విచిత్ర ప్రణయం - అచ్చంగా తెలుగు

విచిత్ర ప్రణయం

పి.వి.ఆర్. గోపీనాథ్


“హల్లో ... "హెచ్..ఎఫ్.ఎస్.డి."...”
సెల్లు పిలుపు వింటూనే ఉలిక్కిపడి లేచి ఆన్ చేయగానే వచ్చిన పలకరింపుతో ఉలిక్కి పడింది రాధ. టైము చూస్తే తెల్లవారుతోంది. తేదీ ఆగస్టు పదకొండు. వెంటనే సిగ్గు ముంచుకు వస్తాననడంతో దాన్ని కాసేపాగమని, నెమ్మదిగా
“ఐ కే యూ వదినా” అనేసింది అంతే అల్లరిగా...
“ఏయ్. నాకెందుకూ అదేదో మా తమ్ముడికే ఇవ్వూ”
(మొదటిది హేపీ ఫస్ట్ సైట్ డే కాగా, జవాబు ఐ కిస్ యూ అనుకోవాలి)
గుసగుసలు, నవ్వులతో నిద్రాభంగమైనట్లు బద్ధకంగా కదిలిన రామకృష్ణ ‘’పొద్దున్నేఏమిటీ?” అనబోగా “హుష్” అంటూ
అంటూ సెల్లుచెవి దగ్గర పెట్టబోయి మనసు మార్చుకుని లేచి టీవీ ఆన్ చేసింది.
మరుక్షణం చెవులు చిల్లులు పడేట్లు యాంకరమ్మగారి భీకరమైన గొంతు....
“రా...కృష్ణమ్మ పిలుస్తోంది కదలిరా....”
అదిరిపడి ఏదో గుర్తొచ్చినట్లు తెరకిందే ఉన్న తారీకు చూశాడు.
వెంటనే బల్బు వెలిగినట్లయి ఇటు తిరిగి “అంటే ఆ కాల్...?”
మరే. అనేసి మంచం దిగబోగా అతను చున్నీ పట్టుకు లాగబోయాడు. అంతలోనే పిల్లలు కదలడంతో నిట్టూర్చడం చూసి తనూ కొంచెం చిరు అసంతృప్తితోనే లేచి టీవి కట్టేసింది.
టివి కట్టేసిందే గానీ, వెనక్కుపోయే మనసును ఆపలేకపోయింది.
సరిగ్గా పుష్కరం కిందట, కాదు అంతకు ఓ ఏడాది ముందుగానే...
*****
గోదావరి పుష్కరాలు. శని, ఆదివారాలు కూడా కలసి రావడంతో ఇంకో రెండు రోజులు దొరకపుచ్చుకుని మరీ హాస్టల్లోంచి బయటపడింది రాధ. తీరా బస్టాండ్ చేరేసరికి సీట్లన్నీ ఫుల్. ఈ ఒక్కసారీ సరదాగా కిటికీ దగ్గరే కూచుని రాత్రి వెన్నెల్లోనూ, ఆపైన సుప్రభాతంలోనూ కదిలే ప్రకృతిని కనులారా చూడాలనుకుంటే...ప్చ్!
(కొందరిలా తనకూ ప్రయాణాలలో తప్పనిసరైనపుడు కనులు మూసుకోవడం తప్పితే రాత్రయినా సరే నిద్ర పట్టదు. మరి)
హైదరాబాద్ నుంచి రాజమండ్రివరకూ మాటలు కాదు గనుక స్టాండింగ్ పేసింజర్స్ నో అంటున్న సిబ్బందిని బతిమిలాడగా ఆడగా చివరకు అదనపు ఆదాయం వదులుకోలేక సరే అన్నారు. వారడిగినంతా ఇచ్చి మరీ బస్సెక్కింది. సరదా, సర్దుబాటు తత్వమే ఇప్పుడీ కథను ముందుకు నడిపింది.
తనొక్కతే నిలబడటంతో అతనెవరో పాపం లేచి తనకు సీట్ ఆఫర్ చేసేడు. ముందు వద్దనుకున్నా, అలాగే అన్నా తీరా అతని మన్ననా, తన అవసరమూ ముందుకు తోసేయి. ఇప్పుడు అతనొక్కడే...దాంతో సీన్ రివర్సు. పాపం అతను సర్దుకుని కూర్చున్న తీరు...పక్కనే ఉన్న కడ్డీవైపు వాలిపోయినా, కుదుపులకు పడుతున్న అవస్థ...
******
రాజమండ్రిలో బస్సు దిగగానే ఎన్ని కుర్ర ఆటోలు ముసిరాయో. బస్సు అనుభవం కళ్ళ ముందు కదలాడగా వీరందరినీ ఎలాగో వదిలించుకుని మూలన నిర్వేదంగా కూర్చున్న నడి వయసు రిక్షాను పిలిచి ఇల్లు చేరింది.
వాకిట్లో ముగ్గు వేస్తున్న వదిన సుజాత మరదలిని చూస్తూనే విస్తుబోయి ఆపైన ఆనందం పట్టలేక ఓ కేక పెట్టింది. వింటూనే ఇంటిల్లిపాదీ నిద్ర లేచీ లేవకా బిలబిలా వచ్చేసేరు.అవును మరి. ఎప్పుడూ నెల రోజులు ముందుగానే నోటీసిచ్చి దరిమిలా వారం ముందు నుంచీ వదిన గారికి బస్సు టైము గుర్తు చేసే ‘పాపాయి(ఇంట్లో అలాగే పిలుస్తారు మరి)’ ఇప్పుడిలా హఠాత్తుగా...
మధ్యాహ్నం పెద్దవాళ్ళంతా నిద్రలోకి జారుకున్నాక వదినా మరదళ్ళిద్దరూ పెరట్లోకి జారుకున్నారు.
“ఆఁ. ఇప్పుడు చెప్పు విశేషాలు.”వదినగారి ఇంటర్వ్యూ మొదలు.
”ఏవున్నాయ్. పుష్కరాలు కదా, సెలవులూ కలసి వచ్చాయి. సరదాగా మీతో కలసి స్నానం చేద్దామనీ...”
“సర్లే. ఆ మాట రాగానే చెప్పావు గానీ, ప్రయాణం కబుర్లు చెప్దూ, లేక నా దగ్గరా దాపరికమేదన్నా...”?
ఆషాఢం కావడంతో పూర్తిగా పోని గ్రీష్మాన్ని పైన సూర్యుడు గుర్తు చేస్తున్నా, పైనున్న మైల్లెలూ,, జాజీ, చుట్టూ ఉన్న జామీ, వేప ఇత్యాదులన్నీ చేరి తాపం పోగొడుతూ ఇంత పరిమళం కూడా సరఫరా చేస్తున్నాయి.
వదినగారి దబాయింపులకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తోచక తనలో తనే నవ్వుకుంటున్న మరదలిని చూసి విస్తుబోయింది సుజాత.
“ఆ నవ్వులేవో మాకూ పంచవచ్చుగా” అంటూ మేలమాడింది.
******
హమ్మయ్య అనుకున్నాడు రామకృష్ణ. అలా అనుకోవడం మూడోసారో, నాలుగోసారో. సీటు ముందే రిజర్వు చేసుకున్నప్పటికీ ఆఫీసులోంచి బయటపడేసరికే లేటైపోయంది. దాంతో హడావుడిగా బస్టాండుకు వచ్చేశాడు. తాను పాయింటుకు చేరే సమయానికే బస్సు చివరి హారన్ మోగడంతో చేతిలో ఉన్న పూరీ ప్యాకెట్ ఆశగా చూస్తున్న ఓ కుర్రాడి చేతిలో పడేసి మజ్జిగ ప్యాకెట్ తోనే బస్సెక్కాడు. తను ఎక్కగానే బయల్దేరడంతో హమ్మయ్య అనుకున్నాడు. ఇంకోసారి అనుకుందామనుకునే లోగానే తిరిగి బ్రేకు పడటంతో అందరితో పాటూ తనూ ఆందోళనగా చూసేడు. కానీ సంగతి తెలిసి ఊపిరి పీల్చుకున్నాడు.
ఆమె ఒక్కతే నిలబడటం చూసి తన స్వభావానికి అనుగుణంగానే లేచి సీటిచ్చాడు. తర్వాత ఆమె మాట కాదనలేక తనూ పక్కనే సర్దుకుని కూర్చున్నాడు. కబుర్ల వరకేగానీ కాస్తో కూస్తో సంస్కారం ఉన్న వారికి అలా బొత్తిగా పరిచయంలేని యువతి పక్కన కూర్చుని ప్రయాణం చేయవలసిరావడం నిజంగా అవస్థే. కుదుపులలో శరీరాలు తగులుతున్నప్పటికీ చిన్నపుడు చదువుకున్న శతకాలూ, నేర్చిన సంస్కారమే అతని పరువు నిలబెట్టాయి మరి. ఏలూరు వచ్చీ రాగనే ఎవరో తరుముకు వస్తున్నట్లు గభాల్న దూకేసిన తీరు మరోసారి గుర్తు వచ్చి...
అంతా విని నవ్వబోయింది సుజాత. కానీ మరదలు నొచ్చుకుంటుందని
“అవును మరి. అదే చిన్నతనం నుంచి నేర్చిన సంస్కారం. ఇంట్లో పెద్దలు ఉండాలనేది అందుకే కదా ”
“నిజమే వదినా. నువ్వంటుంటే గుర్తొచ్చింది చిన్నప్పుడు తాతయ్య చెప్పే పద్యం”
“ఆ.వె. పెద్దలున్న యింట పెడ బుద్ధులుండవు
తీర్చి దిద్దగలరు తీరుగాను !
తాతలైన, బామ్మ, తల్లి తల్లియునైన
పంక్తి వరుని రాత ప్రగతి గీత!!”
“అన్నట్లు పంక్తి వరుడు అంటే ఏమిటో”
“అవును చెప్మా?” వెక్కిరించింది సుజాత.
“ఏయ్ ఏంటా వెటకారం. తెలిస్తే చెప్పాలిగానీ...”
“లేకపోతే? పుస్తకాలు బట్టీ పట్టేది నువ్వూ, అడిగేది నన్నా?”
“సరే. నేనే చెప్తాలే తల్లీ. పంక్తి అంటే అంటే వరుస....”
“నీ తలకాయ్. పంక్తికి ఉన్న ఇంకో అర్థం భూమి.”
“వామ్మో. తెలిసే ఆడిస్తున్నావా.... సరే పూర్తిగా చెప్పయితే”
“తప్పుతుందా... వరుడు అంటే అల్లుడు లేదా భర్త. వెరసి పంక్తి వరుడు అంటే రాముడో, కృష్ణుడో....
అన్నట్లూ నీ హీరో పేరేమిటో...”
అప్పటిగ్గానీ బల్బు వెలగలేదు రాధకు. వివరాలేమీ మార్చుకోనందుకు మనసు కొద్దిగా మూలిగినట్లనిపించిదిం. వెంటనే తమాయించుకుని ఎదురు దాడికి దిగింది.
“నాకేం పని లేదా...అందరి ఊరూ పేరూ అడుగుతూ కూచోడానికీ” అంటూ... ఎంత సంప్రదాయం అనుకున్నా ఇలాంటివారూ ఉంటారా ఈ తరంలో అనుకుంటూ సుజాత మరోసారి విస్తుబోయినా వారిని మనసులోన అభినందించింది.
*****
కాలం కదిలింది. కృష్ణా పుష్కరాలు వచ్చేశాయి.అవి అలా మొదలైనాయో లేదో వాటితో సంబంధంలేని విశాఖ నుంచి పిలుపు. అర్జంటుగా ఓసారి వచ్చి వెళ్ళాలని. ఈసారీ హడావుడి ప్రయాణాలే. రాధ, కృష్ణులిద్దరిలోనూ ఏదో ఆందోళనా, ఉద్వేగమూ. అనుకున్నట్లే తిరిగీ ఇద్దరిదీ ఒకే బస్సు. రిజర్వు కాకపోవడంతో అందిన స్లీపర్ ఎక్కేశారు. ఆ చివర ఒకరూ, ఈ చివర వొహరూ. ఎక్కే సమయంలో కళ్ళు కలిసినా ఏదో బెరుకు మాట్లాడుకోనీలేదు. ఆ తర్వాత ఆ చాన్సే రాలేదు.
అంతకు మునుపే ఏలూరు, రాజమండ్రి నగరాలలో పనిచేసే వారి తండ్రులకు దాదాపు ఒకేసారి బదలీ కావడంతో రెండు కుటుంబాలు విశాఖ చేరాయి. ఒకే కాలనీలో ఇళ్ళూ దొరికాయి. క్రమేపీ ఆ పెద్దల మద్య పరిచయం స్నేహంగా మారడంతో ఇప్పుడిలా పిల్లలకు పిలుపులువెళ్ళాయన్నమాట.
పెళ్ళి చూపుల్లో ఆ ఇద్దరినీ పరిశీలించిన సుజాత ఎవరూ చూడకుండా కళ్ళతోనే రాధను కదిలించి తనకు కావలసిన సమాచారం రాబట్టుకుని జవాబుగా నవ్వింది.
“అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా బాబూ?” అన్న రాధ తండ్రితో అతనేదో అనే లోగానే సుజాతే కల్పించుకుని
“అబ్బే.అంత సీను లేదు లెండి మామయ్యా” అనేసింది. అందరూ విస్తుబోయి చూస్తుండగా రాధ చురుక్కున వదిన మోచేతిని గిల్లింది. తానేదో అనబోయిన కృష్ణ కంట్లో ఇది పడనే పడింది. అర్థమైనట్లు అతను మరి పెదవి కదపలేదు.
“ఏమిటమ్మా నువ్వన్నదీ?” అన్న రామకృష్ణ తండ్రితో
“తర్వాత చెప్తాలెండి బాబయ్య గారూ” అంటూ నవ్వుతూనే దాటవేసింది.
వ్యవధి లేక రాధాకృష్ణులకు ముందుగా ఫొటోలు పంపడమూ వీలుకాలేదు మరి. అన్నీ బాగున్నాయనుకోవడంతో ఆ ఆశ్వీయుజంలోనే ముహూర్తాలూ పెట్టేసుకున్నారు.
*******
“ఏయ్. చక్కిలాలు చాలుగానీ, చాయ్ సంగతి చూడు”
“చక్కిలాలా”
అయోమయంగా చూసింది రాధ.
“మరి ఫ్లాష్ బ్యాక్ సిగ్నల్స్ అవేగా...”
మీదకు వాలబోతున్న భర్తను తను నెట్టేలోగానే
“అమ్మా! బూస్టు” అంటూ వచ్చిన పెద్దవాడిని చూసి తనే తప్పుకున్నాడు.
“ఇంతకూ టికెట్లు కంఫామ్ అయినాయా... లేకపోతే ఈ బొంబాయి నుంచి అక్కడి వరకూ వెయిటింగు కష్టమేమో.” మధ్యాహ్నమే పర్మిషన్ పెట్టి వచ్చిన కృష్ణను అడిగింది రాధ.
ఏటా కాకపోయినా పెళ్ళయిన తర్వాత తొలి పుష్కర సెలవులు కావడం, ఇద్దరి పుట్టిళ్ళూ ఒక్క చోటే కావడంతో సరదాగా పోయిరావాలనుకున్నారు.
“ఏమో. చూడలే. అయినా ఫర్లే. అయినా స్టేషన్కు నేనే ముందుగా వెళతాలే...” కవ్వింపుగా అన్నాడు.
“అలాగే. వీళ్ళిద్దరినీ చెరో భుజంపై ఎక్కించుకునీ...”
“అంటే ... నన్ను...”
“మరంతే. రాముడైనా తన బంటు తర్వాతే అంటారుగా...”
అమ్మా, నాన్నా ఎందుకు నవ్వుతున్నారో తెలీకపోయినా తామూ శృతి కలిపారు పిల్లలు.
* * * * * * * * సమాప్తం * * * * * * * * * * *

No comments:

Post a Comment

Pages