న్యాయపోరాటం - అచ్చంగా తెలుగు

న్యాయపోరాటం

పెయ్యేటి శ్రీదేవి


ఉదయాన్నే జయలక్ష్మి స్నానం చేసి ఇల్లు, దేవుడి గది శుభ్రం చేసి, పూజ చేసి, రాత్రి కిరాణాకొట్టు నించి తెప్పించిన సరుకుల్లో కొబ్బరికాయ తీసి కోట్టింది. అది కుళ్ళింది. వెంటనే ఆ కొబ్బరికాయ షాపుకి తీసికెళ్ళి, ఇది కుళ్ళింది, ఇంకోటిమ్మంది. షాపువాడు ఇవ్వనన్నాడు. లోపల కుళ్ళిందో, లేదో మాకేం తెలుస్తుంది, కుళ్ళితే మా తప్పా? అని వాదించాడు. ఆ షాపువాడితో గొడవ పడింది. చుట్టూ అందరూ మూగారు. పొద్దున్నే బేరాలు ఆగిపోతున్నాయని, ఆవిడ బాధ పడలేక ఇంకో కొబ్బరికాయ ఇచ్చి పంపాడు. ఇంటికొచ్చి, ' అపరాధం మన్నించు స్వామీ, ఇంకో కొబ్బరికాయ తెచ్చాను.' అంటూ కొబ్బరికాయ కొట్టి, నైవేద్యం పెట్టింది. ప్రతి శనివారం ఆంజనేయస్వామి పూజ చేసి కొబ్బరికాయ కొడుతుంది. ఆ రోజంతా ఉపవాసం వుండి, రాత్రి టిఫిన్ చేస్తుంది. ఏ సరుకు కొన్నా అందులో తేడా వస్తే, వెంటనే షాపుకెళ్ళి గొడవ చేసి, పీక పిండెట్టి వసూలు చేస్తుంది. అందరూ ఆమె నోటిధాటికి జడిసి, "అమ్మా, తల్లీ, నీకో నమస్కారం." అంటూ ఆమె అడిగింది ఇచ్చేస్తారు. జయలక్ష్మి షాపుకొచ్చిందంటే చాలు, అందరూ హడిలిపోతారు. తప్పుతూకం తూచినా, సరుకు సరిగా లేకపోయినా, ఏ పిండి గాని, పప్పులు గాని పుచ్చిపోయి, నిలవ్విచ్చినా గొడవ గొడవ చేసేస్తుంది. "ఏమయ్యా! నేనిచ్చిన డబ్బులో తేడా వుంటోందా? కావాలంటే ఒక రూపాయి ఎక్కువ తీసుకో గాని, ఇల్లా పుచ్చిపోయిన పప్పులు అమ్మకు." అని నిలేసి అడుగుతుంది. ఆమె గొడవకి అందరూ మూగుతారు. వచ్చే బేరాలు కూడా రావని, మంచి సరుకు లేకపోతే లేదని చెప్పేస్తారు. ఆవిడ రాగానే మంచి సరుకు ఇచ్చి వెంటనే పంపేస్తారు. ఇలా ఏ విషయంలో అన్యాయం జరిగినా క్షమించదు, సహించదు.
ఒకసారి టైలరు అమ్మాయి జాకెట్టు సరిగ్గా కుట్టలేదని డబ్బు ఇవ్వలేదు. ముందర సరిపోయిందో లేదో చూస్తానని చెప్పి, చాలకపోతే, జాకెట్టు సరిగ్గా కుట్టలేదని ఆ జాకెట్టు అక్కడే వదిలేసింది. ఇంకెప్పుడిచ్చినా, 'అమ్మా, తల్లీ! నీకు నేను కుట్టలేను పొమ్మంది. అలా టైలరమ్మాయికి విరోధి అయింది జయలక్ష్మి. ఒకసారి కూరల మార్కెట్ కి వెళ్ళి కూరలు తెచ్చింది. కిలో టోమేటోలు కొంది ఊరగాయ చేద్దామని. తీరా బేగ్ లో టోమేటోలు లేవు చూసుకుంటే. టోమేటోలకి డబ్బిచ్చింది. కానీ కూరలతను టోమేటోలు వేయలేదు. మళ్ళీ మార్కెట్ కి వెళ్ళి టోమేటోలు వెయ్యలేదంటూ అతనితో గొడవ పడింది. వాడు వేశానని అడ్డంగా అబధ్ధమాడాడు. పోలీసు రిపోర్టు ఇస్తానంది. జనం మూగారు. ఇంక తప్పించుకోలేక టోమేటోలు ఇచ్చి పంపాడు. ఇలా ఎక్కడన్నా తేడా వస్తే పోతే పోనీ అని ఊరుకోకుండా న్యాయపోరాటానికి దిగుతుంది. కొంతమంది ఆవిడ చేసే పోరాటాన్ని సమర్థిస్తూ నీలా అందరూ వుంటే ఇలాంటి అన్యాయాలు జరగకుండా కొంతయినా అపవచ్చు, కాని అందరూ మనకెందుకులే అని ఊరుకోబట్టే అక్రమార్కుల ఆటలు యధేఛ్ఛగా సాగుతున్నాయి అంటారు. జయలక్ష్మి మార్కెట్ కి వస్తోందంటే కాలు, షాపులవాళ్ళు హడిలిపోతారు. ఆవిడ రాగానే ఆమె అడిగిన సరుకులు ముందర ఆవిడకిచ్చేసి పంపేస్తారు. ఆవిడ ఇల్లు బజారు వెనక వీధిలోనే వుంది. కాబట్టి చీటికి మాటికి నడిచొచ్చి కావల్సిన సరుకులు తెచ్చుకుంటుంది. నెలవారీ సరుకులైతే కిరాణాషాపుకి ఫోను చేసి సరుకుల లిస్టు చెబుతే సరుకులన్నీ లిస్టు రాసి జాగ్రత్తగా ఇంటికి పంపిస్తారు. అసలే ఆవిడంటే చచ్చేంత భయం అందరికీ. న్యాయంగా పోరాడుతుందే గాని ఆవిడ చాలా మంచిది. పెట్టేటప్పుడు పనివాళ్ళకి బాగా పెడుతుంది. దానధర్మాలూ బాగా చేస్తుంది. కానీ ఆవిడ మంచితనం కన్న, ఆమె చేసే న్యాయపోరాటం వల్లే, ఆమెకి గయ్యాళి అన్న పేరు స్థిరపడిపోయింది.
ఆవిడ పెట్టే న్యాయపరమైన ఆంక్షలకి పనిమనుషులు కూడా ఎక్కువ రోజులు చెయ్యరు. రెండురోజులు మించి మానితే నాగాలు కడుతుంది. నిర్ణయించుకున్న ప్రతిపనీ చెయ్యాల్సిందే. ఏమాత్రం పని చెయ్యకుండా వెళిపోయినా ఊరుకోదు. అక్కడికీ భర్త రఘూరాం చెబుతూనే వుంటాడు. 'ప్రతి చిన్న విషయానికి న్యాయం, ధర్మం అంటూ పోరాటాలు సాగిస్తే ఆఖరికి మనకెవ్వరూ మిగలరు. అవసరమైతే సాయం చేసేవాళ్ళు కూడా వుండరు జయా. మొన్న ఎలక్ట్రీషియన్ వచ్చినప్పుడు ట్యూబ్ లైట్ వెలగడం లేదు, చూడమంటే, డైనింగ్ టేబుల్ కుర్చీ ఎక్కాడని, అది ఎక్కద్దు, నిచ్చెన వుంది, వేసుకోమని చెప్పావుట. అతనికి కోపమొచ్చి, మొన్న ట్యూబ్ పోయింది, రమ్మంటే రానన్నాడు.'
'ఇందులో నేనేం తప్పు అన్నాను? డైనింగ్ టేబుల్ కుర్చీ ఎక్కుతారా? దానికి వాడి కాళ్ళ మట్టి అంతా అంటుకుని, కడిగినా పోలేదు. ఆదివరకేదో పనికొచ్చినప్పుడు, ప్లాస్టిక్ స్టూలెక్కితే అదికాస్తా విరిగిపోయింది. చెక్కస్టూలుంది, నిచ్చెనుంది. అది వేసుకోవచ్చుగా? అవి ఇచ్చేలోగానే వచ్చేసి ధ్వంసం చేసేశాడు. ఒకసారి డైనింగ్ టేబులు ఎక్కేసి బల్బులు పెట్టేస్తున్నాడు. స్క్రూడ్రైవర్లు అవీ నోట్లో పెట్టి,ఆ ఎంగిలివి టేబులు మీద పెట్టాడు. ఇలాంటి అశుభ్రమైన పనులు చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోవాలి? నేనేమీ అన్యాయంగా ఎవరిపట్లా ప్రవర్తించటల్లేదు. ఎవర్నీ చెడుగా పల్లెత్తు మాటా అనటల్లేదు. ఐనా నన్నెందుకు ఆడిపోసుకుంటారు? చూసూచూస్తూ ఇలాంటివి నేను సహించలేను. నేను చెప్పేదాంట్లో అన్యాయమేముందో నాకర్థం కాదు. ఇక కూరల మార్కెట్ కి గాని, సూపర్ మార్కెట్ కిగాని వెళ్తే, వేలు నాలిక్కి అద్ది, ప్లాస్టిక్ కవర్లు తీసి సరుకులు అందులో వేస్తారు. అలా ఎంగిలి చెయ్యద్దంటే కోపం. పైగా ఇందులో తప్పేముందని అడుగుతారు. ఆఖరికి ఆ సరుకులు తీసుకోకుండా వదిలేసి వచ్చేయడం జరుగుతోంది. ఆఖరికి దేవుడికి పువ్వులు కొందామంటే కూడా కవరు ఎంగిలి చేసి తీస్తారు. తినేదేమన్నా ఎంగిలి చేసిస్తే నువ్వు తింటావా? అలా ఏదీ ఎంగిలి చేయకూడదు, నోటితో కవర్లు తియ్యద్దు అంటే, ఒక పిచ్చిదాన్ని చూసినట్లు చూసి, పోమ్మా, పో, నువ్వేం కొనద్దులే పొమ్మంటారు. నన్నో వింతమృగాన్ని చూసినట్లు చూస్తారు. నేనన్నదాంటో తప్పేముందో నాకర్థం కాదు. అన్యాయంగా వాళ్ళనేమీ అనలేదు.'
'ఇక్కడ న్యాయాన్యాయాలతో పనిలేదు జయా. ఇప్పటి దేశకాల పరిస్థితిననుసరించి, ఎన్నో మార్పులొచ్చాయి. కాలానుగుణంగా మనుషుల మనస్తత్వాలూ మారిపోతున్నాయి. మంచి, చెడు తారతమ్యాలు ఇప్పుడెవరికీ అక్కర్లేదు. తెలియదు కూడా. నీకు అంటే అప్పటి పెద్దవాళ్ళు ఏది తప్పో, ఏది మంచో తెలియపర్చారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ఎలా వుండేవో, ఆనాటి మన పెద్దలు చెప్పారు కాబట్టి మనకి తెలుసు. అందుకే ఈనాటి వాళ్ళు ఏ చిన్నతప్పు చేసినా తట్టుకోలేక పోతున్నాం. ఇప్పటి తరం వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. చెప్పినా వినేవాళ్ళెవరు? వింతగా చూస్తారు. ఇప్పుడందరి ఆలోచనావిధానం మారిపోయింది. ఒకప్పుడు చెడు, అన్యాయం అనుకున్నది ఇప్పుడవే మంచిపనులు. వాళ్ళు చెప్పేదే వేదం. నువ్వేం చెప్పినా వాళ్లతలకెక్కదు. నీదే తప్పంటారు. ఆఖరికి నీకూ మనశ్శాంతి వుండదు. అందుకే ఎవరితోనూ వాదనలు పెట్టుకోకు. అప్పటి సినిమాలలో కూడా నీతి, న్యాయం, ధర్మం, మర్యాద, ఆత్మీయతా, ప్రేమానుబంధాలు తెలియజెప్పే కథలు వుండేవి. ఇప్పుడవి లేవు.
ఇక్కడ చుట్టుపక్కల షాపుల్లో, ఇరుగుపొరుగు వాళ్ళు, పనివాళ్ళు నువ్వో గయ్యాళివని, నీతో నెగ్గడం కష్టమని ప్రచారం చేస్తున్నారు తెలుసా? ఈ ప్రచారాలు పనివాళ్ళు, ఇరుగుపొరుగువాళ్ళు మాత్రమే చేస్తారు. రెండురోజుల్నించి పనమ్మాయి ఎందుకు రావటల్లేదో తెలుసా నీకు?'
'ఎందుకుట?'
'నోట్లో వేళ్ళు పెడితే, ఆ ఎంగిలిచేత్తో గిన్నెలు తోమకు, అంటూ చేతులు శుభ్రంగా కడుక్కోమన్నావుట. టిఫిను ప్లేట్లో పెట్టకుండా, ప్లేస్టిక్ కవర్లో పెట్టిచ్చావుట. 'మేమేం అంటరానోళ్ళామా? గిన్నెలు తోమితే పనికొస్తాది గాని, మా చేతికి టిఫిను ఇవ్వకూడదా?' అని అడిగింది. నోట్లో వేళ్ళు పెట్టద్దంటావుట. మట్టికాళ్ళతో లోపలికి రావద్దంటావుట. ఇల్లు సరిగ్గా తుడు అంటావుట. జిడ్డు పోలేదని, పాల అట్టలు పోలేదని తోమిన గిన్నెలే మళ్ళీ మళ్ళీ తోమిస్తావుట. వాళ్ళ పిల్ల సోఫాలో చొంగ కారుస్తూ, బిస్కట్ తింటూ అదంతా సోఫాకవర్లకంటించిందని అవన్నీ తడిపించావుట. బట్టలుతుకుతే, సబ్బు పోలేదు, మళ్ళీ జాడించమంటావుట. 'చేసిన పనే మళ్ళా మళ్ళా చేయిస్తాది ఆ యమ్మ, నాలుగిళ్ళు చేసుకునేదాన్ని, ఒక్కింటికాడే నాలుగు గంటలుంటే, ఇంటికెప్పుడెల్లాల, ఏ అమ్మగారూ నన్నేమనరయ్యా. రాజమ్మా నువ్వు పని బాగా చేస్తావు, నువ్వే కావాలంటారయ్యా. ఆంటీ, సెల్లుపోను చారిజింగు పెట్టమంటే, ప్లగ్గు పని చెయ్యటం లేదంటారు. ఒకపాలి ఊళ్ళో మా యమ్మకి పోను చెయ్యాలా, పోను నెంబరు కలపమంటే, పోను డెడ్డయింది, పని చేయటల్లేదన్నారయ్యా. నీ కాల్మొక్కుతా, ఆ యమ్మింటో నేను చెయ్యలేనయ్యా. నేనే కాదు, ఎవరూ చేయలేనంటున్నారు.'
'పోనీలెండి, అలాంటి పనమ్మాయి లేకపోవడమే మంచిది. పైగా అందరికీ లేనిపోనివి చెప్పి, ఎవర్నీ చెయ్యనివ్వకుండా చేస్తోంది. అంత అశుభ్రమైన పనమ్మాయిని, అబధ్ధాలు చెప్పేదాన్ని ఎక్కడా చూడలేదు. పైగా దొంగబుధ్ధి కూడా వుంది. మంచం మీద పెట్టిన పర్సు కొట్టేసింది. అందులో రెండువందల నోట్లు, మందు చీటీలు వున్నాయి. అడిగితే దొంగతనం అంటగడతావా అంటూ పెద్దగా దెబ్బలాడి, వీధిలో అరుచుకుంటూ పోయింది.'
ఇంతలో అరవక్లాసు చదువుతున్న పదేళ్ళ కూతురు, సౌమ్యని తెలుగులో మాట్లాడినందుకు టీచరు కొట్టిందట. ఏడ్చుకుంటూ వచ్చింది.
'చూడమ్మా, నువ్వు తెలుగులో మాట్లాడు, తెలుగులో మాట్లాడు అంటూ ప్రాణాలు తోడేస్తావు. టీచరు ఎలా కొట్టిందో చూడు.' అంటూ చెయ్యి చూపించింది. చెయ్యంతా బొబ్బలెక్కింది. జయలక్ష్మి చలించిపోయింది. బాధతో వెళ్ళి టీచరుతో పోట్లాటకి దిగింది. 'నీ పిల్లకి చదువు చెప్పను, పొమ్మంది' టీచరు. ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చేస్తే ఎలాగో గొడవ సర్దుబాటు చేసి, ప్రిన్సిపాలు కూడా ఇంగ్లీషులోనే మాట్లాడాలని తీర్పిచ్చింది. రేపు ఉద్యోగాల్లో కూడా ఇంగ్లీషు అవసరం కదమ్మా? పిల్లల భవిష్యత్తు కోసమే కదా, ఇంగ్లీషులో మాట్లాడమంటున్నాం?' అంది.
'మాతృభాష తెలుగులో మాట్లాడడం కూడా నేరం కింద పరిగణించి, పిల్లల్ని కొట్టడం మంచి పనేనా? అమెరికా, ఆస్ట్రేలియాలలో పిల్లలకి తెలుగుబడులు ఏర్పాటు చేసి, మన తెలుగు భాషను చక్కగా నేర్పిస్తున్నారు. ఇక్కడేమో తెలుగులోనే మాట్లాడద్దంటారు!'
'అమ్మా, మీతో వాదించలేను. మీ పిల్లని ఈ స్కూల్లో చదివిస్తే చదివించండి. లేకపోతే టి.సి.ఇచ్చేస్తా. వేరే చోట చదివించుకోండి.' అంది.
ఇంకో చోట కూడా ఇదే సమస్య ఎదురువుతుంది కదా అని నోరు నొక్కుకుని మౌనంగా ఊరుకుంది జయలక్ష్మి.
పక్కింటివాళ్ళ పనమ్మాయి చెత్తంతా జయలక్ష్మి ఇంటిముందు వేస్తుంటే చూసి సహించలేక పోయింది. ఇక్కడ పడెయ్యద్దన్నందుకు ఆ పనమ్మాయి, ఇంటిగలామె పెద్ద గొడవ లేవదీసారు. తనన్న దాంట్లో తప్పేమిటో అర్థం కాలేదు జయలక్ష్మికి. చెత్తబ్బాయి వారం రోజుల్నించీ రావటల్లేదు. వీళ్ళ ఇల్లు చివరగా వున్నందువలన ఆ చెత్తంతా వీళ్ళింటి ఎదురుగా వేసేస్తారు. ఇక దోమలు, ఈగలు అన్నీ వీళ్ళింటి ముందే తచ్చాడతాయి. భయంకరమైన వాసన. చెత్తబ్బాయేమో సరిగ్గా రాడు. వచ్చినా చిన్న డబ్బా తెచ్చి, అందులో చెత్త వంపుకుంటాడు. సగం చెత్త కిందే పడుతుంది. తియ్యమంటే వాడికి కోపం. గట్టిగా దెబ్బలాడతాడు. ఇండియాలో పెద్ద సమస్య చెత్త సమస్యే. ఇది ఒకళ్ళ తప్పనీ అనలేం. ప్రభుత్వాలు చాలా విషయాల్లో కఠినంగా ఏదీ అమలు చెయ్యవు. అన్నీ నోటిమాటలే. ఆ మధ్య ప్లేస్టిక్ కవర్లు వాడద్దన్నారు. కానీ దానికి ప్రత్యామ్నాయం ఇంకోటేదీ చెప్పలేదు. అదీ సరిగ్గా అమలు కాక, మళ్ళీ ప్లేస్టిక్ కవర్లనే వాడుతున్నారు. ఇది సరిగ్గా అమలు చెయ్యకపోగా, దాని ఫలితంగా ఇప్పుడు సూపర్ మార్కెట్లలో కవరుకి రెండు రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వాలే అలా వుంటే ప్రజలింకెలా వుంటారు? యధారాజా తథాప్రజా అన్నట్లుంటారు.
ఆ మధ్య ఆస్ట్రేలియాలో రెండేళ్ళు వున్నారు. రోడ్లమీద ఒక్క చిత్తుకాగితం వుండదు. ఇక్కడిలా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు వుండవు. చెత్త వెయ్యడం కోసం ఇంటింటికి మునిసిపాల్టీ వాళ్ళే చక్రాలున్న రెండు పెద్ద ప్లేస్టిక్ డ్రమ్ములు ఏర్పాటు చేస్తారు. ఒకదాంట్లో కూరగాయతొక్కలు లాంటి తడి చెత్త, రెండవదాంట్లో కాగితాలలాంటి పొడి చెత్త వెయ్యాలి. వారం వారం పెద్ద వేను వస్తుంది. ఆ వేను వచ్చినరోజు ముందరే ఈ చెత్తడబ్బాలు జరుపుకుంటూ వెళ్ళి ఇల్లుగలవారు రోడ్డు మీద పెడతారు. వేను వచ్చి మిషను సాయంతో డబ్బాలలోని చెత్త వేనులో వేసుకుంటుంది. తర్వాత ఆ చెత్తడబ్బాలు ఈడ్చుకుంటూ తెచ్చి ఎవరికి వారు ఇంటిముందు జరుపుకుంటారు. ఇక్కడిలా వాటినెవరూ దొంగిలించరు. అక్కడ పాతపేపర్లు, పాలకవర్లు, పాత ఇనపసామాన్లు దాచుకోరు. ఎవరూ కొనరు. అన్నీ పడేయాల్సిందే. ఫ్రిజ్, సోఫాసెట్లు, టి.వి.లు పాడయిపోతే రోడ్డు మీద పెట్టేస్తారు. తరవాత మునిసిపాల్టీవాళ్ళు వేనులో తీసుకుపోతారు. ఇండియాలో ఐతే చెత్త వేసుకోడానికి అల్లాంటి ఏర్పాట్లు వుండవు సరికదా, పాత బకెట్లో గాని, ఇనపడబ్బాలో గాని వేసిపెడితే, అవికూడా ఎత్తుకుపోయి, పాతసామాన్ల షాపుకి తీసికెళ్ళి అమ్ముకుంటారు. పొద్దున్నే రోడ్లమీద తిరుగాడుతూ సాక్షాత్కరిస్తారు చెత్తకాగితాలు, ఇనపముక్కలు ఏరుకునేవారు. చూసుకోకపోతే గేటు తీసుకుని, లోపలికి వచ్చి ఏదుంటే అది పట్టుకుపోతారు. అప్పట్నించే మొదలవుతాయి, చిన్నదొంగతనాల దగ్గర్నించి, బేంకు దొంగతనాల వరకు. దొంగతనాలు చేసేవారికి అబధ్ధాలు ఆడడం కూడా సహజగుణం. ఇక్కడ బుకాఃయించే వాళ్ళే కాలరెగరేసుకుంటూ బతికేస్తారు. వాళ్ళు బతకనేర్చిన వాళ్ళు. నేరగాళ్ళకి కఠినశిక్షలు లేవు కాబట్టే, అలాంటివాళ్ళ అటలూ సాగుతున్నాయి. యదార్థవాదీ లోకవిరోధీ అని, యదార్థం మాట్లాడేవాళ్ళకి, నీతి నియమాలు పాటించేవాళ్ళకి రోజులు కావు. ఆస్ట్రేలియాలో చేతులకి గ్లౌస్ వేసుకుని సరుకులు ఇస్తారు. నోటితో తడి చేసి కవర్లు తియ్యరు. మన మంత్రులు ఇతర దేశాలు వెడతారు గాని, అక్కడ చెత్త తీసికెళ్ళే విధానం గాని, ట్రాఫిక్ ని నియంత్రించే విధానం గాని, ఇక్కడ అమలు చేస్తే బాగుంటుంది. కానీ చెయ్యరు. అక్కడ్ణించి ఫేషన్లయితే నేర్చుకుంటున్నారు. నేర్చుకుని ఇక్కడివాళ్ళు మన సంప్రదాయమైన దుస్తులు వదిలేసి, అసభ్యకరమైన వస్త్రధారణ చేస్తున్నారు.
పక్కింటి వాళ్లమ్మాయి ఒకసారి జుట్టు విరబోసుకుని, టైట్ ఫేంటు, షర్టు వేసుకుని గుడికి వచ్చిందని గుడికి ఇలా రాకూడదమ్మా అని చెప్పినందుకు పెద్దగా దెబ్బలాడింది. ఇంట్లో తల్లి కూడా తప్పని చెప్పకపోగా, జయలక్ష్మిదే తప్పన్నట్లు మాట్లాడి, ఆ కక్షతో వాళ్ళింట్లో చెత్తంతా వీళ్ళ గుమ్మంలో పొయ్యడం మొదలెట్టింది.
వీళ్ళింటి పక్కన ఖాళీ స్థలం వుంటే, ఎదర మందులకంపెనీవాళ్ళు ఆ స్థలం కొని, జనరేటరు పెట్టారు. కరెంటు పోయినప్పుడల్లా ఆ జనరేటరు మోత, పొగ వీళ్ళకొస్తాయి. తియ్యమంటే తియ్యరు. పోలీసు రిపోర్టు ఇస్తే, పోలీసులు, పొల్యూషను కంట్రోలు బోర్డు వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళకి లంచాలిచ్చి పంపేశారు. ఆ పొగ, జనేటరు చప్పుడు అలాగే వుంది. పేదవాని కోపం పెదవికి చేటు అన్నట్లు, ఏమీ చెయ్యలేక జయలక్ష్మిఆ ధ్వనికాలుష్యాన్ని, పొగ కాలుష్యాన్ని అలవాటు చేసేసుకుంది.
ఒకసారి వాళ్ళ అక్కకూతురు రవళిని వాళ్ళ అత్తామామలు, భర్త బాధలు పెడుతున్నారని, అదనపు కట్నం తెమ్మని వేధిస్తున్నారని, 'అక్కా, నువ్వోసారి రా, వచ్చి మాట్లాడు, లేకపోతే నేను చచ్చిపోతా.' అంటూ ఫోను చేస్తే వెళ్ళింది. 'సరే, నాతో రా, కొన్నాళ్ళుండు, ఒకసారి ఇచ్చాంగా, మళ్ళీ మళ్ళీ కట్నాలు, కానుకలు అంటూ ఎలా ఇస్తాం?' అన్న పాపానికి, ఐతే మీ చెల్లిని మీ ఇంట్లోనే వుంచుకోండి.' అంటూ పంపేశాడు ఆ మొగుడు. తర్వాత కాళ్ళా వేళ్ళా పడి, బతిమాలి, నచ్చజెప్పి, వాళ్ళడిగిన డబ్బిచ్చి అత్తారింటికి పంపారు. అప్పట్నించీ వాళ్ళకి తను శత్రువు అయిపోయింది. అందరి సంసారాలు కూలుస్తావంటూ నానామాటలూ అన్నారు.
ఒకసారి ఒక పనమ్మాయి మొగుడు తాగొచ్చి కొట్టాడని, శరీరం నిండా వాతలొచ్చి, బొబ్బలెక్కితే, ఏడ్చుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయి మీద జాలిపడి, ఇంటికెళ్ళకు, వీధిగదిలో వుండమని వేడి వేడి అన్నం వండి పెట్టింది. చాప, దుప్పటి ఇచ్చి పడుకోమంది. ఆ రాత్రంతా పడుకున్నందుకు, మర్నాడు దాని మొగుడొచ్చి, ఇక్కడెవరితో రంకు సాగిస్తున్నావంటూ చాలా అసభ్యంగా మాట్లాడి దాన్ని తీసుకుపోయాడు. 'మాలో మాకు సవాలక్ష గొడవలుంటాయి. మీరు మా గొడవల్లో తల దూర్చకండమ్మా. మొగుడు, పెళ్ళాలన్నాక ఏవో గొడవలుంటూనే వుంటాయి. అయ్యగారు, మీరు పోట్లాడుకోరా? కోపమొస్తే మీరు ఎవరింటికన్నా వెళ్ళిపోగలరా?' అంటూ ఆ పనమ్మాయి ఎదురు దెబ్బలాడింది. మంచికి పోతే చెడు ఎదురయింది. ఇంక వాళ్ళ సంసారవిషయాల్లో ఎవరి తప్పున్నా తలదూర్చకూడదనుకుంది. మొగుడు పెళ్ళాలు వాళ్ళలో వాళ్ళు ఎంత కొట్టుకు చచ్చినా, చంపుకున్నా, నరుక్కున్నా కల్పించుకోడమంత బుధ్ధితక్కువ పని ఇంకోటుండదు.
*******************************
ఇప్పుడు జయలక్ష్మికి వైరాగ్యస్థితి వచ్చేసింది. భర్తే నచ్చజెప్పాడు. 'కవర్లు నోటి ఎంగిలి చేసి తియ్యద్దని, పనిమనిషిని నోట్లో వేళ్ళు పెట్టద్దని, మట్టికాళ్ళతో ఇంట్లో నడవవద్దని ఏమీ చెప్పకు. సరుకులు నేనే తెస్తాను. టైలరమ్మాయి జాకెట్టు సరిగ్గా కుట్టకపోతే మళ్ళీ ఇంకో గుడ్డ కొనుక్కుని, ఇంకో టైలరమ్మాయికిచ్చుకో. డబ్బు పోతే పోయింది. అందరితో దెబ్బలాడి మనశ్శాంతిని పోగొట్టుకోకు. పక్కవాళ్ళు చెత్త వేస్తున్నారని నోరు పారేసుకోకు. చెత్తబకెట్టు దొంగిలించావని చెత్త అబ్బాయిని ఏమీ అడక్కు. వాడు మానేస్తే మనకే నష్టం. డబ్బు పోతే పోయింది. ఇంకో చెత్తడబ్బా కొనుక్కో. పక్క జనరేటరు చప్పుడు వస్తోందని, పొగ వస్తోందని పోలీసుల దాకా వెళ్లకూడదు. ఆ ధ్వనికాలుష్యానికి తలనెప్పి వస్తోందని, ఫోన్లు వినబడటం లేదని గొడవ చేయకు. తలుపులేసుక్కూర్చో. నువ్వే మారాలి జయా! వాళ్ళు మారరు. మన పాప ఇంగ్లీషులోనే మాట్లాడినా ఊరుకో. మన స్కూళ్ళు, టీచర్లు, మన ప్రభుత్వాలు అల్లా వున్నప్పుడు, ఎవరూ మారనప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? మనమే మారదాం.'
జయలక్ష్మి భర్త ఉపదేశాన్ని గంభీరంగా వింది. అన్నిటికీ మనసులోనే బాధని అణిచిపెట్టుకుని మౌనంగా వుండిపోయింది.
తర్వాత జయలక్ష్మి పూర్తిగా మారిపోయింది. బజార్నించి తెచ్చిన కూరగాయలు, కిరాణా సరుకులు చిల్లుల బుట్టలో వేసి, కుళాయి దగ్గర కడిగేసుకుంటుంది. కొబ్బరికాయ కుళ్ళింది ఇచ్చినా అడగదు. పనమ్మాయి సరిగ్గా పనిచెయ్యకపోతే మెల్లగా చెబుతుంది. మానేస్తే తనే చేసుకుంటుంది. లేక, మరో అమ్మాయిని మరికొంచెం జీతం ఎక్కువిచ్చి పెట్టుకుంటుంది. పక్క జనేరటరు భయంకరమైన చప్పుడు చేస్తుంటే, ఆమె చెవుల్లో దూది పెట్టుకుంటుంది. ఇలా అన్ని విషయాల్లో రాజీ పడి నిర్లిప్తంగా బతికేస్తోంది జయలక్ష్మి. ఒకప్పుడు కూతురు రమ్య మమ్మీ అని పిలిస్తే బాధ పడేది. ఇప్పుడు అమెరికా వెళిపోయిన రమ్య కూతురు తనని ఫోనులో గ్రానీ అని పిలిస్తే సంతోషంగా సమాధానమిస్తుంది.
అమెరికాలో వున్న కూతురికి పచ్చళ్ళు, బట్టలు, తెలిసున్న పెద్ద స్వీటుషాపులో రమ్యకిష్టమని జీడిపప్పు పాకం, మరికొన్ని స్వీట్లు కొంది. తీరా కూతురి దగ్గరకి పంపాక, జీడిపప్పు పాకం రాలేదంది. తానే పొరపాటు పడిందేమో, తీసుకోలేదేమో అనుకుంది. తరవాత తెలిసింది, ఆ షాపువాడు తీసుకున్న సరుకులన్నిటికీ డబ్బు లెక్కవేసి, ఒక స్వీటుపేకెట్టు నోక్కేస్తున్నాడని. ఇల్లా అందరూ గొడవ చెయ్యడం మొదలు పెట్టారు.
ఇప్పుడు జయలక్ష్మి గయ్యాళి కాదు. ఒకప్పుడు యదార్థం మాట్లాడి అందరికీ విరోధి అయిన జయలక్ష్మి ఇప్పుడు యదార్థాన్ని కప్పిపుచ్చి, మనసుని జోకొట్టుకుని, ఎవరేమన్నా పైకి ఏమీ మాట్లాడలేని ఒక అమాయకురాలు. ఇప్పుడు జయలక్ష్మి చాలా మంచిది, ఉత్తమురాలు!!
****************************

No comments:

Post a Comment

Pages