సరిహద్దు ఉగ్రవాదం పై గజల్ - అచ్చంగా తెలుగు

సరిహద్దు ఉగ్రవాదం పై గజల్

Share This

సరిహద్దు ఉగ్రవాదం పై గజల్ 

TVSRK.ఆచార్యులు (రాంకీ)మనసుకున్న మేలి ముసుగు తీసేందుకు వీలుకాదు  
మాముందర కుతంత్రాలు చూపేందుకు వీలుకాదు

ఉగ్గుపాల రంగరించి దేశభక్తి నేర్చినాము 
రగులుతున్న యువతరాన్ని ఆపేందుకు వీలుకాదు

సింహాలకు వేటంటే మక్కువనీ తెలుసుకోర 
భరతజాతి గర్జిస్తే బ్రతికేందుకు వీలుకాదు

పొంచిఉన్న నక్కలెన్నొ ఉండేలుకు కూలుతాయి 
కన్నులెర్ర చేసామా దాగేందుకు వీలుకాదు

ఉగ్రవాద ఉనికినీకు నిలువనీడ నీయదులే 
తలవంచుకు పోకుంటే నిలిచేందుకు వీలుకాదు

స్నేహహస్త మిస్తుంటే కాటునీవు వేస్తావా
ధీటుగానె జవాబిస్తె మొరిగేందుకు వీలుకాదు

శాంతిబాట మాదంటే ఎందుకలా వణుకుతావు 
కపోతమే కత్తిదూస్తె గెలిచేందుకు వీలుకాదు

దాయాదుల పోరులోన ధర్మమెపుడు గెలుస్తుంది 
అహముతోటి మంచితనము అణిచేందుకు వీలుకాదు

రాంకి కూడ సైనికుడే అక్షరాలె ఆయుధాలు 
కలముచాల గట్టిదిలే విరిచేందుకు వీలుకాదు
******

No comments:

Post a Comment

Pages