపెడుతున్నట్లు ఉంది. అంతర్జాతీయంగా, ప్రతి దేశం స్విస్ బ్యాంకు నుంచి టాక్స్ ఎగ్గొట్టిన వారి మొత్తాన్ని రాబట్టుకోగలుగుతోంది. కాని, మీ ప్రభుత్వం కనీసం స్విస్ బ్యాంకు వారి సహకారాన్ని కూడా కోరినట్టు లేదు. దీనిపై మీ వ్యాఖ్య ఏమిటి?” అని ప్రశ్నించాడు.
ఆర్ధిక మంత్రి ఒక నిముషం ఆగి, “ స్విస్ ప్రభుత్వానికి ఈ అభ్యర్ధనలు పంపేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అవన్నీ మేము పరిష్కరించామని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. సంబంధిత ప్రభుత్వాలకు, బ్యాంకులకు,  చివరకు వ్యక్తిగతంగా కూడా మేము కొన్ని అభ్యర్ధనలు పంపాము. త్వరలోనే నల్లదనం గురించి విస్తృత సమాచారం రానుంది.” అని చెప్పి, ఆయన అక్కడి నుంచి కదిలారు.
మంత్రిగారు జవాబిచ్చేదాకా వేచి ఉన్న మహేంద్ర, ఆయన వెళ్ళగానే  త్వరగా బోర్డు రూమ్ వైపు కదిలాడు.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages