పైపై దూరక పదరో యింతి - అచ్చంగా తెలుగు

పైపై దూరక పదరో యింతి

Share This

                                     పైపై దూరక పదరో యింతి     

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి  


పైపై దూరక పదరో యింతి
కోపాన బాసైనఁ గొనీఁ గాని     ॥పల్లవి॥
1వ చరణము
 1. పరివారపుఁ బడఁతులేఁటికే
 2. దొరలనంటేరు తోలరో
 3. సరసపు తమ జగడాల నిట్టే
 4. పరుల దూరేరు పచ్చిగనే ॥పైపై॥
2వ చరణము
 1. చక్కని విభుని సారెకుఁ జెలులు
 2. వెక్కసాలాడక విడరో
 3. దిక్కులకెల్లాను తెఱవఁ బాసి తాఁ
 4. నొక్కఁడే విచ్చేయుటొచ్చెమని ॥పైపై॥
3వ చరణము
 1. శ్రీ వేంకటేశుఁడు చెలువుఁ డొక్కఁడే
 2. యేవంకకేఁగిన నేమౌను
 3. భావించి యురముపైనున్న కొమ్మదాఁ
 4. నేవేవి గడించె నెఱుఁగరా ॥పైపై॥(రేకు: 63-1సంపుటము: 5-187)

తాత్పర్యము

అన్నమయ్య ఒక చెలికత్తెగా మారి అలమేలుమంగతో మాట్లాడుతున్నాడు.
 ఓ చక్కనమ్మా ! (ఇంతి)  లోతులేక, సాధారణంగా, తేలికగా, మీఁద మీదగా,  అధికముగా, మిక్కిలిగా పైపై మాటలతో (పై పై)  స్వామి వారిని నిందించకు(దూరక) ఇక చాల్లే. పద.
కోపంతో   నువ్వు మాట్లాడే  భాషను  ఆ మహానుభావుడు  స్వీకరిస్తాడా తల్లీ ! (స్వీకరించడని భావం)
1వ చరణము
 1. నీ పక్కన ఆ వేచియుండే స్త్రీలు ఎందుకే?
 2. స్వామిని కలవటానికి (దొరలన్) నిన్ను  అంటుకొని ఉంటారు.పంపించవే !
 3. ఇదుగో నువ్వు మెదలుపెట్టావని వాళ్ళు కూడా సరసత్వంతో కూడిన తమ తగాదాలతో వెంటనే(ఇట్టె)
 4. భగవంతుడయిన ఆ స్వామిని వేంకటేశుని (పరుడు= భగవంతుడు) నిర్లజ్జగా నిందిస్తున్నారు.ఇక ఆపమ్డి.
 2వ చరణము
 1. చక్కనైన స్వామిని మాటి మాటికి చెలికత్తెలు
 2. తిట్టకుండా(వెక్కసాలాడక) విడిచిపెట్టండి.
 3. దిక్కులన్నిటా స్త్రీని విడిచిపెట్టి(తెఱవఁ బాసి)- అంటే అలమేలుమంగమ్మను దిక్కులేకుండా వదిలివేసి
 4. తాను ఒక్కడే వచ్చుట (విచ్చేయుట) అవమానమని(ఒచ్చెమని) తిట్టకుండా విడిచిపెట్టండి
3వ చరణము
 1. శ్రీ వేంకటేశుడనే అందగాడొక్కడే
 2. ఏ దిక్కుకు వెళ్ళినా, ఏ పక్కకి వెళ్లినా ఏమవుతుందే?!
 3. ఆయనగారి వక్షస్థలముపై ఉన్న లక్ష్మి తనకు తానుగా అనుకొని , ఊహించి
 4. ఏవేవి సంపాదించిందో ఎరుగరా?( భృగు మహర్షి విష్ణువక్షస్థలాన్ని తాకటంతో అలిగి వెళ్ళిన లక్ష్మీదేవి పద్మావతీదేవిగా, అలమేలుమంగగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొంది. పూజలందుకొంటోంది)
విశేషాలు
ఈ కీర్తనలో స్వామి వారి నింద పనికిరాదనే సందేశాన్ని రకరకాల పద భంగిమలలో అన్నమయ్య చెప్పాడు.
మన సాహిత్యంలో నిందలు – మన లౌకిక నిందల స్థాయిలోనివి  కావు.
ఉదాహరణకి ఒక అందమయిన  నిందా శ్లోక భావన గమనిద్దాం.
ఇది లక్ష్మీ పార్వతుల సంభాషణ.
లక్ష్మిః              భిక్షార్థీ స క్వ యాత:?” (ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మా!( ఆది భిక్షువు శివుడు అని వ్యంగ్యం)
పార్వతిః           సుతను !బలిమఖే ('బలి చక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరకు)( మీ అయన కూడా బలిదగ్గర భిక్షుకుడు కదా!)
లక్ష్మిః             తాండవం క్వాద్య భద్రే!( మీ ఆయన తాండవం ఈరోజు ఎక్కడ?)( శివుడు దిగంబరుడని వెక్కిరింపు)
పార్వతిః           మన్యే బృందావనాంతే ( బృందావనంలో అనుకుంటున్నాను)( మా అయన ఒంటరిగా చేస్తాడు. మీ ఆయన                      ఆడవాళ్ల గుంపులతో  చేస్తాడు)
లక్ష్మిః             క్వను చ మృగ శిశు: ? ( మీ అబ్బాయి  ఏనుగు మొగంవాడు  వినాయకుడు ఎక్కడ?). ( మాఅ బ్బాయి మన్మథుడు                    అందగాడు. మీ అబ్బాయి ఏనుగు మొగంవాడని వెక్కిరింపు)
పార్వతిః           నైవ జానే వరాహం ' ( ఇక్కడేదో పంది తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడు. ఎక్కడున్నాడో తెలీదు")( మా అబ్బాయి                    వినాయకునిది  ఏనుగు ముఖమే మీ ఆయన పూర్తిగా వరాహావతారము)
లక్ష్మిః             బాలే! కచ్చిన్న దృష్ట :  జరఠ వృషపతి: ?(బాలా !  'మీ వాహనం  ఆ  ముసలి ఎద్దు ఎక్కడా కనబడడంలేదు?)                (మేము ఆకాశంలో తిరిగేవాళ్ళం.   మీరు నేల పై తిరిగే వాళ్ళు. ).
పార్వతి           "గోప ఏవాస్య వేత్తా (ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని కాసేవాణ్ణి అడిగితే తెలుస్తుంది) (మా ఆయన నడిపే                  వాహనాన్ని మీఆయన మేపుతాడు.)
                   లక్ష్మీపార్వతులు  నిజంగా తిట్టుకొన్నారని భావిస్తే అంతకంటె అనౌచిత్యం ఉండదు. ఇది సాహిత్య చమత్కారం.                             అన్నమయ్య కీర్తన కూడా ఇంతే.
          పైపై పదాన్ని  అన్నమయ్య ఈ కీర్తనల్లో కూడా ప్రయోగించాడు.
 1. పట్టిన చలములేలే పైపై నాతనితోడ (7-580),
 2. పదరుదురా యిటు పైపైనే (8-6)
 3. పైపై నిన్నుఁ గొరితే పసురే కాదా (9-190)
 4. పండెఁ దెచ్చుకొనవయ్యా పైపైనె వలపలు(14-73),
 5. పైపైనే వున్నది బత్తి మీయిద్దరికిని (14-160)
 6. బడలివుందాన నేను పైపై నడియాసల(18-324)
 7. పచ్చి సేయకుందునా పైపై నిన్ను(21-437)
 8. పచ్చిగాఁ గానఁగరాదా పైపై ప్రియాలు తన్ను(22-26)
 9. పట్టకువే చలమింత పైపై నీవు(26-142)
 స్వస్తి.

No comments:

Post a Comment

Pages